సివిల్స్ తెలుగు తేజాలు
సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్.. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్ష. 2020 పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. దీనిలో విజేతలు దేశంలోని అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ తదితర 24 రకాల సర్వీసులకు ఎంపికవుతారు. కొత్త కెరీర్లు ఎన్ని వస్తున్నా క్రేజీ తగ్గని పరీక్ష ఇది. డాక్టర్లు, సీఏలు, లా, ఇంజినీర్లు, ఆర్ట్స్, సైన్స్ ఇలా దాదాపు అన్ని రంగాలకు చెందినవారు దీనికోసం ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుంచి కలగా కొందరు, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగిన ఘటనతోనో మరికొందరు, చేస్తున్న కొలువులో సంతృప్తి లేక మరింతగా సమాజ సేవ చేయాలనో సివిల్స్ రాస్తారు చాలామంది. సివిల్స్‌లో రాణించడానికి కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్తోమత అవసరం లేదు. అంతేకాదు ఏ సబ్జెక్టు అనేది కూడా సమస్యే కాదు. గతంలో అనేకమంది ఈ విషయాలను నిరూపించారు. మరోసారి 2020 సివిల్స్ తుది ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైంది. ఎంబీబీఎస్ చేసి మొదటి ప్రయత్నంలో తెలుగు రాష్ర్టాల్లో టాప్ ర్యాంక్ సాధించిన శ్రీజ, బీటెక్ చేసి మొదటి ప్రయత్నంలో 83వ ర్యాంకు సాధించిన మేఘన మరోవైపు. తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు సుమారు 30కి పైగా సర్వీసులు పొందే ర్యాంకులు సాధించారు. భవిష్యత్తులో సివిల్స్ రాసేవారికి విజేతల అనుభవాలు పాఠాలుగా ఉపయోగపడుతాయి. సివిల్స్ విజేతల వ్యూహాలు, చదివిన పుస్తకాలు, ఇంటర్వ్యూ విశేషాలు నమస్తేతో పంచుకున్న విషయాలు నిపుణ పాఠకుల కోసం
సరదాగా చదువుతూ సాధించా
సివిల్స్ 20వ ర్యాంకర్
శ్రీజ
ఇష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా మొదటి ప్రయత్నంలోనే సాధించవచ్చని సివిల్స్‌లో 20వ ర్యాంకు పొంది నిరూపించింది శ్రీజ. తెలుగురాష్ర్టాల్లో ఉత్తమ ర్యాంకు సాధించడానికి ఆమె గమనాలను నమస్తే తెలంగాణకు పంచుకున్నారు.
కుటుంబ నేపథ్యం
వరంగల్‌కు చెందిన తండ్రి శ్రీనివాస్ హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌లోని మహరాజ ఎన్క్లేవ్ కాలనీలో స్థిరపడ్డారు. హబ్సిగూడలోని హోండాషోరూంలో సీనియర్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి లత జనగాం జిల్లా రఘునాథ్పల్లిలో నర్సుగా పనిచేస్తున్నారు. తమ్ముడు సాయిరాం. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తిచేసింది.
మొదటిప్రయత్నంలోనే
సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో, నాన్న ప్రోత్సాహంతో సివిల్ సర్వీస్వైపు దృష్టిసారించాను. ఉస్మానియా మెడికల్ కళాశాలో ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు సేవ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అమ్మ నర్స్ కాబట్టి హెల్త్ సెక్టార్లో సేవలపై అవగాహన కలిగింది. కోచింగ్ తీసుకుని ఎంతో ఇష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు సాధించాను. మెడికల్ సైన్స్ ఆప్షనల్స్ తీసుకొన్నాను. మెయిన్స్ వస్తుందనే నమ్మకంతోనే ప్రిలిమ్స్ రాశాను. రెండింటికి కలిపి నోట్స్ రాసుకున్నాను. సరదాగా, ఇష్టంగా చదివాను.
టైం లిమిట్ పెట్టుకోలేదు
చదువుతున్నప్పుడు ప్రతి విషయంపై ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి. ఆలోచించి ప్రతి విషయాన్ని చర్చించేదాన్ని, టైం లిమిట్ ఏం పెట్టుకోలేదు. ఆన్లైన్ రిసోర్స్‌ను సద్వినియోగం చేసుకున్నాను. ఆడపిల్లలకు ఉద్యోగం, విద్య చాలా అవసరం. ఏదైనా సాధించవచ్చనే నమ్మకాన్ని కల్పించాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిలబస్‌ను డివైడ్ చేసుకొని ప్రణాళికతో ప్రిపేర్ కావాలి. ప్రీవియస్ పేపర్స్‌ను సమగ్రంగా అర్థం చేసుకొని ఎలా ఎంతవరకు చదవాలని ఐడియా తెచ్చుకొని చదవాలి. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ బాగా రాసుకోవాలి. విజయం సాధించాలంటే ఫ్యామిలీ సపోర్ట్, మంచి స్నేహితులు, గైడెన్స్ అవసరం. గతంలో సివిల్స్ రాసిన సీనియర్ల సలహాలు, సపోర్ట్‌తోపాటు, మన తప్పులు నిర్మొహమాటంగా చెప్పేవారు ఉండాలి. మొదటి ప్రయత్నంలో రాకపోవచ్చు, అయినప్పటికీ నిరాశపడకుండా, తప్పులను తెలుసుకోవాలి. తప్పుల నుంచి నేర్చుకోకపోవడంతో విలువైన సమయం వృథా అవుతుంది. పరీక్షల ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తూ చదవాలి. మహిళా సాధికారికత, హెల్త్, ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక దృషిసారించడమే నా భవిష్యత్ లక్ష్యం.
ఇంటర్వ్యూ
అనంత్ గారి బోర్డు ఇంటర్వ్యూ చేశారు. ఎక్కువగా మెడికల్ సైన్స్‌పైనే ప్రశ్నలు అడిగారు. మెడిసిన్ చదవడం, అమ్మ హెల్త్ విభాగంలో పనిచేస్తుండటంతో వాటిపైనే ఎక్కువగా ప్రశ్నించారు. మనం తీసుకునే విధానంపైనే ఒత్తిడి ఆధారపడి ఉంటుంది.
పల్లా మహేందర్‌రెడ్డి, ఉప్పల్
ప్రజల జీవితంలో మార్పు తీసుకువస్తాను…
355వ ర్యాంకర్
సౌమిత్ రాజ్ కంచనపల్లి
కుటుంబం, విద్యాభ్యాసం
మాది హన్మకొండ జిల్లా, బాలసముద్రం. నాన్న భరత్ బాబు, అమ్మ ప్రవీణజ్యోతి బొటిక్ రన్ చేస్తుంది. చెల్లి టీసీఎస్ జాబ్. స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్‌లో సాగింది. ఇంటర్, ఇంజినీరింగ్ (ఐఐటీ హైదరాబాద్) హైదరాబాద్‌లో చదివాను.
ప్రైవేట్ జాబ్ చేస్తూ…
సివిల్స్ వైపు రావడానికి స్నేహితుడు సాయితేజ కారణం. బీటెక్ పూర్తయ్యాక ఫ్లిప్‌కార్ట్‌లో రెండు సంవత్సరాలు జాబ్ చేశాను. ఆ సమయంలో సాయితేజ సివిల్స్ ర్యాంకు సాధించాడు. అతడిని ఆదర్శంగా తీసుకుని.. నేను కూడా సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను.
రెండో ప్రయత్నం
రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే ప్రిపేరయ్యాను. ఎక్కువగా ఇంటర్నెట్ ఆన్లైన్ టెస్టులు, మాక్‌టెస్టులు అటెంప్ట్ చేశాను. ఇంటర్వ్యూ కోసం రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సార్ వాట్సప్ గ్రూప్ నుంచి చాలా నేర్చుకున్నాను.
ప్రిలిమ్స్, మెయిన్స్
ఆప్షనల్ సబ్జెక్ట్ పొలిటికల్‌సైన్స్ తీసుకున్నాను. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్‌కు వీలైనన్ని ఎక్కువ మాక్‌టెస్టులు రాస్తే చాలామంచిది. స్నేహితులతో సబ్జెక్ట్స్ పై చర్చించుకోవడం కూడా కలిసివచ్చింది. నోట్స్ రాసుకొని.. ఎక్కువసార్లు రివైజ్ చేసుకోవాలి.
స్మార్ట్ వర్క్, సలహాలు, ఆత్మవిశ్వాసం, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలదొక్కుకుని ర్యాంకు సాధించాలని పట్టుదలతో ప్రయత్నించాను.
ఇంటర్వ్యూ
ఎయిర్ మార్షల్ అజిత్ బోస్లే సార్ బోర్డ్ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగం, వరంగల్ రామప్ప టెంపుల్, కొవిడ్ సెకండ్ వేవ్, క్వాంటమ్ కంప్యూటింగ్, గాంధీజీ, మార్క్స్ తత్వాల గురించి అడిగారు.
భవిష్యత్ లక్ష్యాలు, సలహాలు
విద్య, ఆరోగ్య రంగాల్లో తగినంత అభివృద్ధిని తీసుకురావాలి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా కృషిచేస్తాను. ఇంటర్నెట్ను సరైన పద్ధతిలో ఉపయోగించుకుని స్మార్ట్‌వర్క్ చేస్తే సివిల్స్ సాధించవచ్చు. చాలామందితో ఎలా చదవాలనే సలహాలు, సూచనలు తీసుకొని తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని చదవాలి. –
సూదగాని సత్యం గౌడ్
అమ్మానాన్నల ప్రోత్సాహంతో
83వ ర్యాంకర్
మేఘన
ఇష్టపడి, కష్టపడి చదివితే సివిల్స్ సాధించవచ్చని నిరూపించింది. మేఘన. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఐఐఎంలో పీజీ చేసి మార్కెంటింగ్ మేనేజర్‌గా జాబ్ చేసినా సివిల్స్ వైపు దృష్టిసారించి మొదటి ప్రయత్నంలోనే 83వ ర్యాంకు సాధించింది. ఆమె విజయ ప్రస్థానం ఆమె మాటల్లో..
కుటుంబం, చదువు
మాది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామం. నాన్న కావలి రాములు, సుజాత. విద్యాభ్యాసం హైదరాబాద్ మదీనగూడలోని ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. కూకట్‌పల్లిలోని కళాశాలలో ఇంటర్, ఎన్ఐటీ వరంగల్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (బీటెక్), ఐఐఎం లక్నోలో పీజీ చేసి, ఐటీసీ లిమిటెడ్ బెంగళూర్‌లో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం చేశాను. తర్వాత జాబ్‌కు రిజైన్ చేసి ఢిల్లీలో 9 నెలలు కోచింగ్ తీసుకున్నాను. కరోనా వల్ల హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే 83వ ర్యాంకు సాధించాను.
సంపూర్ణ సేవ
సివిల్స్ ద్వారా సంపూర్ణమైన సేవ చేసే అవకాశం ఉంటుందని ఇటువైపు వచ్చాను. సమాజంలో మంచి మార్పు తీసుకు రావాలనే నమ్మకంతో సివిల్స్ ఎంచుకున్నాను. దేశంలో ప్రాథమిక విద్య బాగుంది. ఉన్నత విద్యకు సరైన సౌకర్యాలు, వసతులు లేకపోవడంతో చాలామంది చదవలేకపోతున్నారు. పేద, ధనిక అనే భేదాలు లేకుండా ప్రతి వ్యక్తికి సంపూర్ణమైన విద్యను అందించేందుకు కృషిచేస్తాను.
ఇంటర్వ్యూ
సత్యవతి మేడం బోర్డు ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణపై ప్రశ్నలు, మంచినీళ్ల సమస్యలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఆప్షనల్ సబెక్టు సోషియాలజీ. ప్రభుత్వ పథకాలు, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ, జీకే సామాజిక శాస్ర్తాలు, ప్రధానంగా తెలంగాణ చరిత్ర, పథకాలు బాగా చదవడంతో ఈజీగా సమాధానాలు చెప్పాను.
సలహా..
క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో ముందుకెళితే ఎంతటి కష్టాన్ని అయిన సునాయాసంగా సాధించవచ్చు.
- పెరుమాళ్ల వెంకటరెడ్డి, తాండూరు ఆర్సీ ఇన్చార్జి
ప్రజలతో మమేకమయ్యేది సివిల్స్‌తోనే
681వ ర్యాంకర్
పులిచర్ల రమణయ్య
కుటుంబం, విద్యాభ్యాసం
మాది కడప. నాన్న కలెక్టరేట్ ఆఫీస్‌లో కాంట్రాక్ట్ ఆఫీస్ బాయ్. అమ్మ గృహిణి. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్, ఇంజినీరింగ్ కడపలో సాగింది.
సొంతంగా నిర్ణయించుకున్నాను..
నాన్న కలెక్టర్ ఆఫీసులో పనిచేయడం వల్ల ఆ ప్రభావంతో కలెక్టర్ కావాలని నిర్ణయించుకొన్నాను. ఇంకా కుటుంబ పరిస్థితులు, పుట్టిన ప్రాంతం, ప్రజాసేవ చేయడానికి సివిల్స్ సరైన వేదిక అని భావించి ఇటు వైపు వచ్చాను.
ఎలాంటి కోచింగ్ లేకుండానే…
ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే ప్రిపేరయ్యాను. 3వ ప్రయత్నంలో సాధించాను. రెండుసార్లు కూడా ఉద్యోగం చేస్తూ ప్రయత్నించాను. రెండు ప్రయత్నాల తర్వాత ఉద్యోగం మానేసి మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించాను.
ఆప్షనల్
ప్రతిఒక్క పేపర్‌కు నోట్ తయారు చేసుకున్నాను. ఒక సంవత్సరం పాటు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకొన్నాను. సిలబస్ అంతా గుర్తుంచుకొని అన్నింటికి నోట్స్ ప్రిపేర్ చేశాను. మాక్‌టెస్ట్‌లు బాగా అటెంప్ట్ చేశాను. ప్రణాళిక ప్రకారం చదివాను. నా ఈ విజయంలో తమ్ముడు చిన్నబాబు, స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహకారం, ప్రోత్సాహం ఇచ్చారు.
ఇంటర్వ్యూ
సత్యవతి మేడమ్ బోర్డు ఇంటర్వ్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ర్టాలు ఏపీ నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అడిగారు. అలాగే పంటల గురించి అడిగారు. మహిళా శాతం, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రశ్నలు అడిగారు.
భవిష్యత్ లక్ష్యాలు, సలహాలు
ఐఏఎస్ కావాలన్నది నా కల. మా ఊరికి, ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. ఒక సంవత్సరం పాటు సరైన ప్రణాళికతో చదివితే సివిల్స్ సాధించడం సులువు. సిలబస్‌ను చదివి సరైన ప్లానింగ్‌తో అనుకున్నది సాధించవచ్చు.
-సూదగాని సత్యం గౌడ్
ప్రజా సేవ చేయాలని
413వ ర్యాంకర్
వర్షిత అడెపు
కుటుంబం, విద్యాభ్యాసం
మాది హన్మకొండ సిటీ. నాన్న రాజకట్టమల్లు హోటల్ బిజినెస్. అమ్మ రాధారాణి టైలర్ షాప్ నిర్వహిస్తుంది. అక్క మానస డాక్టర్. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా వరంగల్‌లోనే సాగింది.
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు వచ్చాను. చిన్నప్పటి నుంచే సేవాధృక్పథం ఉండాలని అమ్మానాన్నలు చెప్పేవారు. అందుకే ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రజలకు సేవ చేసేందుకు సివిల్స్ సర్వీస్ ఉత్తమమైనదని భావించాను. దీనికి తోడు అమ్మానాన్నలు నన్ను ఐఏఎస్‌గా చూడాలని చెప్పేవారు.
మూడో ప్రయత్నంలో..
మూడో ప్రయత్నంలో సాధించాను. రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ అర మార్క్‌తో తప్పిపోయింది. మళ్లీ ప్రణాళికాబద్ధంగా చదివాను. ఇందుకు కోచింగ్ తీసుకున్నాను. ఢిల్లీలోని ఓ ఇన్స్టిట్యూట్లో పది నెలలు కోచింగ్ తీసుకున్నాను. తరువాత వారిచ్చిన గైడెన్స్‌తో సొంతంగా ప్రిపరేషన్ సాగించాను.
ప్రిలిమ్స్, మెయిన్స్
మొదటి, రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాను. అందుకే మూడో ప్రయత్నంలో సాధించాను. ఎక్కువగా సొంతంగా నోట్స్ తయారుచేసుకుని చదివాను. టెస్ట్ సిరీస్ ఎక్కువగా అటెంప్ట్ చేశాను. మెయిన్స్‌కు వచ్చేసి న్యూస్ పేపర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ నోట్స్ తయారుచేసుకున్నాను. మాక్‌టెస్ట్‌లు ఎక్కువ రాశాను. అందువల్లనే ఫైనల్ ఎగ్జామ్‌లో అన్ని ప్రశ్నలను ఇచ్చిన సమయంలోనే రాయగలిగాను. పక్కా ప్రణాళికతో రోజుకు 8-10 గంటలు చదివాను. ఆప్షనల్స్‌గా పొలిటికల్ సైన్స్, అంతర్జాతీయ సంబంధాలు పాఠ్యాంశాలుగా తీసుకున్నాను.
ఇంటర్వ్యూ..
ఆర్ఎన్ చౌబే బోర్డ్ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్, క్రిప్టో కరెన్సీ, వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ, కుర్దిస్థాన్ ఇష్యూ, నాన్ పర్ఫామింగ్ అసెట్స్, విద్యారంగం, వరంగల్ రూరల్ సమస్యలపై ప్రశ్నలు అడిగారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచాను.
భవిష్యత్ లక్ష్యాలు, సలహాలు
తల్లిదండ్రులు, అక్కబావలు, స్నేహితుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించాను. వారి సహాయ సహకారం ఎంతో తోడ్పడింది. రెండు ప్రయత్నాల్లో ఓటమి చెందినా వారు ఎంతో ప్రోత్సహించారు. సరైన ప్రణాళిక, సెల్ఫ్ నోట్స్, టైంటేబుల్, కష్టపడి చదవడం నా విజయానికి దోహదపడ్డాయి.
ప్రస్తుత ర్యాంకుతో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నా. నా డ్రీమ్ ఐఏఎస్ కాబట్టి ఐపీఎస్ సర్వీస్ చేస్తూనే మళ్లీ ప్రిపేరవుతాను. కచ్చితంగా ఐఏఎస్ సాధిస్తాను. ఐఏఎస్/ఐపీఎస్‌గా నేను మహిళాసాధికారత, ఉమెన్ ఇన్ ఎకానమీ, విద్యారంగంలో ప్రజలకు సేవలందిస్తాను.
ఓటమి చెందినా కూడా నిరాశపడకూడదు. ఒక్కసారి కాకపోయినా మరోసారి తప్పక విజయం సాధించవచ్చు. ఎక్కువగా మాక్‌టెస్ట్‌లు రాస్తే ఫైనల్ ఎగ్జామ్స్‌లో మంచి స్కోర్ చేయవచ్చు.
సూదగాని సత్యం గౌడ్,
కలెక్టర్లను చూసి కలెక్టర్ అవ్వాలనుకున్నా
పాఠశాలలో నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మోటివేషనల్ స్పీచ్‌కు అతడు ఇన్స్పైర్ అయ్యాడు. అప్పుడే తాను కూడా కలెక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యసాధన దిశలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అనుకున్నది తొలి ప్రయత్నంలోనే సాధించాడు పృథ్వీనాథ్ గౌడ్.
సివిల్స్ ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే..
541వ ర్యాంకర్
పృథ్వీనాథ్ గౌడ్
ప్రణాళికాబద్ధంగా..
ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే సివిల్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు వస్తాయని సీనియర్లను అడిగాను. సక్సెస్ అయిన వాళ్లతో, ఫెయిల్యూర్ అయినవాళ్లతోనూ మాట్లాడాను. 6 నుంచి 10 వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, రెగ్యులర్‌గా ఇంగ్లిష్ పేపర్‌ను ఫాలో అయ్యాను. బెంగళూరులో ప్రిలిమ్స్ కోసం కోచింగ్ తీసుకున్నాను. కరోనా వల్ల ప్రిలిమ్స్ ఆలస్యం అవడం కూడా కలిసి వచ్చింది. డైలీ, వీక్లీ, మంత్లీ టార్గెట్ పెట్టుకొని చదివాను. సివిల్స్ గురించి వాట్సప్ గ్రూప్స్‌లో సాధ్యమైనంత మేరకు డిసషన్స్ ఉపయోగపడ్డాయి.
సమయం వృథాచేయకుండా..
మెయిన్స్‌కు రెండు నెలల సమయం ఉంది. ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకున్న. హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న. సమయం వృథా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం చదివాను. నాకంటే తెలివైనవాళ్లు, ఎకువసేపు కష్టపడేవాళ్లు కూడా మెయిన్స్‌లో వైఫల్యం చెందారని తెలుసుకున్నాను. వాళ్లు చేసిన లోపాలేంటో, వాటిని ఎలా అధిగమించాలో వారినే అడిగాను. అలా వాటిని అధిగమిస్తూ కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను.
ఇంటర్వ్యూ
స్మితా నాగరాజు బోర్డు ఇంటర్వ్యూ చేశారు. ఇదివరకే ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూలు చేయడం చాలా కలిసి వచ్చింది. ఆంత్రోపాలజీ ఆప్షన్ ఎందుకు తీసుకున్నావ్, బాల్య వివాహాలపై నీ అభిప్రాయం ఏంటి, గోలొండ కోట గురించి అడిగారు.
అధికారికంగా సేవ చేయాలని..
మెరుగైన విద్య, వైద్యం అందించడమే ధ్యేయంగా పనిచేస్తాను. డాక్టర్‌గా కొంతమందికి మాత్రమే సేవ చేయగలిగాను. అదే సివిల్స్ అధికారి అయితే అధికారిగా అనేకమందికి సేవ చేసే అవకాశం ఉంటుందని సివిల్స్ సాధించాను. ఇందుకు అమ్మానాన్న గుండ్రాతి శ్రీనివాస్ గౌడ్, వనజ, బాబాయ్ మధు గౌడ్ సహకరించారు. వనపర్తికి కలెక్టర్‌గా పనిచేసిన శ్వేతా మహంతి కూడా సివిల్స్ ఎలా ప్రిపేర్ కావాలో వివరించారు.
సలహా
సివిల్స్ కోసం ఎలా సిద్ధం అవ్వాలో అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. అలాంటివారు తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవాలి. దీనివల్ల ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎంత చదవాలో అనే అవగాహన వస్తుంది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వాట్సాప్ గ్రూప్ కూడా ఇంటర్వ్యూకు ఉపయోగపడింది. సివిల్స్‌కు ప్రిపేరయ్యే వాళ్లు సీనియర్ల అనుభవాన్ని తెలుసుకోవాలి.
- పెద్ది విజయ భాసర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి
ఇష్టపడితేనే విజయం
560వ ర్యాంకర్
దివ్య
వివాహం అయ్యింది, కూతురు పుట్టింది. అయినా వంటింటికే పరిమితం కాకుండా ఏదైనా సాధించాలన్న లక్ష్యంతో కష్టపడి చదివింది. ఫలితంగా సివిల్స్‌లో ర్యాంక్ 560వ ర్యాంకు సాధించింది దివ్య. తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
కుటుంబం, చదువు
తండ్రి జాన్ (వ్యాపారి), తల్లి నిరంజని (రిటైర్డ్ హెడ్మాస్టర్). భర్త శామ్ (పాస్టర్). 2008లో ఇంటర్ చదువుతున్నప్పుడే పెళ్లయ్యింది. భర్త శామ్ సహకారంతో మహబూబ్‌నగర్‌లో ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీలో డిగ్రీ, పాలమూరు యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేశాను. తరువాత సివిల్స్ కోసమని తొలిసారిగా పాలమూరు దాటి హైదరాబాద్ వచ్చాను. ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నాను. రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ పాస్ కాలేకపోయాను. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు ఇక చాల్లే అని అన్నారు. వారి మాటలతో ఎలాగైనా సివిల్స్ సాధించాలన్న పట్టుదల మరింత పెరిగి కష్టపడి చదివాను. ఐదేండ్ల పాప ఎరిన్‌ను తల్లి నిరంజని వద్ద ఉంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదివాను. ఈసారి కోచింగ్ లేకుండానే చదివాను. ఓ కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టి వారానికి ఒకటి చొప్పున మూడు పేపర్లు రాసినా రివ్యూ ఇవ్వలేదు. దీని వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. దీనివల్ల మెయిన్స్ వద్దనుకునే పరిస్థితి వచ్చింది. కానీ మెయిన్స్ రాసే అవకాశం కొందరికే వస్తుంది కదా అని ధైర్యం చేసి చదివి పరీక్ష రాశాను. కష్టానికి ఫలితం దక్కింది.
ఆంత్రోపాలజీ ఆప్షనల్
ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకున్నాను. పుస్తకాలను తక్కువగా ఎంపిక చేసుకొని వాటిని కొని ఇంటివద్దే చదువుకున్నాను. పాలిటీకి లక్ష్మీకాంత్, చరిత్రకు తమిళనాడు బోర్డు పుస్తకాలు, మోడ్రన్ హిస్టరీ కోసం స్ప్రెక్టం బుక్స్, ఎన్విరాన్మెంట్కు శంకర్ ఐఏఎస్, ఎకానమీకి మృనాల్, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్‌కు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివాను.
ఇంటర్వ్యూ
చౌబే సర్ బోర్డు ఇంటర్వ్యూ చేశారు. లవ్ జిహాద్, దిశ కేసులపై ప్రశ్నించారు. హాబీస్‌పై, ఆంత్రోపాలజీపై ప్రశ్నలు అడిగారు. సోషల్ మీడియాలో చూపించినట్లు ఇంటర్వ్యూ బోర్డు కఠినంగా ఏమీ లేదు.
పేదలకు సేవ చేస్తా..
ఎక్కడ పని చేసినా పేద ప్రజలందరికీ సాధ్యమైనంత వరకు సాయం చేస్తా. అధికారిగా మంచి పేరుతెచ్చుకుంటా.
సలహా
సివిల్స్‌లోకి రావాలనుకునేవారు ఫెయిల్యూర్స్ వచ్చినా బాధ పడవద్దు. కష్టపడితే ఏదో ఒకసారి తప్పకుండా సివిల్స్ సాధించవచ్చు. గొప్ప లక్ష్యంతో ముందుకు సాగితే అనుకున్న స్థానానికి చేరుకోవడం కష్టమేమీ కాదు.
పెద్ది విజయ భాస్కర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి
సర్కారు బడి నుంచి సర్కారు అధికారిగా..
652వ ర్యాంకర్
కిరణ్‌కుమార్
అతడు సర్కారు బడిలో చదివాడు. ఎన్నో కష్టాలను అనుభవించాడు. అయినా వాటికి వెరవకుండా తన లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాడు. శ్రమకు ఫలితంగా సివిల్స్-2020లో మంచి ర్యాంక్ సాధించాడు. అతడే సివిల్స్‌లో 652 ర్యాంక్ సాధించిన కోట కిరణ్‌కుమార్. అతడి గురించి తెలుసుకుందాం..
కుటుంబ నేపథ్యం
మా స్వగ్రామం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం సమీపంలోని హరిజనవాడ పంచాయతీ. తండ్రి కృష్ణయ్య, తల్లి వజ్రమ్మ దంపతుల చిన్న కుమారుడిని. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి నూతనంగా ఏర్పడిన భీమవరం హరిజనవాడకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సోదరుడు బాబూరావు పెద్దపల్లి జిల్లా తాళ్లూరు సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
విద్యాభ్యాసం
మండలంలోని హరిజనవాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 4వ తరగతి, దమ్మపేట గురుకుల పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి, హైదరాబాద్‌లోని నాగోల్ గురుకులంలో ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్) పూర్తి చేశాను. హైదరాబాద్‌లో సివిల్స్‌కు శిక్షణ తీసుకొని రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. మూడోసారి 652వ ర్యాంక్ సాధించి సివిల్స్‌కు ఎంపికయ్యాను.
సివిల్స్ వైపు ఆసక్తి చూపడానికి కారణం?
సోదరుడు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్‌వైపు అడుగులేశాను. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు అన్ని విధాలా వారు సహకరించారు. అంతేకాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా సివిల్స్‌వైపు దృష్టిసారించాను.
ఎన్నో ప్రయత్నంలో సాధించారు?
రెండు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుదిరిగాను. అయినా భయపడకుండా కష్టపడి మూడో ప్రయత్నంలో విజయం సాధించాను.
కోచింగ్ తీసుకున్నారా?
సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుని, హైదరాబాద్‌లో శిక్షణ తీసుకొన్నాను. వారి శిక్షణలో ఈ ర్యాంక్ సాధించాను. మెయిన్స్‌కు టెస్ట్ సిరీస్ ఒక్కటే ఆప్షన్ ఉంటుంది. మెయిన్స్ చాలా కష్టమైంది. స్టాండర్డ్, బేసిక్ పాయింట్స్ మెయిన్‌గా ఇంటర్వ్యూలో అడుగుతారు.
విజయాని దోహదపడిన అంశాలు?
రెండుసార్లు ఇంటర్వ్యూలో విజయం సాధించలేకపోయాను. దీంతో మరింత పట్టుదలతో ఎక్కువ సమయం చదివి విజయం సాధించాను.
యువతకు మీరిచ్చే సలహాలు?
స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం వరిస్తుంది. ఒక్కసారి, రెండుసార్లు ఫెయిలయ్యామని బాధపకుండా మరింత పట్టుదలతో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు.
ఇంటర్వ్యూ విశేషాలు?
మేడం సత్యవతి బోర్డు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో నేను చదివిన నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్‌కు అనుసంధానంగా ప్రశ్నలు అడిగారు. విదేశాల నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న వెజిటబుల్, ఆయిల్స్ ఇక్కడ పండించ లేమా? తయారు చేసుకోలేమా? అని అడిగారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అంశంపై ప్రశ్నలు అడిగారు. దేశంలో జనరిక్ డ్రగ్స్‌కు కమర్షియల్ డ్రగ్స్ కన్నా తక్కువ ధరలు ఉన్నా జనాలు వాటిపై ఎందుకు మొగ్గుచూపడం లేదు? అని ప్రశ్నించారు. కలెక్టర్ అయితే స్కిల్స్‌ను ఉపయోగించి ఎలా పరిపాలన సాగిస్తావు? అని అడిగారు.
అధికారిగా ఏం చేస్తావు?
ప్రజలకు దగ్గరగా ఉండి వారికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతా. ప్రజాసమస్యలను గుర్తిస్తూ, వాటిని పరిష్కరించేందుకు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తా.
- ఎరమల శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రుపాలెం రిపోర్టర్
సివిల్ సర్వీసెస్ -2020
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ 2020 ఎగ్జామ్‌కు సుమారు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఫలితాలను సెప్టెంబర్ 24న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. 761 మంది ఈసారి ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ర్యాంకుల ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర గ్రూప్ ఏ, బీ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలను మరో పదిహేను రోజుల్లో విడుదల చేయనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది ఫలితాల్లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్ పూర్తి చేసిన శుభం కుమార్ తొలి ర్యాంకు సాధించాడు. శుభం ఈ ర్యాంకును మూడో ప్రయత్నంలో సాధించాడు. భోపాల్ ఎన్ఐటీలో బీటెక్ చదివిన జాగ్రతి అవస్థి రెండో ర్యాంకు, అంకితా జైన్ మూడో ర్యాంకు సాధించారు.
సివిల్ సర్వీసెస్‌కు అర్హత సాధించిన వారిలో 263 మంది జనరల్, 86 మంది ఈడబ్ల్యూఎస్, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 61 మంది ఎస్టీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. మరో 150 మంది రిజర్వ్ లిస్ట్‌లో ఉన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సివిల్స్‌లో ర్యాంకులు సాధిస్తున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. మొదటి వంద ర్యాంకుల్లో ప్రతి ఏడాది తెలంగాణ వారు మంచి ర్యాంకులు సాధిస్తుండటం హర్షించదగ్గ విషయం.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు