భారీ ప్రాజెక్టులే బెటర్!
- పూర్తిస్థాయిలో భద్రత, మౌలిక వసతులు
- ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు
రమ్య – రవి దంపతులు రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సంజీవరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. సొంతిల్లే అయినా, ఆ ప్రాంతమంతా వ్యాపార కేంద్రంగా మారడంతో ప్రశాంతంగాఉండలేకపోతున్నారు. దీంతో రణగొణ ధ్వనులకు దూరంగా శివారు ప్రాంతాల్లోని హౌసింగ్ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. నార్సింగి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 11 ఎకరాల్లో చేపట్టిన భారీ ప్రాజెక్టులో ఓ ఇంటిని కొనేశారు. ఇక్కడ వాకింగ్ ట్రాక్, క్లబ్ హౌస్, మినీ కమ్యూనిటీ హాల్ వంటి సకల సౌకర్యాలతోపాటు దగ్గరే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉండటంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా హాయిగా ఉంటున్నారు. కేవలం రమ్య – రవి దంపతులే కాదు.. అనేకమంది ఇలాగే ఆలోచిస్తున్నారు, ఆచరిస్తున్నారు
పూర్తిస్థాయిలో భద్రత, మౌలిక వసతులు ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు సొంతిల్లు కొనుగోలు చేద్దామనుకునేవారు తమ అభిరుచిని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. ఇన్నాళ్లు కోర్ సిటీలోనే ఒక ఇంటిని కొనుక్కోవాలని అనుకునేవారు. ఇప్పుడు మాత్రం విశాలమైన, ప్రశాంత వాతావరణంలో నివాసముండాలని అనుకుంటున్నారు. సిటీలో సొంతిల్లు ఉన్నవారూ ఇలాగే ఆలోచిస్తున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణమైన ఇల్లు, ఆధునిక హంగులు, కోరుకున్న సౌకర్యాలు, పూర్తి స్థాయిలో భద్రత, ఆహ్లాదకర వాతావరణం కావాలని కోరుకుంటున్నారు. అలాంటివాటి కోసం నగర శివారు ప్రాంతాల్లోని భారీ గేటెడ్ కమ్యూనిటీలవైపు పరుగులు తీస్తున్నారు.
అభిరుచికి అనుగుణంగా..
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, యువ వ్యాపారులు అధునాతన ఇండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచికి తగ్గట్లే అనేక సంస్థలు నగర శివారు ప్రాంతాల్లో మూడు నుంచి 15 ఎకరాల స్థలంలో భారీ హౌసింగ్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. 10 నుంచి 20 ఫ్లాట్లతో కూడిన అపార్టుమెంట్ల కన్నా, ఒకేచోట రెండు నుంచి నాలుగు బ్లాకుల్లో ఉండే అపార్టుమెంట్ ప్రాజెక్టులు, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ భవనాలతో భారీ హౌసింగ్ ప్రాజెక్టులను రూపొందిస్తున్నాయి. నగరానికి దూరమైనా అన్ని రకాల మౌలిక వసతులూ అందుబాటులో ఉంచుతున్నాయి. పూర్తిస్థాయిలో భద్రత సౌకర్యాలూ కల్పిస్తున్నాయి. సూపర్మార్కెట్లు, హోటళ్లు వంటి అన్ని వసతులూ ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా శివారుల్లోని ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతున్నది. తమ ఆర్థిక స్థోమతనుబట్టి ఆయా ప్రాజెక్టుల్లో నివాసాలను కొనుగోలు చేసేవారి సంఖ్యా పెరుగుతున్నది. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత ‘రియల్ ఎస్టేట్ ట్రెండ్’ అంతా ఇలాంటి భారీ ప్రాజెక్టుల చుట్టూనే తిరుగుతున్నదనే అభిప్రాయం బిల్డర్లలో వ్యక్తమవుతున్నది.
మెరుగైన రవాణా
గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో అన్ని మౌలిక వసతులూ ఉంటాయి. దీనికితోడు ఔటర్ రింగురోడ్డు సమీపంలోనే ఎక్కువ స్థాయిలో నిర్మాణాలు చేపడుతుండగా, అద్భుతమైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంటున్నది. నగరంలోకి రావాలన్నా.. జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లాలన్నా, ముఖ్యంగా ఐటీ కారిడార్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాలకు చేరుకోవాలన్నా ఓఆర్ఆర్ ఎంతో అనుకూలంగా ఉంది. దీంతో రోడ్డుమార్గం మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో భారీ హౌసింగ్ ప్రాజెక్టులను చేపడుతుండగా కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నది. మున్సిపాలిటీలతోపాటు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్‌ను అనుసరించి రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో దూరమైనప్పటికీ కోర్ సిటీలో ఎక్కడికైనా త్వరగానే చేరుకునేలా రవాణా వ్యవస్థ ఉన్నది. దీనివల్లే చాలామంది శివారు ప్రాంతాల్లో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నారు.
మూడు దిక్కులా..
హైదరాబాద్ నగర నలుమూలలా భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, ఐటీ కారిడార్ ఉన్న పడమర దిక్కునే ఎక్కువ స్థాయిలో గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఆ తర్వాత ఉత్తర దిక్కు, దక్షిణాన శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం హైవే, సాగర్ హైవే వంటి ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో విల్లా ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. 300 గజాల నుంచి 500 గజాల స్థలంలో వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ తర్వాత ఉన్న గోపన్‌పల్లి, తెల్లాపూర్, నలగండ్ల, కొల్లూరు, పటాన్చెరువు ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఎగువ మధ్య తరగతివర్గాలవారు తమ బడ్జెట్లో వచ్చే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల కోసం మేడ్చల్, కీసర, ఘట్కేసర్ వైపు చూస్తున్నారు. మొత్తంగా శివారు ప్రాంతాల్లో విశాలమైన స్థలంలో సొంతింటి కలను నిజం చేసుకోవడానికే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అందుకే, భారీ హౌసింగ్ ప్రాజెక్టులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలో కాకుండా ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఎక్కువగా రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రాధాన్యం పెరిగింది!
కరోనా తర్వాత మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరిగింది. అనేకమంది పూర్తిస్థాయి సెక్యూరిటీతోనే నివాసముండాలని అనుకుంటున్నారు. వీటిలో హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా చాలా ఎక్కువ ఖాళీస్థలం ఉంటుంది. అదే విధంగా అన్ని రకాల మౌలిక వసతులనూ బిల్డర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గృహప్రవేశం చేసేనాటికే సకల వసతులూ అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని వ్యక్తిగత గృహాలు, అపార్టుమెంట్లలో కేవలం నిర్మించి విక్రయించడం వరకే బిల్డర్లు చూసుకుంటారు. వాటి ముందు రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్, పుట్‌పాత్‌ల నిర్వహణ స్థానిక పంచాయతీలే చూడాలి. కొన్ని ప్రాంతాల్లో ఇది ఇబ్బందికరంగా పరిణమిస్తున్నది. అదే ప్రాంతంలోని గేటెడ్ కమ్యూనిటీలు, భారీ హౌసింగ్ ప్రాజెక్టుల్లోనైతే బిల్డర్లే పూర్తి స్థాయి మౌలిక వసతులూ కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు ఉన్నతమైన జీవనశైలిని పొందేలా ప్రముఖ ఆర్కిటెక్టులతో ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు.
గోపాల కృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్,
హాల్‌మార్క్ ఇన్ఫ్రాకాన్ బరిగెల శేఖర్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు