అరుదైన కోర్సులు.. అద్భుత అవకాశాలు
నలుగురిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా ఉన్నవారే విజయం సాధిస్తారు.. కెరీర్ పరంగా అందరూ చేసే కోర్సుల కంటే విభన్నమైన కోర్సులను ఎంచుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటివే బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్. ఈ కోర్సులను అందించే కళాశాలు ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి. సీట్లు కూడా పరిమితమే. బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుల ఎంపిక ఎంసెట్ ద్వారా చేస్తుండగా… బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌కు యూనవర్సిటీ ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను ఇస్తుంది. బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ సీట్లను నేరుగా లేదా దోస్త్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ విభిన్న కోర్సుల గురించి నిపుణ పాఠకుల కోసం…
బీటెక్ డెయిరీ టెక్నాలజీ
-ఈ కోర్సును రాష్ట్రంలోని ఒకే ఒక కళాశాల గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కామారెడ్డి అందిస్తుంది. ఈ కాలేజీని మొదట ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసినా 2007లో శ్రీ వేంకటేశ్వర వెటర్నిటీ యూనివర్సిటీ, తిరుపతి పరిధిలోకి వచ్చింది. దీంతో పూర్తిస్థాయిలో డెయిరీ టెక్నాలజీ కాలేజీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం (వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీ సైన్స్) పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కళాశాల క్యాంపస్ కామారెడ్డి పరిధిలోనే కొనుసాగుతున్నది.
ప్రవేశాలు
-బీటెక్ డెయిరీ టెక్నాలజీ నాలుగేండ్ల కోర్సు. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. రాష్ట్రంలో మొత్తం 35 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంసెట్ ద్వారా 25 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్) ఐదుగురు విద్యార్థులను నామినేట్ చేస్తుంది. మరో ఐదుగురు విద్యార్థులను ఫార్మర్ కోటాలో ఎంపిక చేస్తారు.
-డెయిరీ ఉత్పత్తులైన పాలు, ఐస్‌క్రీమ్, పెరుగు తదితర ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ, ప్యాకింగ్, పంపిణీ, రవాణాలో అడ్వాన్స్డ్, హైటెక్ టెక్నాలజీ ఉపయోగించడమే డెయిరీ టెక్నాలజీ. పాలలోని హానికరమైన విషరసాయనాలను తొలిగించి, వాటిలోని పోషక విలువలు తొలిగిపోకుండా చూడటమే డెయిరీ టెక్నాలజిస్ట్ విధి. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో ఒక సెమిస్టర్ కాలం డెయిరీ ప్లాంట్‌లో శిక్షణ ఉంటుంది.
-డెయిరీ టెక్నాలజీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నిపుణులైన వృత్తినిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలో పాలు, పాల ఉత్పత్తులకు నెలకొన్న విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో డెయిరీ ఇండస్ట్రీ విస్తృతమవుతున్నది. ఈ క్రమంలో డెయిరీ టెక్నాలజీ చదివిన వారికి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. నాలుగేండ్ల కోర్సు పూర్తికాగానే విద్యార్థి డెయిరీ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరవచ్చు లేదా పీజీ చేయవచ్చు. స్వయం ఉపాధి పొందాలనుకొనే వారు సూక్ష్మ స్థాయిలో పాల కేంద్రాలు, ఐస్‌క్రీమ్ యూనిట్లు, వెన్నె తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అమూల్, మదర్ డెయిరీ, నెస్ట్లే, వాదిలాల్, రిలయన్స్, మెట్రో డెయిరీ, ఐటీసీ (ఆహార విభాగం), హింజ్, సీవోఎంపీఎఫ్ఈడీ (సుధ), జీసీఎంఎంఎఫ్ తదితర ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రంగంలో ఫ్రెషర్లకు 15 వేల నుంచి 25 వేల వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది. ఎక్స్పీరియన్స్ సాధించిన తర్వాత రూ. 40 వేల నుంచి 60 వేల వరకు వేతనం పొందడానికి అవకాశం ఉంటుంది.
-నాలుగేండ్ల బీటెక్ డెయిరీ టెక్నాలజీ తర్వాత ఎంటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంటెక్‌లో డెయిరీ మైక్రోబయాలజీ. డెయిరీ ఇంజినీరింగ్, యానిమల్ బయోకెమిస్ట్రీ, యానిమల్ న్యూట్రిషన్, యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ డెయిరీ కెమిస్ట్రీ, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ డెయిరీ టెక్నాలజీ వంటి స్పెషలైజేషన్ కోర్సులు చేయవచ్చు. పీజీ తర్వాత డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ డెయిరీ కెమిస్ట్రీ చేసి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందవచ్చు.
బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్
-ఈ కోర్సును రాష్ట్రంలో అందిస్తున్న ఏకైక కాలేజీ… కాలేజ్ ఆఫ్ హోంసైన్స్. ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలో ఉంది. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌ను గతంలో హోంసైన్స్గా పిలిచేవారు.
ప్రవేశాలు
-బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ నాలుగేండ్ల కోర్సు (ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ హోంసైన్స్ మూడేండ్ల కోర్సుగా ఉంది). కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ద్వారా గుర్తింపు పొందింది. ప్రవేశాల కోసం విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. ఇంటర్మీడియట్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయిలో బైపీసీ లేదా ఎంపీసీ లేదా ఎంబీపీసీ చదివి ఉండాలి. రాష్ట్రంలో మొత్తం 47 సీట్లు ( మరో 5 సీట్లు ఒకేషనల్ కోర్సుల వారికి, మరో 7 సీట్లను ఐసీఏఆర్ ద్వారా భర్తీ చేస్తారు.) ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన ఏడాదిలో డిసెంబర్ 31 నాటికి జనరల్, బీసీ అభ్యర్థులకు వయస్సు17 ఏండ్లకు తగ్గకుండా, 22 ఏండ్లకు మించకుండా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే.. గరిష్ఠ వయస్సు 25 ఏండ్లు మించరాదు.
-సమాజంలోని అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అవగా హన పెంచుకోవడానికి ఈ కోర్సు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, అపెరల్ డిజైన్ అండ్ టెక్స్టైల్స్, రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ సర్వీస్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్లో ప్రావీణ్యం సాధించే దిశగా కోర్సు కొనసాగుతుంది.
-బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ పూర్తిచేసిన తర్వాత ఎమ్మెఎస్సీ అపెరల్ అండ్ టెక్స్ టైల్స్, ఎమ్మెస్సీ చైల్డ్ గైడెన్స్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్, ఎమ్మెస్సీ ఎక్సెటెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్ అండ్ డైట్టిక్స్, ఎంఎస్సీ ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎమ్మెఎస్సీ ఫుడ్ అండ్ టెక్నాలజీ తదితర కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆపై చదువులు కొనసాగించడానికి ఆసక్తి లేనివారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృమైన అవకాశాలు ఉన్నాయి.
బీఎస్సీ ఫారెస్ట్రీ
-మేడ్చల్ రంగారెడ్డి జిల్లా పరిధి దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో బీఎస్సీ ఫారెస్ట్రీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ను 2016లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈ కళాశాల ఒక్కటే బీఎస్సీ ఫారెస్ట్రీని ఆఫర్ చేస్తున్నది. ప్రస్తుతం ఈ కళాశాల క్యాంపస్ దూలపల్లిలో కొనసాగుతుంది. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత సిద్దిపేట ములుగు జిల్లాకు కళాశాలను మార్చనున్నారు.
ప్రవేశాలు
-బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేండ్ల కోర్సు. గత ఏడాది మార్కుల ప్రతిపాదికన నేరుగా ప్రవేశాలు కల్పించారు. ఈ ఏడాది నుంచి ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ స్థాయిలో బయాలజీ (జంతు+ వృక్షశాస్త్రం), ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్, బయాలజీ (జంతు+ వృక్షశాస్త్రం), ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. రాష్ట్రంలో మొత్తం 50 సీట్లు ఉన్నాయి. ఇందులో 85 శాతం లోకల్, 15 శాతం నాన్ లోకల్ కేటగిరీలో భర్తీ చేస్తారు. 33 1/3 శాతం సీట్లు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. నోటిఫికేషన్ విడుదలైన ఏడాదిలో డిసెంబర్ 31 నాటికి జనరల్, బీసీ అభ్యర్థులకు వయస్సు17 ఏండ్లకు తగ్గకుండా, 22 ఏండ్లకు మించకుండా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే.. గరిష్ఠ వయస్సు 25 ఏండ్లు మించరాదు.
-అటవీ వనరుల పరిరక్షణ, నిరంతర నిర్వహణే లక్ష్యంగా బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు రూపలక్పన చేశారు. నాలుగేండ్ల కోర్సు కాలంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో అడవుల సందర్శన, వాటి సంరక్షణపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ ఉంటుంది. కచ్చితంగా అకాడమీ పరిధిలోని హాస్టల్లో ఉండాల్సి ఉంటుంది.
-బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తిచేసిన తర్వాత ఎంఎస్సీ పారెస్ట్రీ, ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్, ఎంస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రోఫారెస్ట్రీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, మాస్టర్ ఆఫ్ ఆఫ్ సైన్స్ ఇన్ ట్రీ ఇంప్రూవ్మెంట్స్, మాస్టర్ ఇన్ వైల్డ్ సైన్సెస్ తదితర పీజీ కోర్సులు చేయవచ్చు. ఆతర్వాత ఎంఫిల్ లేదా పీహెచ్డీ చేయవచ్చు. విద్యార్హత పెరుగుతున్నా కొద్దీ అవకాశాలతోపాటు వేతనం కూడా అదే స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంది.
-బీఎస్సీ ఫారెస్ట్రీ చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో జూలాజికల్ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి పరిశోధన సంస్థలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, దాని అనుబంధ సంస్థలు, వన్యప్రాణి సంరక్షణ శాఖలు, అటవీ శాఖ, జాతీయపార్కులు, శాంక్చువరీ, అటవీ నర్సరీల్లో ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది.
బీఎస్సీ (బీటీసీఎఫ్ఎస్)
-నేర పరిశోధనలో విజ్ఞాన సూత్రాలను వర్తింపజేసి సాధారణ దృష్టిని తప్పించుకునే ఆధారాలను కనుక్కునే శాస్త్రమే ఫోరెన్సిక్ సైన్స్. ఆధునిక సమాజంలో నేరాలు చేసినవారిని గుర్తించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ఎంతో ఉపకరిస్తుంది. దీంతో ఈ రంగంలో కెరియర్ అవకాశాలు విస్తరిస్తున్నాయి. సైన్స్ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులోప్రవేశం పొందవచ్చు. అయితే డిగ్రీ స్థాయిలో రాష్ట్రంలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సును రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల మాత్రమే అందిస్తున్నది.
-బీఎస్సీ (బీటీసీఎఫ్ఎస్- బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్) అనేది మూడేండ్ల కోర్సు. ఇంటర్మీడియట్లో సాధించిన మార్కుల ఆధారంగా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. పదోతరగతితోపాటు ఎంపీసీ లేదా బైపీసీ చదివిన అభ్యర్థులు అర్హులు. రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి కళాశాలలో మొత్తం 50 సీట్లు ఉన్నాయి. గత ఏడాది ఆఫ్‌లైన్ ద్వారా ప్రవేశాలను కల్పించారు. ఈ ఏడాది ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్(దోస్త్) ద్వారా ప్రవేశాలు కల్పించడానికి ఆస్కారం ఉంది.
-సైన్స్ అంటే ఆసక్తి, గణితంలో ప్రావీణ్యం, సమాచార విశ్లేషణ, వాస్తవానికి దగ్గరగా ఊహించడం, సునిశిత పరిశీలన దృష్టి ఉన్నవాళ్లు ఈ కోర్సులో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి.
-నేర విచారణ సమయంలో భౌతిక ఆధారాలను సేకరించడం, సంరక్షించడం, పరిశీలించడంలో ఫోరెన్సిక్ సైంటిస్ట్‌లు సహాయం చేస్తుంటారు. ఫోరెన్సిక్ సైంటిస్ట్ విధుల్లో కచ్చితత్వం, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్ అనేది నేర ప్రయోగశాల ఆధారిత వృత్తి. ప్రపంచవ్యాప్తంగా ఫోరెన్సిక్ సైన్స్‌ను ప్రజా ఆరోగ్యం, క్రిమినల్ చట్టాల అమలు, సివిల్ నేరాలకు సంబంధించి నిబంధనలు, పరిష్కారాల విషయాల్లో ఉపయోగిస్తుంటారు. ఫోరెన్సిక్ సైన్స్‌లో అంతర్గతంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మెడిసిన్, సైకాలజీ, స్టాటిస్టిక్స్ ఇలా పలు సబ్జెక్టులు ఉంటాయి. ఇవి వృత్తిలో ప్రావీణ్యం సాధించడానికి ఉపయోగపడుతాయి.
-ఫోరెన్సిక్ సైన్స్ పూర్తిచేసిన వారికి అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఎక్కడో ఒకచోట నేరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఫోరెన్సిక్ సైన్సెస్ చదివిన వారికి అదేస్థాయిలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో కూడా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత సొంతంగా ఫోరెన్సిక్ ప్రాక్టీస్, ఫోరెన్సిక్ సర్వీస్ ఆఫీస్‌ను తెరువవచ్చు. అంతేకాకుండా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, డిటెక్టివ్ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
-ఫోరెన్సిక్ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేయవచ్చు. ఎంఎస్సీ పూర్తిచేసిన వారికి డాక్టోరల్ డిగ్రీని ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎంఫిల్, పీహెచ్డీ కూడా చేయవచ్చు. విద్యార్హత పెరిగినా కొద్దీ అవకాశాలు విస్తృతమవుతుంటాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు