గ్రూప్-4 లక్ష్యమా.. ఇలా సాధించు మిత్రమా!
- గ్రూప్-4 ప్రిపరేషన్ ప్లాన్
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రూప్-4 ఉద్యోగం సాధించడం కోసం ఏవిధంగా ప్రిపేర్ కావాలి, సబ్జెక్టులు ఎలా చదవాలి, ఈ పరీక్షలో ఎలా విజయం సాధించాలి అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేయడానికి నిపుణ అందిస్తున్న సలహాలు సూచనలు..
గ్రూప్-4 పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ నాలెడ్జ్ 150 మార్కులకు, రెండో పేపర్ సెక్రటేరియల్ సామర్థ్యాలు 150 మార్కులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వెబ్‌నోట్ ప్రకారం గ్రూప్-4 పరీక్ష ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే దాదాపు ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు సమర్థంగా వినియోగించుకుంటే కచ్చితంగా పరీక్షలో విజయం సాధించవచ్చు.
పేపర్-1 ను జనరల్ నాలెడ్జ్‌గా పేర్కొన్నప్పటికీ దీన్ని వివిధ పరీక్షలకు నిర్వహించే కామన్ పేపర్ అయిన జనరల్ స్టడీస్‌గా పరిగణించాలి.
పేపర్-1లో మొత్తం 11 అంశాలుంటాయి.
- కరెంట్ అఫైర్స్
- అంతర్జాతీయ సంబంధాలు- సంఘటనలు
- నిత్యజీవితంలో జనరల్ సైన్స్
- పర్యావరణ అంశాలు- విపత్తు నిర్వహణ
- భారతదేశం, తెలంగాణ భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ
- భారత రాజ్యాంగం-ముఖ్య లక్షణాలు
- భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
- ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమంపై ప్రత్యేక ప్రాధాన్యం
- తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
- తెలంగాణ సమాజం, నాగరికత, వారసత్వం, కళలు, భాషా సాహిత్యాలు
- తెలంగాణ ప్రభుత్వ విధానాలు
గమనిక: అభ్యర్థులు మిగతా పరీక్షలకు నిర్వహించే జనరల్ స్టడీస్ పేపర్లోని సోషియాలజీ అనేది గ్రూప్-4 పరీక్షలో భాగం కాదని గమనించాలి. అలాగే భారతదేశ చరిత్రకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొన్న ప్రకారం ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు అల్ప ప్రాధాన్యం ఇచ్చి, ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయ ఉద్యమానికి సంబంధించిన అంశాలపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
పైన పేర్కొన్న 11 అంశాల నుంచి 150 మార్కులకు అత్యధిక మార్కులు ఎలా సంపాదించాలో దశల వారీగా చూద్దాం.
మొదటి దశ: సబ్జెక్టును అర్థం చేసుకొని లోతుగా చదవడం
రెండో దశ: నమూనా ప్రశ్నలు/గత ప్రశ్నా పత్రాలు సాధన చేయడం
మూడో దశ: లోపాలను సవరించుకోవడం
నాలుగో దశ: గ్రాండ్ టెస్ట్ రాయడం
ఈ దశలో అభ్యర్థులు చేయవలసినది ఏమిటంటే గ్రూప్-4 పరీక్షలో రెండు పేపర్లు ఉన్నాయి కాబట్టి చదివే సమయాన్ని రెండు సమ భాగాలుగా విభజించుకోవాలి (ఉదా: ఒకరోజులో 6 గంటలు చదవాల్సి ఉంటే 3 గంటలు పేపర్-1, మరో మూడు గంటలు పేపర్-2 చదవాలి).
అలా కాకుండా ఎవరైనా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు పేపర్-2లో భాగాలైన లాజికల్ రీజనింగ్, సంఖ్యా గణిత సామర్థ్యాలకు సంబంధించిన అంశాలపై పట్టులేకుంటే ఆ అంశాలపై పట్టుసాధించేంత వరకు కొంత అదనపు సమయాన్ని కేటాయిస్తే మంచిది.
పేపర్-1లో ప్రతిరోజు మీరు చదివిన సబ్జెక్టును మరుసటి రోజు రివిజన్ చేసిన తర్వాతే కొత్త టాపిక్ చదవాలి. తర్వాతి రోజు కొత్త టాపిక్ చదివే ముందు మొదటి రెండు రోజులు చదివిన దాన్ని రివిజన్ చేసిన తర్వాత మరో కొత్త టాపిక్ చదవటం అలవాటు చేసుకోవాలి. సంబంధిత సబ్జెక్టు చదివేటప్పుడు దానికి సంబంధించిన ప్రస్తుత వర్తమాన అంశాలను జోడించాలి. పరీక్షా పేపర్లో ప్రశ్నలు సాధారణ స్థాయిలో అడిగినా, కఠిన స్థాయిలో అడిగినా అధిక మార్కులు వచ్చేలా ప్రిపేర్ కావాలి.
ముందుగా గత ప్రశ్న పత్రాలు విశ్లేషించడం వల్ల లేదా సాధన చేయడం వల్ల సంబంధిత సబ్జెక్టులో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, ఏ కోణంలో సబ్జెక్టు చదవాలి అనేది తెలుసుకోవచ్చు. ఉదా: ఇటీవల జరిగిన ఫుడ్ ఇన్స్పెక్టర్, గ్రూప్-1 పరీక్షల ప్రశ్నపత్రం పరిశీలిస్తే జాగ్రఫీకి సంబంధించిన రెండు పేపర్లోనూ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాలపైన ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి కాకాతీయులు అనే అంశం మీద రెండు పరీక్షల్లో ప్రశ్నలు వచ్చాయి.
నమూనా ప్రశ్నలు సాధన చేయడం వల్ల సబ్జెక్టును ఎంత వరకు అర్థం చేసుకోగలిగారు, మీరు చదివిన సబ్జెక్టులో ఏ ఏరియా నుంచి సమాధానాలు తప్పుగా గుర్తిస్తున్నారు అనే అంశాలు మీకు మీరు స్వయంగా తెలుసుకోవచ్చు.
నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయడం ద్వారా తప్పు సమాధానాలు గుర్తించిన ప్రశ్నలకు సంబంధించిన అంశాలను ఒకటి, రెండుసార్లు రివిజన్ చేయడం ద్వారా ఆ అంశాలపై పట్టు సాధించవచ్చు. అలాగే వీక్‌గా ఉన్న అంశాలను గుర్తించి వాటిని మళ్లీ రివిజన్ చేస్తే పరీక్షలో తప్పులు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది.
ప్రిపరేషన్ మొత్తం పూర్తయిన తర్వాత అందుబాటులో ఉన్న సంస్థల వద్ద గ్రాండ్ టెస్ట్‌లు రాయడం వల్ల ఏ స్థాయిలో ఉన్నారు. విజయ అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో సమీక్షించుకోవచ్చు. తద్వారా ప్రిపరేషన్ సామర్థ్యాలను మరింత పెంచుకోవచ్చు. దీని వల్ల పరీక్ష హాల్లో ఎటువంటి టెన్షన్, ఒత్తిడి లేకుండా రాయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
గమనిక: మోడల్ ప్రశ్నపత్రాలు, గ్రాండ్ టెస్ట్ రాసే సమయంలో పరీక్ష మాదిరిగా OMR షీట్‌ను ఉపయోగిస్తూ సమాధానాలు బబుల్ చేస్తూ గుర్తించడం ద్వారా OMR షీట్‌ను ఉపయోగించడం తేలికవుతుంది.
అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలు అంటే సంబంధిత సబ్జెక్టులో నిష్ణాతులైన వారు రాసిన పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు చదవడం ఉత్తమం.
ఉదా: తెలంగాణ చరిత్ర, ఉద్యమం, జాగ్రఫీ, భారత రాజ్యాంగం, ఇతర అంశాలకు తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు చదవడం ఉత్తమం.
తెలంగాణ చరిత్రకు సంబంధించి ఈ అంశంలో ముఖ్యమైన శాతవాహనులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్‌షాహీల కాలం నాటి సామాజిక సాంస్కృతిక విషయాలు, అసఫ్‌జాహీల కాలం నాటి సామాజిక సాంస్కృతిక విషయాలపై పట్టు సాధిస్తే మంచిది.
తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ముల్కీ, నాన్ ముల్కీ అంశాలు, పెద్దమనుషుల ఒప్పందం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆరు సూత్రాల పథకం, జీవో నెంబర్ 610, పంచసూత్ర పథకం, అష్ట సూత్ర పథకం, 1990లలో జరిగిన కొన్ని ప్రధాన ఘట్టాలు, 2001 టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి 2014 జూన్ 2న రాష్ట్రం సిద్ధించే వరకు మొదలైన ముఖ్యమైన అంశాలపై అభ్యర్థులు పట్టు సాధించాలి.
తెలంగాణ సమాజం- సంస్కృతికి సంబంధించి హస్తకళలు, ప్రధాన కట్టడాలు, జాతరలు, పండుగలు, చిత్రకారులు, కోటలు, వివిధ రకాల కులాలు, మతాలు, జానపద కళల వంటి వాటిపై అభ్యర్థులు పట్టు సాధించాలి.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం (ఎకనామిక్ సర్వే), తెలంగాణ స్టాటికల్ అబ్స్ట్రాక్ట్ కచ్చితంగా చదవాలి. తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనే సబ్జెక్టుకు ఈ రెండు పుస్తకాలు ప్రామాణికం.
కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుకు సంబంధించి ప్రతిరోజు రెండు ముఖ్య దినపత్రికలు చదవడం, దాంతో పాటు ప్రతినెలా విడుదలయ్యే ప్రముఖ మ్యాగజైన్లు ఫాలో అవడం చాలా ఉత్తమం.
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ సమాచార, పౌర సరఫరాల శాఖ ప్రతినెలా ప్రచురించే ‘తెలంగాణ’ మాస పత్రిక తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలపై పట్టు సాధించేందుకు చాలా దోహదపడుతుంది.
అంతర్జాతీయ సంబంధాలు అంశంలో వివిధ రకాల అంతర్జాతీయ సంస్థలు ఉదా: UNO, WTO, WMO, వివిధ దేశాల కూటములు మొదలైన అంశాలపై పట్టు సాధించాలి. దాంతో పాటు భారత్‌కు సంబంధించి వివిధ కూటముల్లో సభ్యత్వం, వివిధ దేశాలతో ఇటీవల చేసుకున్న ఒప్పందాలు వంటి వాటిపై దృష్టి సారించాలి.
ఉదా: ప్రస్తుతం G-20 కూటమికి ప్రస్తుతం భారతదేశం సారథ్యం వహిస్తుంది. దానికి సంబంధించిన లోగోను కూడా విడుదల చేశారు. ఇటువంటి అంశాలపై దృష్టి సారించాలి.
మూడు మఖ్య సూత్రాలు
- సబ్జెక్ట్ చదివిన తర్వాత పరీక్షలో ఇలా ప్రశ్నలు అడుగుతారని ఎగ్జామినర్ ఆలోచించే విధంగా మీరు ఊహించగలగడం.
- మెజారిటీ అభ్యర్థులు సరైన సమాధానాన్ని గుర్తిస్తే వారిలో మీరు ఉండటం.
- కఠిన ప్రశ్నలకు తక్కువ మంది సమాధానం గుర్తిస్తే వారిలో మీరు ఉండటం
పై మూడింటిని మీరు ఆకళింపు చేసుకుని ఫాలో అయితే కచ్చితంగా విజయం సాధిస్తారు.
చేయాల్సినవి
- నిర్దిష్టమైన టైం టేబుల్ ఏర్పరుచుకొని కచ్చితంగా అనుసరించడం
- స్వయంగా మోటివేట్ చెందడం కోసం స్టడీ రూంలో ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ అతికించుకోవడం
- ఈ రంగంలో విజయం సాధించిన వారి సలహాలు సూచనలు తీసుకోవడం
- మీకు అలసట అనిపించినప్పుడు గాని చదవాలనే ఆసక్తి లేనప్పుడు గాని నచ్చిన పనిని గంట/అరగంట చేయడం
ఉదా: పాటలు వినడం
- వీక్‌గా ఉన్న సబ్జెక్టును ఎక్కువ సార్లు రివిజన్ చేయడం
- ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రిపరేషన్ కొనసాగించడం
- సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌కు సంబంధించిన యూట్యూబ్ చానళ్లు మాత్రమే ఫాలో అవడం
చేయకూడనివి
- సోషల్ మీడియాకు దూరంగా ఉండటం
- ఒక సబ్జెక్టుకు రెండు కంటే ఎక్కువ పుస్తకాలు చదవడం
- విపరీతంగా యూట్యూబ్ చానళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అనవసరమైన విషయాలను చూస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం
-గందె శ్రీనివాస్ సెకండ్ ర్యాంకర్
2012 గ్రూప్-4 9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు