నిరుద్యోగం ఎన్ని రకాలంటే?
నిరుద్యోగం అంటే ఏమిటి? దాని నిర్వచనంలో ఏయే అంశాలు ఇమిడి ఉంటాయి?
ఏ వయసు వారిని నిరుద్యోగులుగా పరిగణిస్తాం, నిరుద్యోగాన్ని ఎలా కొలుస్తారు?
నిరుద్యోగం ఎలాంటి సందర్భంలో ఉద్యోగంగా మారుతుందో మొదలైన విషయాలను
గత వ్యాసంలో తెలుసుకున్నాం. అయితే నిరుద్యోగం అధ్యాయానికి సంబంధించి
నిరుద్యోగం రకాలు వాటికి గల కారణాలు తెలుసుకోకుండా ఈ చాప్టర్ పూర్తి కాదు. ఇంకా నిరుద్యోగం ఎలా వస్తుంది? దాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి వ్యవస్థాగత చర్యలు చేపట్టింది? మొదలైన విషయాలను ఈ వ్యాసంలో చర్చిద్దాం.
నిరుద్యోగం అంటే ఇంతకుముందు చర్చించినట్టు.. పనిచేయడానికి సిద్ధంగా ఉండి, కోరికతో ఉండి, మార్కెట్లో ఉన్న వేతనానికే పనిచేయాలనుకున్నా పని దొరకని స్థితి. అయితే ఈ నిరుద్యోగాన్ని పలు సందర్భాల్లో ఆయా పని మూలాన్ని బట్టి, ఆ పని లభించే ప్రదేశాన్ని బట్టి, ఆ పనికోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులను బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు.
అభివృద్ధి చెందిన దేశాలు-నిరుద్యోగ రకాలు
సంఘృష్ట నిరుద్యోగిత
-ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారే క్రమంలో వ్యక్తులు కొన్నిరోజులు ఉద్యోగం లేకుండా ఉంటారు. అలాంటి విరామస్థితిని సంఘృష్ట నిరుద్యోగిత అంటారు.
-ఎలా వస్తుంది : ఒక ఉద్యోగంలో ఒకవేళ వేతనాలు తక్కువగా ఉండి, ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వేరే ఉద్యోగంలోకి మారుతుంటారు. అలాంటి సందర్భంలో కొన్ని రోజులు ఉద్యోగం దొరకని స్థితి ఉంటుంది.
-ఇది సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు కూడా సంభవిస్తుంది.
-కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొనే క్రమంలో కొందరిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
-సాధారణంగా వేరే ఉద్యోగం దొరికిన తర్వాతే ప్రస్తుతమున్న ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు.
-ఇది తాత్కాలికమైనది.
చక్రీయ నిరుద్యోగిత
-ఆర్థికమాంద్యం, ఆర్థిక అస్థిరత, ఆర్థిక సంక్షోభం మొదలైనవి వచ్చినప్పుడు కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తాయి. ఇలాంటి పరిస్థితిని చక్రీయ నిరుద్యోగిత అంటారు.
-దీన్నే డిమాండ్ డెఫిషియన్సీ (డిమాండ్ లేమి) నిరుద్యోగిత అని కూడా అంటారు.
మూల కారణం
-ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తికి డిమాండ్ తగ్గడం. అలా తగ్గినప్పుడు వ్యాపార సంస్థలు వస్తువుల ఉత్పత్తిని తగ్గించాలి. తక్కువ వస్తువుల ఉత్పత్తికి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు అవసరం కాబట్టి కొంతమంది ఉద్యోగులను తొలగిస్తుంటారు.
ఉదా: 2008లో అమెరికాలో వచ్చిన సబ్‌ప్రైమ్ క్రైసిస్.
అస్వచ్ఛంద నిరుద్యోగం
-అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తికి సరిపడా డిమాండ్ లేకపోవడంతో తమ ప్రమేయం లేకుండానే స్వచ్ఛందంగా నిరుద్యోగం ఏర్పడుతుంది. అయితే ఇది తాత్కాలిక నిరుద్యోగం మాత్రమే.
-మళ్లీ వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు ఉద్యోగిత కూడా పెరుగుతుంది.
-పై నిరుద్యోగ రకాలన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తాయి. అంటే ఇప్పటికే వ్యవస్థాపరంగా, సంస్థాగతంగా అన్ని రంగాల్లో ఉన్నతిని సాధించినా, సంపూర్ణ ఉద్యోగిత ఉన్నా నిరుద్యోగం వస్తుందని చెప్పడానికి పైమూడు ఉదాహరణలు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగం
నిర్మితి నిరుద్యోగిత
-ఈ నిరుద్యోగం జనాభా పెరుగుదలలో విపరీతమైన మార్పులు వచ్చినప్పుడు సాంకేతికంగా విపరీత అభివృద్ధి జరిగినప్పుడు, మూలధన పెట్టుబడుల్లో తగ్గుదల వచ్చినప్పుడు ఏర్పడుతుంది.
-ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని బట్టి ఉంటుంది. దేశంలో శ్రామికశక్తి పెరిగినప్పటికీ శ్రామిక డిమాండ్ అంటే ఉద్యోగావకాశాలు పెరిగినట్లయితే ఏర్పడే పరిస్థితిని నిర్మాణాత్మక లేదా వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా అభివర్ణిస్తారు.
ఎలా వస్తుంది?
-ఎక్కువగా వనరుల అల్ప వినియోగం, తక్కువస్థాయి పెట్టుబడి, సాంఘిక వెనుకబాటుతనం, తక్కువస్థాయి సాంకేతికత, నిరక్షరాస్యత మొదలైనవి ఇటువంటి నిరుద్యోగంలో కనిపిస్తాయి.
అల్ప ఉద్యోగిత
-ఒక వ్యక్తి సామర్థ్యానికి, విద్యాసంబంధ అర్హతకు సంబంధంలేకుండా ఉద్యోగం లభించడాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. ఉదా: పీజీ, ఎంటెక్, పీహెచ్డీ చేసిన అభ్యర్థులు అటెండర్, జూనియర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు చేయడం.
-అంటే ఇక్కడ ఉద్యోగం లభించినా సరిపోయే ఉద్యోగం కాదు కాబట్టి దీన్ని అల్ప ఉద్యోగిత అంటారు.
-ఇటీవల కానిస్టేబుల్, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలను ఎంటెక్, పీహెచ్డీ చేసినవారు పొందడం కూడా ఈ కోవలోకే వస్తుంది.
చదువుకున్నవారిలో నిరుద్యోగిత
-అన్ని విద్యలు, నైపుణ్యాలను పొందికూడా ఒక వ్యక్తికి ఉన్న అర్హతలకు అనుగుణంగా ఉద్యోగం లభించనట్లయితే దాన్ని చదువుకున్నవారిలో నిరుద్యోగంగా వర్ణిస్తారు. ఇక్కడ ఉద్యోగం లభించని స్థితి.
-అదే అల్ప ఉద్యోగితలో అయితే ఉద్యోగం ఉంటుంది. కానీ సామర్థ్యానికి అనుగుణంగా ఉండదు.
బహిరంగ నిరుద్యోగిత
-శ్రామికులు ఏ పనిలేకుండా జీవించినట్లయితే, వారికి చేయడానికి ఏ పని దొరకనట్లయితే వారందరూ బహిరంగ నిరుద్యోగితలోకి వస్తారు. ఉదా: గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఏ పనీ లభించని స్థితిని బహిరంగ నిరుద్యోగిత అని అనవచ్చు.
స్వచ్ఛంద నిరుద్యోగిత
-ఉద్యోగాలు లభించే పరిస్థితుల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగాలేని వ్యక్తులు ఈ కోవలోకి వస్తారు. ఉదా: సంపన్నులు, బద్దకస్తులైన వ్యక్తులు పని లభించే పరిస్థితి ఉన్నా పనిచేయడానికి సిద్ధంగా ఉండరు. ఈ వ్యక్తులు శ్రామిక శక్తి కోవలోకి రారు.
ప్రకృతి నిరుద్యోగిత-సాధారణ నిరుద్యోగిత
-ఒక దేశంలో నిరుద్యోగిత 2 శాతం నుంచి 3 శాతం మధ్యలో ఉంటే దాన్ని సాధారణ నిరుద్యోగిత అంటారు.
-మొత్తం నిరుద్యోగాన్ని తొలగించడం సాధ్యం కాదు. అలాగే ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఇది అనివార్యం.
-పైన వర్గీకరించిన నిరుద్యోగ రకాలేకాకుండా నిరుద్యోగాన్ని మరో రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1) గ్రామీణ నిరుద్యోగం:
ఉదా: రుతుపరమైన, ప్రచ్ఛన్న నిరుద్యోగం.
2) పట్టణ నిరుద్యోగం:
ఉదా: బహిరంగ నిరుద్యోగం.
పట్టణ నిరుద్యోగాన్ని మళ్లీ మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1) బ్లూ కాలర్ నిరుద్యోగులు:
ఉదా: నైపుణ్యంలేని పారిశ్రామిక శ్రామికులు.
2) వైట్ కాలర్ నిరుద్యోగులు:
ఉదా: చదువుకున్న మధ్యతరగతి వర్గం
3) పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవారు
నిరుద్యోగిత కారణాలు
1) జనాభా పెరుగుదల
2) ఉపాధిలేకుండా వృద్ధి
3) పేదరికం
4) నైపుణ్యాల కొరత
5) యాంత్రీకరణ, సాంకేతిక వృద్ధి
6) నాణ్యతలేని విద్య
7) సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్షీణత
8) వ్యాపార చక్రాలు
9) సరళీకరణ విధానాలు
ముగింపు: పై కారణాలే కాకుండా సమాజంలో ఉండే వివిధ పరిమితులు, సాంఘిక, సాంస్కృతిక, చారిత్రక కారణాలు కూడా నిరుద్యోగితకు కారణాలవుతున్నాయి.
ప్రచ్ఛన్న నిరుద్యోగిత
ఇది ఒక ప్రత్యేకమైన నిరుద్యోగ సందర్భం. ఇక్కడ ప్రజలు ఉద్యోగులుగా ఉంటారు. కాని వారి వల్ల జరిగే ఉత్పత్తి సున్నాగా ఉంటుంది. ఇటువంటి నిరుద్యోగిత ఎక్కువగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది.
ఉదా: ఒక కంపెనీలో నలుగురు వ్యక్తులు పనిచేస్తూ ఐదు టన్నుల ఇనుమును ఉత్పత్తి చేస్తారనుకుందాం. ఆ తర్వాత మరో ఐదుగురు వ్యక్తులు ఆ ఉత్పత్తిలో పాల్గొన్నా కూడా ఉత్పత్తి పెరుగుదల శూన్యం. అయితే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.
-అంటే ప్రస్తుతం ఉన్న పనికి కొంతమందిని కలిపినా, తీసివేసినా ఉత్పత్తిలో ఎలాంటి పెరుగుదల, తరుగుదల లేని పరిస్థితిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు.
-దేశంలో ఈ నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది.
రుతుపరమైన నిరుద్యోగిత
శ్రామికులకు ఏడాదంతా పని ఉండక కొన్ని రుతువుల్లో పని ఉండి, మరికొన్ని రుతువుల్లో పనిలేనట్లయితే అటువంటి నిరుద్యోగితను రుతుపరమైనదిగా భావిస్తారు.
-ఇది భారత్ లాంటి దేశాల్లో వ్యవసాయ సంబంధ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఉదా: 1) సాగునీటి వసతిలేకుండా వర్షంపై ఆధారపడే వ్యవసాయం.
2) చక్కెర పరిశ్రమల్లోకి కార్మికులను తీసుకోవడం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు