1952 లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఎమ్మెల్యే ఎవరు?
నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి లభిస్తుందని భావించి పోలీస్ చర్యను స్వాగతించిన హైదరాబాద్ రాజ్య ప్రజలకు తరువాత ఏర్పడిన మిలిటరీ జనరల్ జేఎన్ చౌధరి పాలన, ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వ పాలనలో స్థానికేతరులను (నాన్ ముల్కీ) వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడం అనేది పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు పక్క రాష్ర్టాలైన మద్రాస్, బాంబే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి గంపగుత్తగా అధికారులను దిగుమతి చేసుకోవడం వల్ల హైదరాబాద్ రాష్ట్ర ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి, అలజడులు ఆందోళన రూపంలో బయటపడ్డాయి. అయితే బాంబే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అధికారులు మాత్రం హైదరాబాద్ రాష్ట్ర ప్రజలతో మంచిగా కలిసిపోయారు. కానీ మద్రాస్ ప్రాంత అధికారులు ముఖ్యంగా ఆంధ్రులు స్థానిక ప్రజల పట్ల చులకన భావంతో, ఆధిపత్యం చెలాయిస్తూ సమస్యలు సృష్టించారు. నిజాం పాలన పోయి భారత యూనియన్ కాంగ్రెస్ పాలన వస్తే తమ బతుకులు బాగుపడుతాయని భావించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజల భ్రమలు త్వరగానే చెదిరిపోయాయి.
దీంతో నాన్ ముల్కీల వల్ల స్థానికులైన విద్యావంతులకు ఉద్యోగాలు రావేమోనని ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే 1952 మార్చి 6న ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయిన ప్రజా ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పడింది. అయినప్పటికీ నాన్ ముల్కీలు నకిలీ ధృవపత్రాలు సృష్టించి ముల్కీలుగా ఉద్యోగాల్లో చేరడం వంటి విషయాలను బూర్గుల ప్రభుత్వం అరికట్టలేకపోయింది. దీంతో స్థానికుల్లో అభద్రతాభావం పెరిగిపోయింది. ఆనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి వరంగల్‌లో 1952, జూలై 26న ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి వేలాది మంది విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు.
అదే క్రమంలో ఈ ఐక్యకార్యాచరణ సమితి 1952, జూలై 26న ఒక తీర్మానాన్ని కూడా చేసింది.
1) ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి, దాన్ని ముఖ్యమంత్రే స్వయంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలి.
2) ముల్కీ నిబంధనల ప్రకారమే వెంటనే ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీచేసి, యుద్ధ ప్రాతిపదికపై వాటిని నింపాలి.
3) హైదరాబాద్ రాష్ట్రంలో స్థానికేతరుల ఆధిపత్యం, అజమాయిషీలను వెంటనే అరికట్టి, స్థానికుల్లో అభద్రతా భావాన్ని తొలగించే ప్రకటన చేయాలి.
- ఈ తీర్మానాల పత్రాన్ని 1952, ఆగస్ట్ 6న సీఎంకు పంపగా, కొద్దిరోజుల తరువాత అంటే 1952, ఆగస్ట్ 22న ముఖ్యమంత్రి స్వయంగా వరంగల్‌కు వచ్చి విద్యార్థులతో చర్చించారు. హైదరాబాద్ వెళ్లిన తరువాత ఆ డిమాండ్లను తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇచ్చిన బూర్గుల రామకృష్ణారావు వివిధ జిల్లా కలెక్టర్ల ద్వారా అధికార ప్రకటన కూడా చేయించారు.
- కాలయాపనతో పాటు కలెక్టర్ల ప్రకటనా సమాచార లోపం వల్ల వరంగల్ విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ 1952, ఆగస్ట్ 27న మరో ర్యాలీని విజయవంతంగా నిర్వహించి మరోలేఖను సీఎంకు పంపించారు.
- ఈ క్రమంలోనే 1952, ఆగస్ట్ 30న దాదాపు 200 మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయగా చాలామంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన విద్యార్థి లోకం మరుసటి రోజు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా వరంగల్‌తో పాటు, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఇల్లందు, నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో పూర్తిస్థాయి ఆందోళనలు, హర్తాళ్లు నిర్వహించింది.
- వరంగల్‌లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తమైనప్పటికీ అది హైదరాబాద్ నగరంలో ఎక్కువ ప్రభావాన్ని చూపింది. 1952, ఆగస్ట్ 30న హన్మకొండలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా ఆగస్ట్ 31న హైదరాబాద్‌లో సమ్మె నిర్వహించి అదే రోజు సైఫాబాద్ కాలేజీ నుంచి అబిడ్స్ వరకు విద్యార్థులు పెద్ద ప్రదర్శనను నిర్వహించారు.
- 1952, సెప్టెంబర్ 1న బక్రీద్ పండుగ ఉండటం వల్ల ఆ రోజు ఎలాంటి సమ్మె నిర్వహించలేదు. మరుసటి రోజు సెప్టెంబర్ 2న ‘నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ ఘర్ కో జావ్, స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్’ వంటి నినాదాలతో విద్యార్థులు భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు.
- సెప్టెంబర్ 3న పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఒక ప్రకటన ద్వారా నిషేధిత ఆజ్ఞలను జారీచేయడం జరిగింది. అయినప్పటికీ సెప్టెంబర్ 3న సిటీ కాలేజీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. సిటీ కాలేజీ విద్యార్థుల ఆందోళనను శాంతింపజేయడానికి కొండా లక్ష్మణ బాపూజీ ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
- 1952, సెప్టెంబర్ 3న సిటీ కాలేజీ, పత్తర్‌ఘాట్ ప్రాంతాల్లో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. మొదటిసారి కాల్పుల్లో మహమ్మద్ ఖాసిం అనే 22 ఏండ్ల యువకుడు మరణించగా రెండోసారి కాల్పుల్లో షేక్ మహబూబ్ అనే వ్యక్తి మరణించాడు.
- సెప్టెంబర్ 4న చనిపోయిన వారి మృతదేహాలను అప్పగించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో శాంతిభద్రతలను సాకుగా చూపిస్తూ 1952, సెప్టెంబర్ 4న అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. 1952, సెప్టెంబర్ 4న జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు.
- ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రితో పాటు రాజకీయ నాయకులైన వీడీ దేశ్‌పాండే, ఓంకార్ ప్రసాద్, డా. జయసూర్య, పద్మజానాయుడు, శ్రీడాగే, డా. మెల్కోటే, బాకర్ అలీ మీర్జా, వెంకటస్వామి, రామాచారి, హయగ్రీవాచారి, కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి ఆందోళనకారులను శాంతింపజేయడానికి ఎంతో ప్రయత్నించి చివరికి ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపారు.
- పర్యవసానంగా 1952, సెప్టెంబర్ 5న ప్రభుత్వం కాల్పులపై విచారణకు గాను జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీతో పాటు సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల అమలుకు ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా నియమించింది.
1) కొండా వెంకట రంగారెడ్డి- ఎక్సైజ్ శాఖ మంత్రి
2) డా. జీఎస్ మెల్కోటో- ఆర్థిక శాఖ మంత్రి
3) ఫూల్‌చంద్ ప్రేమ్‌చంద్ గాంధీ- విద్యాశాఖ మంత్రి
4) మెహదీ నవాజ్ జంగ్- పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి - ఈ మంత్రివర్గం అప్పటికే అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను పూర్తిగా పరిశీలించి విద్యార్థులు, ఇతర సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులను కలిసి వారి అభిప్రాయాలను సేకరించి నివేదికను సమర్పించింది. ఇదే సందర్భంగా సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెక్షన్ (పీడీ) చట్టం కింద శాసనసభ్యుడు సయ్యద్ అక్తర్ హుస్సేన్, పాత్రికేయురాలు బేగం సాదిక్ జహాన్‌లను అరెస్ట్ చేశారు.
- ఈ ఉద్యమ కాలంలో అంటే 1952, ఆగస్ట్‌లో ‘హైదరాబాద్ హితరక్షణ సమితి’ని స్థాపించిన శాసనసభ్యుడు పీ రామాచారి నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా దీర్ఘకాలికమైన ఉద్యమాన్ని నడిపించి చరిత్రలో నిలిచిపోయారు.
- జగన్మోహన్ రెడ్డి కమిటీ – నివేదిక
హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ముల్కీ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పులపై విచారణ చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 1952, సెప్టెంబర్ 5న జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి చైర్మన్‌గా కమిటీని నియమించింది. - ఈ కమిటీ ప్రజల మధ్య ప్రధానంగా హైకోర్టు, సిటీ కాలేజీ, పత్తర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో పర్యటించి ప్రముఖ వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షులు, ప్రభుత్వాధికారులను దాదాపు 100 మందిని విచారించి తన సమగ్ర నివేదికను 1952, డిసెంబర్ 28న ప్రభుత్వానికి సమర్పించింది.
- మొదటిసారి అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపినప్పుడు ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీస్ అధికారులు, పోలీస్ బలగాల మధ్య సమన్వయం కొరవడింది.
- పోలీస్ సరిగా స్పందించకపోవడం, ప్రజా నాయకులు సరిగా కల్పించుకోకపోవడం వెరసి ఆందోళనకారులు, విద్యార్థులు చెలరేగిపోయారు.
- ఆందోళనకారులు ఎలాగైనా ర్యాలీ తీయాలనే సంకల్పంతో ఉండటం, పోలీసుల పై రాళ్లు రువ్వడం వల్ల పోలీసులు కాల్పులు చేపట్టారు.
1. హైదరాబాద్ హిత రక్షణ సమితిని స్థాపించి, నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించింది?
1) వందేమాతరం రామచంద్రారావు
2) పీ రామాచారి
3) మర్రి చెన్నారెడ్డి
4) హయగ్రీవాచారి
2. ‘ది జ్యుడీషియరీ ఐ సర్వ్డ్’ ఎవరి ఆత్మకథ?
1) పింగళి జగన్మోహన్ రెడ్డి
2) పండిట్ సుందర్ లాల్
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) కేవీ రంగారెడ్డి
3. కింది వారిలో ముల్కీ నిబంధనల అమలు కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు కానివారు?
1) కేవీ రంగారెడ్డి
2) డా. మెల్కోటే
3) ఫూల్‌చంద్ గాంధీ
4) మర్రి చెన్నారెడ్డి
4. తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు తెలంగాణ ప్రాంతమంతటా వ్యాపించాయని ఎవరి ఆత్మకథలో పేర్కొన్నారు?
1) నవాజ్ జంగ్
2) రామాచారి
3) పింగళి జగన్మోహన్ రెడ్డి
4) వీబీ రాజు
5. సిటీ కాలేజీ సంఘటన జరిగింది?
1) 1952, సెప్టెంబర్ 2
2) 1952, సెప్టెంబర్ 3
3) 1952, సెప్టెంబర్ 4
4) 1952, సెప్టెంబర్ 5
6. 1952, సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీఏ) కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు?
1) సయ్యద్ అక్తర్ హుస్సేన్
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) మర్రి చెన్నారెడ్డి
4) పీ రామాచారి
7. హైదరాబాద్ రాష్ట్ర మొదటి స్పీకర్?
1) పంపన్న గౌడ
2) ఎం నర్సింగరావు
3) కాశీనాథరావు వైద్య
4) వీడీ దేశ్‌పాండే
సమాధానాలు
1-2, 2-1, 3-4, 4-3, 5-2, 6-1, 7-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు