విష్ణుకుండిన రాజుల్లో గొప్పవాడు?
విష్ణుకుండినులు
శాతవాహనులు, ఇక్ష్వాకుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన మరో ముఖ్య వంశం విష్ణుకుండినులు. క్రీ.శ.358-569 వరకు ప్రధానంగా కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న తెలంగాణను, ఉత్తరాంధ్రను పరిపాలించారు. విష్ణుకుండినులు నర్మదా నది వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించి మూడు సముద్రాల (అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం) మధ్య దేశాన్ని కూడా కొంతకాలం పరిపాలించారు.
వీరి చరిత్ర గురించి మనకు కీసరగుట్ట (రంగారెడ్డి), తుమ్మలగూడెం, ఏలేశ్వరం (నల్లగొండ), గొల్లగుడి, గుమ్మడం (మహబూబ్నగర్), నేలకొండపల్లి (ఖమ్మం)లో లభ్యమైన పురావస్తు ఆధారాలు, శాసనాలు, తుమ్మలగూడెంలో లభించిన సుమారు 2000 నాణేల ఆధారంగా తెలుస్తుంది. వీరి రాజధానులు అమరపురం, ఇంద్రపాల నగరం, దెందులూరు. వీరి మొదటి రాజధాని అయిన అమరపురం నేటి మహబూబ్నగర్ జిల్లాలోకి అమ్రాబాద్ మండల కేంద్రం. ఇంద్రపాల నగరం నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలంలోని తుమ్మలగూడెం గ్రామ శివార్లలో ఉంది. దెందులూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్లోని బెజవాడ కూడా విష్ణుకుండినులకు కొంతకాలం రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఆధారాలు: వీరి చరిత్రకు ప్రధాన ఆధారాలు శాసనాలు. వీరి కాలంలో వేయించిన శాసనాలు 13 కాగా, వారి తర్వాత కాలంలో వేయించిన 8 శాసనాలు కూడా విష్ణుకుండినుల చరిత్రను తెలియజేస్తున్నాయి. ఈ శాసనాల్లో 16 రాగి రేకుల శాసనాలు కాగా, 5 శిలాశాసనాలు. ఇవేగాక వీరు వేయించిన నాణేలు, కట్టించిన కోటలు, నగరాలు, గుహాలయాలు, తవ్వకాల్లో బయటపడిన అనేక వస్తువులు, పనిముట్లు వీరి గురించి తెలుపుతున్నాయి. వీరి కాలం నాటి ‘జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి’, సేతుబంధ మొదలైన గ్రంథాలు కూడా ఆనాటి చారిత్రక పరిణామాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతున్నాయి.
పరిపాలకులు
విష్ణుకుండినులు తమను తాము అమరపురీశులమని, శ్రీపర్వతస్వామి పాదానుధ్యానం వల్ల తమ రాజ్యం, శ్రీపర్వతం రెండువైపులా విస్తరించిందని చెప్పుకోవడం జరిగింది.
ఇంద్రవర్మ (క్రీ.శ.358-70): ఇతడు విష్ణుకుండినుల వంశంలో మొట్టమొదటగా పేర్కొన్న రాజు.
ఇతడు రామతీర్థ శాసనాన్ని వేయించాడు.
ఇతడు ఏలేశ్వరం, మిర్యాలగూడెం, నల్లగొండ, భువనగిరి, కీసర మొదలైన ప్రాంతాలను ఆక్రమించి ఇంద్రపాలనగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు.
తుమ్మలగూడెంలో లభించిన తామ్రశాసనం ఆధారంగా వీరి రాజధాని ఇంద్రపురం అని తెలుస్తుంది.
మొదటి మాధవవర్మ (క్రీ.శ.370-98)
ఇంద్రవర్మ తర్వాత అతడి కుమారుడైన మొదటి మాధవ వర్మ పాలించాడు.
ఇతడు రాజ్యాన్ని మహబూబ్నగర్, కొల్లాపురం, కరీంనగర్, ఖమ్మం జిల్లాల వరకు విస్తరించాడు.
ఇతడి కుమారుడైన గోవింద వర్మ వేయించిన శాసనంలో ఇతడు పేర్కొనబడినాడు.
ఇతడి బిరుదు ‘విక్రమ మహేంద్ర’ మొదటి మహేంద్రవర్మ ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురంలో గుహలను చెక్కించాడు.
గోవింద వర్మ (క్రీ.శ.398-440)
మొదటి గోవింద వర్మ విష్ణుకుండిన తొలి రాజుల్లో అగ్రగణ్యుడు.
ఇతడి రాజధాని ఇంద్రపాలపురం. ఇతడు వేసిన ఇంద్రపాలనగర తామ్ర శాసనం తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం.
గోవింద వర్మ తన భుజబలంతో విష్ణుకుండిన రాజ్యాన్ని శ్రీపర్వతానికి (శ్రీశైలం-నాగార్జునకొండ) రెండువైపులా విస్తరింపజేశాడు.
ఇతడు పల్లవులను ఓడించి, గుండ్లకమ్మ నది వరకు ఆక్రమించాడు.
అంతేకాకుండా కోస్తాంధ్రలోని బలవంతమైన ‘గుణపాశపురం’ పాలకుడైన మూలరాజు బిడ్డను పెండ్లి చేసుకొని, అతడి సహాయంతో వేంగీ శాలంకాయనులను ఓడించి, వారి రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకొన్నాడు.
గోవింద వర్మ పట్ట మహిషి ‘మహాదేవి’. ఆమె బౌద్ధమతాభిమాని. ఆమె తన పేర ఇంద్రపురిలో ‘చాతర్దద శార్య’ సంఘ బిక్షువులకు మహావిహారాన్ని నిర్మించింది.
ఈ విహారానికి గోవింద వర్మ ‘పేణ్కపతి’ గ్రామాన్ని (నల్లగొండ జిల్లా మోత్కూరు తాలూకాలోని పనకబండ గ్రామం) దానం చేశాడు.
గోవింద వర్మన్ మొదట బౌద్ధమతాన్ని అనుసరించినప్పటికీ, తర్వాత శైవమతాన్ని స్వీకరించాడు.
ఇతడు హైదరాబాద్లోని చైతన్యపురిలో మూసీనది ఒడ్డున తన పేరిట గోవింద విహారాన్ని నిర్మించి ప్రాకృత శాసనం వేయించాడు.
ఇది తెలంగాణలో తొలి ప్రాకృత శాసనంగా పరిగణించబడుతుంది.
రెండో మాధవ వర్మ (క్రీ.శ.440-95)
ఇతడు గోవింద వర్మ కుమారుడు.ఇతడు విష్ణుకుండినుల రాజులందరిలో కెల్లా గొప్పవాడు.
ఈయన సుమారు 100కు పైగా యుద్ధాలు చేసి, బహుశా అన్ని యుద్ధాల్లోనూ విజయం సాధించి, ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసరగుట్టపైన ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు.
అంతేకాకుండా ఈయన విజయం సాధించిన ప్రతిచోటా రామలింగేశ్వర దేవాలయాన్ని కట్టించాడు.
ఇలా ఇతడు కట్టించిన రామలింగేశ్వర దేవాలయాలు వేల్పూరు, ఈపూరు, ఇంద్రపాలనగరం, కీసరగుట్టల్లో ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి.
ఇతడి దిగ్విజయాలు
గుణపాశపురం పాలకుడు, బంధువు కూడా అయిన ప్రభాకరుని సహాయంతో కళింగను (ఉత్తర కోస్తాంధ్ర+దక్షిణ ఒడిశా) ఆక్రమించాడు.
తన 33వ రాజ్యపాలనా సంవత్సరంలో పల్లవులపై దాడిచేసి మళ్లీ గుండ్లకమ్మ నది వరకు విష్ణుకుండిన రాజ్యాన్ని విస్తరించాడు.
పడమర దిక్కున మహారాష్ట్రలో శక్తిమంతులైన వాకాటకుల్లో చివరి రాజైన పృథ్వీసేనుడిని ఓడించి అతడి కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నాడు.
పైన పేర్కొన్న విజయాలతో రెండో మాధవ వర్మ ‘ప్రాగ్దక్షిణాపదాంబోనిధిరేవా సంత్సలిలవలయ, భూమి భర్తయై అనేక సామంత మకుటమణిఖచిత చరణయుగళుడయ్యాడు.
అంటే ఆయన రాజ్యం తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకు, దక్షిణాన పులికాట్ సరస్సు నుంచి ఉత్తరాన రేవా (నర్మద) నది వరకు విస్తరించింది. ఎంతోమంది సామంతరాజులు ఆయన పాదాలపై వాలారు అని అర్థం.
ఈ విజయాలను పురస్కరించుకొని పదకొండు అశ్వమేధ యాగాల్ని, 1000 క్రతువుల్ని నిర్వహించాడు.
ఇతడి బిరుదు ‘త్రివర నగర భవనగత సుందరీ హృదయ నందన (త్రివర నగరంలోని భవనాల్లో ఉండే అందగత్తెల హృదయాలను ఆనందింపచేసినవాడు)’.
ఇతడు పల్లవుల దండయాత్రలను అరికట్టే ఉద్దేశంతో రాజధానిని ఇంద్రపాల నగరం నుంచి రాజధానిని వేంగీ సమీపంలోని దెందులూరుకు మార్చాడు (అయితే అమరావతికి మార్చాడని కొందరి అభిప్రాయం).
భార్య వాకాటక మహాదేవి ప్రోత్సాహంతో రెండో మాధవ వర్మ నిర్మించిన దేవాలయాలు..
అమరేశ్వరాలయం, రామేశ్వరాలయం, మల్లికార్జున ఆలయం- ఇంద్రపాలన నగరం (నల్లగొండ జిల్లా)
రామలింగేశ్వారాలయం- కీసర
జడల రామలింగేశ్వరాలయం- చెరువుగట్టు
రామలింగేశ్వరాలయం- షాద్నగర్
రామలింగేశ్వరాలయం- పులిగిళ్ల (వలిగొండ)
రెండో మాధవ వర్మ దేశంలోనే ప్రథమంగా నరమేధయాగం, పురుషమేధ యాగం చేశాడు. ఈ యాగం సందర్భంగా పినారక భట్టు అనే బ్రాహ్మణుడిని వధించాడు.
ఇతడి కాలంలో తన మొదటి రాజధాని అమరపురిలో తన పెద్ద కొడుకు దేవవర్మను రాజప్రతినిధిగా నియమించాడు.
మొదటి విక్రమేంద్ర వర్మ (క్రీ.శ.510-25)
రెండో మాధవ వర్మకు, వాకాటక మహాదేవికి పుట్టినవాడైనందున విక్రమేంద్ర వర్మకు ‘విష్ణుకుండి వాకాటక వంశద్వయాలంకార జన్మ’ అనే నామాంతరం ఉంది.
ఇతడు ఇంద్రపాలనగర తామ్ర శాసనం వేయించాడు.
ఇతడి బిరుదు మహాకవి.
అమరపురిలో స్వతంత్రం ప్రకటించుకొని కందార వంశాన్ని పూర్తిగా నిర్మూలించి ‘త్రికూట మలయాధిప’ బిరుదును ధరించిన దేవవర్మ కొడుకు మూడో మాధవ వర్మను అణచివేసి విక్రమేంద్ర వర్మ దాదాపు విష్ణుకుండిన రాజ్యాన్ని దశాబ్దంన్నర కాలం పరిపాలించాడు.
రెండో ఇంద్ర (భట్టారక) వర్మ (క్రీ.శ.525-55)
ఇతడు విక్రమేంద్ర వర్మ కొడుకు.
ఇతడి కాలంలో ఇతడి దాయాది మూడో మాధవ వర్మ బాదామి చాళుక్యుల సహాయంతో దాడి చేశాడు.
ఇందుకు నిదర్శనంగా మొదటి పులకేశి బిరుదు ‘రణవిక్రమ’ అనే పదం చెక్కిన శాసనాలు ఏలేశ్వరంలో దొరికాయి.
కళింగ సామంతుల కూటమిని ఇతడు ఓడించడం జరిగింది.
ఇతడు కీసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర ఘటికను ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ఘటిక అనే విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన మొదటి రాజుగా చెప్పవచ్చు.
ఇతడు ఈశాన వర్మ శలిక (ఉత్తర భారత మౌఖరి రాజు) చేతిలో ఓడిపోయి తన కూతురు ఇంద్ర భట్టారిక దేవిని, ఈశానవర్మ కొడుకుకిచ్చి వివాహం చేసి వారి మైత్రి సంపాదించాడు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల ,9492 575 006
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు