సిపాయిల తిరుగుబాటు ఫలితమేంటి?
భారతదేశ చరిత్ర
– 1857 తిరుగుబాటు అణచినా అది బ్రిటిష్ అధికారాన్ని పునాదులతో సహా కదలించింది. లార్డ్ క్రోమర్ అన్నట్లు ఇంగ్లండ్‌లోని యువకులు సిపాయిల తిరుగుబాటు చరిత్రను చదివి అంతరంగంలో జీర్ణించుకోవాలని నా కోరిక. అది అనేక పాఠాలు, హెచ్చరికలను కలిగి ఉన్నది.
– విప్లవం తర్వాత బ్రిటిష్‌వారు విభజించు పాలించు విధానాన్ని పూర్తిగా అమలుపర్చారు. దేశంలోని కీలక ప్రాంతాలను వారు ఆక్రమించుకుని పాలించారు.
– భారతదేశ పరిపాలన, తూర్పు ఇండియా వర్తక సంఘం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఈ మేరకు 1858 నవంబర్ 1న విక్టోరియా రాణి ప్రకటన జారీ అయ్యింది.
– ఇంగ్లండ్‌లో 1858 చట్టం మూలంగా భారతదేశ కార్యదర్శి అనే అధికారి భారతీయ విషయాలు గమనించడానికి నియమితుడయ్యాడు. దేశంలో గవర్నర్ జనరల్ రాజ ప్రతినిధి (వైస్రాయ్) అనే బిరుదు చేర్చి కొనసాగాడు.
– ఈ చట్టం దేశ వ్యవహారాల నిర్వహణకు బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష బాధ్యత ఉంచింది. విక్టోరియా రాణి ప్రకటనలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ నిలుపుదల చేసినట్లు భారతీయ
సంస్థానాధీశులకు అధికారాలు, గౌరవ మర్యాదలు ఎప్పటిలా ఇవ్వడానికి వాగ్దానం చేశారు.
– మత విషయాల్లో ఎలాంటి జోక్యం కల్పించుకోకుండా, జాతి విచక్షణ లేకుండా, అర్హతను బట్టి ప్రజలందరికీ ఉద్యోగాలు ఇచ్చేట్లుగా చట్టం చేయడానికి, ప్రాచీన సంప్రదాయాలను పాటించడానికి ఆమె ఉద్దేశం స్పష్టం చేసింది. 1857 తిరుగుబాటు బ్రిటిష్ అధికారులను సైన్య నిర్మాణం గురించి ఆలోచింపజేసింది.
– సైన్యాన్ని పూర్తిగా పునర్వవస్థీకరించారు. దేశంలోని ఆంగ్లేయ అధికారుల సంఖ్య పెరిగింది. బెంగాల్లో భారతీయ సైనికులు, విదేశీ సైనికులకు నిష్పత్తి 2:1గాను బొంబాయి, మద్రాస్ రాష్ర్టాల్లో 3:1గాను కొనసాగింది.
– 1857 తిరుగుబాటుకు గల కారణాల్లో ప్రధానమైనది బ్రిటిష్ పరిపాలకులకు భారతీయులతో తగిన సంబంధాలు లోపించడమేనని భావించింది.
– అందువల్ల 1861 కౌన్సిల్ చట్టంలో స్థానికులకు అధిక సంఖ్యలో ప్రాతినిధ్యం ఇచ్చి బ్రిటిష్‌వారితో అభిప్రాయ భేదాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. అయితే తిరుగుబాటు తర్వాత మత కలహాలు ఎక్కువ అయ్యాయి.
– బ్రిటిష్‌వారు హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలు, మత విభేదాలు సృష్టిస్తూ వచ్చారు. వారి జాతి గొప్ప అనే భావాన్ని బ్రిటిష్‌వారు వ్యక్తీకరించారు. బ్రిటిష్‌వారి ఆ ప్రవర్తన భారతీయుల్లో జాతీయతా భావాన్ని ప్రబోధించింది. అప్పటి నుంచి జాతీయోద్యమం అంకురించిందని చెప్పవచ్చు.
కంపెనీ పాలనలో విద్యావ్యాప్తి
– కంపెనీ ఆధీనంలో ఉన్న దేశంలోని విద్యావ్యాప్తిని రెండు దశలుగా విభజించవచ్చు. 1772 నుంచి 1818 వరకు గల మొదటి దశను ప్రారంభ దశగా చెప్పవచ్చు.
– రెండో దశ 1818 నుంచి 1857 వరకు కొనసాగింది. ఈ సమయంలో ఆంగ్ల విద్యావ్యాప్తికి బలమైన పునాదులు పడ్డాయి. ప్రధాన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.
– మొదటి దశలో ఇంగ్లండ్ అమెరికా స్వాతంత్య్ర సమరాన్ని ఒకవైపు, మరోవైపు ఐరోపాలో ఫ్రెంచ్ విప్లవాన్ని, నెపోలియన్ యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
– విద్యారంగంలో సంస్కరణలు ఆలస్యమయ్యాయి. రెండో దశలో ఇంగ్లండ్ శాంతియుతంగా ఉన్నది. నెపోలియన్‌తో యుద్ధం ముగిసింది. వీటితోపాటు ఆ సమయంలో విద్యావ్యాప్తిపై కచ్చితమైన దృక్పథాలు గల పరిపాలకులు అనేక మంది ఉండటం గమనార్హం.
– వారు ఎల్ఫిన్స్టన్, థామస్ మన్రో, బెంటింక్, మెకాలే మొదలైనవారు. బ్రిటిష్ కంపెనీ దేశంలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న సమయంలో అప్పటి విద్యావిధానం హిందూ, ముస్లింల మత విధానాన్ని అనుసరించిన్నట్లు తెలుసుకున్నారు.
– హిందువులకు పండితులు పాఠశాలలో సంస్కృతాన్ని బోధించేవారు. ముస్లింలకు మౌల్వీలు మసీదుల్లో పాఠాలు బోధించేవారు. కంపెనీ ప్రభుత్వం అప్పటి ఈ పద్ధతిని మార్చకూడదని మొదట భావించింది.
– కానీ కొద్దికాలం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలతో ఆ పద్ధతిలో విద్యావ్యాప్తి కొనసాగడానికి వీలులేకపోయింది. రాజకీయాధికారాన్ని కోల్పోవడంతో స్థానిక సంస్థానాలు పాఠశాలలను పోషించలేకపోయాయి.
– పండితులు, మౌల్వీలకు తగిన ప్రోత్సాహం లేకపోయింది. ఈ పరిస్థితుల గురించి 1784లో వారన్‌హేస్టింగ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు లేఖ రాస్తూ హిందూ దేశంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో పాఠశాలలు క్షీణిస్తున్నాయని తెలిపాడు.
– కంపెనీ ప్రభుత్వం భారతీయులను విద్యావంతులను చేసే బాధ్యత స్వీకరించడానికి నిరాకరించినా, కంపెనీ ఉద్యోగులుగా భారతదేశానికి వచ్చినవారు విద్యావ్యాప్తికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
– భారతీయ విద్యావ్యాప్తి కోసం కంపెనీ ప్రభుత్వం అర్ధ మనస్సుతో కొంత ప్రయత్నించింది. 1781లో వారన్‌హేస్టింగ్స్ కలకత్తా మదర్సాను స్థాపించి అరబిక్, పారశీక భాషలను బోధించే ఏర్పాట్లు చేశాడు.
– అతడు ఉద్దేశించినట్లు ఆ పాఠశాల బాధ్యతాయుత ఉన్నత ఉద్యోగాలకు దేశీయ ముస్లింలకు శిక్షణ ఇవ్వడానికి స్థాపితమైంది. కొన్నేండ్ల తర్వాత జాన్ ఓవెన్ అనే వ్యక్తి స్థానికులకు ఆంగ్లాన్ని బోధించే పాఠశాలలు స్థాపించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించాడు.
– అయితే దీనిని ఎవరు పట్టించుకోలేదు. కానీ 1791లో బెనారస్లోని బ్రిటిష్ ఉద్యోగి జొనాథన్ డంకన్ ప్రయత్నాలు ఫలించి అక్కడ ఒక సంస్కృత కళాశాల ఏర్పాటైంది.
– దీన్ని స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం హిందువుల చట్టాలను, వాజ్ఞయాన్ని, మతాన్ని పరిరక్షించడానికి ముఖ్యంగా బ్రిటిష్ న్యాయవేత్తలకు కావాల్సిన హిందూ సహాయకులను తయారు చేయడానికి.
– 1792-93 ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీని కొనసాగించాలా వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన విల్బర్ ఫోర్స్ భారతదేశానికి ఉపాధ్యాయులను, మిషనరీలను అధిక సంఖ్యలో పంపాలని సూచించాడు.
– కానీ భారతీయులకు అప్పటికున్న విద్యా పద్ధతులను మార్చి విదేశీ పద్ధతులను ప్రవేశపెట్టడం అసమంజసమని భావించి అప్పుడు కంపెనీ ప్రభ్వుత్వం విల్బర్ ఫోర్స్ సూచనను అంగీకరించలేదు.
– కంపెనీ డైరెక్టర్లలో ఒకడైన చార్లెస్ గ్రాంట్ భారతీయులకు విద్యా సౌకర్యాలను కలిగించి ఆంగ్ల భాషను బోధించి కొత్త విధానాలు ఉద్దేశాలకు చేరువయ్యేట్లు కంపెనీ తగిన శ్రద్ధ వహించాలని సూచించాడు.
– అతని ఉద్దేశంలో మహ్మదీయ పాలకులు భారతీయులకు పారశీక భాషను బోధించినట్లు బ్రిటిష్‌వారు ఆంగ్ల భాషను బోధించాలి. క్రమేణా ఆంగ్లాన్ని బోధించే పాఠశాలలు స్థాపించి విరివిగా ఆంగ్ల భాషా గ్రంథాలను పంచి భారతీయులను ఆంగ్ల భాషా బోధనకు శిక్షణ ఇవ్వాలని అతడు భావించాడు.
– కంపెనీ ప్రభుత్వానికి చేసిన ఆ సూచనలతోపాటు క్రైస్తవ మిషనరీలు కూడా ఆంగ్ల భాష మూలంగా మత ప్రచారం సులభమని భావించి ఆంగ్ల విద్యావ్యాప్తికి సుముఖత చూపాయి.
– ప్రత్యేకంగా శేరంపూర్లోని మిషనరీలు, అలాంటి ఆంగ్ల విద్యా విధానాన్ని ఉత్సాహంగా సమర్థిస్తూ వచ్చారు. 1800లో లార్డ్ వెల్లస్లీ కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించాడు.
– ఇది కంపెనీ అధికారులకు భారతీయ భాషలు, ఆచార వ్యవహారాలు నేర్పడానికి ఉద్దేశించింది. ఆ కళాశాల ఒక ఆంగ్ల హిందుస్థానీ నిఘంటువు, వ్యాకరణం మొదలైన అనేక ఇతర గ్రంథాలను ప్రచురించింది.
– కానీ రెండేండ్లు మాత్రమే పనిచేసిన ఈ కళాశాలను 1802లో డైరెక్టర్ల ఉత్తర్వు మేరకు మూసివేశారు. 1813 చార్టర్ చట్టం దేశంలోని బ్రిటిష్ భూభాగాలపై గల సార్వభౌమాధికారం పూర్తిగా ఇంగ్లండ్ ప్రభుత్వానికే చెందుతుందని ప్రకటిస్తూ కంపెనీవారు తమ వార్షిక ఆదాయంలో సాలీనా లక్ష రూపాయలు భారతీయుల్లో విద్యావ్యాప్తికి ఖర్చు చేయాలని పేర్కొన్నది.
– దీంతో ఏ రకమైన విద్యావిధానాన్ని అనుసరించాలి, అమలు జరపాలి అనే వివాదానికి తెరలేచింది. ఆంగ్లేయులు పాశ్చాత్య విద్యావ్యాప్తికి మాత్రమే ఆ సొమ్ము ఖర్చు చేయాలని పట్టుబట్టారు.
తిరుగుబాటు స్వభావం
– 1857 తిరుగుబాటు గురించి చరిత్రకారులు భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చారు. కొద్దిమంది దానిని కేవలం సిపాయిల పితూరి అంటే కొందరు క్రైస్తవులకు ఒకవైపు, హిందూ, ముస్లింలకు మరోవైపు జరిగిన మత పోరాటమని పేర్కొన్నారు.
– కొందరి ఉద్దేశంలో అది తూర్పు, పశ్చిమాల సంస్కృతి సంఘర్షణ. వీరసావర్కర్ దీనిని భారతీయ ప్రథమ స్వాతంత్య్ర సమరమని నిర్ణయించాడు.
– ఆర్సీ మజుందార్, ఎస్ఎన్ సేన్ వంటివారు 1857 విప్లవం ముందుగా పథకాలు వేసుకొని జరిపించిందికాదని, అది దానంతటదే ఉత్పన్నమైందని భావించారు.
– అయితే తిరుగుబాటు పూర్తిగా జాతీయగుణం కలదిగా కూడా చెప్పడానికి వీలులేదు. నాయకులందరూ తమ తమ స్వప్రయోజనాల కోసం యుద్ధంలో పాల్గొన్నారు.
– కొన్ని ప్రాంతాల్లో తప్ప తిరుగుబాటు ప్రజలందరినీ ఆకర్షించలేదు. బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన ప్రధానవర్గం సిపాయిలు మాత్రమే.
– 1857 తిరుగుబాటు గురించి ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెంట్ గ్రంథాన్ని వీడీ సావర్కర్, ఇండియన్ మ్యూటినీ అనే గ్రంథాన్ని జీబీ మాలేకన్, ది కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అనే గ్రంథాన్ని సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, రివోల్ట్ ఆఫ్ 1857 గ్రంథాన్ని ఆర్సీ మజుందార్ రచించారు.
బ్రిటిష్ కాలంలో విద్యాసంస్థలు
– 1820 నాటికి మిషనరీలు దేశవ్యాప్తంగా మత ప్రచార ఉద్యమాన్ని కొనసాగించాయి. ఆంగ్లభాషా వ్యాప్తి మత ప్రచారానికి సహాయపడుతుందని వారు గుర్తించారు. ఆ ఉద్దేశంతో బొంబాయిలో విల్సన్ కళాశాల, మద్రాస్‌లో క్రైస్తవ కళాశాల ప్రారంభమయ్యాయి.
– 1853లో సెయింట్ జాన్ కళాశాల ఆగ్రాలో స్థాపించారు. తర్వాత మచిలీపట్నం, నాగ్‌పూర్‌లో కూడా మిషనరీ కళాశాలు ఏర్పాటయ్యాయి. ఈ విద్యా సంస్థల్లో బైబిల్ పఠనం తప్పనిసరిగా కొనసాగింది.
– మిషనరీలు విద్యావ్యాప్తితోపాటు మత ప్రచారాన్ని మేళవించాలనే భావన, అలాంటి కళాశాలల స్థాపనలో తెలుస్తుంది. పాశ్చాత్య విద్యావ్యాప్తికి ఆంగ్ల భాషా ప్రవేశానికి ప్రధాన కారణం ఆర్థిక అవసరం.
– ఆ భాష మూలంగా కంపెనీ పాలనలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, అధిక సంఖ్యలో ఆంగ్ల భాషను అభ్యసించడం ప్రారంభించారు. పాశ్చాత్య విద్యా ప్రాధాన్యతను గుర్తించిన రాజరామ్మోహన్రాయ్ భారతీయులు ఐరోపియా భాషలు నేర్చుకోవడానికి, విజ్ఞానశాస్ర్తాన్ని అభ్యసించడానికి ప్రభుత్వం ఒక పాఠశాలను స్థాపించాలని అభ్యర్థించడానికి ఒక సంఘాన్ని కూడా స్థాపించాడు.
– ఫలితంగా 1817లో హిందూ కాలేజీ స్థాపితమైంది. ఆంగ్లభాషా వ్యాప్తిని సమర్థిస్తూ రాజారామ్మోహన్ రాయ్ కనిపించే వస్తువులను మిథ్య అని బోధించే వేదాంత పద్ధతులతో యువకులు సంఘంలో సరైన సభ్యులు కాజాలరని కచ్చితంగా తెలిపాడు.
– ఆధునిక విజ్ఞానశాస్త్ర అధ్యయనం ఆవశ్యకతను గురించి రామ్మోహన్ ఇలా రాశాడు. దేశాన్ని పూర్తిగా అంధకారంలో ఉంచడం ప్రభుత్వ ఉద్దేశమైనతో సంస్కృత విద్యకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అలాగాక దేశ ప్రజల అభివృద్ధిని కాంక్షించినట్లయితే కొత్త ఉదాత్తమైన విద్యావిధానాన్ని చేపట్టిన గణితం, సహజ వేదాంతం, రసాయనశాస్త్రం, శారీరకశాస్త్రం మొదలైన ఉపయోగపడే శాస్ర్తాలను బోధించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు