ఎకానమీపై పట్టు సాధించడం ఎలా?
గ్రూప్-2 సాధించడం అనేది ఎంతోమంది నిరుద్యోగుల కల. జీవితంలో ఉన్నతస్థాయికి చేర్చే ఉద్యోగాల్లో ఇది ఒకటి. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పటి నుంచే సన్నద్ధం అయితే చాలామంచిది. గ్రూప్-2లో ఎకానమీ సబ్జెక్టును ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకుందాం.
గ్రూప్-2 రాష్ట్రస్థాయిలో ఉండే ఉన్నత ఉద్యోగాల పరీక్ష. ప్రజా సంబంధాలు కలిగి పరిపాలన చేయడానికి అవకాశం ఉన్న ఉన్నత కొలువులు గ్రూప్-2లో ఉంటాయి. కార్యనిర్వాహక, కార్యనిర్వాహకేతర ఉద్యోగాలు ఉంటాయి. కార్యనిర్వాహక కేటగిరిలో ఎగ్జిటివ్ పోస్టులు అయిన డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో), సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వంటి కొలువులు ఉంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో దాదాపు 20 రకాల పోస్టులు ఉంటాయి.
డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ లేదా తత్సమాన డిగ్రీ ఉన్నవారందరూ అర్హులే. దూరవిద్య చదివినవారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు.గ్రూప్-2 తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
పోటీ పరీక్షల్లో ఎకానమీ కీలకం ఎందుకు?
గ్రూప్-2లో పేపర్-3 ఎకానమీ గురించి ఉంటుంది. దీనిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి అడుగుతారు. గ్రూప్-2 సాధించడంలో ఈ పేపరే కీలకం. చాలామంది ఈ పేపర్లో ఇబ్బంది పడుతుంటారు. ఈ సబ్జెక్ట్‌కు 150 మార్కులు కేటాయించారు. దీంతో పాటు పేపర్-1లో కూడా కొన్ని ఎకానమీ ప్రశ్నలు వస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికపరమైన జ్ఞానం చాలా అవసరం. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే దేశాలు దృఢంగా ఉంటాయి. లేకపోతే అవి చిన్నాభిన్నం అవుతాయి. ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. కాబట్టి సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో ఈ సబ్జెక్టుకు పెద్దపీట వేశారు.
ఆర్థికాభివృద్ధికి సివిల్ సర్వెంట్లు మంచి ప్రణాళికలు, వ్యూహాలు రచించినప్పుడే పాలకులు వీటిని అమలు పరిచి దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తారు. అందువల్ల పోటీ పరీక్షల్లో ఎకానమీకి ఇంత వెయిటేజీ ఇచ్చారు.
ఎలా ప్రిపేర్ కావాలి?
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా ఎకానమీపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రోజులో కొంత సమయం తప్పకుండా కేటాయించాలి. మిగతా సబ్జెక్టుల్లాగా కాకుండా దీనికి ప్రత్యేకమైన పరిభాషా పదజాలం ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం కష్టం. రోజురోజు కొత్త పరిభాషిక పదజాలం చేరుతుంది. కాబట్టి దీనికోసం వార్తాపత్రికలు, న్యూస్ చానెళ్లలో ఎప్పటికప్పుడు తెలుసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎకానమీ ఒక నిశ్చలమైన సబ్జెక్ట్ కాదు. ఇది ఏ రోజుకు ఆరోజు మారుతూ ఉంటుంది. కాబట్టి దీనిని గమనిస్తూ ఉండాలి.
పట్టు సాధించడం ఎలా?
మొదటగా పోటీ పరీక్షల్లో ఎకానమీలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించాలి. గత ప్రశ్నపత్రాలను బాగా విశ్లేషిస్తే ప్రశ్నల ధోరణి అర్థమవుతుంది. దానిలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అవి ఎలా గుర్తుంచుకోవాలో అవగతమవుతుంది. ఒక పదేండ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అంటే ఎకానమీకి సంబంధించిన ప్రాథమిక పరిభాషా పదజాలాన్ని నేర్చుకోవాలి. టెర్మినాలజీ, 100 సబ్జెక్టు పదాలను నేర్చుకుంటే ఇవి సబ్జెక్ట్ మొత్తం కవర్ చేస్తాయి. దీనికి స్కూల్ బుక్స్, ఎన్సీఈఆర్టీ బుక్స్, ఇతర ఎకనామిక్స్ డిక్షనరీ లాంటివి పరిశీలించాలి. అప్పుడే ఎకానమీని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చదవడం ఎలా?
ప్రాథమిక అంశాల కోసం పుస్తకాలు చదివేటప్పుడు సబ్జెక్టుల్లోని ఒక టాపిక్ చదివేటప్పుడు మొదట టాపిక్ చదివి, దానిపై ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చో ముందుగా గుర్తించండి. చదివేటప్పుడు ఆ అంశంపై ఒక స్టార్ మార్క్ పెట్టి, ఎలాంటి ప్రశ్న రావచ్చో ఆలోచించాలి. అప్పుడు ఎలాంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయవచ్చు.
నోట్స్ రాయడం ఎలా?
మూడు, నాలుగు సార్లు చదివిన తరువాత ఆ ప్రధాన అంశాలను అండర్లైన్ చేయాలి. వీటిని తిరిగి ఒక నోట్స్‌లో రాసి పెట్టుకోవాలి. అప్పుడు పునశ్చరణ తేలికవుతుంది. ఏ పోటీ పరీక్షలో అయినా విజయం సాధించాలంటే అంతే కచ్చితమైన సొంత నోట్స్ ఉండాలి. సొంతంగా నోట్స్ లేకపోతే సందిగ్దమైన ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు సమాధానం తప్పు అవుతుంది.
సబ్జెక్టును ఎక్కువ సార్లు పునశ్చరణ చేయాలి. ఎందుకంటే ఎకానమీలో తికమక పెట్టే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. అంతేగాకుండా సమకాలీన అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. దాదాపు 20 శాతం నుంచి 30 శాతం సమకాలీన ఆర్థిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాలంటే కచ్చితంగా అనేక సార్లు రివిజన్ చేయాలి.
స్టాటిక్ ఎకానమీ నుంచి ప్రశ్నలు వస్తే చేయగలుగుతారు. ఇటీవల ప్రశ్నలు చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా, సివిల్స్ పరీక్ష లాగా అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాలంటే సొంత నోట్స్ ఉండాలి. సబ్జెక్టును బాగా ఆకళింపు చేసుకొని, అనేకసార్లు పునశ్చరణ చేయాలి.
కరెంట్ ఎకానమీ సమస్య
ఎకానమీలో స్టాటిక్ ప్రశ్నలు, కరెంట్ ఎకానమీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇటీవల పోటీ పరీక్షల్లో సమకాలీన ఆర్థిక అంశాలపై అధికంగా ప్రశ్నలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని సన్నద్ధం కావాలి. దీనికోసం ప్రధానంగా వార్తాపత్రికలను క్షుణ్ణంగా చదవాలి.
ప్రతి వార్తా పత్రిక మూడు పేజీల వరకు ఆర్థికాంశాలకు కేటాయిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా గమనించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే కరెంట్ ఎకానమీకి సంబంధించి 30 శాతం వరకు ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ వార్తాపత్రికల నుంచి నేరుగా వస్తున్నాయి.
జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయిల్లో వచ్చే ఆర్థికాంశాలను చదవాలి. ప్రతి రోజూ రెండు గంటల సమయాన్ని న్యూస్‌పేపర్ చదవడానికి కేటాయించాలి. వార్తాపత్రికల్లోని ఎడిటోరియల్ వ్యాసాలను క్రమం తప్పకుండా చదివి, అర్థం చేసుకొని, వాటిని నోట్స్ చేసుకోవాలి.
ఆర్థిక విషయాల గురించి తోటి విద్యార్థులు లేదా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను కలిసి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. గ్రూప్డిస్కషన్స్ పెట్టుకోవాలి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటు మంచి పుస్తకాలు ఎంపిక చేసుకొని ఒకటికి పదిసార్లు చదవాలి. అంటే ఒక్క పుస్తకాన్ని పదిసార్లు చదవాలి. అప్పుడే సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన వస్తుంది. జాతీయ, రాష్ట్ర, ఆర్థిక సర్వీసులు, బడ్జెట్ నివేదికలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే కరెంట్ ఎకానమీపై పట్టు సాధించవచ్చు.
సమగ్ర ఆర్థిక విశ్లేషణ
ఎకానమీ అంటే గణాంకాలు మాత్రమే కాదు ఒక సమగ్ర ఆర్థిక విశ్లేషణ. క్రమ పద్ధతిలో ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలను అధ్యయనం చేసి వీలైతే ఆర్థిక వ్యవస్థను క్షుణ్ణంగా విశ్లేషించవచ్చు. కాబట్టి గణాంకాలను ఒక మోతాదులోనే గుర్తించుకోవాలి. ఎకానమీలో పైన తెలిపిన నియమ నిబంధనలు పాటించాలి. సబ్జెక్ట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అధిక మార్కులు పొందవచ్చు.
సుబ్బారావు అమ్మనబోలు
సీనియర్ ఫ్యాకల్టీ ,కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్, 9133237733
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు