బౌద్ధమతం వ్యాప్తి ఇలా జరిగింది..
దీక్షను బుద్ధుడు తన శిష్యులకే అప్పగించాడు. దీక్ష అంటే కేశఖండనం, కాషాయ వస్ర్తధారణ.
-బుద్ధుడు ఉరువేల గ్రామం చేరాడు. అక్కడ 30 మంది సంపన్న యువకులు భిక్షువులు అయ్యారు. కశ్యప సోదరులైన ఉరువేల కశ్యపుడు, నదికశ్యపుడు, గయకశ్యపుడు వారి 1000 మంది శిష్యులతో బౌద్ధం స్వీకరించారు.
-బుద్ధుడు కశ్యప సోదరులతో రాజగృహానికి వెళ్లాడు. బింబిసారుడు రాజగృహానికి సమీపంలో ఉన్న వేణువనాన్ని దానం చేశాడు.
-రాజగృహంలోని సంజయుని అనుచరుల్లో ప్రముఖులైన సారిపుత్రుడు, మౌద్గల్యాయనుడు బౌద్ధమతం స్వీకరించారు.
-బౌద్ధస్థాపన మగధలో జరిగినా సంపూర్ణ అభివృద్ధి కోసల (శ్రావస్తి)లో జరిగింది. అక్కడ 21 వస్సలు గడిపాడు. వస్స అంటే చాతుర్మాసదీక్ష వర్షాకాలంలో నాలుగు నెలలు ఒకేచోట ఉండటం.
-కోసలలో సనాతన బ్రాహ్మణమతం అధికారంలో ఉండేది. మగధాధీశులైన బింబిసారుడు, అజాతశత్రువు బుద్ధునికి శిష్యులు అయ్యారు.
-బుద్ధడు రాజగృహం నుంచి తన తండ్రి ఆహ్వానం మేరకు కపిలవస్తు నగరానికి వెళ్లాడు.
-ప్రజాపతి గౌతమి కుమారుడైన నందుడు కపిలవస్తు రాజ్యానికి రాజు అయ్యాడు. బుద్ధుడు నందుని చేతికి ఒక భిక్షపాత్ర ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నందుడు పరిపూర్ణ సన్యాసి అయినట్లు బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి.
-రాహులున్ని యశోధర తండ్రి వద్దకు పంపించగా అతడు సన్యసించాడు. దానికి శుద్ధోధనుడు బాధపడుతూ బుద్ధున్ని తల్లిదండ్రుల అనుమతి లేనిదే ఎవరూ సన్యసించరాదని ఒక నియమం పెట్టమని కోరగా బుద్ధుడు అంగీకరించాడు.
-బుద్ధుడు కపిలవస్తు నగరం సందర్శించినప్పుడు బౌద్ధమతాన్ని స్వీకరించిన వారిలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (క్షురకుడు) ముఖ్యులు.
-బుద్ధుడు సుప్రసిద్ధమైన శ్రావస్తి నగరానికి చేరగా అక్కడ అనాథ పిండకుడు అనే వైశ్యుడు బుద్ధుని గొప్పతనం గురించి విని శిష్యునిగా చేరాడు. తర్వాత యువరాజు జేతుని ఉద్యానవనాన్ని కొనుగోలు చేసి బుద్ధునికి ఇచ్చాడు.
-కోసల రాజు ప్రసేనజిత్తు, అతని రాణి మల్లిక, ఆమె సోదరీమణులు సోమ, సకుల మొదలైన వారు బౌద్ధమతం స్వీకరించారు.
-శ్రావస్తి నగరవాసి విశాఖ అనే స్త్రీ బౌద్ధమతం స్వీకరించింది. ఆమె పుచ్ఛారామం అనే సంఘారామాన్ని బౌద్ధ సంఘానికి దానం చేసింది.
-బుద్ధుడు వైశాలి చేరి ఒక వస్స గడిపాడు. వైశాలి రాజనర్తకి ఆమ్రపాలి బౌద్ధమతం స్వీకరించి బౌద్ధ సంఘానికి తన మామిడితోటను దానం చేసింది.
స్త్రీలకు సన్యాస దీక్ష
-బుద్ధుడు వైశాలిలో ఆనందుడి ప్రోత్సాహంతో స్త్రీలు కూడా సన్యసించడానికి వారికి ప్రత్యేక సంఘారామం ఏర్పరచడానికి అంగీకరించాడు.
-ప్రజాపతి గౌతమి బుద్ధుడి ప్రథమ శిష్యురాలై దీక్ష వహించి, భిక్షుణి సంఘానికి నాయకురాలైంది.
-బుద్ధుడి భార్య, మహా ప్రజాపతి కూతురు నంద, బింబిసారుని భార్య ఖేమ దీక్ష తీసుకున్నారు.
-దమ్మదిన్న అనే స్త్రీ బౌద్ధ సిద్ధాంతాలను ఉపన్యసించిన వారిలో ముఖ్యురాలిగా పేర్కొనవచ్చు.
-నిమ్న కులాలకు చెందిన స్వపాక, సుప్రియులకు, సుమంగళుడికి, కుష్ఠు రోగి సుప్రబద్ధునికి బుద్ధుడు ధర్మదీక్షను ఇచ్చాడు.
-నేరస్థులు, దేశదిమ్మర్లు బౌద్ధమతంలో చేరారు.
-బందిపోటు అయిన అంగుళీమాలుడి క్రూర ప్రవృత్తిని మార్చి తన శిష్యునిగా చేర్చుకున్నాడు.
-బుద్ధుడు తన 9వ వస్స కౌశాంబిలో గడిపాడు. రాజు ఉదయనుడికి బుద్ధునిపై అనుకూల అభిప్రాయం లేదు. కాని అతని రాణి సామవతి బుద్ధుని భక్తురాలైంది.
మహాపరినిర్యాణం
-బుద్ధుడు పావా నగరం చేరుకొని చందుడు అనే వ్యక్తి మామిడి తోటలో విడిది చేశాడు.
-తోట యజమాని చందుడు బుద్ధుని దర్శనానికి వెళ్లి అతనిని తన ఇంటికి భిక్షకు ఆహ్వానించాడు.
-చందుడికి మృతిచెందిన జంతు కళేబరాలను తినే అలవాటు ఉండేది. అయినా బుద్ధుడు అతని ఆహ్వానం మేరకు శిష్యులతో కలిసి భిక్షకు వెళ్లాడు.
-చందుడు ఎండబెట్టిన అడవి పంది మాంసాన్ని, బియ్యపు పిండితో చేసిన రొట్టెలు బుద్ధునికి వడ్డించాడు. ఈ వంటకాన్ని సూకరమర్దవం అంటారు.
-ఈ వంటకాన్ని తినడానికి బుద్ధుడి శిష్యులు అంగీకరించకపోవడంతో తాను మాత్రమే తిని మిగిలిన దానిని భూమిలో పాతి పెట్టమన్నాడు.
-ఈ భోజనం తిన్న తర్వాత బుద్ధుడికి భరించరాని కడుపు నొప్పితో రక్త విరేచనాలు అయ్యాయి. బుద్ధుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన ప్రియ శిష్యుడైన ఆనందునితో కుశీనగరం తీసుకెళ్లమని చెప్పాడు.
-ఈ సమయంలో పుల్కశుడు అనే మల్లజాతి యువకుడు బుద్ధున్ని దగ్గరకు వచ్చి ధర్మోపదేశం చేయమని కోరాడు. బుద్ధుడు అతనికి ధర్మోపదేశం చేయగా, సంతోషించిన పుల్కశుడు బంగారంతో అలంకరించిన వస్ర్తాలు బుద్ధునికి సమర్పించాడు. ఈ వస్ర్తాలు నిర్మలమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న బుద్ధుని శరీరంపై వెలవెలబోయాయి.
-ఈ సందర్భంగా తన రూపం రెండు సందర్భాల్లో
1. పరిపూర్ణమైన వివేకాన్ని పొందినప్పుడు,
2. భూమి మీద భౌతికమైన అస్థిత్వం మిగలకుండా యాత్ర ముగించే రోజు నిర్మలంగా, తేజస్సుతో వెలుగొందుతుందని బుద్ధడు ఆనందునితో చెప్పాడు.
-బుద్ధుడు కుశీనగరంలో రెండు సాలవృక్షాల మధ్య పడక ఏర్పాటు చేసుకొని ఉత్తరం వైపు శిరస్సు పెట్టి పడుకున్నాడు.
-సుభద్రకుడు అనే శ్రమణుడు బుద్ధుని దర్శనానికి అనుమతించమని ఆనందున్ని అడగటం విని బుద్ధుడు అతనికి దర్శనం అనుమతించి ప్రాణాలు పోతున్న దశలో కూడా ధర్మోపదేశం చేశాడు.
-బుద్ధుడు చిట్టచివరిగా సందేశం ఇస్తూ ధర్మం శాశ్వతమైంది. దానికి నాశనం లేదు. నా తర్వాత ధర్మమే మిమ్మల్ని నడిపిస్తుంది. నా ధర్మానికి నీళ్లు వదలకండి. శ్రద్ధగా సాధన చేసి ఎవరి ముక్తిని వారు సాధించుకోవాలి అని చెప్పి క్రీ.పూ. 483లో 80వ ఏట నిర్మాణం చెందాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు