సంప్రదాయ ఆర్థిక వృద్ధి.. స్థిరమైన అభివృద్ధి
6. కింది వాటిలో ఉష్ణమండల గడ్డి భూములు ఏవి?
1. సవన్నాలు 2. కంపాలు
3. పంపాలు 4. ప్రయరీలు
A) ఒకటి మాత్రమే B) రెండు మాత్రమే
C) మూడు మాత్రమే D) మొత్తం నాలుగు
సమాధానం: (B)
వివరణ:
- ఉష్ణమండల గడ్డిభూములు: సవన్నాలు – తూర్పు/మధ్య ఆఫ్రికా, కంపాలు-బ్రెజిల్, లానోలు-వెనెజులా
- సమశీతోష్ణ గడ్డిభూములు: ప్రయరీలు – ఉత్తర అమెరికా, పంపాలు – దక్షిణ అమెరికా, వెల్డులు-దక్షిణాఫ్రికా, స్టెప్పీలు – యురేషియా, డౌనులు – ఆస్ట్రేలియా.
7. కింది పర్యావరణ ఒప్పందాలను, అవి దృష్టి సారించిన అంశాలతో సరిపోల్చండి.
1. క్యోటో ప్రొటోకాల్ వాతావరణ మార్పులు
2. బాసెల్ కన్వెన్షన్ ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ
3. రామ్సర్ కన్వెన్షన్ చిత్తడి నేలల పరిరక్షణ
పై జతల్లో ఎన్ని సరిగా సరిపోలాయి?
A) ఒకటి మాత్రమే B) రెండు మాత్రమే
C) మూడు D) ఏదీ కాదు
సమాధానం: (C)
వివరణ: క్యోటో ప్రొటోకాల్ అనేది వాతావరణ మార్పులపై దృష్టి సారించే అంతర్జాతీయ ఒప్పందం. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడం దీని ప్రాథమిక లక్ష్యం. అందువల్ల జత 1 సరిగా సరిపోలింది.
- బాసెల్ కన్వెన్షన్ అనేది అంతర్జాతీయ ఒప్పందం, ఇది ప్రమాదకర వ్యర్థాలను దేశ సరిహద్దులు దాటి తరలించటం, పారవేయడాన్ని నియంత్రించే లక్ష్యంతో చేసుకున్న ఒప్పందం. ఇది మానవ ఆరోగ్యం, పర్యావరణంపై వాటి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ప్రమాదకర వ్యర్థాలను, పర్యావరణ అనుకూలంగా నిర్వహణను ప్రోత్సహిస్తుంది. అందువల్ల, జత 2 సరిగా సరిపోలింది.
- రామ్సర్ కన్వెన్షన్ అనేది చిత్తడి నేలల పరిరక్షణ, స్థిరమైన వినియోగాన్ని నొక్కి చెప్పే అంతర్జాతీయ ఒప్పందం. ఇది చిత్తడి నేలల పర్యావరణ విలువను గుర్తిస్తుంది. వాటి పర్యావరణ విధులు, జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో వాటి తెలివైన ఉపయోగాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి, జత 3 సరిగా సరిపోలింది. అందువల్ల, ఎంపిక (సి) సరైన సమాధానం.
8. ఎర్త్ సమ్మిట్ కాన్ఫరెన్స్ నుంచి ఉద్భవించిన ‘ఎజెండా-21’ ప్రధానంగా దృష్టి సారించే అంశం ఏది?
A) వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్
B) జీవ వైవిధ్య రక్షణ
C) 21వ శతాబ్దంలో సుస్థిర అభివృద్ధి
D) అటవీ సంరక్షణ, నిర్వహణ
సమాధానం: (C)
వివరణ: ‘ఎజెండా-21’ అనేది 1992లో రియో డీజనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి (UN) ఆమోదించిన ఒక సమగ్ర కార్యక్రమం. ఇది ప్రపంచంలోని పర్యావరణ, ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన బ్లూప్రింట్. ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ‘ఎజెండా-21’ ప్రాథమిక లక్ష్యం. ‘ఎజెండా-21’ సంప్రదాయ ఆర్థిక వృద్ధి నుంచి స్థిరమైన అభివృద్ధి వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చింది.
- వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రత్యేక వాతావరణ మార్పు ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ద్వారా అమలు చేయబడుతుంది. జీవ వైవిధ్య రక్షణ అనేది ప్రత్యేక జీవ వైవిధ్య ఒప్పందం ద్వారా అమలు చేయబడుతుంది. అందువల్ల, ఎంపిక (C) సరైన సమాధానం.
9. కింది పదాలను వాటి నిర్వచనాలతో సరిపోల్చండి.
1. బయో డీగ్రేడేషన్ జీవుల ద్వారా సేంద్రీయ పదార్థాల విచ్ఛిన్నం
2. బయో మాగ్నిఫికేషన్ ఆహార గొలుసులో విష పదార్థాలు చేరడం
3. బయోడైవర్సిటీ హాట్ స్పాట్లు స్థానిక జాతుల అధిక సాంద్రత కలిగిన ప్రాంతాలు పైన పేర్కొన్న జతల్లో ఎన్ని సరిగా సరిపోలాయి?
A) ఒకటి మాత్రమే B) రెండు మాత్రమే
C) మూడు D) పైవేవీ కావు
సమాధానం: (C)
వివరణ:
బయో డీగ్రేడేషన్ అనేది సహజ ప్రక్రియను సూచిస్తుంది. దీని ద్వారా సేంద్రీయ పదార్థాలు, మొక్కల పదార్థం లేదా వ్యర్థ ఉత్పత్తుల వంటివి, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా కీటకాలు వంటి జీవులచే విచ్ఛిన్నం చేయబడి, కుళ్లిపోతాయి. ఈ ప్రక్రియ పోషకాలను రీసైకిల్ చేసి పర్యావరణానికి తిరిగి అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల 1 సరైనది.
- బయో మాగ్నిఫికేషన్ అనేది, ఆహార గొలుసులో పై స్థాయికి వెళుతున్న కొద్దీ, జీవుల కణజాలాల్లో విషపూరిత రసాయనాలు లేదా కాలుష్య కారకాలు వంటి కొన్ని పదార్థాలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యే ప్రక్రియను సూచిస్తుంది. అందువల్ల 2 సరైనది.
- బయోడైవర్సిటీ హాట్స్పాట్లు అనేవి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలు. ఈ ప్రదేశంలో స్థానిక జాతులు అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. అంటే ఈ నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే జాతులు ప్రపంచంలో మరెక్కడా ఇంతగా కనిపించవు. ఈ హాట్స్పాట్లు వాటి అసాధారణమైన జీవ వైవిధ్యం, పరిరక్షణ విలువకు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అందువల్ల 3 సరైనది. అందువల్ల ఎంపిక (C) సరైన సమాధానం.
10. బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన చట్టాల్లో ఏది స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో సివిల్ సర్వెంట్ల ఎంపిక, రిక్రూట్మెంట్కు సంబంధించి బహిరంగ పోటీ విధానాన్ని, గవర్నర్ జనరల్ కోసం ప్రత్యేక శాసన విభాగాన్ని ప్రవేశపెట్టింది?
A) 1853 చార్టర్ చట్టం
B) 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్
C) 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్
D) 1833 చార్టర్ చట్టం
సమాధానం: (A)
వివరణ: బ్రిటిష్ రాణి ఎలిజబెత్-I బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 1600, డిసెంబర్ 31న ‘చార్టర్’ ద్వారా అనుమతిని జారీ చేసింది. ఈ చార్టర్ కాలపరిమితి 15 సంవత్సరాలు. దీన్ని తర్వాతి కాలంలో పొడిగిస్తూ వచ్చారు.
- ఈస్టిండియా కంపెనీ, బక్సార్ యుద్ధం (1765)లో విజయం సాధించి ‘బెంగాల్ దివానీ అధికారాన్ని’ పొందడం ద్వారా ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది కంపెనీ పాలనకు పునాదైంది. 1765 నుంచి 1773 వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది.
- భారతదేశంపై బ్రిటిష్ ప్రభుత్వం తన సార్వభౌమాధికారాన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ప్రకటించింది. అనేక మార్పులతో కంపెనీ పాలన 1858 వరకు కొనసాగింది. 1858 నుంచి 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందే వరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలన సాగించింది.
- కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి/చక్రవర్తి సర్వాధికారి. కానీ 1773 నాటికి బ్రిటిష్ పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. దీంతో బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి, చక్కదిద్దడానికి అనేక చట్టాలు చేసింది. అందులో మొదటిది రెగ్యులేటింగ్ చట్టం 1773.
- రెగ్యులేటింగ్ చట్టం 1773: దీన్ని భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు.బెంగాల్ గవర్నర్ హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల నిర్వహణపై బెంగాల్ గవర్నర్ జనరల్‌కు పర్వవేక్షణ అధికారాన్ని కల్పించారు.
- కలకత్తాలోని ఫోర్ట్ విలియం (బ్రిటిష్ వర్తక స్థావరం)లో సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇది 1774లో ఏర్పాటైంది.
పిట్స్ ఇండియా చట్టం 1784 : ఈస్టిండియా కంపెనీ విధులను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించి, వాణిజ్య విధులను పూర్తిగా ‘కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’కు, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను ‘బోర్డ్ ఆఫ్ కంట్రోల్’కు అప్పగించారు.
చార్టర్ చట్టం 1813: కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధికారాన్ని తొలగించారు. బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతించింది. అయితే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా తేయాకు, చైనాతో వ్యాపారంలోనూ కంపెనీకి ఉన్న గుత్తాధికారం కొనసాగింది.
- మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించారు. అవి భారతదేశంలో చర్చిలు, ఆస్పత్రులు, విద్యాలయాలను స్థాపించడం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది.
చార్టర్ చట్టం 1833: గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హోదాను ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ‘విలియం బెంటింక్’. - భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ ‘లా కమిషన్’ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
- సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ ‘కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’ వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు.
చార్టర్ చట్టం 1853: బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనీన లేదా బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అంతవరకూ ‘కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’ నియమించేవారు. - గవర్నర్ జనరల్ కౌన్సిల్ విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించి, శాసనాలను రూపొందించడానికి ‘ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్’ను ఏర్పాటు చేశారు. ‘సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్’నే మినీ పార్లమెంటు అంటారు. దీంతో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను మొదటిసారిగా పరిచయం చేసినట్లయ్యింది.
- భారతదేశంలో వ్యాపార సంస్థగా ప్రారంభమైన ఈస్టిండియా కంపెనీ 1858 నాటికి కేవలం పరిపాలనా సంస్థగానే మిగిలింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు (లేదా) ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తర్వాత రద్దయింది. కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలనాధికారాలను స్వీకరిస్తూ 1858 నవంబర్ 1న ఒక ప్రకటన జారీ చేసింది.
11. ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీలకు కింది వాటిలో ఏది ఆవశ్యకమైన మూలకం?
A) మెగ్నీషియం B) లిథియం
C) సోడియం D) బ్రోమిన్
సమాధానం: (B)
వివరణ: ఎలక్ట్రిక్ కార్లకు శక్తిని ఇవ్వడానికి అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీల్లో & లిథియం కార్బోనేట్ లేదా లిథియంహైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తారు.
12. వార్తల్లో కనిపించే ‘కోస్టాక్ రేట్’ అనే పదం దేనికి సంబంధించినది?
A) మనీ మార్కెట్
B) కనీస మద్దతు ధర (MSP)
C) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)
D) స్థూల దేశీయోత్పత్తి
సమాధానం: (C)
వివరణ: ఇది IPO అప్లికేషన్‌కు సంబంధించినది. కాబట్టి, లిస్టింగ్‌కు ముందు పెట్టుబడిదారుడు IPO అప్లికేషన్‌ను కొనుగోలు చేసే రేటును కోస్టాక్ రేటు అంటారు. అందువల్ల, ఎంపిక (C) సరైనది.
కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు