పదాల పుట్టుపూర్వోత్తరాలు
ఇంగ్లిష్ ప్రపంచ భాష. అది విశ్వ వీక్షణ గవాక్షం. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, మాన్యులు ఎవరైనా సరే ఇప్పుడు తప్పనిసరిగా నేర్వాల్సిన మరో భారతీయ భాష. ఈ నేపథ్యంలో నమస్తే పాఠకుల కోసం ఈ వ్యాస పరంపర.
– భాషలో ప్రావీణ్యం సంపాదించడానికి పదజాలంపై గట్టి పట్టు అవసరం. నేను డిగ్రీ స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో చదివాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీలో చేరిన తర్వాత ఇంగ్లిష్‌లో చదవాల్సి రావడం చాలా అవసరమైంది.
– ఇంగ్లిష్ నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో ఒక రోజు గ్రంథాలయంలో వొకాబులరీపై ఒక పాత పుస్తకం దొరికింది. నేను చేసిన అపరాధాల్లో ఒకటి ఆ పుస్తకం, రచయిత పేర్లు గుర్తుపెట్టుకోలేకపోవడం.
– ఆ పుస్తకం ప్రకారం ఇంగ్లిష్ పదాల్లో దాదాపు 60 శాతం లాటిన్ నుంచి లేదా పాత ఫ్రెంచ్ ద్వారా ఇంగ్లిష్‌లోకి వచ్చాయి. ఆ పుస్తకంలో ఇంగ్లిష్ పదాల వ్యుత్పత్తికి కారణభూతమైన కొన్ని లాటిన్ పదాల ప్రస్తావన ఉంది. sto అనే ఒక లాటిన్ మూలపదం. దాని అర్థం stand అంటే కదలకుండా నిలబడి ఉన్న, స్థిరంగా ఒకచోట ఉన్న అని అర్థం.
– stan, stat, sist, statut, sta అనే రకరకాల రూపాల్లో ఈ sto అనే మూలరూపం
కనిపిస్తుంది.
– stationary – స్థిరంగా ఉన్న, stationary orbit- స్థిర కక్ష్య.
– stand- కదలకుండా నిలబడు
– stagnat- నిలువ ఉన్న/చలనంలేని
– statue- విగ్రహం (స్థిరంగా ఉండేది)
– staple, statute (శాసనం/చట్టం), stadium, state, estate, establish, stall ఇలా లెక్కకుమించిన పదాలు కనిపిస్తాయి.
– ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే సంస్కృతంలో కూడా స్థ అనే ధాతువు నుంచి చలనం లేకుండా, ఒకచోట నిలబడి ఉండే అనే అర్థంలో చాలా పదాలు ఉన్నాయి.
– స్థలం, స్థానం, స్థిరం, స్థితి, స్థావరం, స్థాణువు, స్థానికుడు, స్థానికత, స్థపతి (శిల్పి-sculptor), స్థూపం మొదలైనవి.
– ఇంగ్లిష్, గ్రీకు, లాటిన్, సంస్కృతం ఇవన్నీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి. ఈ భాషల్లో చాలా పదాల అర్థాలు వాటి ధాతువుల్లోనే ఇమిడి ఉంటాయి. ఇంగ్లిష్‌వారి మాతృభూమి ఇంగ్లండ్. ఈ ఇంగ్లండ్ నిజానికి engla, land అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. వీటి అర్థం Land of Angles. అంటే ఆంగ్లేయుల నేల అని అర్థం.
1. Library- Liber అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. Liber అంటే చెట్టు బెరడు లేదా పుస్తకం అని అర్థం. ఎందుకంటే ఆ రోజుల్లో అక్షరాలను చెట్టుబెరడుపై చెక్కేవారు. ఒకవిధంగా చెప్పాలంటే తాళపత్ర గ్రంథాలన్నమాట.
Salt సంగతులు
– నా ఉప్పు తింటూ నన్నే మోసం చేస్తావా, నమ్మకద్రోహి! ఇటువంటి సంభాషణలు చాలా సినిమాల్లో వింటూ ఉంటాం. ఇక్కడ ఉప్పు తినడం అంటే జీతం మీద ఆధారపడి బతకడం అని అర్థం.
– హిందీలో కూడా యజమానిపట్ల కృతజ్ఞుడి (grateful/loyal)గా ఉండేవాడిని నమక్ (ఉప్పు) హలాల్ అని కృతఘ్నుడి (ungrateful/disloyal)గా ఉండేవాడిని నమక్ హరామ్ అని అంటారు. మన నమక్ (ఉప్పు/జీతం) తినేవాడు మన పట్ల విథేయంగా ఉంటాడని నమ్మకం. నిజంగానే జీతం అనే (salary)అనే పదం ఉప్పు నుంచే వచ్చిందంటే నమ్మగలరా!
– మనకు ఇప్పుడు వినిమయ మారకం డబ్బు. అంతకుముందు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఈ పద్ధతిలో డబ్బు ప్రమేయం లేకుండా ఒక రకమైన వస్తుసేవలు మరో రకమైన వస్తుసేవలతో వినిమయం జరిగేవి.
– ఇద్దరి మధ్య జరిగే వస్తుమార్పిడి క్రమేణా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వస్తువు ప్రామాణిక మధ్యవర్తిత్వంతో అనేకుల లావాదేవీలు జరపడం మొదలయ్యింది. ఆనాటి రోమన్ సామ్రాజ్యంలో ఈ ప్రామాణిక మధ్యవర్తి సరకు బంగారమూ, వెండీ కాదు ఉప్పు అనేది నమ్మశక్యం కాని నిజం. ఆ రోజుల్లో ఉప్పు తయారీ రాజ్య నియంత్రణ (state control)లో ఉండేది. కాబట్టి ఇప్పటి లాగా అందరికీ అందుబాటులోలేని వస్తువు.1930లో ఉప్పు తయారీలో బ్రిటిష్‌వారి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని (monopoly) నిరసిస్తూ మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టి దండి యాత్రను బ్రిటిష్ దమన చట్టాలపై దండయాత్రగా మలిచింది.
– రోమన్ సామ్రాజ్య తొలి రోజుల్లో సైనికులకు జీతంగా ప్రతిరోజూ కొంత ఉప్పు (Latin-salt)ను కొలిచి ఇచ్చేవారు. ఈ ఉప్పును మారకం చేస్తూ సైనికులు తమకు అవసరమైన వస్తు సేవలు పొందేవారు. కాలక్రమంలో డబ్బు వాడకం వచ్చిన తర్వాత ఉప్పు స్థానంలో salt money (Latin-Salurium) ఇచ్చేవారు. ఈ salurium నుంచి వచ్చిందే ఇంగ్లిష్‌లోని salary అనే పదం soldier వ్యుత్పత్తి కూడా ఇటువంటిదే.
– అందుకే ఎవరైనా జీతం తీసుకొని సరిగా పనిచేయకపోతే He isnt worth of salt అని, విశ్వాసంగా ఉంటే true to his salt అని అంటారు.
1) (Greek-dia = between, logos = speech, conversion in a book, play or movie పాత్రల మధ్య సంభాషణలు) ఇటువంటివే prologue (pro = ముందు) పుస్తకానికి, సినిమాలకు ముందుమాటలు, epilogue చివరిమాటలు, ఒక్కడే సుదీర్ఘంగా మాట్లాడితే అది monologue (mono = one) ఒకరకంగా one man show అనుకోవచ్చు. Latinలో మరొక మాట soliloquy (స్వగతం) (Solus-alone, loqui = speech). ఈ loqui నుంచి వచ్చిన కొన్ని పదాలు loquacius (వదరుబోతు)/వాగుడుకాయ, eloquent (వక్తృత్వం) colloquial (వాడుక భాష) విషయాన్ని సూటిగా కాకుండా వంకరటింకరగా చెప్పడాన్ని circumlo cution (circum = aford), ventiloquism (ఎక్కడి నుంచో మాటలు వస్తున్నట్లుగా గొంతు మార్చడం మొదలైనవి (venterstomache) పొట్టలోంచి మాట్లాడే కళ).
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు