మన దేశ అద్భుత కట్టడాలు
కుతుబ్మీనార్
ఢిల్లీలోని మెహ్రౌలి దగ్గర కుతుబ్మీనార్ ఉంది. ప్రపంచంలోనే ఎత్తయిన ఇటుకల మినార్ ఇది. ఇండో-ఇస్లామిక్ నిర్మాణశైలిలో ఉన్న దీనిని 1193లో ఢిల్లీని పరిపాలించిన కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తిచేశాడు. కుతుబ్ అంటే ధృవం, మీనార్ అంటే స్తంభం. కుతుబ్మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పై వరకు ఉన్నాయి. దీని విశిష్టత ప్రతి ఏడాది జూన్ 22న భూమి మీద దీని నీడ పడదు. 1993లో యునెస్కో జాబితాలో చేరింది.
మహాబోధి దేవాలయం (బీహార్)
మహాబోధి బౌద్ధ ఆలయం. బోధ్‌గయా (గయా జిల్లా) పట్నా నుంచి 96 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశం బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన ప్రదేశంగా భావిస్తారు. ఇది ద్రవిడుల నిర్మాణ శైలిలో ఉంటుంది. దీనికి పడమర వైపు బోధి వృక్షం ఉంది. దీనిని అశోక చక్రవర్తి నిర్మించాడు. 2002లో యునెస్కో వారసత్వ సంపదగా దీనిని ప్రకటించింది.
హుమాయున్ సమాధి
హుమాయున్ సమాధి మొఘల్ నిర్మాణాల సమూహం. ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్‌లో ఉంది. ఆయన భార్య హాజీ బేగం ఆదేశంతో నిర్మించారు. పేరుకు సమాధే కానీ 30 ఎకరాల్లో విస్తరించిన కట్టడం ఇది. ఈ సమాధి నిర్మాణం హుమాయున్ మరణించిన తొమ్మిదేండ్లకు 1565లో మొదలై.. పూర్తి కావడానికి ఏడేండ్లు పట్టింది. నిర్మాణాన్ని మొదలు పెట్టిన మిరాక్ మీర్జా మరణించడంతో అతడి కొడుకు సయీద్ మహ్మద్ పూర్తిచేశాడు. మొఘలుల తొలి చార్బాగ్ సమాధి. చుట్టూ నాలుగు తోటలతో జామెట్రికల్ లే అవుట్‌తో డిజైన్ చేశారు. ఏ దిక్కు నుంచి చూసినా ఒకే రకంగా కనిపిస్తుంది. ప్రపంచ వారసత్వ జాబితాలో 1993లో స్థానం దక్కింది.
భీంబెట్కా గుహలు
మధ్యప్రదేశ్‌లోని రైసేన్ జిల్లా అబ్దుల్లాగంజ్ పట్టణానికి సమీపంలోని రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో భీంబెట్కా గుహలు ఉన్నాయి. ఈ శిలా నివాసాలు రాతి యుగానికి సాక్ష్యం. ఇక్కడ ఇసుకరాయి ఆశ్రయాలతో పాటు ఆనాటి యుగానికి సంబంధించి అనేక చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ గుర్తించిన 750కు పైగా ఇసుకరాతి ఆశ్రయాల్లో 243 భీంబెట్కా గ్రూపులో ఉండగా, 178 లఖజువార్ గ్రూపులో ఉన్నాయి. 30వేల సంవత్సరాలకు పైగా పురాతనమైన డ్రాయింగ్, పెయింటింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ కనుగొన్న రాతి చిత్రలేఖనాలకు కొన్ని దాదాపు 30 వేల సంవత్సరాల వారసత్వ సంపదగా యునెస్కో 2003లో గుర్తించింది.
స్మారక కట్టడాలు (హంపి)
కర్ణాటకలోని హంపి పట్టణంలో విజయనగర రాజుల స్మారక కట్టడాలు ఉన్నాయి. 4,100 హెక్టార్ల స్థలంలో కోటలు, దేవాలయాలు సుమారు 1600కు పైగా నిర్మాణ అవశేషాలు ఉన్నాయి. 1986లో యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది.
ఖాంగ్‌చెండ్‌జోంగా నేషనల్ పార్క్ (సిక్కిం)
హిమాలయ అందాలతో ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది. సిక్కిం రాష్ట్రంలో ఉన్న ఈ పార్క్ ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం. అసాధారణమైన జీవవైవిధ్యానికి పేరుగాంచిన ఈ ఉద్యానవనం ఉత్తర సిక్కింలో ఉంది. ఈ ప్రాంతంలో అనేక హిమానీ నదాలు ఉన్నాయి. ప్రపంచంలోని మూడవ ఎత్తయిన శిఖరం ఖాంగ్‌చెండ్‌జోంగా పర్వతంతో పాటు అనేక గుహలు, నదులు, సరస్సులు, అడవులు ఉన్నాయి. 1985లో వారసత్వ జాబితాలో చోటు దక్కింది.
సుందర్బన్స్
సుందర్బన్స్ ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవులు, అతిపెద్ద డెల్టా, అతిపెద్ద బెంగాల్ టైగర్ రిజర్వుగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 4వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుందర్బన్స్ 102 ద్వీపాల సమూహం. ఈ 102 ద్వీపాల్లో 54 ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారు. దీని మొత్తం వైశాల్యంలో 40 శాతం భారత్ కలిగి ఉండగా మిగిలిన ప్రాంతం బంగ్లాదేశ్ కలిగి ఉంది. ఇక్కడి భారత భూభాగంలో గొసాబా అతిపెద్ద జనావాస ద్వీపం. ఈ ప్రదేశాన్ని యునెస్కో బయోస్పియర్ రిజర్వుల జాబితాలో1987లో చేరింది.
ఇండియాలోని మౌంటేన్ రైల్వేస్
దేశంలో అనేక రైల్వేలు పర్వత ప్రాంతాల్లో నిర్మించారు. వీటన్నింటిని కలిపి భారత పర్వత రైల్వేలు అంటారు. వాటిలో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి పర్వత రైల్వే, కాల్కా-సిమ్లా రైల్వే, మాథేరాన్ పర్వత రైల్వే. క్లిష్టమైన కొండ ప్రాంతాల్లో వేసిన ఈ రైల్వే లైన్లకు ప్రపంచ వారసత్వ హోదా 1999లో స్థానం దక్కింది.
నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
విభిన్న జీవవైవిధ్యం గల ఈ ప్రాంతం హిమాలయాల పశ్చిమ భాగంలో ఉంది. ఈ ప్రాంతం అద్భుత సహజ అందాలకు, ఆల్పైన్ పూలకు ప్రసిద్ధి. నందాదేవి కొండలు, పువ్వుల లోయ కలిసి నందాదేవి బయోస్పియర్ రిజర్వుగా ప్రకటించారు. 2004 నుంచి ఈ ప్రాంతం యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వులో చేర్చారు.
గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్
తంజావూర్‌లోని చోళ వంశ రాజులు నిర్మించిన బృహదీశ్వర టెంపుల్, గంగైకొండ చోలీశ్వరం టెంపుల్, ధరాసురంలోని ఐరావతేశ్వర టెంపుల్, ధరాసురంలోని ఐరావతేశ్వర ఆలయం క్రీ.శ 11, 12 శతాబ్దాల కాలం నాటివి. ఈ దేవాలయాల శిల్పశైలికి గాను యునెస్కో 1987లో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది.
ఛత్రపతి శివాజీ టర్మినస్
ఛత్రపతి శివాజీ టర్మినల్ గతంలో ‘విక్టోరియా టర్మినస్’గా పిలిచిన ఈ రైల్వేస్టేషన్ దేశంలోని అన్ని రైల్వేస్టేషన్ల కంటే రద్దీగా ఉంటుంది. దీనిని 1887-88లో బ్రిటిష్ ఇంజినీర్ ఫ్రెడరిక్ విలియం స్ట్టీవెన్స్ దీని డిజైన్ రూపొందించి రూ.16.14లక్షల వ్యయంతో నిర్మించాడు. విక్టోరియా రాణి గౌరవార్థం దీనికి విక్టోరియా టెర్మినస్‌గా పేరు పెట్టాడు. దీని నిర్మాణానికి సుమారు 10 సంవత్సరాల కాలం పట్టింది. 1996లో ‘ఛత్రపతి శివాజీ’ టర్మినస్‌గా పేరు మార్చారు. 2004లో దీనికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది.
మహాబలిపురం
తమిళనాడులోని కంచి జిల్లాలో ఉంది. క్రీ.శ 7వ శతాబ్దంలో పల్లవ రాజులచే మహాబలిపురంలో నిర్మించబడిన 40 రాతి చెక్కడాల నిర్మాణం. 1200 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి. ఇంకా పల్లవ రాజుల కాలంలో ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. మహాబలిపురాన్ని మామల్లాపురం అని కూడా పిలుస్తారు. క్రీ.శ 650 నుంచి 750 వరకు ఈ ప్రదేశంలో అనేక కళలు, పురావస్తు, శిల్ప సంపద, సాహిత్యం, డ్రామాలు ఇతర సాంస్కృతిక రంగాలు అభివృద్ధి చెందాయి.1984లో యునెస్కో గుర్తింపు లభించింది.
పడమటి కనుమలు
పడమటి (పశ్చిమ) కనుమలను సహ్యాద్రి శ్రేణులు అని అంటారు. ఇవి దేశ పడమటి భాగమంతా వ్యాపించి ఉన్నాయి. ఈ శ్రేణులు సుమారుగా దేశంలోని 5 రాష్ర్టాల్లో వ్యాపించి ఉన్నాయి. గుజరాత్లో మొదలై మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళలో వ్యాపించి తమిళనాడులోని కన్యాకుమారిలో అంతమవుతాయి. సుమారు 1600 కిలోమీటర్లు పొడవు ఉంటాయి. వీటి సగటు ఎత్తు 1200మీటర్లు. భౌగోళికంగా చూస్తే పడమటి కనుమలు పర్వత శ్రేణులు కావు. దక్కన్ భూమికి అంచులుగా ఉంటాయి. ఇక్కడ మానవ నిర్మిత రిజర్వాయర్లు, సరస్సులు అనేకం ఉన్నాయి. నీలగిరి కొండలపై ఊటీ సరస్సు, పళనికొండలపై కొడైకెనాల్ సరస్సు ప్రముఖమైనవి. నిరంతరం ప్రవహించే గోదావరి, కృష్ణా, కావేరి నదుల జన్మస్థానం పడమటి కనుమలు. పశ్చిమ కనుమల ఉత్తర భాగంలో కల్సూభాయ్, సల్హేర్, హరిశ్చంద్ర ఘర్ శిఖరాలున్నాయి. వీటిలో కల్సూభాయ్ శిఖరం అతిపెద్దది. గోవా దక్షిణ తీరానికి అతి సమీపంగా ఉన్న పశ్చిమ కనుమలు పురాతన నీస్, గ్రానైట్ శిలలతో ఏర్పడి, ఎక్కవ కఠినంగా ఉన్న దట్టమైన స్థలాకృతితో ఉన్నాయి. దక్షిణాన నీలగిరి కొండలు సహ్యాద్రి కొండలను గుడలూరు సమీపంలోకలుస్తున్నాయి. గుడలూరు వద్ద వీటి సరాసరి ఎత్తు 2000మీటర్లు. నీలగిరి కొండల్లోని ఊటీ సమీపంలోని దొడ్డబెట్ట (2637) అతి ఎత్తైన శిఖరం. దీనికి దక్షిణంగా అన్నామళై, పళని, కార్డమమ్ (యాలకుల) కొండలున్నాయి. కేరళలోని అన్నామలై కొండల్లోని అనైముడి శిఖరం (2695మీ) ద్వీపకల్ప పీఠభూమిలో కెల్లా అతిఎత్తైంది.యునెస్కో జాబితాలో 2012లో ప్లేస్ దక్కించుకుంది.
వీటితో పాటు
బీహార్‌లోని నలంద మహావీర పురావస్తు ప్రదేశం (2016)
సాంచి దగ్గర బౌద్ధస్మారక చిహ్నాలు (1989)
ఛాంపనేర్-పావగర్ పురావస్తు ఉద్యానవనం (2004)
చర్చిలు, కాన్వెంట్స్ ఆఫ్ గోవా (1986)
పట్టడకల్ వద్ద గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ (1987) గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్
హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ (2017) యునెస్కో గుర్తింపు పొందాయి.
సత్యం గౌడ్ సూదగాని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు