రాజద్రోహ చట్టం సెక్షన్-124ఎ
గత 150 ఏండ్లుగా దేశంలోని పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ప్రధాన అవరోధంగా ఉన్న రాజద్రోహం చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు దాని అమలును నిలిపివేస్తూ ఇటీవల (మే 11) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకవైపు 75 ఏండ్ల స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగు తుండగా.. మరోవైపు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు ఈ అంశాన్ని సివిల్స్, గ్రూప్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ కోణంలో ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకుందాం.
అసలేంటీ సెక్షన్ 124ఎ?
# భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఎ రాజద్రోహం గురించి చెబుతుంది.
# మాటలతో కాని, చేతలతో కాని, సంకేతాలతో కాని, ప్రదర్శనలతో కాని, మరేవిధంగా కాని భారతదేశంలో చట్టబద్ధంగా నియమితమైన ప్రభుత్వం (గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా) పట్ల అవిధేయతను, విద్వేషాన్ని, శత్రుభావనను ప్రేరేపించిన లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించినవారిని రాజద్రోహం కింద నేరస్థులుగా పరిగణిస్తారు.
# రాజద్రోహం అనేది నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ నేరం.
# దీనికి మూడేండ్ల జైలు నుంచి జీవితఖైదు దాకా (జరిమానాతో/జరిమానా లేకుండా) శిక్ష విధిస్తారు.
# ఈ సెక్షన్ కింద ఆరోపణలతో కేసు దాఖలైనవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. కోర్టులకు పాస్‌పోర్టును అప్పగించి, అవసరమైనప్పుడు హాజరుకావాలి.
నేపథ్యం
#1837- బ్రిటిష్ ఇండియా మొదటి లా కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన థామస్ బాబింగ్టన్ మెకాలే అంతకుముందు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతులను క్రోడీకరించి కొత్తగా ‘ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)’ పేరుతో నూతన శిక్షాస్మృతి ముసాయిదా (డ్రాఫ్ట్)ను రూపొందించి, అందులో సెక్షన్ 133 కింద దేశద్రోహం నిబంధనను చేర్చారు (అప్పటి ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసే భారతీయులను శిక్షించడానికి ఉద్దేశించింది ఈ సెక్షన్).
# 1860- భారత శిక్షాస్మృతి అమలు. కానీ పొరపాటున సెక్షన్ 133ని అందులో చేర్చలేదు. అందుకు విస్పష్టమైన కారణం ప్రస్తావించలేదు.
#1857- సిపాయిల తిరుగుబాటు ఫలితంగా దేశంలో కంపెనీ పాలన రద్దయి, బ్రిటిష్ రాణి/రాజు ప్రత్యక్ష పాలన ప్రారంభమయ్యింది.
# 1863-70 బ్రిటిష్ ప్రభుత్వానికి సవాలుగా మారిన వహాబీ ఉద్యమ కార్యకలాపాలను అణచివేయడానికి అప్పట్లో భారత చట్టాల వ్యవహారాలను చూసుకునే జేమ్స్ స్టీఫెన్ సలహా మేరకు ఐపీసీ చట్టాన్ని సవరించి సెక్షన్ 124ఎ ద్వారా రాజద్రోహంను చేర్చారు.
# 1870- సెక్షన్ 124ఎ అమలు.
నోట్: రాజద్రోహం చట్టం సెక్షన్ 124ఎ 1870లో అమల్లోకి వచ్చిన తరువాత తొలిసారి అరెస్ట్ అయిన వ్యక్తి బెంగాల్ వీక్లీ న్యూస్‌పేపర్ బంగబాసి ఎడిటర్ జోగేంద్ర చుందర్ బోస్ (క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ జోగేంద్ర చుందర్ బోస్ కేసు- 1891). ఇతడు 1891 కనీస వివాహ చట్టాన్ని విమర్శిస్తూ వ్యాసాలు ప్రచురించడం వల్ల సెక్షన్ 124ఎ కింద అరెస్ట్ అయ్యాడు. కానీ కలకత్తా హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసి, కేసు ఉపసంహరించింది.
స్వాతంత్య్ర పూర్వం 124ఎ అమలు
1) బాలగంగాధర్ తిలక్
#దేశంలో తొలిసారి సెక్షన్ 124ఎ కింద అరెస్టయి, జైలుశిక్ష అనుభవించిన తొలి వ్యక్తి లోకమాన్య బాలగంగాధర్ తిలక్.
తొలిసారి 1897లో
కారణాలు: ఎ) 1896లో భారత్‌లో సంభవించిన భయంకరమైన కరువు నేపథ్యంలోనూ బ్రిటిష్‌వారు అమలు చేసిన కఠిన రెవెన్యూ విధానాలను విమర్శిస్తూ తన పత్రిక ‘కేసరి’లో వ్యాసాలు ప్రచురించడం.
#బి) 1897లో పుణెలో సంభవించిన బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897ను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం.
# సి) 1894లో ప్రొఫెసర్ ఆర్పీ కర్కారియా మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ గురించిన నివేదిక ప్రతులను రాయల్ ఏషియాటిక్ సొసైటీ (బొంబాయి)కి సమర్పించడం, వాటిని 1897లో శివాజీ వార్షిక పట్టాభిషేక మహోత్సవం రోజున తిలక్ తన కేసరి పత్రికలో ప్రచురించడం, అవి శివాజీ గొప్పతనాన్ని పొగుడుతూ, పరాయి దేశాల వారిని కించపరిచేలా ఉండటం బ్రిటిష్‌వారిని ఆగ్రహించేలా చేశాయి.
# కేసులో తిలక్ తరఫున వాదించిన లాయర్- దిన్షా దావర్
# కేసులో తీర్పిచ్చిన జడ్జి– జస్టిస్ ఆర్థర్ (స్ట్రాచీ)
#తీర్పు- తిలక్‌ను దోషిగా నిర్ధారించి 18 నెలల కఠిన కరాగార శిక్ష విధించారు.
రెండో సారి- 1908లో
#కారణం- 1905లో బెంగాల్ విభజన నేపథ్యంలో ఖుదీరామ్ బోస్ అనే ఉద్యమకారుడు ఇద్దరు బ్రిటిష్ మహిళలను బాంబు పేలుళ్ల ద్వారా చంపాడని, విచారణలో భాగంగా పోలీసులు పుణెలోని తిలక్ నివాసాన్ని సోదా చేస్తున్నప్పుడు బాంబు పేలుళ్లకు సంబంధించిన రెండు పుస్తకాలు దొరికాయి. వాటిని సాక్ష్యంగా చూపి తిలక్‌ను అరెస్ట్ చేశారు.
# తీర్పిచ్చిన జడ్జి- జస్టిస్ దిన్షా దావర్
#తీర్పు- తిలక్‌ను దోషిగా నిర్ధారించి 6 సంవత్సరాల పాటు ద్వీపాంతర శిక్ష విధించారు.
నోట్: ఈ కేసులో తిలక్‌ను బర్మా (మయన్మార్)లోని ‘మాండెలా’ కర్మాగారంలో బంధించారు. ఈ సందర్భంలోనే ఆయన గీతారహస్యం అనే గ్రంథాన్ని రచించారు.
మహాత్మాగాంధీపై..
# కారణం- గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో 1922, ఫిబ్రవరి 4న యునైటెడ్ ప్రావిన్స్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా రీరా గ్రామంలో ఆగ్రహం చెందిన ఉద్యమకారులు పోలీస్‌స్టేషన్‌ను దహనం చేసి 22 మంది పోలీసులను సజీవదహనం చేయడం.
# దీనికి ప్రేరణ ఇచ్చింది యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ రాసిన వ్యాసాలు అని బ్రిటిష్ ప్రభుత్వం భావించి గాంధీజీపై రాజద్రోహం కేసును నమోదు చేసింది.
#తీర్పిచ్చిన జడ్జి- జస్టిస్ సీఎన్ బ్రూమ్‌ఫీల్డ్ (1922, మార్చి 18).
# తీర్పు- గాంధీజీకి ఎరవాడ జైలులో 6 సంవత్సరాల జైలుశిక్ష విధించారు.
రాజ్యాంగ పరిషత్తులో చర్చ
#రాజ్యాంగ పరిషత్ సమావేశాల్లో ప్రాథమిక హక్కులపై చర్చ జరుగుతున్నప్పుడు సెక్షన్ 124ఎ పై వాదోపవాదాలు జరిగాయి. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజద్రోహం అంశాన్ని రాజ్యాంగంలో ఉంచాలని అభిప్రాయపడగా కేఎం మున్షీ, సోమ్‌నాథ్ లహరి వంటి వారు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిని రాజ్యాంగంలో కొనసాగించలేదు. కానీ భారతీయ శిక్షాస్మృతిలో మాత్రం సెక్షన్ 124ఎ గా రాజద్రోహం కొనసాగింది.
స్వాతంత్య్రానంతరం అమలు
# దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ‘ఈ సెక్షన్‌ను భవిష్యత్‌లో కొనసాగించడం మంచిదికాదని, అత్యంత అనుచితమైనది, గర్హనీయమైనది, ఎటువంటి చట్టంలోనూ దీనికి తావుండరాదు’ అని 1957లో పార్లమెంటులో ప్రసంగించారు.
124ఎ – కోర్టు తీర్పులు
1951-పంజాబ్ హైకోర్టు తీర్పు
# సెక్షన్ 124ఎ అనేది అత్యంత ప్రమాదకరం. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ చట్టబద్ధం కాదు.
# ఫలితంగా 1951లో భారత ప్రభుత్వం 1వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందించి ప్రాథమిక హక్కులోని ప్రకరణ 19(1) ప్రకారం లభించిన స్వేచ్ఛకు సహేతుకమైన పరిమితులను విధిస్తూ ప్రకరణ 19(2)ను చేర్చారు.
1959- అలహాబాద్ హైకోర్టు తీర్పు
#సెక్షన్ 124ఎ అనేది ఏవిధంగానూ సమర్థనీయం కాదు. తక్షణం దాని అమలును పునఃసమీక్షించాల్సి ఉంది. వాక్స్వాతంత్య్రాన్ని కుదించే హక్కు ఎవరికీ లేదు.
కేదార్నాథ్ కేసు- 1962
#తీర్పులోని ముఖ్యాంశాలు: 1) వాక్ స్వాతంత్య్ర హక్కుకు పరిమితి విధించే ఈ సెక్షన్ సరైనదే. ఇది ప్రభుత్వాలు, న్యాయస్థానాల మర్యాద, గౌరవం, సార్వభౌమాధికారాలకు రక్షణ కల్పిస్తుంది.
2) ఈ సెక్షన్‌ను వర్తింపజేయాలంటే సదరు వ్యక్తి వ్యాఖ్యలు లేదా చర్యలు శాంతిభద్రతకు విఘాతం కలిగించేలా లేదా హింసను ప్రేరేపించేలా ఉండాలి.
బల్వంత్ సింగ్ కేసు-1995
# 1989, అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యకు గురైన తరువాత ‘ఖలిస్థాన్ జిందాబాద్’ అంటూ జనసమూహంలో నినాదాలు చేశారనే ఆరోపణలతో బల్వంత్ సింగ్ తదితరులను రాజద్రోహం కింద ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
# సుప్రీంకోర్టు తీర్పు- ‘ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదా ప్రతిస్పందనను ప్రేరేపించని కొన్ని నినాదాలను ఇద్దరు వ్యక్తులు చేయడం దేశద్రోహం కిందకు రావు. అలా రావాలంటే మరింత తీవ్రమైన చర్యలు అవసరం.
124ఎ కింద అరెస్టయిన ప్రముఖులు
1) ప్రవీణ్ తొగాడియా (విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి)- 2003
2) అరుంధతీ రాయ్ (బుకర్ ప్రైజ్ గ్రహీత)- 2010
3) అసీమ్ త్రివేది (కార్టూనిస్ట్)- 2012
4) రిన్షాద్ రీరా (విద్యార్థి కార్యకర్త)- 2019
5) కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ (జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు)- 2019
6) వినోద్ దువా (దివంగత పాత్రికేయుడు)
7) సిద్దిఖీ కప్పన్ (కేరళ జర్నలిస్ట్)
8) హార్దిక్ పటేల్ (గుజరాత్)
9) దిశా రవి (బెంగళూరు- వాతావరణ కార్యకర్త- రైతు ఉద్యమం నేపథ్యంలో టూల్‌కిట్ వ్యవహారంలో)
10) రఘురామ కృష్ణంరాజు (వైఎస్సార్సీపీ ఎంపీ)
#2010-14 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 3762 మందిపై 279 రాజద్రోహం కేసులు దాఖలయ్యాయి. 2014-20 మధ్యకాలంలో 519 కేసుల్లో 7136 మందిపై రాజద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. 2015-20 మధ్య రాజద్రోహం కేసులో అరెస్టయిన 548 మందిలో కేవలం 12 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి.
2022 మే 11 సుప్రీంకోర్టు ఆదేశాలు
1) రాజద్రోహం చట్టం పునఃపరిశీలనలో ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెక్షన్ 124ఎ కింద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు.
2) రాజద్రోహం కేసులకు సంబంధించిన పెండింగ్ విచారణలు, అప్పీళ్లు, అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపివేయాలి. కోర్టుల అనుమతి ఉంటేనే విచారణ కొనసాగించాలి.
3) ఈ సెక్షన్ కింద కేసులు ఎదుర్కొంటున్నవారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
4) సెక్షన్ 124ఎ పై స్టే ఇవ్వడం వల్ల కిందిస్థాయి కోర్టులూ కక్షిదారులకు ఉపశమనం ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చు.
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్స్ మెంటార్
హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు