Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
ఉగాది
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపు కొంటారు. ఇది యుగ+ఆది= యుగాది నుంచి పుట్టి ఉగాదిగా మారిందంటారు. అంటే కాలగణన ఈ రోజునుంచే ప్రారంభమైందన్న దానికి సూచిక అన్నమాట!
- వేదాలను దొంగిలించిన సోమకుణ్ణి విష్ణుమూర్తి ఈ రోజునే చంపాడన్నది పురాణ గాథ. దీనికి గుర్తుగా ఉగాదిని జరుపుకొంటున్నారని కొంతమంది అభిప్రాయం.
- మరో కథ ప్రకారం విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం జరుపుకొన్న తిథి ఇదే. అందుకని అప్పటి నుంచి ఉగాది జరుపుకోవడం ఆచారంగా స్థిరపడిందన్నది మరికొంతమంది అభిప్రాయం.
- ఈ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ‘ఉగాది పచ్చడి’ తినడం సంప్రదాయం. ఇది ఆరు రుచుల సమ్మేళనం. జీవితం కూడా వివిధ అనుభవాలు, సుఖదుఃఖాలు, వ్యయ ప్రయా సలతో కూడుకొని ఉంటుంది. అన్నీ సమ పాళ్లలో ఉంటేనే అది జీవితం. ఉగాది పచ్చడి తినడం అంతరార్థం ఇదే.
- ఉగాదిని మహరాష్ట్రలో గుడి పడ్వాగా జరుపుకొంటారు. గుడి అంటే పతాకం, పడ్వా అంటే పాడ్యమి. ఈ రోజున మహారాష్ర్టులు ఒక కర్రను మామిడి ఆకుల తోరణాలు, పూలతో అలంకరించి, దానికి ఒక పట్టు వస్ర్తాన్ని కడతారు. దానిమీద ఒక పాత్రను బోర్లించి ధ్వజస్తంభంలా ఉంచుతారు. కర్ణాటకలో కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.
- తమిళనాడు, బెంగాల్లో వైశాఖంలో ఉగాదిని జరుపుకొంటారు. ఉగాదిని తమిళనాడులో పుత్తాండు, బెంగాల్లో నబబర్ష(పొహెలా బైశాఖ్), కేరళలో విషు, గోవాలో సంవత్సర్ పడ్వో అని పిలుస్తారు.
- సిక్కింలో సంవత్సరాదిని ‘లోసాంగ్’గా జరుపుకొంటారు. పంటకోతల అనంతరం డిసెంబర్ నెలలో వచ్చే ‘లోసాంగ్’ ప్రధానంగా భూటియా తెగవారి పండుగ. ఇప్పుడు లెప్చాలు కూడా ఈ ఉత్సవాలను జరుపుకొంటున్నారు.
శ్రీరామ నవమి - ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమిని శ్రీరాముని పుట్టినరోజుగా జరుపుకొంటారు. రాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడో అవతారం. రామకథతో ముడిపడి ఉన్న అయోధ్య, రామేశ్వరం తదితర ప్రదేశాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. తెలుగు రాష్ర్టాల్లో అయితే భద్రాచలం (తెలంగాణ), ఒంటిమిట్ట (ఆంధ్రప్రదేశ్) రామాలయాలతో పాటు అన్ని ఆలయాల్లో సీతారాముల కల్యాణం జరిపించడం ఆనవాయితీ.
రక్షాబంధన్
- శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకొనే పండుగ. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరుల కుడిచేతికి రాఖీ కడతారు. బదులుగా సోదరులు తమ సోదరీమణులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామంటూ బహుమతులు అందజేస్తారు. అలా రక్షాబంధన్ తోబుట్టువుల మధ్య బంధం అవిచ్ఛిన్నంగా సాగేందుకు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పాదుకునేందుకు దోహదపడుతుంది.
- చారిత్రకంగా చూస్తే.. క్రీ.పూ.325లో భారతదేశం మీదికి అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. అప్పుడు తన భర్తను యుద్ధంలో ఏమీ చేయొద్దని అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి చేతికి రాఖీ కట్టిందన్నది ఐతిహ్యం.
- మధ్యయుగంలో రాజపుత్ర రాణులు కూడా మొగల్ చక్రవర్తులకు రాఖీలు పంపించిన కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు బెంగాల్‌ను విభజించినందుకు నిరసనగా గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు 1905లో బెంగాల్ లో ‘రక్షాబంధన్’ను పాటించారు.
ఓనం
- శ్రావణం లేదా భాద్రపద మాసాల్లో కేరళ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ ఓనం. ఆంగ్ల కాలమానం ప్రకారం ఇది ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. కేరళ ప్రజల కొత్త సంవత్సరం- కొల్లవర్షం చింగం నెలలో ఓనం రోజున మొదలవుతుంది. ప్రధానంగా వ్యవసాయ పర్వదినం అయిన ఓనం పుట్టుక వెనుక ఒక పురాణ గాథ ఉంది.
- పూర్వం ఈ ప్రాంతాన్ని మహాబలి (బలిచక్రవర్తి) పాలించేవాడు. ముల్లోకాలకు అధిపతి కావాలన్న కోరికతో బలి ఒక యాగం మొదలుపెట్టాడు. తన స్వర్గలోక ఆధిపత్యానికి ముప్పుగా భావించిన ఇంద్రుడు, ఇతర దేవతలతో కలిసి విష్ణుమూర్తిని శరణు వేడుకున్నాడు. దేవతల విజ్ఞప్తి మేరకు విష్ణువు వామన అవతారాన్ని ధరించి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. వామనుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు బలి. మూడు అడుగుల నేల దానంగా అడిగాడు వామనుడు. బలి సరే అన్నాడు. దాంతో వామనుడు త్రివిక్రమ ఆకారాన్ని ధరించి తన రెండు పాదాలతో బ్రహ్మాండం అంతా ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడగటంతో బలి తన తలను చూపించాడు. వామనుడు బలి తలమీద పాదం మోపి పాతాళానికి పంపుతాడు. తన రాజ్య ప్రజలను చూసేందుకు ఏడాదికి ఒక్కసారి భూమ్మీదికి వచ్చే వరం విష్ణుమూర్తి నుంచి పొందాడు. అలా బలి చక్రవక్తికి ఆహ్వానాన్ని పలుకుతూ కేరళ వాసులు ఏటా ఈ ఓనం జరుపుకొంటున్నారు.
- పది రోజులు ఎంతో సందడిగా జరుపుకొనే ఓనం వేడుకలో చెప్పుకోవాల్సింది మాత్రం అరణ్ ములైలో జరుపుకొనే ‘వల్లంకాలి’గా పిలిచే పాము-పడవల పోటీ. ఈ ఆటలో వందమంది దాకా ఒకే పడవలో కూర్చుని ఇతర పడవలతో పోటీ పడతారు.
జన్మాష్టమి - దీనికే కృష్ణాష్టమి, గోకులాష్టమి అని పేర్లు ఉన్నాయి. ఇది శ్రావణ బహుళాష్టమి నాడు వస్తుంది. ఇది విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినం. శ్రీకృష్ణుడు మధ్యరాత్రి పుట్టాడు కాబట్టి వేడుకలు రాత్రివేళల్లో నిర్వహిస్తారు. బాలకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి పాటలు పాడుతారు. ఆ రోజున తమ ఇళ్ల ముందు ముగ్గు పొడితో చిన్న చిన్న పాదాలను గీస్తారు. ఇది తమ ఇంటికి చిన్నికృష్ణుడిని ఆహ్వానిస్తున్న దానికి ప్రతీక.
- కృష్ణ గాథతో ముడిపడిన మధుర, బృందావనం, ద్వారక లాంటి చోట్ల ప్రజలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాలుపంచుకుంటారు. కృష్ణాష్టమి సందర్భంగా కొన్నిచోట్ల కృష్ణుడు వెన్న దొంగిలించిన కథకు ప్రతిరూపంగా ఉట్లు కొట్టే వేడుక నిర్వహిస్తారు. వీటిలో మహారాష్ట్రలో నిర్వహించే ‘దహీ హండీ’ వేడుక ప్రసిద్ధి చెందింది.
దహీ హండీ - ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరుపుకొనే వేడుక. దీనికి ప్రధాన వేదిక మహారాష్ట్ర. దీన్ని కృష్ణాష్టమి తర్వాతి రోజు నిర్వహిస్తారు. దహీ అంటే పెరుగు, హండీ అంటే కుండ. దీనికోసం కొంత ఎత్తుమీద పెరుగు కుండను వేలాడదీసి ఉంచుతారు. ఈ ఆటలో పాల్గొనేవాళ్లు ఒక పిరమిడ్‌లా ఏర్పడతారు. దీనిలో పై చివరన ఉన్న వ్యక్తి కుండను పగలగొడతాడు. శ్రీకృష్ణుడి బాల్య లీలా విశేషమైన వెన్నను దొంగతనం చేసే ఘట్టం దీనికి ప్రేరణ.
- ముంబై, థానే నగరాల్లో దహీ హండీ పోటీలో గెలిచేవాళ్లకు బహుమతిగా ఇచ్చే నగదు లక్ష నుంచి పది లక్షల రూపాయల పైనే ఉంటుంది. దీనికోసం ముందుగానే సాధన మొదలుపెడతారు. ఈ పిరమిడ్ల ఎత్తు నలభై అడుగుల దాకా ఉంటుంది.
వినాయక చవితి
- భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుంది. ఈ రోజున పార్వతి పసుపుతో వినాయకుణ్ణి సృష్టించి ప్రాణం పోసిందన్నది పురాణగాథ. తన కొడుకన్న సంగతి తెలియక శివుడు వినాయకుడి శిరస్సును ఖండిస్తాడు. పార్వతి కోరిక మేరకు ఏనుగు తలను అతికించి మళ్లీ ప్రాణం పోస్తాడు. ఈ ఘట్టం భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగింది. కాబట్టి దీన్ని వినాయక చవితి, గణేశ్ చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున భారతదేశం అంతటా మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. మూడు రోజుల నుంచి పదకొండు రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతాయి. ఆ తర్వాత వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తారు.
- వినాయక చవితి ఉత్సవాలను లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1893లో ప్రజా ఉత్సవంగా మార్చివేశాడు. అలా భారత జాతీయోద్యమంలో ప్రజలను భాగం చేసేందుకు ఈ వినాయక చవితి వేడుకలను తిలక్ ఒక మాధ్యమంగా మలుచుకున్నాడు.
విజయదశమి
- దసరాగా పిలిచే విజయదశమి ఆశ్వయుజ శుద్ధ దశమినాడు వస్తుంది. దేశమంతటా జరుపుకొనే దసరా పది రోజుల పండుగ. మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించిన ఘట్టానికి గుర్తుగా విజయదశమిని జరుపుకొంటారు. ఇదే రోజున రాముడు రావణుడిని సంహరించాడంటారు. అందుకే దసరా రోజు సాయంత్రం కొన్నిచోట్ల రావణుసురుడి బొమ్మలను దహనం చేస్తారు.
- దసరా ఉత్సవాల్లో పాడ్యమి మొదలుకుని నవమి వరకు తొమ్మిది రోజులు రోజుకు ఒక అవతారం చొప్పున నవదుర్గలను పూజిస్తారు. మూలా నక్షత్రం రోజున ప్రత్యేకంగా సరస్వతి పూజ చేస్తారు. ఎనిమిదో రోజును దుర్గాష్టమి, తొమ్మిదో రోజును మహవర్నవమి అంటారు. ఈ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి. పదో రోజున శమీ వృక్షానికి (జమ్మిచెట్టు) పూజ చేస్తారు. ఇది మహాభారత కాలంలో పాండవులు తమ ఆయుధాలను శమీ వృక్షం మీద దాచి, ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించిన సంఘటనకు ప్రతీక. ఈ రోజున ఆయుధ పూజ కూడా జరుగుతుంది.
- దుర్గాపూజ బెంగాల్లో ఘనంగా జరుపుకొంటారు. గుజరాత్లో స్త్రీలు గర్బా, స్త్రీ పురుషులు కలిసి దాండియా రాస్ నృత్యాలు చేస్తారు. దుర్గా పూజకు 2021లో యునెస్కో ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తింపు లభించింది. దక్షిణాది రాష్ర్టాల్లో కూడా దసరా ఘనంగా జరుపుకొంటారు. తెలంగాణలో అమ్మవారిని ‘బతుకమ్మ’ పేరుతో పూలతో పేర్చి పూజిస్తారు.
- కర్ణాటకలోని మైసూర్ కూడా దసరా ఉత్సవాలకు పేరెన్నికగన్నదే. ఇక్కడ ఉత్సవాలు 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలోనే మొదలయ్యాయి. దీనికి వేదిక మైసూరు రాజభవనం. ఇక్కడికి దసరా ఉత్సవాల కోసం ఒక్క కర్ణాటక నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కళాకారులు తరలివస్తారు. జంబూ సవారీ పేరుతో జరిగే ఏనుగుల ప్రదర్శన, వాటి వెనుక వివిధ రాష్ర్టాల శకటాలు బయలుదేరి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని బణ్ణిమంటప మైదానం చేరుకోవడంతో మైసూరు ఉత్సవాలు ముగుస్తాయి.
కుల్లూ దసరా
- వివిధ రాష్ర్టాల్లో విజయదశమి నాటికి దసరా సంబరాలు ముగిసిపోతాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లూ లోయలో మాత్రం దసరా రోజు ఉత్సవాలు మొదలవుతాయి. దీనికి వేదిక రఘునాథ్పుర్, ఢాల్పుర్ గ్రామాలు. క్రీ.శ. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతపు రాజు జగత్ సింగ్ ఈ ఉత్సవాలను ప్రారంభించాడు. ఆయనకు తన రాజ్యంలోని దుర్గాదత్ అనే రైతు దగ్గర అందమైన ముత్యాలు ఉన్నాయని తెలిసిందట. వాటిని ఎలాగైనా పొందాలనుకున్న రాజు దుర్గాదత్ను తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు.
- విషయం తెలుసుకున్న దుర్గాదత్ తన దగ్గర అలాంటి ముత్యాలేవీ లేవని చెప్పాడు. రాజు ఈ మాటలను నమ్మలేదు. దాంతో దుర్గాదత్ రాజును శపించాడు. రాజుకు చిక్కకుండా తన కుటుంబసభ్యులతో కలిసి అగ్నికి ఆహుతి అయిపోయాడు. ఫలితంగా రాజుకు కుష్ఠు వ్యాధి సోకింది. అప్పుడు ఓ సాధువు రఘునాథ్ జీ (రాముడి) విగ్రహం ప్రతిష్ఠించి, ఆరాధిస్తే మంచి జరుగుతుందని చెప్పాడు. రాజు అలానే చేయడంతో కొంతకాలానికి వ్యాధి తగ్గిపోయింది.
- అప్పటినుంచి జగత్ సింగ్ తన జీవితాన్ని, రాజ్యాన్ని రఘునాథుడికి అర్పించాడు. కుల్లూ లోయలో దసరా ఉత్సవాలను కూడా మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా రాజుల కులదైవం హడింబాతోపాటు 365 మంది దేవతలను కుల్లూకు ఆహ్వానిస్తారు. ఆయా దేవతల విగ్రహాలను రఘునాథ్జీతోపాటు రథం, పల్లకీల్లో ఊరేగిస్తారు. ఆరో రోజున ‘మొహల్లా’గా పిలిచే దేవతల సమావేశం జరుగుతుంది.
- చివరిదైన ఏడో రోజున రథాన్ని సమీపంలోని బియాస్ నది దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ ముళ్లపొదల కుప్పకు నిప్పు అంటిస్తారు. ఇది లంకా దహనానికి ప్రతీక అన్నమాట. ఆ తర్వాత రఘునాథ్జీని రఘునాథ్‌పుర్‌కు చేర్చడంతో కుల్లూ దసరా ఉత్సవాలు ముగిసిపోతాయి.
సంకలనం
హర్షవర్ధన్ చింతలపల్లి
Previous article
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు