Current Affairs – Groups Special | బీహెచ్ఏఆర్ఏటీ (భారత్) దేనికి సంబంధించింది?
1. ఎగుమతుల సన్నద్ధత సూచీలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? (4)
1) 3 2) 8 3) 5 4) 6
వివరణ: ఎగుమతుల సన్నద్ధత సూచీ-2022లో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ఈ సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. 2021లో విడుదల చేసిన సూచీలో తెలంగాణ రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకింది. తొలి ఐదు స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా నిలిచాయి. తెలంగాణ సాధించిన స్కోర్ 61.36%. రాష్ర్టాలను మూడు భాగాలుగా విభజించి మార్కులను గణించారు. తీర రాష్ర్టాలు, భూపరివేష్టిత రాష్ర్టాలు, హిమాలయ రాష్ర్టాలుగా పేర్కొన్నారు. భూ పరివేష్టిత రాష్ర్టాల జాబితాలో గతంలో ఐదో స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం రెండో స్థానానికి చేరుకుంది.
2. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఐదేళ్లలో ఎన్ని కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు? (2)
1) 5 కోట్లు 2) 13.5 కోట్లు
3) 15 కోట్లు 4) 9 కోట్లు
వివరణ: దేశంలో ఐదేళ్లలో బహుముఖ పేదరికం నుంచి 13.5 కోట్ల మంది విముక్తి పొందారు. ‘జాతీయ బహుళ పార్శ పేదరిక సూచీ- ఒక ప్రగతి సమీక్ష-2023’ పేరుతో ఈ నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేసింది. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ఆధారంగా సూచీని రూపొందించింది. 707 జిల్లాల గణాంకాల ఆధారంగా ఈ అంచనాలను రూపొందించారు. ఈ కొలమానం ప్రకారం 2015-16 నుంచి 2019-21 మధ్య కాలంలో పేదరికం 24.85% నుంచి 14.96 శాతానికి తగ్గింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో రికార్డ్ స్థాయిల్లో తగ్గుదల కనిపించింది.
3. బిమ్స్టెక్కు ఉన్న ప్రాధాన్యాల్లో భారత్ ఎన్నింటికి సారథ్యం వహిస్తుంది? (3)
1) 1.6 2) 5 3) 4 4) 8
వివరణ: బిమ్స్టెక్ అనేది ఏడు దేశాల కూటమి. దీని పూర్తి రూపం- బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీసెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ కూటమి సమావేశం జూలై మూడో వారంలో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించారు. మొత్తం ఈ కూటమికి 14 అంశాల ప్రాధాన్యాలున్నాయి. ఇందులో నాలుగింటికి భారత్ నేతృత్వం వహిస్తుంది. అవి 1. కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్‌నేషనల్ క్రైమ్, 2. ట్రాన్స్పోర్ట్-కమ్యూనికేషన్, 3. పర్యాటకం, 4. పర్యావరణం-విపత్తు నిర్వహణ. భారత్ తరఫున ఈ సమావేశాల్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు.
4. బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ దేనికి సంబంధించింది? (1)
1) ఆహార సంక్షోభ నివారణ
2) యుద్ధాన్ని నిలిపివేయడం
3) నల్ల సముద్రపు తీర దేశాల్లో
పర్యావరణ పరిరక్షణ
4) పైవేవీ కాదు
వివరణ: ఆహార ధాన్యాలను వివిధ దేశాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపేందుకు ఉద్దేశించిందే బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. యూఎన్, టర్కీ దేశాల చొరవతో దీన్ని రష్యా 2022 జూలైలో అంగీకరించింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు నల్ల సముద్రం మార్గం గుండా ఆహార ధాన్యాల సరఫరాకు యుద్ధం వల్ల ఎలాంటి ఆటంకం కలగకుండా ఇందులో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒప్పందం పొడిగింపునకు రష్యా జూలై మూడో వారంలో నిరాకరించింది. నిజానికి ఒప్పందం కుదిరినప్పుడు రష్యాకు చెందిన ఆహార, ఎరువులతో ప్రయాణించే నౌకలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని మాటను నిలబెట్టుకోలేదని రష్యా ఆరోపణ. అందుకు పొడిగింపునకు నిరాకరించినట్లు పేర్కొన్నారు.
5. పిడుగుపాటుకు సంబంధించి ఇటీవల కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంది? (2)
1) సహజ విపత్తుగా ప్రకటించింది
2) సహజ విపత్తుగా ప్రకటించేందుకు నిరాకరించింది
3) పరిశీలన కమిటీ ఏర్పాటు చేసింది
4) పైవేవీ కాదు
వివరణ: పిడుగుపాటును సహజ విపత్తుగా గుర్తించేందుకు కేంద్రం నిరాకరించింది. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా, పిడుగుపాటు మరణాలను నిరోధించవచ్చని పేర్కొంది. మేఘాల్లో భిన్న విద్యుదావేశాల మధ్య ప్రసరణ జరిగినప్పుడు పిడుగుపాటు వస్తుంది. పిడుగుపాటు మరణాల సంఖ్య భారత్‌లో ఎక్కువగా ఉంటుంది. పిడుగుపాటును ‘ప్రమాదపు మృతుల’ విభాగంలో ఎన్సీఆర్బీ చేర్చింది. 2021లో ఈ ప్రమాదానికి గురై మరణించిన వారి సంఖ్య 2880గా ఉంది. 1967తో పోలిస్తే 2021 నాటికి పిడుగుపాటు మృతుల సంఖ్య రెట్టింపుగా ఉంది.
6. నొమాడిక్ ఎలిఫెంట్ ఏ దేశంతో కలిసి భారత్ నిర్వహించే విన్యాసం? (3)
1) మయన్మార్ 2) కాంబోడియా
3) మంగోలియా 4) ఇండోనేషియా
వివరణ: భారత్, మంగోలియా మధ్య సైనిక విన్యాసానికి పేరు నోమాడిక్ ఎలిఫెంట్. ఈ ఏడాది జూలై 17 నుంచి 31 వరకు మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో నిర్వహించారు. ఈ ఏడాది 15వ సైనిక విన్యాసం నిర్వహిస్తున్నారు. మంగోలియా భారత్‌కు ఎగువన ఉంది. చైనాతో ఈ దేశానికి సరిహద్దు కూడా ఉంది. ఉలాన్బాటర్ ఆ దేశ రాజధాని. ప్రపంచ రాజధానుల్లో కెల్లా అత్యంత శీతలమైంది.
7. ఏ దేశంలో సుప్రీంకోర్ట్ అధికారాలను పరిమితం చేస్తూ పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టింది? (4)
1) ఉత్తరకొరియా 2) ఇరాక్
3) ఇరాన్ 4) ఇజ్రాయెల్
వివరణ: సుప్రీంకోర్ట్ పర్యవేక్షణాధికారాలపై పరిమితులు విధిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ ఒక కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇది ఇంకా పూర్తి స్థాయి శాసన ప్రక్రియను పూర్తి చేసుకోలేదు. ఇప్పటికే నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం, మంత్రులు, ఇతర ఎన్నికయిన వ్యక్తులు తీసుకునే నిర్ణయాలను కొట్టివేసే అధికారాన్ని తొలగించే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
8. ఏ విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా నాలుగు రన్‌వేలను అందుబాటులోకి తెచ్చారు? (1)
1) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
3) లాల్‌బహుదూర్ శాస్త్రి విమానాశ్రయం
4) రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
వివరణ: నాలుగు రన్వేలు కలిగిన భారతదేశ తొలి విమానాశ్రయంగా డిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలువనుంది. ఈ విమానాశ్రయ సామర్థ్యం గతంలో రోజుకు 1400-1500 ట్రాఫిక్‌ను కలిగి ఉండగా, ప్రస్తుతం 2000 మందికి పెరిగింది. దీంతో విమాన సర్వీసులు కూడా పెరిగిన నేపథ్యంలో నాలుగు రన్‌వేలను అందుబాటులోకి తెచ్చారు.
9. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఎన్ని పతకాలను గెలుచుకుంది? (3)
1) 15 2) 21 3) 27 4) 24
1) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ 27 పతకాలను గెలుచుకుంది. పతకాల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ పోటీలు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జూలై 12వ నుంచి 16 వరకు నిర్వహించారు. భారత్ తరఫున తొలి బంగారు పతకాన్ని సాధించింది జ్యోతి యారాజి. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఆమె బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో పాటు 200 మీటర్ల పరుగు పందెంలో రజత పతకాన్ని కూడా కైవసం చేసుకుంది. అత్యధికంగా జపాన్ దేశం 37 పతకాలను గెలుచుకుంది. ఇందులో 16 బంగారు, 11 వెండి, 10 కాంస్య పతకాలున్నాయి. భారత్ మొత్తం 9 బంగారు, 6 రజతం, 12 కాంస్య పతకాలతో మూడో స్థానంలో ఉంది. రెండో స్థానంలో చైనా నిలిచింది.
10. ఐఐటీ ఢిల్లీ విదేశీ శాఖను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? (2)
1) టాంజానియా 2) అబు ధాబి
3) టెల్ అవీవ్ 4) కౌలాలంపూర్
వివరణ: ఐఐటీ ఢిల్లీ తన తొలి విదేశీ శాఖను అబు ధాబిలో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆ దేశంలో పర్యటించిన సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. రూపాయి మారకంతో పాటు డిజిటల్ చెల్లింపులకు సంబంధించి కూడా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. గ్రీన్ హైడ్రోజన్ విషయంలో కూడా పరస్పరం సహకరించుకోనున్నాయి.
11. ఆహార ద్రవ్యోల్బణంతో ఏ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు? (2)
1) పెరూ 2) నైజీరియా
3) జింబాబ్వే 4) మొరాకో
వివరణ: అధికంగా ఆహార ధరలు పెరుగుతుండటంతో పాటు కొరత కూడా ఉండటంతో నైజీరియాలో అత్యవసర పరిస్థితిని ఆ దేశాధ్యక్షుడు బోలా టినుబు ప్రకటించారు. ఇటీవల ఆ దేశంలో చమురుకు రాయితీని ఎత్తివేశారు. ఆ మొత్తంతో వచ్చిన నగదును వినియోగించి రైతులకు ఇస్తున్నారు. అలాగే పేద గృహాలకు 10 డాలర్లు ఆరు నెలల పాటు సాయం కూడా చేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది. నైజీరియాలో ఆహార భద్రతకు సంబంధించి 25 మిలియన్ల ప్రజలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది కూడా. అలాగే అగ్నిపర్వతం బద్ధలు కావడంతో పెరూ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఇదే దేశంలో గౌలియన్ బరే సిండ్రోమ్ అనే వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కూడా అత్యవసర పరిస్థితిని విధించడానికి కారణమైంది.
12. ఫాస్ఫేట్ను పెద్ద మొత్తంలో ఏ దేశంలో గుర్తించారు? (3)
1) స్విట్జర్లాండ్ 2) స్వీడన్
3) నార్వే 4) కొలంబియా
వివరణ: ఫాస్ఫేట్ రాళ్లను పెద్ద మొత్తంలో యూరప్‌లోని నార్వేలో గుర్తించారు. ఎక్కువగా దీన్ని ఎరువుల తయారీలో వినియోగిస్తారు. అలాగే పురుగు మందుల తయారీ, డిటర్జెంట్లలో వాడతారు. ప్రపంచ అవసరాల్లో దాదాపు 80% మేర సరిపోయేంతగా ఇది లభించిందని నార్వే ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో లిథియం నిక్షేపాలను గుర్తించారు. అలాగే అరుదైన మూలకాలను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కనుగొన్నారు.
13. బార్డ్ చాట్‌బాట్ ఏ సంస్థకు సంబంధించింది? (4)
1) మైక్రోసాఫ్ట్ 2) నాసా
3) స్విస్‌బ్యాంక్ 4) గూగుల్
వివరణ: గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ బార్డ్ అనే పేరుతో చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఆధునిక కృత్రిమ మేధతో ఇది పని చేస్తుంది. దీన్ని యూరప్, బ్రెజిల్ దేశాల్లో ముందుగా విడుదల చేయనుంది. 40 భాషల్లో ఇది మాట్లాడగలదు. ఇందులో తొమ్మిది భారతీయ భాషలు కూడా ఉన్నాయి. అవి- బెంగాలి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠి, గుజరాతి, ఉర్దూ, హిందీ. అలాగే గొంతును తమకు అనుకూలంగా వినియోగదారులు మలుచుకొనే వీలుంటుంది (పర్సనలైజ్).
14. బీహెచ్ఏఆర్ఏటీ (భారత్) దేనికి సంబంధించింది? (1)
1) బ్యాంకింగ్ 2) ఎగుమతులు
3) భాష
4) జాతీయ ఉద్యమ స్ఫూర్తి
వివరణ: బీహెచ్ఏఆర్ఏటీ అనేది సంక్షిప్త రూపం. దీన్ని విస్తరిస్తే.. బ్యాంక్స్ హెరాల్డింగ్ యాక్సిలరేటెడ్ రూరల్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్. వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్ రంగం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సహకారంతో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల నిధుల సమీకరణకు సంబంధించింది. ఒక నెల పాటు దీన్ని అమలు చేస్తారు. రూ.7200 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా ఉంది.
15. ‘ఇండియా రైజింగ్ మెమోయిర్ ఆఫ్ ఏ సైంటిస్ట్’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? (3)
1) కస్తూరి రంగన్ 2) రాధాకృష్ణన్
3) ఆర్ చిదంబరం 4) మాధవన్ నాయర్
వివరణ: ప్రముఖ శాస్త్రవేత్త చిదంబరం, సురేశ్ గంగోత్రి సంయుక్తంగా ‘ఇండియా రైజింగ్ మెమోయిర్ ఆఫ్ ఏ సైంటిస్ట్’ అనే పుస్తకాన్ని రచించారు. దేశంలో ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఆయన కూడా ఒకరు. కేంద్ర క్యాబినెట్‌కు శాస్త్ర సాంకేతిక అంశాల్లో సలహా ఇచ్చే కమిటీకి ఆయన చైర్మన్‌గా పని చేశారు. ఈ పదవిలో ఆయన 2001 నవంబర్ నుంచి 2018 మార్చి వరకు సుదీర్ఘ కాలం కొనసాగారు. భారత అణ్వస్ర్తాల కార్యక్రమంలో కూడా ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌కు కూడా చైర్మన్‌గా వ్యవహరించారు. 2020 తర్వాత ఐఏఈఏ పాత్ర అనే అంశానికి సంబంధించి ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తలున్న ఆ కమిటీలో భారత్ తరఫున చిదంబరం కూడా సభ్యులుగా ఉన్నారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు