ఉపన్యాసాలిస్తే సినిమాలు చూడరు
‘వ్యవసాయం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి వినూత్నమైన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి నటించా’ అని అన్నారు శర్వానంద్. ఇమేజ్, వాణిజ్య సూత్రాలకు లోబడకుండా వైవిధ్యతను నమ్మి సినిమాలు చేసే కథానాయకుల్లో శర్వానంద్ ఒకరు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. కిషోర్ దర్శకుడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా శర్వానంద్ పాత్రికేయులతో ముచ్చటించిన సంగతులివి..
ఈ సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
మన ముందు తరాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి. కానీ నేడు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రైతు కొడుకు రైతు కావడానికి ఇష్టపడటం లేదనే పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఇతర వ్యాపార రంగాల మాదిరిగానే వ్యవసాయం లాభసాటి అనేది చాలామంది గుర్తించడం లేదనే అంశాన్ని స్పృశిస్తూ హృద్యంగా ఈ సినిమా సాగుతుంది.
వ్యవసాయం నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది ఎంతవరకు విభిన్నంగా ఉంటుంది?
ఉమ్మడి వ్యవసాయం గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఊరందరు కలిసి వ్యవసాయం చేస్తే లాభాల్ని అందరూ సమంగా పంచుకోవచ్చు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవచ్చని ఈ సినిమాలో చూపించాం. రైతులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి విధి అని చెప్పే చిత్రమిది. నా దృష్టిలో రైతుకు మించిన హీరోలు దేశంలో లేరు. కానీ నేడు రైతుకు పెళ్లి కావడమే కష్టంగా మారింది. ఎన్నో అంశాల్ని ఈ సినిమాలో చర్చించాం.‘మహరి’్షతో పాటు వ్యవసాయ రంగం నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలతో ఈ చిత్రానికి ఎలాంటి పోలికలు ఉండవు.
సందేశాత్మక కథాంశాన్ని వాణిజ్య హంగులు జోడిస్తూ చెప్పడం చాలెంజింగ్‌గా అనిపించిందా?
సందేశాత్మక కథాంశాల్ని కమర్షియల్ పంథాలో జనరంజకంగా చెప్పడం కత్తిమీదసాము లాంటింది. ఉపన్యాసాలు ఇస్తున్నట్లుగా కాకుండా మేము చెప్పాలనుకున్న పాయింట్‌కు వినోదం, భావోద్వేగాల్ని మేళవిస్తూ అందరికి అర్థమయ్యేలా ఆమోదయోగ్యంగా చెప్పడానికి చాలా శ్రమించాం. ప్రస్తుతం సినిమాల్లో లెక్చర్స్ ఇస్తే ఎవరూ థియేటర్లకు రావడం లేదు.
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
వ్యవసాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న యువకుడిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. రైతుగా మారాలనే ఆలోచనతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని అతడు వదులుకున్నాడా? ఈ క్రమంలో తండ్రి నుంచి అతడికి ఎలాంటి వ్యతిరేకత ఎదురైందనేది ఆకట్టుకుంటుంది. సినిమాలో తండ్రీకొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ మనసుల్ని కదిలిస్తుంది. అంతర్లీనంగా అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుంది.
ఈ సినిమా చేసిన తర్వాత వ్యవసాయ రంగం పట్ల మీ ఆలోచనల్లో ఎలాంటి మార్పులొచ్చాయి?
హైదరాబాద్ పరిసరాల్లో నాకో ఫామ్‌హౌస్ ఉంది. ఇదివరకు షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో అక్కడికి ఎక్కువగా వెళ్లే అవకాశం రాలేదు. లాక్డౌన్లో మూడు నెలలు ఫామ్‌హౌస్‌లోనే ఉన్నా. ఆ సమయంలో వ్యవసాయంపై ఇష్టం మొదలైంది. వ్వవసా యరంగంలో వస్తోన్న కొత్త విధానాలపై అవగాహన పెరిగింది. సినిమాల నుంచి తప్పుకొంటే వ్యవసాయమే చేస్తా.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌గారు ఈ సినిమా గురించి మాట్లాడితే ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుందనే నమ్మకంతోనే ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారితో పాటు కేటీఆర్‌గారికి ప్రత్యేకంగా ఈ సినిమా చూపించే ఆలోచన ఉంది.
తదుపరి సినిమాల విశేషాలేమిటి?
ఈ ఏడాది నేను నటించిన మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నా. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. ఇందులో పెళ్లికాని కుర్రాడిగా కనిపిస్తా. ‘మహాసముద్రం’ 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. శక్తివంతమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ ద్విభాషా చిత్రంతో పాటు మరో రెండు సినిమాల్ని అంగీకరించా.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?