అఫ్గాన్‌లో అంతర్యుద్ధం
- (జనరల్ ఎస్సే గ్రూప్ – 1, సివిల్స్)
ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం అఫ్గానిస్థాన్ వైపే చూస్తున్నాయి. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అఫ్గాన్‌లో అలజడులు చెలరేగడం మొన్నటి వరకు సాధారణ పరిణామం. కానీ ఈసారి జరుగుతున్నది అలజడి కాదు, మరోసారి మొదలైన అంతర్యుద్ధం. అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబన్లు మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అఫ్గాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, దాని ప్రభావం తెలుసుకోవాలంటే అసలు అఫ్గాన్ గత చరిత్ర, తాలిబన్ల నేపథ్యం తెలుసుకోవాలి.
ఆధునిక ప్రపంచంలోనూ అంటే 1973 వరకు కూడా అఫ్గానిస్థాన్‌లో రాచరికం నడిచింది. 1823 నుంచి 1973 వరకు బరాక్ జాహి అనే రాజవంశం పాలించింది. ఈ వంశం చివరి రాజు జహీర్ షా. అతను రాజుగా ఉన్నప్పుడు రాచరిక కుటుంబానికి సమీప బంధువైన దావూద్ ఖాన్ ప్రధానిగా వ్యవహరించారు. అఫ్గాన్ పాలనలో దావూద్ ఖాన్ అనేక రాజకీయ సంస్కరణలు తీసుకువచ్చారు. ఇతను పష్టూన్ తెగకు చెందినవారు. ఈ తెగకు చెందిన కొన్ని ప్రాంతాలు సరిహద్దు దేశమైన పాకిస్థాన్‌లో ఉండేవి. దాంతో పాకిస్థాన్‌లోని పష్టూన్ తెగ ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించాలని దావూద్ ఖాన్ ప్రయత్నించాడు. ఈ ఆక్రమణ వ్యవహారం కారణంగానే అఫ్గాన్- పాకిస్థాన్ మధ్య వైరం తలెత్తింది. అయితే దావూద్ ఖాన్ వక్రబుద్ధిని గుర్తించిన రాజవంశం ఆయనని పదవి నుంచి తొలగించింది. (అదును కోసం ఎదురుచూస్తున్న దావూద్ ఖాన్ అఫ్గానిస్థాన్ రాజు జహీర్ షా ఇటలీ పర్యటనలో ఉన్నప్పుడు) తన వ్యూహం అమలు పరచాడు. డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ అఫ్గానిస్థాన్, మిలిటరీలోని కొంతమంది అనుకూల అధికారుల సహాయంతో జహీర్ షాను పదవి నుంచి తొలగించి తాను అధికారం చేపట్టాడు. తనకు సహాయం అందించిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ అఫ్గానిస్థాన్‌ని అణగదొక్కడం ప్రారంభించాడు.
అఫ్గాన్ వ్యవహారాల్లోకి సోవియట్ యూనియన్, అమెరికా
దావూద్ ఖాన్ కుట్రని పసిగట్టిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ అఫ్గానిస్థాన్ (పీడీపీఏ) నేతలు సోవియట్ యూనియన్ సహకారంతో 1978లో రాజు దావూద్ ఖాన్ని, అతని కుటుంబాన్ని అంతం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పీడీపీఏకి చెందిన నూర్ మహ్మద్ తరాఖీ అఫ్గాన్ అధ్యక్ష పదవి సొంతం చేసుకున్నారు. ఈ తరాఖీకి సొంత పార్టీకి చెందిన హఫీజుల్లా అమీన్ నేతతో వైరం చోటుచేసుకుంది. తర్వాత తరాఖీని గద్దెదించి హఫీజుల్లా అమీన్ అధ్యక్ష పదవి దక్కించుకున్నాడు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ హఫీజుల్లా అమీన్ ప్రభుత్వాన్ని పడగొట్టి తన మద్దతుదారుడైన బాబ్రక్ ఫర్మాన్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చింది. ఈ చర్య నచ్చని ముజాయిద్దీన్ వర్గం సోవియట్ యూనియన్‌తో విభేదించింది. మరోవైపు ముజాయిద్దీన్ గ్రూప్‌నకు అమెరికా, పాకిస్థాన్ మద్దతుగా నిలిచాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వా త అక్కడ అమెరికా ప్రాబల్యం పెరిగింది.
తాలిబన్లు ఎవరు, ఎలా ఎదిగారు?
పాకిస్థాన్‌లోని చిన్న చిన్న తెగలకు సంబంధించిన మదర్సాల్లో ఇస్లామిక్ విద్యని ప్రోత్సహించే ఉద్దేశంతో సౌదీ అరేబియా నిధులు సమకూరుస్తుంటుంది. ఇక్కడి విద్యార్థులను తరఫ్‌లు అంటారు. వీరినే తాలిబన్లుగా వ్యవహరిస్తుంటారు. అఫ్గానిస్థాన్‌లో షరియత్ చట్టం అమల్లోకి రావాలని అక్కడ తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే నినాదాన్ని వాళ్లలో బలపరిచారు. అలా క్రమంగా తాలిబన్లు ఒక ప్రభావ వర్గంగా రూపొందింది. 1996లో అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, 2001 వరకు నడిపించారు. ఈ ప్రభుత్వాన్ని పాకిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు గుర్తించి తమ స్నేహ హస్తం అందించాయి.
తాలిబన్ సహాయ నిరాకరణం-అమెరికా ఉక్కుపాదం
సెప్టెంబర్ 11, 2001లో అమెరికాపై అల్ ఖైదా దాడి జరిపింది. దీంతో తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా యుద్ధం ప్రారంభించింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రంగంలోకి దిగింది అమెరికా. అల్ ఖైదా నాయకుడైన ఒసామా బిన్ లాడెన్ సమాచారం కోసం తాలిబన్ సహాయం కోరింది. కానీ వారు స్పందించలేదు. దీంతో అమెరికా సైన్యం, నాటో దళాలు అఫ్గాన్‌లోకి దూసుకెళ్లాయి. పరిస్థితిలో మార్పు కోసం కృషి చేశాయి.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యాలు, నాటో దళాలు క్రమంగా ఉపసంహరించుకుంటామని తెలిపారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ అఫ్గాన్, తాలిబన్ల మధ్య సయోధ్య కోసం ఖతార్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఈ చర్చలు ప్రభావం చూపించలేకపోయాయి. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఒబామా అనుసరించిన విధానాన్ని కొనసాగించారు. దీనికనుగుణంగా సెప్టెంబర్ 11, 2021 వరకు అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యాలను వెనక్కి తీసుకువస్తామని తెలిపారు. ఈ సమయంలో యుద్ధాన్ని తామే గెలిచినట్లు ప్రకటించుకున్నారు. కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే తాలిబన్లు అఫ్గాన్ ప్రభుత్వాన్ని పడగొట్టారు.
అమెరికా ఏమంటుంది?
అఫ్గానిస్థాన్ జాతి నిర్మాణమనేది ఎన్నడూ తమ లక్ష్యం కాదని స్పష్టం చేసింది అమెరికా. అఫ్గానిస్థాన్‌లో అమెరికా జోక్యానికి కారణం కేవలం అమెరికాపై టెర్రిరస్ట్ దాడుల నివారణే తప్ప ఏకీకృత ప్రజాస్వామ్య అఫ్గానిస్థాన్ నిర్మాణం మాత్రం కాదని తెలిపారు.
భారత్ – అఫ్గాన్ సంబంధాలు
సహజంగా అఫ్గాన్ వ్యవహారంతో భారత్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. మొన్నటి వరకు మంచి స్నేహమే నడిచింది. అఫ్గాన్‌లో పార్లమెంట్ నిర్మాణంతోపాటు ఇతర అవస్థాపనా సౌకర్యాలకు సహకారం అందించింది. రెండు దేశాలు వాణిజ్య భాగస్వాములుగా కూడా వ్యవహరిస్తున్నాయి.
ఆఫ్ఘన్‌కు భారత్ రెండో ప్రధాన దిగుమతిదారు కాగా అఫ్గాన్‌కు భారత్ దాదాపు రూ.6 వేల కోట్ల విలువ చేసే ఎగుమతులు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ వాణిజ్య సంబంధాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. ప్రధాన విషయం ఏమిటంటే ఇప్పుడు అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబన్లు, భారత శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌కు మంచి మిత్రులు. వాళ్ల స్నేహం భారత్‌కు కొత్త సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఇకనుంచి అఫ్గాన్ వ్యవహారాల్లో ఈ రెండు దేశాల జోక్యం పెరిగే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఇదే జరిగితే తాలిబన్ల పాలన, భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు వ్యూహాత్మకమైన బలాన్ని సమకూర్చే అవకాశం ఉంది. ఇతర ఉగ్రవాద సంస్థలు బలపడి భారత దేశానికి ఉగ్రవాద ముప్పు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
అంతర్జాతీయ
రాజకీయాలపై ప్రభావం
అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య పాలన నడిచిన కాలంలో పశ్చిమ దేశాలతోపాటు భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూరే విధంగా అఫ్గాన్ వ్యవహరించింది. కానీ ఇప్పుడు పాకిస్థాన్, రష్యా, ఇరాన్, చైనా కలిసికట్టుగా సరికొత్త రాజకీయానికి తెరతీసే విధంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు పశ్చిమ దేశాలతోపాటు భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు అనుకూలంగా అఫ్గాన్ వ్యవహారాలు నడిచాయి. కానీ ఇక నుంచి ఈ పరిస్థితులు మారే అవకాశం ఉంది. మరోవైపు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉన్నసరిహద్దు అంశాలకు తాలిబన్ ఎప్పుడు ఆమోదం తెలపనేలేదు. కాబట్టి వారి మధ్య అపరిమిత స్నేహం కూడా అంత సులువు కాదనే మరో వాదన ఉంది. అమెరికా, రష్యా విషయానికొస్తే అఫ్గాన్‌పై అదుపు కోసం రెండు దేశాల మధ్య మరోసారి ఆధిపత్య పోరు బలపడవచ్చన్నది విశ్లేషకుల అంచనా.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ,హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు