అన్యాయంపై ఆక్రోశం-1969 ఉద్యమం ( తెలంగాణ చరిత్ర)
పెద్దమనుషుల ఒప్పందం అమలు పట్ల తెలంగాణలో నెలకొన్న అసంతృప్తిని వివరించండి?
# తెలంగాణ నాయకులు చట్టబద్దమైన రక్షణలు కల్పిస్తేనే ఆంధ్రరాష్ట్రంతో విలీనానికి ఒప్పుకుంటామని స్పష్టంచేయటంతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇరుప్రాంతాలకు చెందిన 8మంది నాయకులు 1956 ఫిబ్రవరి 20న ఆ షరతుపై ఒప్పందం చేసుకున్నారు. దాన్నే పెద్దమనుషుల ఒప్పందం అంటారు. దీనిద్వారా విలీనం సందర్భంగా తెలంగాణకు కొన్ని హక్కులు లభించాయి. అయితే దీని అమలులో ఆంధ్రనాయకులు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. విలీనానికి మరొక మార్గం కనిపించకపోవటంతో ఒప్పందం చేసుకున్నారే తప్ప ఆ ఒప్పందం అమలుకు ఆసక్తి చూపలేదు. అసలు రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఒప్పందాల ఉల్లంఘన మొదలైంది.
ప్రాంతీయ మండలి
# పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు విస్తృతమైన అధికారాలుగల ప్రాంతీయ మండలి ఏర్పడాలి. అయితే పార్లమెంటులో నోట్ ఆన్ సేఫ్‌గార్డ్‌ను ప్రవేశపెట్టే సమయానికి తెలంగాణ ప్రాంతీయమండలికి బదులు తెలంగాణ ప్రాంతీయ కమిటిని ప్రతిపాదించారు. కమిటీ నిర్మాణంలోనూ, అధికారాలలోనూ మండలికంటే భిన్నమైంది, బలహీనమైంది కూడా. ఈ కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలదు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు తగ్గట్లు విధానాలు తయారుచేసే అధికారాలు దీనికి లేవు. తెలంగాణకు సంబంధించిన హక్కుల ఉల్లంఘనలో ఇది మొదటిది, చాలా ముఖ్యమైనది.
రాజకీయ ఉల్లంఘనలు
# పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి ఆంధ్రకు చెందిన వ్యక్తి అయినప్పుడు తెలంగాణవారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి తెలంగాణవారికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి నిరాకరించారు.
# పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం 1962 వరకు తెలంగాణ ప్రాంతానికి విడిగా కాంగ్రెస్ కమిటీ ఉండాలి. కానీ 1957లోనే తెలంగాణకు ఉన్న కాంగ్రెస్ కమిటీనికి రద్దుచేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో విలీనం చేశారు. దాంతో తెలంగాణ నుంచి నాయకత్వం ఎదిగే అవకాశం లేకుండా పోయింది.
సాగునీటిరంగంలో వివక్ష
# తెలంగాణలో నికరసాగు భూమిలో 16.6శాతం భూమికి సాగునీటి సౌకర్యం ఉండగా, కోస్తాంధ్రలో 48.3శాతం నికర భూమికి సాగునీటి సౌకర్యం ఉండేది. తెలంగాణలోని సాగునీటి సౌకర్యం ఉన్న భూమిలో 80శాతం చెరువులు, బావుల కిందనే సాగవుతున్నది. సాగునీటి విషయంలో తెలంగాణ వెనుకబడి ఉన్నా రెండో పంచవర్ష ప్రణాళిక (1961-66) కాలంలో ఆంధ్రప్రాంతంలో సాగునీటి సౌకర్యాలకు రూ.93.67 కోట్లు ఖర్చుచేయగా తెలంగాణలో కేవలం రూ.56.76 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఫలితంగా రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దేవునూరు, ఇచ్చంపల్లి ప్రాజెక్టులను పూర్తిగా రద్దుచేసింది. పోచంపాడు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది.
# 1956-68 మధ్యకాలంలో వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్రప్రాంతంలో రూ.35.43 కోట్లు ఖర్చు చేశారు. కానీ తెలంగాణ వ్యవసాయాభివృద్ధికి జరిగిన ఖర్చు రూ.15.66 కోట్లు మాత్రమే.
ఉద్యోగాల్లో వివక్ష
# ఆంధ్రలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని ముల్కీ నియమాలకు విరుద్దంగా వారిని తెలంగాణకు కేటాయించారు. స్థానికంగా అర్హులైన అభ్యర్థులు లేరన్న నెపంతో చాలామందిని స్థానికేతరులను నియమించారు. ఒకాక సందర్భంలో 2500 మంది ఆంధ్రప్రాంతంవారిని తెలంగాణలో ఉపాధ్యాయులుగా నియమించారు. ఈ స్థానాల్లో తెలంగాణవారిని నియమించి నిర్ణీత సమయంలో శిక్షణ పూర్తిచేయాలన్న నిబంధన విధిస్తే సరిపోయేది.
# హైదరాబాద్ ప్రభుత్వ హయాంలోనే నియమించబడిన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు నిరాకరించారు. అప్పటికి తెలంగాణలో లేని డిపార్టుమెంటు టెస్టులను ప్రవేశపెట్టి వాటి ఆధారంగా ప్రమోషన్లు ఇస్తామన్న నిబంధన విధించారు.
నిధులలో వివక్ష
# పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర, కేంద్ర, సాధారణ పరిపాలనా వ్యయానికి అయ్యే ఖర్చును ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. ఈ ఖర్చుపోగా తెలంగాణ ఆదాయంలో మిగులును ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి. అయితే ఆంధ్ర పాలకులు తెలంగాణ మిగులు నిధులను తెలంగాణకోసం ఖర్చుచేయకుండా దుర్వినియోగం చేశారు.
# తెలంగాణ మిగులు నిధులను లెక్కించటానికి నియమించబడిన ఉన్నతస్థాయి కమిటీలైన లలిత్‌కుమార్ కమిటీ, జస్టిస్ భార్గవ కమిటీలు ఈ ప్రాంతానికి చెందాల్సిన మిగులు నిధులను గుర్తించాయి. 1956-68 కాలానికి రూ.34.09 కోట్ల మిగులు నిధులను తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటుందని లలిత్ కమిటీ తేల్చితే, అదే కాలానికి రూ. 28.34 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ భార్గవ కమిటీ లెక్క తేల్చింది.
ముగింపు
# పై విధంగా తెలంగాణ రక్షణల ఉల్లంఘన కారణంగా తెలంగాణ మనుగడ, అస్తిత్వం సంక్షోభంలో పడి 1969 తెలంగాణ ఉద్యమానికి దారితీసింది.
1969 తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులను వివరించండి?
# 1969 ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ అంతటికి వ్యాపింపజేసిన ఘనత కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని తెలంగాణ ఉద్యోగ నాయకులు, వారికి మార్గదర్శనం చేసిన టీఎన్జీవో పాల్వంచ అధ్యక్షుడు వీఎల్ నరసింహారావు, ఇల్లందుకు చెందిన కొలిశెట్టి రామదాసు, ఉపాధ్యాయ సంఘం నేత కే. రామసుధాకర్రాజులకు దక్కుతుంది.
ఉద్యమ ప్రారంభం
# ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్ పవర్‌స్టేషన్‌లో 1969 జనవరి 5న ఉద్యమం రాజుకుంది. తెలంగాణ బొగ్గు, గోదావరి జలాల సాయంతో నిర్మించి ఆ విద్యుత్ కేంద్రంలో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీవర్గం ఆంధ్రప్రాంతంవారే. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయం జరిగింది. ఉద్యోగుల్లో తెలంగాణ కానివారిని వెనుకకు పంపించాలని, తెలంగాణ రక్షణలు అమలుచేయాలని వారి డిమాండ్లు.
# ఖమ్మంజిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన కొలిశెట్టి రామదాసు పాల్వంచ థర్మల్ కేంద్రంలో జరిగిన అన్యాయాలను మొదట వెలుగులోకి తెచ్చి, ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమ ప్రారంభానికి 1968లోనే అంకురార్పణ జరిగింది. 1969 జనవరి 8న పాల్వంచ పట్టణంలో రవీంద్రనాథ్ అనే బీఏ విద్యార్థి రామదాసు నాయకత్వంలో ఖమ్మం పట్టణంలోని గాంధీ క్వద్ద నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే తెలంగాణ రక్షణలు అమలుచేయాలని విద్యార్థులు పెద్ద ఊరేగింపు తీశారు. ఆంధ్ర అని కనిపించిన బోర్డులన్నీ పీకేశారు. తెలంగాణ రక్షణ సమితి అనే సంస్థను స్థాపించి తెలంగాణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఖర్చుచేయాలని, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని, తెలంగాణేతర ఉద్యోగులను వెనక్కు పంపి ఆ స్థానాల్లో తెలంగాణ ఉద్యోగులకు అవకాశాలు ఇవ్వాలని తీర్మానాలు చేశారు. జనవరి 10న ఈ ఉద్యమం నిజామాబాద్‌కు వ్యాపించింది. విద్యార్థి పరిషత్తు అధ్యక్షుడు ఎఎస్ పోశెట్టి నాయకత్వంలో విద్యార్థులు స్కూళ్లు, కేలేజీలను బహిష్కరించి పట్టణంలో ఊరేగింపు తీశారు. నాన్‌ముల్కీ గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ పరిరక్షణ కమిటీ
# 1969 జనవరి 13న హైదరాబాద్ నగరంలోని పురప్రముఖులందరూ సమావేశమై తెలంగాణ పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేశారు. దాని చైర్మన్ కాటం లక్ష్మినారాయణ. వీరు విద్యార్థి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
# జనవరి 15 నుంచి విద్యార్థుల తరగతుల బహిష్కరణ సమ్మె విజయవంతమైంది. 1969 తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు.
తొలి లాఠీచార్జి
# జనవరి 18న నగరంలో మొదటిసారి పోలీసు లాఠీచార్జి జరిగింది.
అఖిలపక్ష సమావేశం
# లాఠీచార్జి, ఉద్యమాలతో పరిస్థితి చేయిదాటిపోయిందని గమనించి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి 1969 జనవరి 18,19 తేదీల్లో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. అఖిలపక్ష ఒప్పందం ప్రకారం లెక్కలు తీస్తే 4500 మంది నాన్ ముల్కీ ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారని తేలింది. వారిని ఆంధ్రకు పంపించివేయటానికి జీవో నంబర్ 36ను ప్రభుత్వం తెచ్చింది. అయితే ఆ జీవోను సవాలుచేస్తూ ఆంధ్ర ఉద్యోగులు 1969 జనవరి 29న హైకోర్టులో రిట్ వేశారు.
రవీంద్రనాథ్ దీక్ష విరమణ
# ప్రభుత్వం తెలంగాణ రక్షణలు అమలుచేయటానికి జీవో 36ను జారీ చేయటంతోపాటు, తెలంగాణ మిగులు నిధుల పరిశీలన కోసం ఢిల్లీకి ఒక బృందం వస్తున్నదని తెలిపింది. దాంతో ఖమ్మంలో 17 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రవీంద్రనాథ్ తన దీక్షను విరమించాడు.
తొలి అమరవీరుడు శంకర్
# 1969 జనవరి 24న మెదక్ జిల్లా సదాశివపేటలో ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో గాయపడిన 19 ఏండ్ల శంకర్ అనే యువకుడు మరణించాడు. 1969 ఉద్యమంలో ఇతడే తొలి అమరుడు.
తెలంగాణ ప్రజాసమితి స్థాపన
# తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ ప్రజాసమితిగా 1969 మార్చి 25న ఆవిర్భవించింది. దానికి అధ్యక్షుడు మదన్మోహన్
రెడ్డి హాస్టల్ సమావేశం
# 1969 మార్చి 8,9 తేదీల్లో హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో తెలంగాణ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు శ్రీమతి సదాలక్ష్మి అధ్యక్షత వహించారు.
# 1969 మార్చి 29న కొండాలక్ష్మణ్ బాపూజీ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. మార్చి 30న ఆయన ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పరిచారు.
# 1969 ఏప్రిల్ 11న ప్రధాని లోక్‌సభలో అష్టసూత్ర పథకాన్ని ప్రతిపాదించారు. అయితే ఈ పథకం తెలంగాణ ప్రజలను సంతృప్తిపర్చలేకపోవటంతో ఉద్యమం మరింత తీవ్రమైంది.
# 1969 మే 23న తెలంగాణ ప్రజాసమితి మదన్మోహన్ స్థానంలో మరిచెన్నారెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకొంది. దానికి పోటీగా తెలంగాణ ప్రజాసమితి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పడింది. 1969 మే 27న ఉద్యోగసంఘాల నాయకుడు అమోస్‌ను పీడీ చట్టం కింద అరెస్టు చేశారు.
# 1971లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 14 స్థానాలకు పోటీచేసి 10 స్థానాల్లో విజయం సాధించింది. ఇందిరాగాంధీ దేశవ్యాప్త ప్రభంజనం వల్ల చేసేది ఏమీలేక చెన్నారెడ్డి తెలంగాణ రక్షణల హామీని ఇందిరాగాంధీ నుంచి పొంది ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
ఉద్యమంలోకి ఉస్మానియా
# ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్ని కాలేజీల విద్యార్థి సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. తెలంగాణ రక్షణల అమలు కోసం జనవరి 15 నుంచి నిరసన సమ్మె చేయాలని నిర్ణయించారు. పెద్దమనుషుల ఒప్పందాన్ని తు.చ. తప్పకుండా అమలుచేయాలని, ముల్కీ నిబంధనలను ఉల్లంఘించినవారిని కఠినంగా శిక్షించాలని, తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు రాజీనామా చేయాలని తెలంగాణకు రూ.70 కోట్ల నిధులు విడుదల చేయాలని తీర్మానాలు చేశారు.
# 1969 జనవరి 13న ఓయూలో తెలంగాణ కార్యాచరణ సమితి ఏర్పడింది. ఈ కార్యాచరణ సమితి ప్రధాన కార్యదర్శిగా మెడికల్ విద్యార్థి మల్లికార్జున్ ఎన్నికయ్యారు. వీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారు. వీరి కేంద్రస్థానం నిజాం కాలేజీ. అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడైన వెంకట్రామిరెడ్డి నాయకత్వంలోని గ్రూపు కేవలం తెలంగాణ రక్షణలు అమలు చేయాలని మాత్రమే కోరింది. వారి లక్ష్యం సమైఖ్యత.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు