Geography | ప్రకృతి మూలం.. సజీవ, నిర్జీవుల సమ్మేళనం
ఆవరణ వ్యవస్థలు
- 1935లో ఎ.జి.టాన్స్లే అనే బ్రిటిష్ వృక్ష, ఆవరణ శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించాడు.
- ప్రకృతి మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు.
- ఈయన పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అని నామకరణం చేశాడు.
- టాన్స్లే ప్రకారం ప్రకృతి వ్యవస్థలాగా పనిచేస్తుంది. అందులోని జీవులు వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ వాతావరణ కారకాలు ఒకదానినొకటి తీవ్రంగా ప్రభావితం చేసుకుంటాయి.
- ఆవరణ వ్యవస్థ అనే సజీవ, నిర్జీవ సమూహాలు వాటి పరిసరాలతో కూడి ఉంటాయి.
- ఆవరణ వ్యవస్థలో జీవ అంశాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఆవరణ వ్యవస్థలో సజీవ అంశాలు, నిర్జీవ అంశాలైన గాలి, నీరు, మృత్తికలు కూడా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి.
- ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఆహారపు గొలుసు అనే పదాన్ని వాడారు.
ఉత్పత్తి దారులు- విచ్ఛిన్నకారులు-వినియోగదారులు - చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేస్తాయి. వీటిని ఉత్పత్తి దారులు అంటారు.
- వీటిని తిని శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అంటారు.
- చివరి స్థాయిలో ఉండే విచ్ఛిన్నకారులు మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుంచి ఆహార పదార్థాలను సేకరిస్తాయి. వాటిని కుళ్లింపజేయడం ద్వారా పోషకాలను మొక్కలు తిరిగి వినియోగిస్తాయి. కాబట్టి విచ్ఛిన్నకారులను పునరుత్పత్తి దారులు అంటారు.
ఉదా: మొక్కలు – మిడత- కప్ప- పాము- గద్ద
ఆవరణ వ్యవస్థ రకాలు
- మానవ ప్రమేయం, ప్రభావం ఆధారంగా ఆవరణ వ్యవస్థలను వర్గీకరించారు.
నీటి ఆవరణ వ్యవస్థ
- జలావరణ వ్యవస్థను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి…
1. మంచినీటి ఆవరణ వ్యవస్థ 2. ఉప్పు నీరు/ సముద్ర ఆవరణ వ్యవస్థ
మంచినీటి ఆవరణ వ్యవస్థ - ఇందులో నిశ్చలమైనది, ప్రవహించేది అనే రెండు రకాల ఆవరణ వ్యవస్థలున్నాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, రంగారెడ్డి జిల్లాలోని శామీర్‌పేట్ చెరువు, వరంగల్‌లోని వడ్డేపల్లి చెరువు, ఖమ్మంలోని పాలేరు చెరువు కొన్ని మంచి నీటి జలాశయాలు మంచినీటి ఆవరణ వ్యవస్థలు. సముద్ర ఆవరణ వ్యవస్థ మాదిరిగానే సరస్సులోని పర్యావరణ పరిస్థితులు అధ్యయనం చేయడానికి వీలుగా కాంతి ప్రసారాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు.
లిట్టోరల్ మండలం: సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల భాగాన్ని లిట్టోరల్ మండలం అంటారు. ఈ మండలం సమీపంలో నీరు, మట్టితో కలిసి మడ్డిగా ఉంటుంది. నత్తలు, రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలకు నిలయంగా ఉంటుంది. అనేక శైవల జాతులు, బురద తామరలు, వాలినేరియా, హైడ్రిల్లా లాంటి మొక్కలు ఇందులో ఉంటాయి.
లిమ్నాటిక్ మండలం: సరస్సులో నీటి పైభాగం (ఉపరితలం)లో బయటకు కనిపించే భాగాన్ని లిమ్నాటిక్ మండలం అంటారు. ఈ భాగం ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరుగుతుంది.
ప్రోఫండల్ మండలం: ఈ మండలం తక్కువ వెలుతురు కలిగి మసకగా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలా వరకు డెట్రివోరస్ జీవులు ఉంటాయి. ఈ భాగంలోని జంతువులు ఆహార సేకరణపై దృష్టి ఉంచడం కంటే వాసన, వినికిడి జ్ఞానం పైన ఎక్కువగా ఆధారపడతాయి.
సముద్ర (ఉప్పునీటి) ఆవరణ వ్యవస్థ
l కాంతి ప్రసారం ఆధారంగా సముద్ర ప్రాంతాన్ని కూడా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి..
1. యూఫోటిక్ మండలం
2. బెథిలియల్ మండలం
3. అబైసల్ మండలం
మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ(కోరింగ)
- వెనుకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాల్లోనూ, నదులు, సముద్ర జలాలు కలిసే చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి.
- వీటిని మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. ఈ అడవులు వాటికి కావల్సిన పోషకాలను భూమి పైపొరల్లో ఉన్న మంచి నీటి నుంచి, సముద్ర అలల ఉప్పునీటి నుంచి గ్రహిస్తాయి.
- సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రజనన స్థలంగా, కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడతాయి.
- కోరింగ మాంగ్రూవ్స్ (మడ అడవులు)
కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్టణ దక్షిణ ప్రాంతం నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి.
మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో సజీవ అంశాలు-నిర్జీవ అంశాలు
సజీవాంశాలు - జీవ అంశాల్లో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయి.
ఉత్పత్తిదారులు: మడ చెట్లు, స్పైరోగైరా, యూగ్లినా, అసిల్లటోరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు, యూలోథ్రిక్స్ మొదలైనవి.
వినియోగదారులు: పీతలు, హైడ్రా, ప్రొటోజోవాలు, నత్తలు, తాబేళ్లు, డాఫ్నియా, గొట్టం పురుగులు మొదలైనవి.
విచ్ఛిన్నకారులు: డెట్రిటస్ బ్యాక్టీరియా.
నిర్జీవాంశాలు
ఉప్పునీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, మృత్తిక అనుకూలనాలు - ఆవరణ వ్యవస్థల్లో జరిగే ప్రస్ఫుటమైన, వైవిధ్యమైన మార్పులకు అనుగుణంగా జీవులు జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలు ప్రదర్శిస్తాయి.
- మడ అడవుల్లోని సైప్రస్ లాంటి కొన్ని వృక్షాలు, మొక్కలు, తడి, ఉప్పునీటి సమస్యను ఎదుర్కోవడానికి విభిన్నమైన మార్గాలను అవలంబిస్తాయి. వీటి వేర్ల నుంచి శ్వాసవేళ్లు అభివృద్ధి చెందుతాయి.
- ఇవి నీటిలో పెరిగే మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియ జరపడానికి తోడ్పడతాయి.
- ఈ విధంగా వివిధ పరిస్థితుల్లో జీవించే జీవులు కొంతకాలం తర్వాత వాటికి అనుకూలంగా మారుతాయి. లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవుల్లోని అనుకూలనాలు అంటారు.
- అనుకూలనాలు ఒక జనాభాలో కనబడే సాధారణ లక్షణాలు. ఎందుకంటే ఇవి జీవులు మనుగడ సాగించడంలో సహకరిస్తాయి.
- ఎలక్ట్రిక్ ఈల్ చేపలు దాదాపు 600 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
- ఇవి విద్యుత్‌ను శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి ఉపయోగిస్తాయి.
- వీటి పేరులో ని ఈల్ అంటే సర్పం అనే అర్థం వచ్చేటప్పటికి ఇది పాము కాదు.
- పాక్షికంగా మునిగే మొక్కలు కాండాలు, ఆకులు, వేళ్లు గాలితో నిండి ఉంటాయి. ఇవి నీటిపై తేలడానికి (సమతాస్థితి) ఉపయోగపడతాయి. ఉదా: గుర్రపు డెక్క
- సముద్రంలోని జీవుల శరీరాల్లో లవణాల స్థాయిని క్రమపరిచే అవయవాలు మూత్రపిండాలు, మొప్పలు.
- సముద్ర ఆవరణ వ్యవస్థలో కూడా జీవులు సహజీవనం, రక్షించుకునే ప్రవర్తన, దాక్కోవడం, ప్రత్యుత్పత్తి వ్యూహాలు, సమాచార సంబంధాలు మొదలైన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను కలిగి ఉంటాయి.
- తాబేళ్లు, చేపలు నీటిలో ఈదటానికి తెడ్ల వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉంటాయి.
- కొన్ని చేపలు, డాల్ఫిన్స్ వంటి జలచరాలు శరీరాల్లో ఫ్లోటర్స్ అనే గాలితిత్తులు (జీర్ణ మండలంలోని ప్రత్యేక నిర్మాణం) ఉండటం వల్ల నీటిలో వివిధ స్థాయిల్లో నివశించగలుగుతాయి.
- సీల్ చేపలు కుచించుకుపోయే ఊపిరితిత్తుల వల్ల నీటిలో సులభంగా మునుగుతాయి.
అడవి ఆవరణ వ్యవస్థ
- అడవి ఆవరణ వ్యవస్థను వృక్షాల వయస్సు, శీతోష్ణస్థితి, మృత్తికల రకాలను అనుసరించి వర్గీకరిస్తారు.
- శితోష్ణస్థితి, పోషకాల క్రియాశీలత, నీటి వనరులు మొదలైన అంశాలు స్థానికంగా, ప్రాంతాల వారీగా అటవీ పరిసరాలను ప్రభావితం చేస్తాయి.
ఉత్పత్తిదారులు (వృక్షజాలం): అడవుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అడవి ఏర్పడిన విధానాన్ని బట్టి అక్కడ వృక్ష సంపద ఉంటుంది. ఇక్కడ వృక్షాలతోపాటు పొదలు, నేలపై పెరిగే మొక్కలు ఉంటాయి. వృక్షాలు పరిమాణంలో, నిర్మాణంలో ఎక్కువ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.
వినియోగదారులు (జంతుజాలం): ఆకులను తినే శాకాహారులైన చీమలు, మగ దోమలు, పేడ పురుగులు, సాలెపురుగులు, పశువులు, జింకలు, దుప్పులు, ఏనుగు వంటివి ఉంటాయి. మాంసాహారులైన ముంగీస, పాములు, గబ్బిలాలు, సింహం, పులి, పక్షులు, బల్లులు, నక్కలు మొదలైనవి ఉంటాయి.
విచ్ఛిన్నకారులు: చనిపోయి కుళ్లిపోయిన మొక్కలు, జంతువుల శరీరాలపై పెరిగే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో ఉంటాయి.
ఎడారి ఆవరణ వ్యవస్థ
- భూ భాగంలో దాదాపు 17 శాతం ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఎడారుల్లో సగటు వర్షపాతం 23 మి.మీల కన్నా తక్కువ ఉంటుంది.
- అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఇక్కడ జీవ జాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఇక్కడి వాతావరణానికి అనుకూలనాలను పొంది ఉంటాయి. ఎడారి ఆవరణ వ్యవస్థలోని మూడు అంశాలు..
ఉత్పత్తిదారులు: పొదలు, గడ్డిజాతులు, కొన్ని వృక్షాలు ఉంటాయి. కాక్టస్ (బ్రహ్మజెముడు) మొక్కల కాండాలు రసభరితంగా మారి నీటిని నిల్వ చేసుకుంటాయి. కొన్ని నిమ్నశ్రేణి రకాలైన లైకెన్లు, ఎడారి మాస్లు, నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా కనబడతాయి.
వినియోగదారులు: నీటి కొరతను తట్టుకునే సరీసృపాలు, క్షీరదాలు, కీటకాలు ఎడారుల్లో నివసిస్తాయి. కొన్ని సరీసృపాలు నిశాచరులుగా ఉంటాయి. జంతువుల్లో ఎక్కువగా మాంసాహారులు ఉంటాయి. ఒంటెను ఎడారి ఓడ అంటారు.
విచ్ఛిన్నకారులు: అతి తక్కువ మొక్కలు, నిర్జీవ సేంద్రియ పదార్థాలు ఉండటం వల్ల విచ్ఛిన్నకారులు తక్కువగా ఉంటాయి. ఉష్ణమోచక శిలీంద్రాలు (థర్మో, ఫంగి), బ్యాక్టీరియాలు ఉంటాయి.
ఎడారి మొక్కల్లో అనుకూలనాలు - కలబంద మొక్కలో పత్రాలు ముళ్లలాగా (కంటకాలు) మార్పు చెందడం వల్ల బాష్పోత్సేకం ద్వారా నీరు వృథా కాకుండా చూస్తాయి. కాండంలోని కణజాలం నీటిని నిల్వ చేసి రసభరితంగా ఉంటుంది.
- ఈ మార్పు ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినా జీవించగలుగుతాయి.
- సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎడారి ప్రాంతాల్లో కనబడుతాయి. ఇలాంటి అనుకూలనాలున్న వాటిని ఎడారి మొక్కలు అంటారు.
- ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నిల్వ చేస్తాయి. వీటిని గులకరాళ్ల మొక్కలు అంటారు. వీటిలో ప్రతి గులకరాయి ఒక పత్రం.
- సూర్యరశ్మి పత్రంలో ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీ వంటి భాగం కలిగి ఉంటుంది.
- రాయిలా కనిపించడం వల్ల జంతువులు మోసపోయి ఈ గులకరాళ్ల మొక్కలను తినకుండా వదిలేస్తాయి. ఈవిధంగా మొక్కలు రక్షించబడుతాయి.
- కొన్ని ఎడారి మొక్కలు అలంకారం కోసం ఇళ్లలో పెంచుతున్నారు. కొన్ని మొక్కలైతే పుష్పంగా కనిపిస్తాయి.
ఉదా: కాక్టస్
Previous article
IIT Kharagpur Recruitment | ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో టీచింగ్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు