వసంతోత్సవాలను నిర్వహించిన రాజు ఎవరు?
రణము కూడు
వెలమనాయకులు ఆ కాలంలో రణము కూడు అనే అమానుషకాండాన్ని అమలుచేశారు. అది అత్యంత క్రూరంగా ఉండేది. ఈ క్రూర ఆచారాన్ని వెలమరాజులు పాటించినట్లు వెలుగోటివారి వంశావళి వివరిస్తుంది. ఇందులో భాగంగా యుద్ధంలో చిక్కిన శత్రువులను చంపి వారి రక్తాన్ని భూత, ప్రేత, పిశాచాలకు వెదజల్లేవారు. కొన్నిసార్లు శత్రువుల తలలు నరికి వారి పుర్రెల్లో రక్తం పట్టి అందులో బియ్యం పోసి వండేవారు. దీన్నే రణము కూడు అనేవారు. అర్ధరాత్రి వేళ దిగంబరులై శరీరమంతా విభూతి పూసుకొని జుట్టు విరబోసుకొని రణము కూడు పాత్రను తలపై పెట్టుకొని బలి, భూత, ప్రేత మంత్రాలు చదువుతూ ఊరి పొలి మేరల చుట్టూ తిరుగుతూ భూత, ప్రేత, పిశాచ, శాకిని, ఢాకినీలకు ఆ రణము కూడును నైవేద్యంగా వెదజల్లేవారు. ఇది ఆగమ హితమైన కర్మకాండ అని, శత్రువులపై విజయం సాధించడానికి రేచర్ల వంశంలోని ప్రతి ఒక్కరూ ఈ కర్మకాండను జరిపారని వెలుగోటివారి వంశావళి తెలుపుతున్నట్లు మల్లంపల్లి సోమశేఖరశర్మ వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి వెలమనాయకులు తమ శత్రువుల పట్ల అతిక్రూరంగా వ్యవహరించారని తెలుస్తుంది.
ప్రజల విలాస జీవితం
ఈ కాలంలో ప్రజలు భోగలాలసులయ్యారు. వేశ్యావృత్తి బాగా పెరిగింది. రాజులు, వారి సామంతులు, సామన్య ప్రజలు చివరికి బ్రాహ్మణులు కూడా వేశ్యాలంపటత్వానికి అర్రులు చాచారు. సింగభూపాలుడు పోతనతో భోగినిదండకం రాయించాడు. సర్వజ్ఞ సింగన కూడా వేశ్యలను పోషించాడు. తిరునాళ్లు, జాతరలు, ఉత్సవాల్లో స్త్రీ పురుషులు విచ్చలవిడిగా విహరించేవారు.
ప్రజల ఆహార్యాలు
ఈ కాలంలో పురుషులు పంచె, అంగీలతోపాటు తలపాగాలు ధరించేవారు. స్త్రీలు రంగురంగుల చీరలను ధరించేవారు. కాశీకట్టు కట్టుకొనేవారు. రంగు అద్దాలుండేవి. సింహాసన ద్వాత్రింశిక 49 రకాల సిల్క్ చీరలను, 14 రకాల బంగారం, వెండి, రాగి ఆభరణాలను పేర్కొంటుంది. సాధారణంగా ఈ యుగంలో స్త్రీ, పురుషులు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ధనవంతులు పట్టు, సిల్క్ వస్ర్తాలు ధరిస్తే, పేదవారు మాములు వస్ర్తాలు ధరించేవారు. చెంగావి, నీలం, ఎరుపు, పచ్చ రంగులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కవులు, పండితులు కోకకట్టి కుళ్లాయి నెత్తికి చుట్టుకొనేవారు. కట్టు, వేషధారణ కులానికి ఒక రకంగా ఉండేది. చిన్న కులాలకు చెందిన స్త్రీలు ఎడమ పైట వేసుకొనేవారు. పెద్ద కులాలకు చెందిన స్త్రీలు కుడి పైట వేసుకొనేవారు. రాజులు, రాణులు ఖరీదైన పాదరక్షలు ధరించేవారు.
సమాజంలో స్త్రీ స్థానం
ఈ యుగంలో స్త్రీల స్థానం సమాజంలో దిగజారినట్లు కనిపిస్తుంది. ముస్లిం దండయాత్రల వల్ల స్త్రీలను ఇండ్లు వదిలి బయటకు రానివ్వకుండా చేశారు. ధర్మశాస్ర్తాల్లో చెప్పిన సూత్రాలు తూచ తప్పకుండా పాటించారు. సతీసహగమనం అమలులోకి వచ్చింది. హిందూ సమాజంలోని దూరాచారాలన్ని ఈయుగంలో ప్రవేశించాయి. బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ ముస్లిం దండయాత్ర ఫలితంగా సంభవించినవే. స్త్రీలను రక్షించుకోవడం, వారి గౌరవాన్ని కాపాడుకోవడం శక్తికి మించిన పనైంది. కాబట్టి ఇలాంటి దురాచారాలు స్త్రీలపై రుద్దారు. ఫలితంగా సమాజంలో స్త్రీల పరిస్థితి దయనీయంగా మారింది. రాజవంశ స్త్రీల వివాహాలు ఆడంబరంగా జరిగేవి. కట్నాలు, కానుకలు ఇచ్చుకొనేవారు. ఆరోజుల్లో కట్నానికి మారుపేరు అరణం.
మత పరిస్థితులు
ముస్లిం అధికార దౌర్జన్యాలపై తిరుగుబాటు ఫలితంగా ఏర్పడిన రాజ్యాల్లో వెలమనాయకుల రాజ్యం ఒకటి. ఇలాంటి రాజ్యం హిందూ మత సంస్కృతుల పరిరక్షణకు పూనుకోవడం సహజం. ముస్లిం దాడుల్లో నష్టపోయిన బ్రాహ్మణ అగ్రహారాల పునరుద్ధరణతో ఇది ప్రారంభమైంది. అందుకే కాకతీయుల కాలం నాటి శైవ, వైష్ణవ మతాలకు ఈ కాలంలో ప్రాధాన్యం పెరిగింది. వెలమలు మొదట శైవ మతాభిమానులు. కానీ ఈ వంశంలో సింహాసనాన్ని అధిష్టించిన చివరి రాజులు వైష్ణవ మతాన్ని స్వీకరించి ఆదరించారు. అయినా వీరు ఇతర మతాలను ద్వేషించలేదు.
శైవం
ఈ కాలం నాటికి శైవమతంలోని తీవ్రవాద శైవానికి ఆదరణ పెరిగింది. ముఖ్యంగా శివుని ఉగ్ర రూపాలైన భైరవ, మైలార దేవుళ్లను పూజించడం ప్రారంభమైంది. ఈ భైరవ ఆరాధన ఫలితంగా రణము కూడు అనే ఆచారం ప్రవేశించింది. సమాచార సంబంధమైన తాంత్రిక పూజా విధానం బలంగా ఉంది. సిద్ధులు సాధించిన మత్స్యేంధ్రనాథాది నవనాథుల చరిత్రను ప్రజలు పురాణాలుగా చెప్పుకొనేవారు. కాళ్లు, చేతులు, తలలు నరుక్కోవడం, నాలుకలు కత్తిరించుకోవడం, కండలు కోసి అర్పించడం వంటి క్రూర కృత్యాలు ఎక్కువగా సాగాయి. నాటి కావ్యాల్లో చంపుడు గుడుల ప్రసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఈ కాలంలో కాళీకాదేవి, దుర్గాదేవి, చండి, భద్రకాళి, మహిషాసుర మర్దినులను కూడా పూజించేవారు. ఇదేవిధంగా గ్రామ దేవతలయిన కట్ట మైసమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, ఏకపాక దేవతల ఆరాధన కూడా అమల్లో ఉంది. నాగాదేవతారాధన కూడా ఉన్నట్లు సాహిత్యాధారాలు తెలుపుతున్నాయి.
వైష్ణవం
వెలమరాజుల్లో చివరివాడైన సర్వజ్ఞ సింగమనాయుని కోరికపై వేదాంత దేశికుడు సుభాషితనీతి, తత్వ సందేశం, రహస్య సందేశం అనే గ్రంథాలు రాసి రాచకొండకు పంపాడు. వేదాంత దేశికుడు వైదికాచారంతో కూడుకొని ఉన్న వీడగళై శాఖకు చెందినవాడు. తర్వాత అతని కుమారుడు వరదాచార్యుడు వైష్ణవమత ప్రచారం చేయడానికి రాచకొండకు వచ్చాడు. ఇతనికి వైనాచార్యుడనే పేరు కూడా ఉంది. ఇతడు సర్వజ్ఞ సింగన ఆస్థానంలో ఉన్న శాకల్యమల్లు భట్టుని ఓడించి సర్వజ్ఞ సింగన మనస్సు గెలుచుకున్నాడు. అందువల్ల సర్వజ్ఞ సింగన వైనచార్యుల వద్ద వైష్ణవ దీక్ష పుచ్చుకున్నాడు. పరాశరభట్టు కూడా శాకల్యమల్లు భట్టును ఓడించాడు. అందువల్ల వెలమరాజ్యంలో వైష్ణవ మతం త్వరితగతిన అభివృద్ధి చెందింది. అనేక విష్ణు ఆలయాలు ఈ సందర్భంలోనే నిర్మితమయ్యాయి. రాచకొండలో రామాలయం కూడా నిర్మితమైంది. వెలమరాజులు బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చారు. ముస్లింల దాడుల వల్ల నాశనమైన దేవాలయాలను పునరుద్ధరించారు. యుద్ధాల్లో విజయం లభించినప్పుడు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు దర్శించి దేవాలయాలకు దానాలు చేశారు.
విద్యా-భాషా, సారస్వతాలు
వెలమ నాయకులు కూడా సంస్కృతాంధ్ర భాషలను పోషించారు. వీరి కాలంలో వేదాలు, వేదాంగాలు, జ్యోతిష్యం, షడ్దర్శనాలు, మీమాంస, రాజనీతిశాస్త్రాలు, శబ్దశాస్ర్తాలు, సాహిత్య సంగీత శాస్ర్తాల అధ్యయనం జరిగింది. వీరి కాలంలో సంస్కృతాంధ్ర భాషలే కాకుండా అరబ్బి, పారశీక భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. నాడు విద్యలకు కేంద్రాలైన అగ్రహారాలు, దేవాలయాలు, మఠాలను రాజులు సమాజంలోని ధనవంతులు పోషించారు. వివిధ విద్యలతోపాటు లలిత కళల్లో కూడా ఈ కాలంలో విశేషమైన కృషి జరిగింది. సంగీత, నాట్యశాస్ర్తాలపై చాలా గ్రంథాలు రచించబడ్డాయి. సర్వజ్ఞ సింగమ భూపాలుడు వసంతోత్సవాలు జరిపి దూర ప్రాంతాల నుంచి సైతం నటులను, గాయకులను ఆహ్వానించేవారు. వీళ్లకు ప్రతిభా పరీక్షలు జరిపి అర్హతను బట్టి ఆదరించేవారు. నాట్యంలో కొత్త పద్ధతులు అనేకం బయలుదేరాయి. మార్గరీతియైన భరత నాట్యమే కాకుండా, గొండ్ల, జక్కిణి, పేరిణి, బిందు అనే దేశరీతులు పారశీకమత్తలి అనే విదేశీరీతులు ప్రచారంలో ఉన్నాయి. వాయిద్యాల్లో భేరి, జయగంట, పల్లకి, చక్కి, కాహశం, వంశం డక్క, హుడుక్కి మొదలైన వాటి గురించి నాటి వాజ్ఞ్మయం తెలుపుతుంది. నాటక కళ కూడా చాలా అభివృద్ధి చెందింది. వసంతోత్సవాలు, రథోత్సవాల్లో నాటకాలాడేవారు. నటులు సంఘాలుగా ఏర్పడి దేశ సంచారం చేస్తుండేవారు.
సంస్కృత సాహిత్యం
వెలమరాజుల ఆస్థానాల్లో సంస్కృత భాషకు విశేష ఆదరణ లభించింది. మొదటి అనపోతనాయుని ఆస్థానంలో నాగనాథుడు అనే సంస్కృత కవి ఉండేవాడు. ఇతడు పశుపతి పండితుని కుమారుడు. విశ్వేశ్వరుని శిష్యుడు. ఇతడు సంస్కృత భాషలో మదన విలాసబాణం అనే నాటకాన్ని రచించాడు. మొదటి అనపోతానాయకుడు వేయించిన ఐనవోలు శాసనాన్ని ఇతడే రచించాడు. ఈ శిలాశాసనం క్రీ.శ. 1369లో వేయించాచబడింది. ఇతడు అనపోతానాయకీయం అనే మరో నాటకాన్ని కూడా రాశాడు. కానీ ఇది లభ్యం కాలేదు. కానీ దీని గురించి కుమార సింగన, రసార్ణవ సుధాకరంలో ప్రస్తావించాడు. వెలమనాయక రాజుల్లో సర్వజ్ఞ సింగన చాలా గొప్పవాడు. ఇతడు స్వయంగా కవి సాహిత్య సృష్టిలో రెడ్డి రాజైన పెదకోమటి వేమారెడ్డి దీటైనవాడు. ఇతడు రసార్లవ సుధాకరం అనే లక్షణ గ్రంథాన్ని, రత్న పాంచాలిక అనే నాటాకాన్ని రచించడమేగాక సారంగధరుని సంగీత రత్నాకరంపై సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానం సమకూర్చాడు. ఇతడు రచించిన రత్నపాంచాలిక అనే నాటకానికి కువలయావళి అనే పేరుంది. ఇందులోని ఇతివృత్తం శ్రీకృష్ణునితో కువలయావళికి వివాహం జరగడం.
ఈ నాటకంలోని కవి తనను తాను లలితకవితా విలాస చతురానామా అని వర్ణించుకున్నాడు. ఇంక ఇతనికి ప్రతిగండభైరవ, ఖడ్గ నారాయణ అనే బిరుదు ఉన్నట్లు కూడా ఈ నాటకం తెలుపుతుంది. ఈ రత్నపాంచాలిక నాటకాన్ని రాచకొండలో ప్రసన్న గోపాల దేవుని ఆలయం వద్ద జరిగే వసంతోత్సవాల సమయంలో ప్రదర్శించేవారు. సింగమ భూపాలునకు లక్షలక్షణవేద, సర్వజ్ఞ, చూడామణి అనే బిరుదులు ఉన్నాయి. సింగమ భూపాలుడు గొప్ప కవే కాకుండా కవులు, పండితులను పోషించాడు. ఇతని ఆస్థానంలో విశ్వేశ్వరుడు, బొమ్మకంటి అప్పయార్యుడు అనే ఇద్దరు కవులు ఉండేవారు. వీరిలో విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
బొమ్మకంటి అప్పయార్యుడు అమరకోశానికి వ్యాఖ్యానం రాశాడు. విశ్వేశ్వరుడు చమత్కారచంద్రికలో సింగమ భూపాలుడిని సాహిత్య శిల్పావధ అని వర్ణించాడు. సింగమ భూపాలుని కుమారుడైన రావు మాదానాయుడు కూడా గొప్ప విద్వాంసుడు. ఇతడు శ్రీమద్రామాయణంపై రాఘవీయ అనే వ్యాఖ్యానం రాశాడు. మాదానాయుడి భార్య వేయించిన నాగారం శాసనంలో ఈ విషయం రాయబడింది. అదేవిధంగా రేచర్ల వెలమల ఆస్థానాల్లో ప్రసిద్ధి పొందిన మరో కవి శాకల్యమల్లభట్టు. ఇతడు నిరోష్ఠ్య రామాయణం, ఉదార రాఘవం అనే కావ్యాలు, అవ్యయ సంగ్రహ నిఘంటువు రచించాడు. ఈ నిఘంటువు చివర తాను చతుర్భాషా కవితా పితామహుడని చెప్పుకున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు