ఈ యుద్ధం ఇంకెంతకాలం?
ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన కరోనా మహమ్మారితో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రాణనష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది కూడా మరో ప్రపంచ యుద్ధంలాగే నడుస్తుందని చెప్పవచ్చు. ఇదివరలో దేశాల నడుమ ఆధిపత్య పోరు, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష యుద్ధాలకు దారితీసిందిగానీ, ఇక ఇప్పుడు యుద్ధమంటూ వస్తే అది జీవాయుధాలదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివిధ దేశాలు జీవాయుధాల తయారీలో నిమగ్నమై ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న కరోనా ఉదంతం ఇటువంటి ఊహాగానాలకు ఊతమిస్తున్నది.
2019 నవంబర్‌లో పరిచయమైన కొవిడ్ 19 క్రమక్రమంగా అన్ని దేశాలకు పాకి 2020లో సృష్టించిన ఒక మహా భయోత్పాతాన్ని ప్రపంచమంతా గమనించింది. జనజీవనం స్తంభించిపోయింది. విమానాశ్రయాలు మూతపడ్డాయి. దేశాలన్నీ లాక్డౌన్ విధించుకున్నా యి. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా పరిణమించిన ఈ మహమ్మారి బారినుంచి ఎలా బయటపడాలో, కనబడని శత్రువుతో ఎలా యుద్ధం చేయాలో తెలియక సతమతమయ్యారు.
కరోనా ఉదంతం ఇప్పటివరకు కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. దాని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారు 25 లక్షలకు పైగానే ఉన్నారు. అన్ని రంగాలపై ప్రభావం పడింది. దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు కుదేలయ్యాయి. చాలా పరిశ్రమలు, కంపెనీలు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. లక్షల, కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోతున్నది. దీనివల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఇప్పటివరకు 350 లక్షల కోట్లు నష్టపోయినట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
కరోనాతో పోరాటం ఇంకా ఎంతకాలం నడుస్తుందో తెలియదు. ఆ వైరస్‌తో సుదీర్ఘ కాలం సహజీవనం చేయాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. టీకా వచ్చిందిగానీ అది ఎంతవరకు ఫలితాన్నిస్తుందో ఖచ్చితంగా తెలియదు. ఇన్ని అనర్థాలకు కారణంగా భావిస్తున్న చైనా దేశాన్ని ఏ అంతర్జాతీయ వేదికపైన కూడా గట్టిగా నిలదీయకపోవడం గమనార్హం. వుహాన్ పట్టణంలోని ప్రయోగశాలను సందర్శించడానికి చైనా ఏ దేశాన్ని కూడా అనుమతించలేదు. చాలా దేశాలు వాణిజ్యపరంగా చైనా మీద ఆధారపడి ఉండటం, అమెరికాకు చెందిన అనేక సంస్థలు చైనాలో ఉండటం, ప్రపంచ జీడీపీలో చైనా 16 శాతానికి పైగా వాటా కలిగి ఉండటం వంటి కారణాలతో ఏమీ అనలేకపోతున్నాయి.
అణ్వాయుధాలకన్నా ఎక్కువగా, మానవాళి మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిన ఇలాంటి జీవాయుధ పరిశోధనలను నియంత్రించాల్సిన అవసరం ప్రపంచదేశాలపై ఉంది. ఎలాంటి పరిశోధనలైనా మనిషి మనుగడకు ముప్పు వాటిల్లకుండా, మానవాళి అభివృద్ధికి దోహదపడాలే తప్ప వినాశాన్ని కాంక్షించగూడదు. ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ సంస్థలు తగిన చర్యలను చేపట్టాలి. ఇలాంటి ఉదంతాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి.
(వ్యాసకర్త: డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి , ఇ.ఎన్. టి. స్పెషలిస్ట్, ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వైద్యశాల, కోఠి)
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు