Indian History | రుగ్వేద సమాజంలోని రాజకీయ అంశాలు
గతవారం తరువాయి..
- ఆర్యుల రాజకీయ వ్యవస్థకు పునాది తెగ. తెగ అధిపతిని రాజన్ అని పిలిచేవారు.
- రాజన్కు సలహాలివ్వడానికి, అతని అధికారం పరిమితం చేయడానికి సభ, సమితి, విధాత, గణ అనే సభలుండేవి.
- సభలో తెగ పెద్దలు మాత్రమే ఉండేవారు.
- సమితిలో తెగలోని వారందరూ కూడా సభ్యులే.
- సభ, సమితి కార్యకలాపాల్లో స్త్రీలు పాల్గొనేవారు.
- ఈ రెండూ న్యాయ, రాజకీయ విధులను నిర్వహించేవి.
- రోజువారీ పాలనలో రాజుకు పురోహితుడు, సేనాపతి, ప్రజాపతి, గ్రామణి అనే అధికారులు ఉండేవారు.
- పై అధికారుల్లో పురోహితుడు ముఖ్యమైనవాడు. రుగ్వేద కాలంలో వశిష్టుడు, విశ్వామిత్రుడు అనే పురోహితులు కీలక పాత్ర పోషించారు.
- రాజ్య నిర్వహణ కోసం తెగ సభ్యులందరూ కొంత ధనాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్ని బలి అనేవారు. ఇది స్వచ్ఛందం మాత్రమే.
- రుగ్వేద కాలంలో న్యాయాధికారి ప్రస్తావన రాలేదు.
- రాజు శాశ్వతమైన సైన్యాన్ని పోషించేవాడు కాదు. అందుకు కారణం ఆర్థికంగా బలంగా లేకపోవడమే.
- యుద్ధ సమయంలో వ్రాతం, గ్రామం, గణ, సార్థం మొదలైన తెగల్లోని గుంపుల నుంచి పోరాట వీరులనే తీసుకునేవాడు.
- ఆనాటి ప్రభుత్వం గిరిజన ప్రభుత్వం. అందులో సైనిక ప్రభావం ఎక్కువగా ఉండేది. రుగ్వేదకాలంలో ఒక పౌరవిధానం గాని, ప్రాంతీయ పరిపాలన గాని లేవు.
రుగ్వేద కాలం నాటి మతం - రుగ్వేదంలోని ప్రధాన దేవుడు ఇంద్రుడు. అతడిని పురంధరుడు అనేవారు. (కోటలు ధ్వంసం చేసేవాడు)
- రాక్షసుల (ఆర్యులు కానివారు) మీదకు ఆర్యుల సైన్యాలను పంపించి విజయాలు సాధించడం అతని పని.
- అతడు వానదేవుడు కూడా. వర్షాలను కురిపిస్తాడని రుగ్వేదకాలం ప్రజలు నమ్మారు. ఇంద్రుడికి సంబంధించి రుగ్వేదంలో 250 మంత్రాలున్నాయి.
- ఇంద్రుడి తర్వాత రెండో స్థానం అగ్నిది. ఇతని మీద 200 మంత్రాలున్నాయి. రుగ్వేద కాలం నాటి ఆదిమవాసుల జీవితాల్లో అడవులను తగులబెట్టడానికి, వంట చేసుకోవడానికి, ఇతర అవసరాలకు అగ్ని ప్రధానం కాబట్టి అగ్నిదేవుడికి ప్రాధాన్యం ఉండేది.
- భారతదేశంలో కాకుండా ఇరాన్లో నివాసం ఉన్నప్పుడే ఆర్యులు అగ్నిదేవుడిని పూజించారు. అగ్నిదేవుడు సాధారణ ప్రజలకు, దేవతలకు మధ్య ఒక రాయబారిగా వ్యవహరించేవాడు.
- యజ్ఞంలో అర్పించిన వాటన్నింటినీ ఆకాశమార్గంలో దేవతలకు చేరవేస్తాడని ప్రజలు నమ్మేవారు. అందుకే అతడిని హవ్యవాహనుడు అని కూడా అంటారు.
- దేవతల్లో మూడో స్థానం వరుణదేవుడిది. ఈయన ప్రకృతిని నియంత్రించే దేవుడు. ప్రపంచంలో జరిగే ప్రతి కార్యం అతని అభీష్టం ప్రకారం జరుగుతుందని భావించేవారు.
- సోమదేవుడు అనే మొక్కల దేవుడు కూడా ఉండేవాడు. ఇతడి పేరు మీద సోమరసం అనే మత్తు పానీయం కూడా ఉండేది. యజ్ఞాలు చేసిన అనంతరం సోమరసాన్ని తాగేవారు.
- పైన చెప్పినట్లుగా రుగ్వేద కాలంలో ప్రకృతి శక్తులకు ప్రాధాన్యం వహించే దేవతలున్నట్లు కనిపిస్తుంది. వీరికి మానవులు చేసే కార్యకలాపాలు ఆపాదించారు.
- ఉషస్, అధితి వంటి స్త్రీ దేవతలు కూడా రుగ్వేదంలో ఉన్నారు. పితృస్వామిక వ్యవస్థ ఉంది. కాబట్టి పురుష దేవతలకు ఉన్న ప్రాధాన్యం స్త్రీ దేవతలకు లేదు.
- దేవుడిని పూజించడంలో ప్రధానంగా మంత్రాలు చదవడం, యజ్ఞాలు చేయడం వంటి అంశాలు ఉండేవి. అంతేగాని బలులు, కర్మకాండలు లేవు.
- రుగ్వేద కాలంలో శబ్దానికి మంత్రశక్తి ఉన్నదన్న అభిప్రాయం బలంగా ఉండేది.
- రుగ్వేద కాలం నాటి ప్రజలు దేవుడిని ఆధ్యాత్మికపరం కోసమో, బాధల నివారణ కోసమో పూజించలేదు. వారు భౌతిక సుఖాల కోసం పూజించారు. దేవుడిని పూజిస్తూ పశువులను, ఆహారాలను, సంపదలను ఇవ్వమని కోరేవారు.
- అనార్యుల (ఆర్యులు కానివారు) దేవతలైన రుద్రుడు, త్వష్ట్రి వంటి వారిని కూడా పూజించారు.
రుగ్వేద కాలం నుంచి మలివేదకాలానికి మార్పు - రుగ్వేద కాలంలో వారి నివాస ప్రాంతం సప్త సింధూ ప్రాంతం కాగా, మలివేద కాలం నాటికి దిగువ గంగా-మైదానం వరకు విస్తరించారు.
- రుగ్వేద కాలంలో రాజు తెగలపై ఆధారపడి ఉండేవాడు. తెగలకు అవసరమైన పశువుల కోసం యుద్ధాలు చేసేవాడు. తెగ రాజు అధికారాలను నియంత్రించేది.
- మలివేద కాలంలో రాజు విశాల ప్రాంతాలపై దృష్టి సారించాడు. రాజ్యాల కోసం యుద్ధాలు చేశాడు. ప్రజల విధేయతలు కూడా తెగ బదులు ప్రాంతానికి తగ్గిపోయాయి. మొత్తం మీద రాజు, రాజరికం ఇంతకు ముందు కంటే ఉన్నత స్థితికి చేరింది.
- రుగ్వేద కాలంలో రాగి, కంచు లోహాలు వాడేవారు. మలివేద కాలం నాటికి ఇనుము వాడకం తెలిసింది. ఇనుము వాడకం వ్యవసాయ ఉత్పత్తులను పెంచింది. ఇది వ్యాపారానికి, పట్టణీకరణకు, పన్నుల ద్వారా రాజ్య ఆదాయం, రాజరిక స్థిరత్వానికి కారణమయ్యింది.
- రుగ్వేదం సమాజ విభజన చాలావరకు సరళంగా ఉంది. కేవలం కొంతమంది యుద్ధం నుంచి వచ్చిన ధనాన్ని దాచుకొని గొప్పవాళ్లుగా ఎదిగారు. మిగతా సమాజం అంతా కష్టపడి పనిచేసేది. మలివేద కాలం నాటికి ఆర్థిక ప్రాతిపదికగా సమాజం విభజింపబడింది. బ్రాహ్మణులు కర్మలు చేయడం, క్షత్రియులు రాజ్యాన్ని రక్షించడం, వైశ్యులు వ్యవసాయ వ్యాపారాలు చేయడం, శూద్రులు పై వర్ణాలకు సేవ చేయడం వంటి ఆలోచనలతో సమాజం ముందుకుపోయింది.
- రుగ్వేద కాలం నాడు ప్రజలు నిరంతరం మునులతో ఉండేవారు. పశుపాలన ప్రధాన వృత్తిగా ఉండేది. మలివేద కాలం నాటికి స్థిర నివాసం, వ్యవసాయం ప్రధాన వృత్తిగా చేపట్టడం వంటి అంశాలు వచ్చాయి. రుగ్వేద కాలం నాటి కుటుంబ పెద్దగా తండ్రి ఉన్నాడు.
- వారి సమాజం పితృస్వామిక అంశాలవైపు ప్రయాణిస్తున్నా స్త్రీలు చదువుకున్నారు, సాహిత్యం సృష్టించారు, సభా సమితుల్లో పాల్గొన్నారు. బాల్యవివాహాలు లేవు. వితంతు వివాహాలు ఉన్నాయి.
- ఆర్థిక కార్యకలాపాల్లో స్త్రీ, పురుషులిద్దరూ పాల్గొనేవారు. మలివేద కాలం నాటికి సమాజం మరింత వేగంగా పితృస్వామిక అంశాల స్థిరీకరణకు చేరుకుంది. స్త్రీలపై పెత్తనాలు, ఆంక్షలు పెరిగాయి. సభ, సమితుల్లో పాల్గొనడం నిషేధించారు. ఆర్థిక కార్యకలాపాల్లో వారి ప్రాధాన్యం తగ్గింది. వివిధ రకాల వివాహాలు ప్రవేశించాయి. గోత్ర విధానం వచ్చింది. దీని ప్రకారం సగోత్రికుల మధ్య వివాహం నిషేధించారు.
మలివేద కాలం
- సమాజం: ఈ కాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలుగా విభజించారు.
- రుగ్వేదం చివరిలోని పురుషసూక్తంలోని శ్లోకంలో బ్రహ్మ మెదడు నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియులు, ఉదరం నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారని ఉంది.
- మొదట బ్రాహ్మణులు 16 పౌరోహిత వర్గాల్లో ఒకరుగా ఉన్నారు. కాలక్రమేణా వీరు ఇతర పౌరోహిత వర్గాలను తోసివేసి ప్రధానమైన వర్గంగా ఏర్పాటయ్యారు.
- బ్రాహ్మణులు ప్రధానంగా యజ్ఞాలను తమ కోసం, ఇతరుల కోసం చేసేవారు. వ్యవసాయానికి సంబంధించిన పండుగలను నిర్వహించేవారు. తమ పోషకులైన రాజుల కోసం ప్రార్థనలు చేసేవారు.
- వీరు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సి ఉండేది కాదు. రాజుల నుంచి అనేక కానుకలు వీరు పొందేవారు. సమాజంలో వీరిది మొదటి స్థానంగా ఉండేది.
- సమాజంలో రెండో స్థానం క్షత్రియులది. క్షత్రియుల్లో రాజ బంధువులు, తెగల నాయకులు ముఖ్యులుగా ఉండేవారు.
- రాజు చేసే యుద్ధంలో వీరు ప్రధాన పాత్ర పోషించేవారు.
- వైశ్యులు మూడో వర్గానికి చెందినవారు. వీరు వ్యవసాయం పశుపాలన వంటి ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించేవారు. వీరిలో కొందరు చేతివృత్తులను కూడా అనుసరించారు. వ్యాపారాలు కూడా నిర్వహించారు.
- మలివేద కాలంలో రాజుకు పన్నును చెల్లించేది వైశ్యులు మాత్రమే. ఆనాటి సమాజం వీరి మీదనే ఆధారపడి ఉంది. పై మూడు వర్ణాల వారికి ఉపనయనం ధరించే అర్హత ఉండేది. నాలుగో వర్ణమైన శూద్రులకు ఉపనయన అధికారం లేదు. పై మూడు వర్గాలకు సేవ చేయడమే శూద్రుల కర్తవ్యం. సమాజంలో చేతివృత్తుల వారికి ప్రాధాన్యం ఉండేది. రాజు యుద్ధాలకు అవసరమైన రథాలను తయారు చేసే రథకారుడికి సమాజంలో ఉన్నత స్థానం ఉండేది. ఇతనికి ఉపనయనం ధరించే అర్హత కూడా ఉండేది.
- కుటుంబంలో తండ్రి ప్రాబల్యం పెరిగిపోయింది. సమాజంలో, కుటుంబంలో మగవారి పెత్తనం పెరిగిపోయింది. మలివేద కాలంలో గోత్ర సంప్రదాయం ప్రారంభమైంది. గోత్రం అనే పదానికి గోశాల లేక ఒక తెగకు చెందిన గోవులన్నింటిని ఒకే చోట ఉంచే స్థలం అని అర్థం. కాలక్రమంలో వంశానికి మూలపురుషుడిని సూచించే పదంగా ఇది మారిపోయింది. అంతేగాక తర్వాత కాలంలో ఒకే గోత్రానికి చెందిన కుటుంబాల మధ్య వివాహాలను నిషేధించడం ప్రారంభించారు. అందుకు ఒకే గోత్రానికి చెందినవారు అన్నదమ్ములని భావించడమే.
భౌతిక, ఆర్థిక పరిస్థితులు
- మలివేద కాలం నాటికి ఇనుము లోహాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ లోహాన్ని శ్యామ అని, కృష్ణ అయాస్ అని పేర్కొన్నారు.
- ఇనుము కనుక్కోవడంతో మలివేద కాలం నాటి వ్యవసాయ అంశాల్లో మంచి మార్పులు వచ్చాయి.
- ఈ కాలం నాటి ప్రజలు బార్లీ పండించడం కొనసాగించినా వరి, గోధుమ ప్రధాన పంటలు అయ్యాయి. వరిని వైదిక గ్రంథాల్లో వృహి అని అన్నారు.
- మలివేద కాలంలో అనేక కళలు, చేతివృత్తులు అభివృద్ధి చెందాయి. ఇనుమును శుద్ధి చేయడం, వస్తువులు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్నట్లు తెలుస్తుంది.
- వ్యవసాయం, ఇతర చేతివృత్తులు ఉండటంతో మలివేద కాలం నాటి ప్రజలు స్థిర నివాసం ఏర్పర్చుకొన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి.
- ఈ కాలం నాటి అవశేషాలు హస్తినాపూర్, అత్రాంజిఖేరల్లో లభించాయి.
- మలివేద కాలం చివరి నాటికి హస్తినాపూర్, కౌశాంబి పట్టణాలు మొదలయ్యాయి.
- మొత్తంమీద ఈ కాలం నాటికి పశుపాలన, సంచార జీవితం పోయి వ్యవసాయం, స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. చేతివృత్తులు, హస్తకళలు అదనపు సహాయం చేయగా మలివేద కాలం ప్రజలు ఉత్తర గంగా మైదానంలో స్థిరపడ్డారు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో సరైనవి?
1) రుగ్వేద ఆర్యుల ప్రధాన దేవుడు ఇంద్రుడు
2) ఇంద్రుడికి సంబంధించి రుగ్వేదంలో 250 మంత్రాలున్నాయి
3) 1 4) 1, 2
2. కింది వాటిని జతపర్చండి?
1. న్యాయ ఎ. జైమిని
2. యోగ బి. కపిలుడు
3. సాంఖ్య సి. పతంజలి
4. పూర్వమీమాంస డి. గౌతముడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3. దశరాజ గణ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది?
1) సింధూ 2) రావి
3) సరస్వతి 4) సట్లెజ్
4. రుగ్వేద కాలంలో ‘హవ్యవాహనుడు’ అంటే?
1) అగ్ని 2) ఇంద్రుడు
3) వరణుడు 4) ప్రజాపతి
5. కింది వాటిలో సరైనవి?
1) రుగ్వేద ఆర్యుల ప్రధాన వృత్తి పశుపోషణ
2) మలివేద ఆర్యుల ప్రధాన వృత్తి వ్యవసాయం
3) 1 4) 1, 2
6. వైదిక గ్రంథాల్లో ‘వృహి’ అని దేన్ని పిలిచేవారు?
1) వరి 2) బార్లీ
3) గోధుమ 4) చెరుకు
7. తొలి వేద కాలంలో పేర్కొన్న వ్రాతం, గ్రామం, గణం, సార్థం అనేవి?
1) గ్రామాల పేర్ల 2) తెగల పేర్లు
3) ధాన్యాల పేర్లు 4) పదవుల పేర్లు
8. ‘గోత్రం’ గురించి తొలిసారి తెలిపిన వేదం?
1) రుగ్వేదం 2) సామవేదం
3) అధర్వణ వేదం 4) యజుర్వేదం
9. కింది వాటిలో సరైనవి?
1) సంహితలు- మంత్ర జపతాపాల సమూహం
2) బ్రాహ్మణాలు- కర్మకాండలను వివరిస్తాయి
3) అరణ్యకాలు, ఉపనిషత్తులు- తత్వజ్ఞానాన్ని వివరిస్తాయి
4) పైవన్నీ సరైనవే
సమాధానాలు
1-4, 2-4, 3-2, 4-1,
5-4, 6-1, 7-2, 8-3, 9-4.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు