ఇవీ ప్రసిద్ధ జన్యు పరిశోధన సంస్థలు..!
జన్యువులు, జన్యు వైవిధ్యం, జీవావరణంలో జీవ విధానం గురించి అధ్యయనం చేసేదే జన్యుశాస్త్రం. ఈ జన్యుశాస్త్రం అనేది ప్రస్తుతకాలంలో చాలా కీలకంగా మారింది. జన్యుశాస్ర్తానికి సంబంధించిన పరిశోధనల గురించి తెలుసుకుందాం..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్
-ఇది ఢిల్లీలో ఉంది. దీన్ని 1984లో స్థాపించారు. జన్యుశాస్త్రంలో ఉన్నతస్థాయి పరిశోధనలు జరుపుతుంది. దేశంలోని వివిధ సంస్థలు, విభాగాలతో పరస్పర క్రమశిక్షణ విధానాలతో, వివిధ రంగాల్లో నిపుణుల జ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకే కాకుండా అధిక విద్యాప్రమాణాలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్
-ఇది తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. దీన్ని 1988 ఏప్రిల్‌లో స్థాపించారు. భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మార్పు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అటవీ నిర్మూలన, సాంఘిక అటవీ ప్రాంతాలను గుర్తించి అడవులను అభివృద్ధి పర్చడానికి ఇది కృషిచేస్తుంది. 3 నుంచి 4 క్యూబిక్ మీటర్ల బయోమాస్ పెరుగుదల సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ
-ఇది ఢిల్లీలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనం కోసం జన్యు ఇంజినీరింగ్, బయోటెక్నాలజీలో పరిశోధన, శిక్షణ కోసం ఏర్పడిన సంస్థ ఇది. దీన్ని 1994, ఫిబ్రవరి 3న యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రోత్సాహంతో స్థాపించారు.
ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ జెనెటిక్స్
-ఇది లక్నోలో ఉంది. 2012లో ఏర్పడింది. దేశంలోని క్లినికల్ జెనెటిక్స్ సేవల నాణ్యతను, ప్రాముఖ్యతను పెంపొందించడం, మెడికల్ జెనెటిక్స్ విద్య, పరిశోధనకు ప్రోత్సహించడం, రోగి సంరక్షణకు వైద్య జన్యు పరిశోధనను ఏకీకృతం చేయడానికి ఇది పనిచేస్తుంది.
సెంటర్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్
-ఇది బెంగళూరులో ఉంది. ఇది ఆధునిక జన్యుశాస్త్రం, ఔషధ ఆధునిక పరిశోధన, బోధన, శిక్షణ ఇస్తుంది. దేశవ్యాప్తంగా యువశాస్త్రవేత్తలు, వైద్యులకు ఇంటెన్సివ్ షార్ట్ కరెంట్ కోర్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కర్ణాటక ప్రభుత్వ సహకారంతో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు ఉచితంగా డయాగ్నస్టిక్, జన్యు సలహా సేవలను అందిస్తుంది.
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్
-ఇది హైదరాబాద్‌లో ఉంది. దీన్ని 1990లో స్థాపించారు. ఇది డీఎన్ఏ, వేలిముద్రలు రోగనిర్ధారణ సేవలను కేంద్రం అందించే కొన్ని చర్యలకు మద్దతు ఇస్తుంది. దీనిలో ఎక్కువగా బ్యాక్టీరియల్ వ్యాధికారక, నిర్మాణ జన్యుశాస్త్రం, అణుజన్యుశాస్త్రం, బయోఇన్ఫర్మాటిక్స్, గణన జీవశాస్త్ర పరమాణు ఎపిడమియాలజీలపై పరిశోధన చేస్తుంది.
ఇంటర్నేషనల్ లైవ్‌స్టాక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది కెన్యాలోని నైరోబీలో ఉన్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ. దీన్ని ఆఫ్రికాలోని ఇంటర్నేషనల్ లైవ్‌స్టాక్ సెంటర్ ఫర్ ఆఫ్రికా, ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ ఫర్ రిసెర్చ్ ఆన్ యానిమల్ డిసీజెస్లతో కలిపి 1994లో స్థాపించారు. ఇది Consultative Group for International Agricultural Research (సీజీఐఏఆర్)లో సభ్యురాలు. తక్కువ ఆదాయ దేశాల్లో పేదరికం నుంచి స్థిరమైన పశుసంపద మార్గాలను నిర్మించడానికి పరిశోధనపై దృష్టిపెడుతుంది.
-పేదప్రజలకు వారి పశుసంపద, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, వారి జంతు ఉత్పత్తులకు లాభదాయకమైన మార్కెట్లను కనుగొనడానికి ఈ ఐఎల్ఆర్ఐ ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములతో పనిచేస్తుంది. ఈ సంస్థ కొత్త జ్ఞానం, సాంకేతికత, విధాన సమాచార అభివృద్ధి పెంపొందించుకోవడానికి రైతులకు వారి జీవనాధారాలను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
-ఇది ప్రపంచ పశువుల అభివృద్ధి, జంతువుల వ్యాధులు, జన్యువనరులు, వాతావరణ మార్పులు, టీకా, డయాగ్నస్టిక్ టెక్నాలజీల్లోని సమస్యలను పరిష్కరించేందుకు పరిశోధనలు చేస్తుంది.
బీజింగ్ జెనోమిక్స్ ఇన్స్టిట్యూట్
-ఇది చైనాలోని బీజింగ్‌లో ఉంది. దీన్ని 1999, నవంబర్ 9న స్థాపించారు. 2003లో సార్స్ వైరస్ జన్యుపదాన్ని డీకోడ్ చేసి, వైరస్‌ను గుర్తించడానికి ఒక కిట్టును రూపొందించారు. ప్రపంచ ఔషధ సంస్థలకు ఆరోగ్యం, వ్యవసాయ, ఇన్ఫర్మాటిక్స్ సేవలను అందిస్తుంది.
-ఇది ఒక ఆసియా వ్యక్తి మొదటి ద్వయస్థితి జన్యువును అంచనా వేసింది. మానవ పాస్-జన్యువు క్రమ మ్యాపును నిర్మించేందుకు కృషిచేస్తుంది.
చైనీస్ నేషనల్ హ్యూమన్ జీన్
-ఇది బీజింగ్‌లో ఉంది. శాస్త్రీయ, సాంకేతిక ప్రాజెక్టులపై పరిశోధన చేస్తుంది. పరిశోధన ఉత్పత్తుల వ్యాపారీకరణను ప్రోత్సహిస్తుంది. జనాభా జన్యుశాస్త్రం, బయోఇన్ఫర్మాటిక్స్ ప్రాజెక్టుల్లో ఉన్నతస్థాయి కార్యకలాపాలను అనుసంధానిస్తుంది.
రాయన్ ఇన్స్టిట్యూట్
-ఇది ఒక ఇరాన్ క్లినికల్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. దీన్ని 1991లో వంధ్యత్వ చికిత్సల పరిశోధనా సంస్థగా స్థాపించారు. ఇది విద్య, సంస్కృతిలపై పరిశోధించే ప్రజా లాభాపేక్షలేని సంస్థ. ఇది మూడు పరిశోధనా సంస్థలను కలిగి ఉంది. అవి.. రాయన్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్‌సెల్ బయాలజీ అండ్ టెక్నాలజీ, రాయియాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిప్రొడక్టివ్ బయోమెడిసిన్, రాయోన్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీ.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్
-ఇది జపాన్‌లో ఉంది. దీన్ని 1949లో స్థాపించారు. ఇది జపాన్‌కు డీఎన్ఏ బ్యాంక్‌గా పనిచేస్తుంది.
ది సెంటర్ ఫర్ అప్లయిడ్ జినోమిక్స్
-ఇది కెనడాలోని టొరంటోలో ఉంది. దీన్ని 1998లో స్థాపించారు. మానవ వైవిధ్యత, ఆరోగ్యం, వ్యాధి జన్యుపరమైన ప్రాతిపదిక పరిశోధనపై దృష్టిపెడుతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ జన్యుశాస్త్రం, మానవ జన్యు నిర్మాణంలోని వైవిధ్యభరిత వైవిధ్యంపై పరిశోధన చేస్తుంది.
ట్రాన్స్లేషన్ జినోమిక్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది అమెరికాలోని అరిజోనాలో ఉంది. దీన్ని 2002లో స్థాపించారు. చికిత్సను అభివృద్ధి చేయడం ద్వారా వ్యాధి ఫలితాలను మెరుగుపర్చేందుకు జన్యుపరమైన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తుంది. అల్జీమర్స్, ఆటిజం, పార్కిన్సన్, డయాబెటిస్, అనేక రకాల క్యాన్సర్, ఇతర సంక్లిష్ట మానవ వ్యాధులతో సహా అనేక మానవ రుగ్మతలపై ఇది పరిశోధన చేస్తుంది.
జెనెటిక్ ఇన్ఫర్మేషన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. దీన్ని 1994లో స్థాపించారు. వివిధ జీవుల జన్యుపరమైన ఆకృతిని, సంభావ్య జన్యుచికిత్స, జన్యు ఇంజినీరింగ్ పరిజ్ఞానం ప్రాతిపదికగా మార్చడానికి జీవక్రియలను అర్థం చేసుకోవడం దీని లక్ష్యం.
కార్ల్ ఆర్ వూస్ ఇన్స్టిట్యూట్ ఫర్ జెనోమిక్ బయాలజీ
-ఇది అమెరికా ఇల్లినాయిస్లోని ఉర్బానాలో ఉంది. దీన్ని 2006లో స్థాపించారు. సిస్టమ్స్ బయాలజీ, సెల్యులార్ అండ్ మెటబాలిక్ ఇంజినీరింగ్, జినోమ్ టెక్నాలజీల లక్ష్యంగా పరిశోధనలు చేస్తుంది. ఆరోగ్యశాస్త్రం, పర్యావరణం, ఆహార ఉత్పత్తికి సంబంధించిన సామాజిక సవాళ్లను విశ్లేషిస్తుంది.
జాక్సన్ ల్యాబొరేటరీ
-ఇది యూఎస్ మైనేలోని బార్హార్బర్లో ఉంది. దీన్ని 1929లో స్థాపించారు. వ్యాధికి కచ్చితమైన జన్యుపరమైన పరిష్కారాలను కనుగొనడం, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, ప్రపంచ బయోమెడికల్ కమ్యూనిటీని శక్తిమంతం చేయడంలో కృషిచేస్తుంది.
ది ఇన్స్టిట్యూట్ ఫర్ జెనోమిక్ రిసెర్చ్
-ఇది యూఎస్ మేరీల్యాండ్‌లోని రాక్‌విల్లేలో ఉంది. దీన్ని 1992లో క్రెగ్ వెంటర్ స్థాపించారు. జన్యు గోప్యత, వివక్ష, జాతి, మూలకణాల జన్యుశాస్త్రం, సామాజిక, నైతిక సమస్యలపై ఇది అధ్యయనం చేస్తుంది.
హోవార్డ్ హ్యూగ్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్
-మేరీల్యాండ్‌లోని చెవిచేస్లో ఉంది. దీన్ని 1953లో హోవార్డ్ హ్యూగ్స్ స్థాపించారు. జన్యుశాస్త్రం, రోగనిరోధక శాస్త్రం, పరమాణు జీవశాస్ర్తాలపై ఇది అధ్యయనం చేస్తుంది.
ది జినోమ్ సెంటర్
-ఇది మిస్సోరిలోని సెయింట్ లూయీస్‌లో ఉంది. దీన్నే మెక్‌డోనెల్ జినోమ్ ఇన్స్టిట్యూట్ అంటారు. దీన్ని 1993లో స్థాపించారు. మానవ ఆరోగ్యం, వ్యాధి, పరిణామం, జీవశాస్త్రం, జన్యుశాస్ర్తాల అధ్యయనానికి నూతన విధానాలను సృష్టించడం, పరీక్షించడం, అమలుచేయడం దీని బాధ్యత.
కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ
-ఇది న్యూయార్క్‌లోని లారెల్ హాలోలో ఉంది. దీన్ని 1890లో స్థాపించారు. ఇది మాలిక్యులార్ జెనెటిక్స్, మాలిక్యులార్ బయాలజీలను అభివృద్ధి చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. అణు జీవశాస్త్రం, జన్యుశాస్ర్తాల్లో పరిశోధన చేయడంలో పేరుగాంచిన సంస్థ.
న్యూయార్క్ జినోమ్ సెంటర్
-ఇది న్యూయార్క్‌లో ఉంది. దీన్ని 2011లో స్థాపించారు. జన్యుపరమైన పరిశోధనలో భాగంగా తీవ్రమైన వ్యాధులకు చికిత్సాపరిష్కార మార్గాలను అన్వేషించడంలో కృషిచేస్తుంది. జన్యుఇంజినీరింగ్, జనాభా, పరిణామాత్మక జన్యుశాస్త్రం, జన్యుగణాంకశాస్త్రం, బయో ఇంజినీరింగ్ వంటివాటిపై పరిశోధనలు చేస్తుంది.
నేషనల్ హ్యూమన్ జినోమ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది మేరిల్యాండ్లోని బెథెస్డలో ఉంది. దీన్ని 1989లో స్థాపించారు. మానవ జన్యువుకు సంబంధించి పరిశోధనలు చేస్తుంది. మానవ డీఎన్ఏ క్రమాన్ని అధ్యయనం చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు