విస్తృత అవగాహనే విజయానికి సోపానం..
ఉపాధ్యాయుడిగా రాణించడానికి, కాలానుగుణంగా బోధనారంగంలో మారుతున్న వ్యూహాలు, సవాళ్లు ఎదుర్కోవడానికి అవసరమైన ప్రతిభ, సామర్థ్యాలు, బోధన నైపుణ్యాలు ఏ మేరకు కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తారు. ఈ పరీక్ష పేపర్-1, పేపర్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. D.Ed అభ్యర్థులు టెట్ పేపర్-1, B.Ed అభ్యర్థులు టెట్ పేపర్-1తోపాటు పేపర్-2 రాయడానికి అర్హులు. ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించిన వారిని ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం జరిగే పరీక్షలకు అనుమతి ఇస్తారు. కాబట్టి అభ్యర్థులు కచ్చితమైన ప్రణాళికను రూపొందించుకుని చదివితే తప్పక విజయం సాధించవచ్చు.
పేపర్-2లో అర్హత సాధించాలంటే శిశు అభివృద్ధి, బోధనా పద్ధతులు, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, సోషల్ కంటెంట్ బాగా చదవాలి. సిలబస్‌లో పేర్కొన్న ప్రకారం 3 నుంచి 10 తరగతుల సోషల్ పాఠ్యపుస్తకాలను సేకరించాలి. అదేవిధంగా తెలుగు అకాడమీ వారి సాంఘిక శాస్త్రం మెథడాలజీ పుస్తకం చదవాలి. అదేవిధంగా తెలుగు అకాడమీ వారి ఇంటర్మీడియట్ భూగోళ శాస్త్రం, అర్థ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విషయాలను కూడా విస్తృత అవగాహన కోసం అధ్యయనం చేయాలి.
సాధన ఎలా..?
- టెట్ సిలబస్‌ను అవగాహన చేసుకుని సంబంధిత పుస్తకాలను సేకరించాలి. ప్రామాణిక పుస్తకాలను మాత్రమే చదవాలి.
- గత టెట్ ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రశ్నల సరళిని, కాఠిన్యత స్థాయిని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ కొనసాగించాలి.
- స్టడీ మెటీరియల్స్, క్వశ్చన్ బ్యాంకులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వాటి జోలికి వెళ్లకుండా డిస్క్రిప్టివ్ మెటీరియళ్లను చాప్టర్ల వారీగా చదువుతూ కీలక భావనలు, ముఖ్యాంశాలను చదవాలి. అంతేగాక సొంతంగా నోట్స్ తయారుచేసుకోవడం వల్ల పునశ్చరణ సులువవుతుంది.
- బహుళైచ్ఛిక ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి చదివే క్రమంలో థమిక భావనలను అండర్లైన్ చేయాలి.
- చదివిన పాఠ్యాంశాలపై గ్రూప్ డిస్కషన్స్ చేయాలి. దీనివల్ల విషయావగాహనతోపాటు కంటెంట్ పునర్బలనం జరుగుతుంది. లోపాలను, తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
- వ్యక్తులు, సంవత్సరాలకు ప్రాధాన్యం ఉన్న అంశాలను చదివేటప్పుడు నిజ జీవిత సంఘటనలతో అనుసంధానం చేసుకుని చదవాలి.
- చరిత్రకు సంబంధించి వంశవృక్ష చార్టులు, కాలమాన పట్టికలు తయారు చేసుకుని అధ్యయనం చేయాలి.
- మేధోచిత్రాలు, ఫ్లోచార్టులు, స్టేట్మెంట్లు తయారు చేసుకుని తరచుగా పరిశీలించాలి.
- బలహీనతలను దృష్టిలో పెట్టుకుని, తగినవిధంగా అభ్యసన ప్రణాళికను తయారు చేసుకుని కంటెంట్‌పై పట్టు సాధించాలి.
- ఎక్కువ మంది సలహాలు తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా సలహాలు ఇస్తారు. దాంతో అభ్యర్థిలో గందరగోళం నెలకొని లక్ష్యసాధనలో వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రామాణిక పుస్తకాల్లోని సిలబస్‌ను విశ్లేషణాత్మకంగా చదవాలి.
- మెథడాలజీలో ఎక్కువ మార్కులు రావాలంటే బోధన, అభ్యసన విధానాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాలు, ప్రస్తుతం అమలవుతున్న బోధనా విధానాలపై విస్తృత అవగాహన పెంచుకోవాలి.
- శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అనే సూక్తిని దృష్టిలో పెట్టుకొని చదవాలి.
- నిరంతర అధ్యయనం చేయాలి. గత టెట్ల ప్రశ్నపత్రాలు, నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేస్తూ తప్పులు సవరించుకుంటూ పునశ్చరణ చేసుకోవాలి. ఇది విజయసాధనలో కీలకపాత్ర పోషిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు