Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
Women’s Reservation Bill | ప్రభుత్వ సామాజిక అభివృద్ధి పథకాలు మొదలు, పచ్చదనం పెంచే కార్యక్రమాల వరకు ఏ పథకం విజయవంతంగా కొనసాగాలన్నా ముందుగా గుర్తుకు వచ్చేది మహిళా పొదుపు/ స్వయం సహాయక సంఘాలే. కానీ మహిళా భాగస్వామ్యం దేశాన్ని నడిపే చట్ట సభల్లో మాత్రం తీసికట్టుగా ఉంది. వారి భాగస్వామ్యాన్ని పెంచే బిల్లు సైతం గట్టెక్కట్లేదు. దీనికి కారణాలు, చారిత్రక నేపథ్యం, ముందున్న కర్తవ్యం, అడ్డంకులు, పరిష్కార మార్గాలను పరిశీలిద్దాం.
చారిత్రక నేపథ్యం
- చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం స్వాతంత్య్రానికి పూర్వమే కొంత చర్చించారు. 1931లో అప్పటి కొత్త రాజ్యాంగం తయారీ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం స్త్రీలకు కొంత ప్రాతినిథ్యం ఇచ్చింది. ఇలా అరకొరగా ఇచ్చే ప్రాధాన్యాలు స్త్రీలు పొందాల్సిన సమాన భాగస్వామ్యాన్ని (Absolute Equality of Political Status) నెరవేర్చవని నిరసిస్తూ సరోజినీ నాయుడు, బేగం షానవాజ్ బ్రిటిష్ ప్రధానికి లేఖ రాశారు.
- స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ సభ చర్చల్లో కూడా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. అది అంత ప్రాధాన్యం గల అంశం కాదని, ప్రజాస్వామ్య విధానాన్ని అవలంబించడం వల్ల అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం అప్రయత్నంగానే దక్కుతుందని భావించారు. కానీ కాలక్రమంలో అది తప్పని రుజువైంది. స్వాతంత్య్రం లభించి 75 ఏండ్లు అవుతున్నా ఈ నాటికీ చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం ఆశించిన రీతిలో లేదు.
- ఇటీవల ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) కమిటీ ప్రపంచ వ్యాప్తంగా 2022కు, దేశాల చట్టసభల్లో మహిళ ప్రాతినిథ్యంపై ఇచ్చిన నివేదికలో భారత్ చుట్టుపక్కల దేశాలైన పాకిస్థాన్ (106వ స్థానం), బంగ్లాదేశ్ (98), నేపాల్ (43) మనకంటే మెరుగైన ప్రాతినిథ్యాన్ని కలిగి ఉన్నాయి. భారత్ స్థానం మాత్రం 2014లో 117వ స్థానం కంటే కూడా దిగజారి 143కు చేరింది. భారత్ 15.1 శాతం స్త్రీల చట్టసభల ప్రాతినిథ్యంతో ప్రపంచ సగటు 25.8 శాతానికి ఎంతో దూరంలో ఉంది.
- రాష్ర్టాల శాసనసభల విషయానికొస్తే మహిళా ప్రాతినిథ్య సగటు కేవలం 9 శాతం మాత్రమే.
- 70వ దశకం నుంచి చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యం పెంపు దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 1971లో స్త్రీల స్థితిగతులపై విచారణ కమిటీ (National Action Committee on Status of Women in India) దేశంలో మహిళల రాజకీయ భాగస్వామ్యం ఆశాజనక స్థాయిలో లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ కమిటీలోని అత్యధికులు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకించారు. కానీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రతిపాదించారు.
- 1988లో ‘National Perspective Plan for Women’ పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు వరకు మహిళా రిజర్వేషన్ వర్తింపజేయాలని సిఫారసు చేసింది. ఇది క్రమంగా 73, 74వ రాజ్యాంగ సవరణలకు పునాది అయ్యింది. ఈ సవరణల ప్రకారం అన్ని రాష్ర్టాలు విధిగా స్థానిక సంస్థల్లో 1/3వ వంతు సీట్లను స్త్రీలకు కేటాయించాలి. అన్ని దశల స్థానిక సంస్థల్లోనూ అధ్యక్ష (చైర్పర్సన్) పదవుల్లో 1/3వ వంతు స్త్రీలు ఉండాలి. ఈ రిజర్వేషన్లలో 1/3వ వంతు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన స్త్రీలకు కేటాయిస్తారు.
- ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ర్టాలు మరో అడుగు ముందుకు వేసి స్థానిక సంస్థల్లో 1/3వ వంతుకు బదులు 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టాలు చేశాయి.
- కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో మాత్రం ఈనాటికీ ఇది సాధ్యపడలేదు. 1996లో తొలిసారిగా దేవెగౌడ ప్రభుత్వం (యునైటెడ్ ఫ్రంట్) మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తూ ‘81వ రాజ్యాంగ సవరణ బిల్లు’ను తీసుకువచ్చింది. లోక్‌సభ ఆమోదానికి నోచుకోకపోవడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. అనంతరం లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు మురిగిపోయింది (ల్యాప్స్డ్).
- 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టింది. ఈసారి కూడా ఆమోదానికి నోచుకోకుండానే బిల్లు మురిగిపోయింది.
- 1999, 2002, 2003లలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు.
- 2008లో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ లోక్‌సభలో ఈ బిల్లును చర్చకు రాకుండా పక్కనపెట్టారు. దాంతో ఇది ఆమోదం పొందలేదు.
- 2014, 19 ఎలక్షన్ మ్యానిఫెస్టోల్లో బీజేపీ చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రకటించినప్పటికీ ఆ దిశగా పెద్ద ప్రయత్నాలేవీ ఇంతవరకూ జరగలేదు.
అడ్డంకులు/కారణాలు
1) రాజకీయ నిబద్ధత లేకపోవడం
- ఇంతవరకు చట్టసభల్లో పురుషులు దాదాపు 85 నుంచి 90 శాతం వరకు ఉంటున్నారు. మహిళా రిజర్వేషన్ల వల్ల తమ స్థానాలు కోల్పోవాల్సి వస్తుందనే స్వార్థం వారిని ఈ బిల్లు ఆమోదం దిశగా ప్రేరేపించడం లేదు. తమ మీద ప్రభావం చూపని స్థానిక సంస్థల విషయంలో, విద్య, ఉద్యోగాల్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ను, తమ సభల్లో గట్టెక్కకపోవడమే దీనికి నిదర్శనం.
- రాజకీయ పార్టీలు కూడా కంటితుడుపు చర్యలాగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాయి. కానీ ఆమోదింపజేయడంలో దృఢంగా వ్యవహరించడం లేదు. ఉదాహరణకు 15వ లోక్‌సభ కాలంలో రాజ్యసభలో ఆమోదం పొందినా ఏండ్ల తరబడి లోక్‌సభలో అసలు ఈ బిల్లు చర్చకే రాలేదు.
2) కొన్ని రాజకీయ పార్టీల అభ్యంతరాలు - సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ వంటి పార్టీలు మహిళా రిజర్వేషన్ వల్ల సంపన్న, అగ్రవర్ణ స్త్రీలు మాత్రమే లబ్ధి పొందుతారని, అట్టడుగు వర్గాల స్త్రీల వరకు రాజకీయ అధికారం చేరదని, కాబట్టి ఈ 33 శాతం మహిళా రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ ఈ బిల్లును అడ్డుకుంటున్నారు.
3) ప్రజలు, మహిళల్లో రాజకీయ చైతన్యం తగినంతగా
లేకపోవడం - జనాభాలోనూ, ఓటర్లలోనూ సుమారుగా సగ భాగమైన మహిళలకు పాలనలో కూడా భాగస్వామ్యం తగినంత దక్కాలని ఉద్యమించే చైతన్యం కొరవడటం ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
4) రాజకీయాల్లో పురుషాధిక్యం, పితృస్వామ్య భావజాలం - అవినీతి, నేరప్రవృత్తి వంటి అనేకాంశాలు మహిళలు రాజకీయ రంగంలోకి రావడానికి అవరోధాలుగా ఉన్నాయి. దీంతో వారి హక్కులపై పోరాడే దృఢమైన మహిళా నాయకులు కూడా చట్టసభల్లో కరువయ్యారు.
బిల్లు ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలు
1) లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచి (పునర్వ్యవస్థీకరించి) మహిళలకు రిజర్వ్ స్థానాలు కల్పించడం ద్వారా పురుష నాయకుల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టవచ్చు. బిల్లు నెగ్గడానికి మార్గం సుగమం చేయవచ్చు.
2) అట్టడుగు వర్గాల స్త్రీలకు ప్రాతినిథ్యం లభించేలా రొటేషన్ పద్ధతిగాని, రిజర్వ్డ్ నియోజకవర్గాలను గాని, డ్రా పద్ధతిలో గాని మహిళా నియోజకవర్గాల నుంచి వారికి కేటాయింపులు చేయవచ్చు.
3) స్వచ్ఛంద సంస్థలు, చట్టసభల్లోని మహిళా అభ్యర్థులు, సామాన్య ప్రజానీకం ఎవరి స్థాయిలో వారు ఒత్తిడి సమూహాలు (Pressure Groups)గా ప్రభుత్వంపై బిల్లు ఆమోదం కోసం ఒత్తిడి తీసుకురావచ్చు.
4) ప్రచార మాధ్యమాల్లో, విద్యాసంస్థల్లో విస్తృతంగా మహిళా రాజకీయ భాగస్వామ్యంపై ప్రచారం, చర్చ జరగాలి.
5) భారతదేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 46.1 కోట్లు. మొత్తం ఓట్లలో సుమారు సగభాగం. మహిళలకు మాత్రమే తాము ఓటు వేస్తామనే ఉద్యమాన్ని తీసుకురాగలిగితే రాజకీయ పార్టీలు మహిళలకు సీట్లు ఎక్కువ సంఖ్యలో కేటాయించేందుకు ముందుకు వస్తాయి. ఈ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రయోజనాన్ని మహిళలు తమకు తామే సృష్టించుకోవచ్చు. బిల్లు ఆమోదానికి అడ్డంకులు తొలగుతాయి.
ప్రతికూల వాదనలు
1) మహిళా రిజర్వేషన్ల వల్ల రాజకీయ వారసురాళ్లు, కుటుంబ పాలన మరింత పెరుగుతుంది. రాజకీయ పార్టీల నుంచి టికెట్లు దక్కించుకోవడంలో సామాన్య మహిళలు వారితో పోటీపడలేరు.
2) పతీ పంచాయతీల వలే పతీ ఎమ్మెల్యే, పతీ ఎంపీలు తయారై స్త్రీ నాయకుల కుటుంబాల్లోని పురుషులే అధికారం చెలాయిస్తారు.
3) రాజకీయ నేపథ్యంలేని వారిలో కూడా విద్య/ ఆర్థిక/ సామాజిక పరంగా ముందున్న స్త్రీలే రాజకీయంగానూ ఎదుగుతారు.
4) పట్టణ, గ్రామీణ స్త్రీల సమస్యలు చాలావరకు విభిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు చదువుకున్న పట్టణ స్త్రీలు, గ్రామీణ మహిళల సమస్యలను ఎంతవరకు అర్థం చేసుకోగలరనేది ప్రశ్న.
అనుకూల వాదనలు
1) మహిళల భాగస్వామ్యం చట్టసభల్లో పెరిగినప్పుడు చేసే చట్టాల్లో మహిళా కోణం, వారి సమస్యల గుర్తింపు/ పరిష్కారం వంటివి ప్రత్యేకంగా ప్రతిఫలిస్తాయి.
2) నాయకుల వారసురాళ్లు వచ్చినప్పటికీ ఆయా నియోజకవర్గ స్త్రీలు నిస్సంకోచంగా తమ సమస్యలను తెలపడానికి, వారిని సంప్రదించడానికి ఆ కొద్దిపాటి మార్పు ఎంతో సహకరిస్తుంది. గ్రామీణ స్త్రీల సమస్యల పట్ల పురుష నాయకుల కంటే వారి స్త్రీ వారసులే ఎక్కువ అవగాహన, సహానుభూతి కలిగి ఉండగలరు.
3) ఇప్పటికే ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా విస్తృతమై స్త్రీలకు రాజకీయపరమైన అవగాహన పెరగడంతో పతీ పంచాయతీ లాంటి వ్యవహారాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఎన్నో పంచాయతీలు, స్థానిక సంస్థల్లో స్త్రీలు సమర్థవంతంగా పనిచేసి ఖ్యాతి తెచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం.
4) సమాజంలో సగంగా ఉన్న స్త్రీలకు పాలనలో సరైన భాగస్వామ్యం లభించడం ద్వారా జెండర్ సెన్సిటివిటీ, లింగసమానత్వం పెరగడం, అది దేశ (శ్రామిక, ఆర్థికపరమైన) భాగస్వామ్యాన్ని పెంచి దేశాభివృద్ధికి దోహదపడుతుంది.
- ఈ బిల్లు విషయంలో చర్చకు రావాల్సిన మరో ముఖ్య అంశం కూడా ఉంది. అదే ట్రాన్స్‌జెండర్ ప్రాతినిథ్యం. అన్ని అట్టడుగు వర్గాల్లోనూ మరింత అట్టడుగున ఉండే వీరి సమస్యల పరిష్కారానికి, అభ్యున్నతి కోసం వీరికి సరైన ప్రాతినిథ్యం కల్పించడమూ అత్యావశ్యకమే.
- రాబోయే రోజుల్లో ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు’ తిరిగి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాక ఇటీవలి ‘జీ-20 ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయ సాధన’ను తమ కిరీటంలో కలికితురాయిగా ప్రభుత్వం చెప్పుకొంటున్న దరిమిలా, దానిలోని ఒక ముఖ్య అంశమైన ‘లింగసమానత్వ సాధన, నిర్ణయాల్లో స్త్రీల భాగస్వామ్యం, సాధికారత’ వంటి ప్రమాణాలను ఎంతవరకు నెరవేర్చడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయం, మహిళా రిజర్వేషన్ బిల్లును నెగ్గింపజేసుకోవడంలో తేలిపోతుంది. ఇప్పటి వరకు దేశంలోని స్త్రీల సమస్యగా ఉన్న ఈ అంశం, ఇప్పుడు భారతదేశ నిజాయితీకి అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి ఒక లిట్మస్ టెస్ట్‌గా మారిందనడంలో సందేహం లేదు.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు