ఇక్షాకుల కాలంలో మత పరిస్థితులు ఎలా ఉండేవి?
శాసనాల ప్రకారం లభిస్తున్న నలుగురు ఇక్షాక రాజుల్లో ఒక్క వీరపురుషదత్తుడు తప్ప మిగిలిన ముగ్గురు రాజులు వైదిక మతావలంబికులు. ఇక్షాక రాజ్యస్థాపకుడైన శ్రీశాంతమూలుడు అశ్వమేథ, వాజపేయ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర మొదలైన క్రతువులను నిర్వహించాడు. ఇతడు విరూపాక్షపతి, మహాసేన, కార్తికేయుల పాదభక్తుడినని చెప్పుకున్నాడు. ఇతని మనుమడైన ఎహూవల శాంతమూలుడిని దక్షిణ భారతదేశంలోనే మొదటి హిందూ దేవాలయాల నిర్మాతగా చెప్పవచ్చు.
-పుష్పభద్రస్వామి అనే పేరుతో ఒక శివాలయాన్ని నాగార్జునకొండలో నిర్మించాడు. ఇతని సేనాని ఎలిశ్రీ సర్వదేవ అనే పేరుతో శివాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎహూవల శాంతమూలుని కాలంలోనే నాగార్జునకొండలో నొడగేశ్వరాలయం ఉన్నట్లు, ఆ ఆలయానికి రతనశ్య అనే వర్తకుని కూతురు, మరికొందరు కలిసి దానధర్మాలు చేసినట్లు తెలుస్తుంది. ఇక్షాకుల కాలంలో మాతృదేవతారాధన కూడా ఉండేది. నాగార్జునకొండలో హరీతి దేవాలయం ఉండేదని తెలుస్తుంది. ఆ రోజుల్లో స్త్రీలు సంతానం కోసం హరీతి దేవాలయంలోని సప్తమాత్రికల వద్ద గాజులను సమర్పించేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా ఇక్షాకుల కాలంలో పౌరాణిక శైవ, వైష్ణవ మతాలు ఆదరణ పొందాయి.
బౌద్ధమతం
-ఇక్షాక రాజైన వీరపురుషదత్తుని కాలాన్ని ఆంధ్రదేశంలో బౌద్ధమతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. బౌద్ధమతానికి చేసిన సేవలకుగాను ఇతను దక్షిణాది అశోకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇక్షాక రాణులు కూడా బౌద్ధమతాన్ని ఆదరించి అనేక దానాలు చేశారు. క్రీ.శ. రెండో శతాబ్దం నాటికి నాగార్జునకొండ భారతదేశంలోనే ప్రసిద్ధ బౌద్ధ ఆరామంగా విలసిల్లింది. నాగార్జునకొండ శాసనాలు అనేక బౌద్ధమత శాఖలను పేర్కొంటున్నాయి. రాజగిరికలు, మహిశాసికులు, సిద్ధాంతికులు వంటి శాఖలు నాగార్జునకొండలో ఉండేవి. అమరావతి పూర్వశైలీయులకు, నాగార్జునకొండ అపరశైలీయులకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి.
-వీరపురుషదత్తుని మేనత్త శాంతశ్రీ అతడి ఆరో పాలనా సంవత్సరంలో బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించి, తొమ్మిది ఆయక స్తంభాలను నెలకొల్పింది. ఆయక స్తంభంపై ప్రాకృతంలో సమ్మ సంభుధన ధాతు పరపరిగ్రహిత అని ఉంది. అంటే బుద్ధుని శ్రేష్టమైన అస్తికను పరిగ్రహించిందని అర్థం. వీరపురుషదత్తుని కుమార్తె కొడబలిశ్రీ, మహిశాసికుల కోసం ఒక విహారాన్ని నిర్మించినట్లు శాసనంలో ఉంది. ఎహూవల శాంతమూలుని కాలంలో అతని తల్లి మహాదేవి భట్టిదేవ బహుశ్రుతీయుల కోసం ఒక మహావిహారాన్ని, చైత్యాన్ని నిర్మించింది.
-అయితే రాజకుటుంబానికి చెందిన వీరే కాకుండా, సామాన్య స్త్రీలు కూడా బౌద్ధ విహారాలకు దానాలు చేసి శాసనాలను వేయించారు. వీరిలో రాజు భాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ చెప్పుకోదగ్గది. ఈమె విజయపురిలో, చుళదమ్మగిరి వద్ద ఒక ఆరామాన్ని నిర్మించింది. ఇది సింహళ విహారంగా ప్రసిద్ధికెక్కింది. ఆ రోజుల్లో సింహళం, నాగార్జునకొండ మధ్య బౌద్ధమత సంబంధాలుండేవి. శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులు నాగార్జునకొండను సందర్శించడానికి వచ్చేవారు. ఈ విధంగా ఇక్షాకుల కాలంలో రాజాదరణ, ప్రజాదరణ పొందిన బౌద్ధమతం తర్వాతి కాలంలో క్షీణించడం ప్రారంభమైంది.
సాహిత్యం
-ఇక్షాకుల కాలంలో ప్రాకృతమే రాజభాష అయినప్పటికీ తర్వాత కాలంలో శాసనాల్లోనూ, సాహిత్యంలోనూ ప్రాకృత భాష స్థానాన్ని సంస్కృతం ఆక్రమించింది. ఎహూవల శాంతమూలుని పదకొండవ పరిపాలనా సంవత్సరం తర్వాత నుంచి శాసనాలు సంస్కృతంలో ఉన్నాయి. అయితే మహాయాన బౌద్ధమతం అంతరించడం బౌద్ధమతం స్థానంలో వైదిక మతం బలపడటం ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
-ఇక్షాకుల కాలంలో ధాన్యకటకం, నాగార్జునకొండల్లో ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు వర్థిల్లాయి. ఇక్కడికి విద్యార్జన కోసం శ్రీలంక, టిబెట్, నేపాల్ నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చేవారని క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన ఉద్యోధనుడు తన కువలయమాల అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఇక్షాకుల కాలంలో ఆచార్య నాగార్జునుని శిష్యుడు ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణం అనే గ్రంథాన్ని రాశాడు. ఇక్షాకుల శాసనాల్లో ఖగోళశాస్త్రం, వైద్యం, గణితం మొదలైన శాస్ర్తాల ప్రసక్తి ఉంది.
వాస్తు-శిల్ప కళలు
-వీరి కాలంనాటి ముఖ్యమైన నిర్మాణాలు నాగార్జునకొండ వద్ద జరిపిన తవ్వకాల్లో లభించాయి. ఇక్కడ లభించిన నిర్మాణాల్లో శతృదుర్భేద్యమైన కోట, కందకం, కోటలోపలి భవనాలు, బహిరంగ ప్రదర్శనశాల (స్టేడియం), శాంతమూలుని అశ్వమేథ వేదిక, బౌద్ధస్తూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలైనవి బయటపడ్డాయి. ఇక్కడ లభించిన స్టేడియం వివిధ అంతస్తుల్లో నిర్మించి ఉంది. దీన్ని రోమన్ నిపుణుల సాయంతో నిర్మించి ఉంటారని కొందరి అభిప్రాయం.
-నాగార్జునకొండలో సుమారు 30 బౌద్ధ ఆరామాలుండేవి. బౌద్ధంలో వివిధ శాఖలకు చెందినవారు వీటిని నిర్మించారు. బుద్ధుడిని మానవరూపంలో చూపడం ఇంతకు పూర్వం నిషేధం కానీ, అపరమహావినశైలీయ శాఖ నుంచి వచ్చిన ఆదరణతో బుద్ధుని విగ్రహాలను అందంగా చెక్కారు.
-ఇక్షాకుల కాలంలో నాగార్జునకొండ అమరావతి శిల్పకళకు కేంద్రమైంది. వీరికాలంలో నిర్మించిన బౌద్ధ స్తూపాలు, విహారాలు తెలంగాణలో నేలకొండపల్లి, గాజులబండ, తుమ్మలగూడెం, నందికొండ, ఆంధ్రప్రదేశ్లో గోలి, చందవరం, దూపాడు, నంబూరు, ఉప్పుగుండూరు, రెంటాల మొదలైన చోట్ల ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఒక మహాస్తూపం, విహారాలు, అనేక నిలువెత్తు బుద్ధుని విగ్రహాలు, బుద్ధుని కంచు విగ్రహం, పాలరాయిపై చెక్కిన తొమ్మిది విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు ఈ నిర్మాణాలు జరిగాయి. ఈ విగ్రహాలు లభించిన చోటుకు సమీపంలోనే పాలరాతి ముక్కలు, నీటి తొట్టెలు బయటపడటంతో అది బుద్ధ విగ్రహాలను తయారుచేసే శిల్ప కర్మాగారమని వీవీ కృష్ణశాస్త్రి అభిప్రాయపడ్డారు.
-నేలకొండపల్లి బుద్ధ విగ్రహాలు అమరావతి శిల్ప కళకు అద్దం పడుతున్నాయి. ఈ విధంగా శాతవాహనుల సామంతులుగా అధికారాన్ని ప్రారంభించిన ఇక్షాకులు వారి పతనానంతరం స్వతంత్రులై సామాజిక, సాంస్కృతిక, విద్య, మత పరిస్థితుల్లో ఆంధ్రదేశంలో ఘనమైన ప్రగతిని సాధించారని తెలుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు