పిడికెడంత పరిమాణం.. అవిశ్రాంత అవయవం
గుండె-నిర్మాణం-వ్యాధులు-నిర్ధారణ
గుండె ఉండేది పిడికెడే.. కానీ నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే క్షణం
ఆగకుండా నిరంతరం రక్తాన్ని పంపు చేస్తూనే ఉంటుంది. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేసి అక్కడ ఆక్సిజన్‌ను నింపుకుని వచ్చిన మంచి రక్తాన్ని అవయవాలకు పంపిస్తూ ప్రాణాలను నిలబెడుతుంది. అటువంటి గుండె పనిచేసే విధానం, గుండెకు రక్త ప్రసరణ,సంభవించే వ్యాధులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు తదితర అంశాల నుంచి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో గుండె నిర్మాణం, విధుల గురించి తెలుసుకుందాం..
గుండె బాహ్య నిర్మాణం
గుండె బేరి పండులా ఉండి త్రికోణాకారంగా ఉంటుంది. పైవైపున వెడల్పుగా, కింది వైపున సన్నగా ఉంటుంది. గుండెను ఆవరించి రెండు పొరలుంటాయి. వీటిని హృదయావరణ త్వచాలు అంటారు. ఈ రెండు పొరల మధ్యభాగం ద్రవంతో నిండి ఉంటుంది. దీన్ని హృదయావరణ ద్రవం అంటారు. ఇది గుండెను అఘాతాల నుంచి రక్షిస్తుంది. గుండె నాలుగు గదులుగా విభజించి ఉంటుంది. పైన గల రెండు గదులను కర్ణికలు అని కింది రెండు గదులను జఠరికలు అంటారు. గుండె గోడలకు అంటిపెట్టుకున్న రక్తనాళాలను కరోనరి రక్తనాళాలు అంటారు. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. కర్ణికల గోడలు పలుచగానూ, జఠరికల గోడలు మందంగానూ ఉంటాయి.
గుండె అంతర్నిర్మాణం
గుండెను ఆవరించి ఉండే రక్తనాళాలు
1. ధమనులు 2. సిరలు 3. రక్తకేశ నాళికలు
ధమనులు: ఇవి దృఢంగా ఉండే రక్త నాళాలు. ఇవి గుండె నుంచి బయలుదేరి శరీర భాగాలన్నింటికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. అతిపెద్ద ధమని బృహద్ధమని. అతిచిన్న ధమని పుపుస ధమని.
సిరలు: ఇవి తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలు. ఇవి శరీర భాగాల నుంచి రక్తాన్ని హృదయానికి
తీసుకుపోతాయి. గుండెకు పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరలను ఊర్థ బృహత్సిర అంటారు. ఇది శరీరం పై భాగాల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది. గుండెకు కుడివైపున దిగువ భాగంలో కనిపించే సిరను అధోబృహత్సిర అంటారు. ఇది శరీర కింది భాగాల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది.
రక్తకేశ నాళికలు: ఇవి ఏక కణ మందంతో నిర్మితమైన సూక్ష్మమైన నాళాలు. ఇవి తమగుండా
గుండె-కవాటాలు
- పదార్థాలు వ్యాపనం చెందడానికి అనుమతినిస్తాయి. ఇవి ధమనులను, సిరలను కలుపుతూ రక్తకేశ నాళికాజాలాన్ని ఏర్పరుస్తాయి.
- గుండెలో నాలుగు రకాల కవాటాలుంటాయి. ఇవి రక్తాన్ని ఏక మార్గంలో కర్ణికల నుంచి జఠరికలోకి పంపిస్తాయి. అవి
1. అగ్ర ద్వయ కవాటం 2. అగ్ర త్రయ కవాటం 3. పుపుస ధమని కవాటం
4. మహాధమని కవాటం
అగ్రద్వయ కవాటం: ఎడమ కర్ణిక, ఎడమ జఠరికకు మధ్య గల ఎడమ జఠరికాంతర విభాజకంపై గల కవాటాన్ని అగ్ర ద్వయ కవాటం (మిట్రల్ కవాటం) అంటారు.
అగ్ర త్రయ కవాటం: కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య గల ఎడమ జఠరికాంతర విభాజకం పై గల కవాటాన్ని అగ్ర త్రయ కవాటం అంటారు.

పుపుస ధమని కవాటం: కుడి జఠరిక పైభాగం నుంచి పుపుస ధమని అనే రక్తనాళం బయలుదేరుతుంది. అది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. దీని పూర్వ భాగంలో గల కవాటాన్ని పుపుస ధమని కవాటం అంటారు.
మహాధమని కవాటం: ఎడమ జఠరిక నుంచి బయలుదేరే రక్తనాళాన్ని బృహద్దమని లేదా హార్థిక వలయంధమనీ చాపం అంటారు. దీని పూర్వ భాగంలో గల కవాటాన్ని మహాధమని కవాటం అంటారు.
నోట్: సిరల్లో కవాటాలుంటాయి కాని ధమనుల్లో ఉండవు.
హార్థిక వలయం
- మానవుడి గుండె పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుంచి స్పందించడం ప్రారంభిస్తుంది. మానవుడు చనిపోయేంత వరకు గుండె స్పందిస్తుంది. గుండె స్పందించడం ఆగిపోతే మరణం సంభవిస్తుంది. కర్ణికలు, జఠరికలు ఒకేసారి సంకోచించి తర్వాత యథాస్థితికి వస్తే దాన్ని ఒక హృదయ స్పందన వలయం అంటారు. దీన్నే హార్థిక వలయం అంటారు.
- హార్థిక వలయంలో గుండె కండరాలు చురుకుగా పాల్గొని సంకోచ ప్రక్రియ విశ్రాంతి తీసుకునే యథా/పూర్వస్థితులు ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11-0.14 సెకన్లు కాగా జఠరికల సంకోచానికి 0.27-0.35 సెకన్ల సమయం పడుతుంది. కర్ణికలు, జఠరికలు ఒకేసారి సడలటానికి సుమారు 0.4 సెకన్ల సమయం పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ 0.8 సెకన్లలో పూర్తవుతుంది.

పుపుస ప్రసరణ
శరీర అవయవాల నుంచి రక్తం-పూర్వ పర మహా సిరలు- కుడి కర్ణిక- అగ్రత్రయ కవాటం ద్వారా- కుడి జఠరిక-పుపుస మహాధమని-ఊరిపితిత్తులు-ఆమ్లజని సహిత రక్తంగా మారుతుంది- పుపుస సిర- ఎడమ కర్ణికదైహిక ప్రసరణ ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజని సహిత రక్తం- పుపుస సిర- ఎడమ కర్ణిక-అగ్రద్వయ కవాటం ద్వారా- ఎడమ జఠరిక- మహాధమని-శరీర అవయవాలు (ఊపిరితిత్తులు తప్ప) ఏక వలయ రక్తప్రసరణ: రక్తం గుండె ద్వారా ఒకసారి మాత్రమే ప్రయాణించినట్లయితే ఈ ప్రసరణను ఏక వలయ ప్రసరణ అంటారు.
ఉదా: చేప
ద్వివలయ ప్రసరణ: రక్తం గుండె ద్వారా రెండుసార్లు ఒకసారి గుండెకు శరీర భాగాలకు మధ్య మరొకసారి గుండెకు ఊపిరితిత్తులకు మధ్య ఇటువంటి రక్త ప్రసరణను ద్వివలయ రక్త ప్రసరణ అంటారు.
ఉదా: మానవుడు
- రక్తం ప్రవహించేటప్పుడు దాని ఒత్తిడి మనకు తెలుస్తుంది. దీన్నే మనం నాడి కొట్టుకోవడం (Pulse) అంటారు. నాడీస్పందన రేటు, హృదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది.
- రక్తనాళాల్లో ప్రవహించే వ్యవస్థను సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు.
ఉదా: అనెలిడా, ఇఖైనోడర్మెటా జీవులు - రక్తనాళాలు లేని రక్త ప్రసరణ వ్యవస్థను వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు.
ఉదా: ఆర్థ్రోపొడా, మొలస్కా జీవులు
గుండె సంబంధిత వ్యాధులు- నిర్ధారణ పరీక్షలు
- గుండె కండరాల్లోని కొన్ని భాగాలకు తగినంత రక్తం లభించనపుడు గుండెపోటు వస్తుంది. దీనికి సకాలంలో చికిత్స చేసి గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించాలి.
నిర్ధారణ పరీక్షలు
ECG (Electrocardio Gram): గుండె జబ్బుల నిర్ధారణకు ఒక ముఖ్యమైన వైద్యసాధనం. ఇది గుండె విద్యుత్ కార్యకలాపాల రికార్డింగ్. ఇది గుండె ఎలక్ట్రోగ్రామ్. దీని ద్వారా గుండెపోటును నిర్ధారించవచ్చు. గ్రాఫ్‌ను గమనించి అంచనా వేస్తారు.
2d ఎకో: గుండెకు అందుబాటులో ఉన్న అనేక పరీక్షల్లో ఇది ఒకటి. ఇది గుండె కోసం చేసే స్కానింగ్ పరీక్ష. గుండె పనితీరును అంచనా వేయడం, గుండె పరిమాణం తెలుసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం.
కరోనరీ యాంజియోగ్రామ్: గుండె రక్తనాళాలను చూడటానికి X-రే ఇమేజింగ్‌ను ఉపయోగించే ఒక సాంకేతికత. గుండెకు చేరే రక్త ప్రవాహంలో ఏమైనా అవరోధం ఉందా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో చేతి ద్వారా చిన్న పరికరాన్ని గుండె రక్తనాళాల వరకు పంపుతారు. అందులో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అనే విషయాన్ని గుర్తిస్తారు.
ట్రెడ్ మిల్ పరీక్ష (TMT Test): ఇది ఒక రకమైన గుండె పరీక్ష. ఈ ప్రక్రియలో ట్రెడ్ మిల్‌పై నడిపిస్తారు. కరోనరీ ధమని వ్యాధి/కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ను నిర్ధారించడంలో ఈ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది. గుండె వ్యాయామం పనిభారాన్ని ఎంత వరకు నిర్వహిస్తుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
గుండె స్టంట్ అంటే ఏమిటి?
- గుండె చుట్టూ ఉండే రక్తనాళాల ద్వారా గుండెలో ఉండే కండరాలకు రక్తం వెళుతుంది. ఈ కారణంగానే గుండె నిరంతరంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్టిరాల్ వంటి వాటి వల్ల పని ఒత్తిడి, మద్యం, సిగరెట్ వంటి అలవాట్ల కారణంగా రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. రక్త గడ్డకట్టేలా చేస్తాయి. దీంతో గుండెకు రక్తం సరఫరా అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ ప్రక్రియలో ఒక చిన్న ట్యూబ్‌ను గుండెలో రక్తం గడ్డకట్టి ఉన్న రక్తనాళానికి అమర్చి రక్తం సాఫీగా ప్రవహించడానికి స్టంట్లు తోడ్పడతాయి.
గుండె ముఖ్యాంశాలు
- గుండె గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని కార్డియాలజీ అంటారు.
- హృదయ స్పందనలను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని స్టెతస్కోప్ అంటారు.
- 1816లో రెని లెన్నిక్ అనే శాస్త్రవేత్త స్టెతస్కోప్‌ను కనుగొన్నాడు.
- విశ్రాంత దశలో ఉన్న మానవుడి హృదయ స్పందన రేటు నిమిషానికి 72 సార్లు.
- విలియం హార్వేను రక్త ప్రసరణ పితామహుడిగా వ్యవహరిస్తారు.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్లు సంయుక్తంగా ఏటా సెప్టెంబర్ 29ని ప్రపంచ హృదయ దినోత్సవంగా నిర్వహిస్తారు.
- హృదయం సంకోచాన్ని సిస్టోల్ అంటారు.
- హృదయం సడలికను డయాస్టోల్ అంటారు.
- 1967లో ప్రపంచంలోనే మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో గుండెమార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు క్రిస్టియన్ బెర్నార్డ్.
- హృదయ ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తీసే ప్రక్రియను ఆంజియోప్లాస్టి అంటారు.
- గుండెలోని కవాటాలు సరిచేయడం లేదా కృత్రిమ కవాటాలను అమర్చడానికి ఓపెన్ హర్ట్ సర్జరీ నిర్వహిస్తారు.
- హృదయ ధమనికి అవాంతరాలు ఏర్పడితే హృదయ కండరాలకు రక్తం సరఫరా చేయడానికి దాని పక్క నుంచి కొత్తనాళాన్ని అమర్చే ప్రక్రియను బైపాస్ సర్జరీ అంటారు.

Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






