పండుగ సాయన్న గాథను గానం చేసేవారు?
గంటెభాగవతులు
పేరు విచిత్రంగా ఉన్నా ఇది ఒక అపూర్వమైన జానపద కళారూపం. దీనిలో నర్తించేవారు చేతితో గంటె పట్టుకొని దానిలో ఒత్తులు వేసి, వెలిగించి, అభినయించే సమయంలో ఆ దీపాన్ని తమ ముఖం మీదకు తెచ్చి భావాలను పలికిస్తారు.
ఇలా దీపాలు వెలిగించిన గంటెలతో నృత్యం చేస్తారు. కాబట్టి వీరిని గంటెభాగవతులు అంటారు. ఈ నృత్యంలో భావ ప్రకటనకు, అందుకు తగిన తాళం, లయ గతులకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.
వీరి ప్రదర్శన రాత్రివేళ ఉంటుంది. వీరిని ‘కొలనుపాక భాగవతులు’ అని కూడా అంటారు. రాష్ట్రంలో వీరు ఎక్కువగా కరీంనగర్ జిల్లా కొలనుపాకలో ఉన్నారు.
చెక్కభజన
పల్లెల్లో తీరిక సమయాల్లో ఈ భజన చేస్తుంటారు. సుమారు 20 మంది సభ్యులు దేవుని ప్రమిదను పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ భజన చేస్తారు.
ఈ భజనలో పాట పాడుతూ చేతితో చెక్కల ద్వారా తాళం వేస్తూ గజ్జెలు కట్టిన కాళ్లతో నృత్యం చేస్తుంటారు. ఒక్కొక్క పాటకు ఒక్కొక్క రకమైన నృత్యం చేస్తారు.
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ప్రసిద్ధి పొందిన జానపద కళా స్వరూపం ఇది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. భావాన్ని ముఖంలో వ్యక్తపరుస్తారు.
కాముని ఆట
ఇది ఒక ఆనందకరమైన పండుగ. పౌర్ణమి ఇంకా వారం రోజులు ఉండగానే వెన్నెల రాత్రుల్లో గుంపులు గుంపులుగా వినోద కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
కాముని పున్నమి సందర్భంగా వెన్నెల పాటలు, అల్లనేరెళ్లు, కోలాటపు పాటలు స్త్రీలు పాడుతుంటే పురుషులు ‘జాజిరి’ పాటలు పాడుతుంటారు.
స్త్రీల కోలాటం కంటే పురుషుల కోలాటం ఉధృతంగా ఉంటుంది. కోలాట పాటలు సంవాద రూపంలో శృంగార రస ప్రధానాలుగా ఉంటాయి.
గంగిరెద్దులాట
ఇది రాష్ట్రంలోని చక్కని జానపద కళ. దీనిని సాధారణంగా పూజగొల్ల కులానికి చెందినవారు గంగిరెద్దులను ఆడిస్తారు. వీరు ఎద్దును అలంకరించి, ఊళ్లలో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు.
గంగిరెద్దుతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వీరిలో ఒకరు గంగిరెద్దును ఆడిస్తే, మరో వ్యక్తి డోలు వాయిస్తాడు. మూడో వ్యక్తి సన్నాయి ఊదుతాడు.
రాష్ట్రంలో ఈ గంగిరెద్దులవాళ్లు ప్రధానంగా సంక్రాంతికి ముందు డిసెంబర్ నుంచి సంక్రాంతి తరువాత ఫిబ్రవరి నెల వరకు కనిపిస్తారు.
చిరతల భజన
ఈ ఆటగాళ్లు మెడలో పూలదండలతో కాళ్లకు గజ్జెలు, నడుముకు పటక, ధోవతి కట్టుతో ఉంటారు. చిరతలను ఒక చేతితోనే ఉపయోగిస్తారు.
ఈ కళకు కోలాటం ఆటకు దగ్గరి పోలిక ఉంటుంది. ఆటగాళ్ల చేతుల్లో కోలలకు బదులు చిరుతలు ఉంటాయి.
దీనిలో మద్దెల, హార్మోనియం వంటి వాయిద్య పరికరాలు కూడా ఉపయోగిస్తారు. వీరు పౌరాణిక సన్నివేశాలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా రామాయణ ఘట్టాలను గానయుక్తంగా అభినయిస్తారు.
ఎక్కువగా శ్రీరామనవమి సందర్భాల్లో తొమ్మిది రోజులు వీరి ప్రదర్శనలుంటాయి. ఈ భజన బృందాల్లో కరీంనగర్ జిల్లా బృందం పేరుమోసింది.
దొమ్మరి ఆట
దొమ్మరాట కూడా ప్రాచీన కాలం నుంచి ఉన్న కళ. దీనిని సర్కస్ అని అంటారు. ఈ కళ 13వ శతాబ్దం నుంచి ఉన్నట్లు పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు.
దేశదిమ్మరులుగా ప్రసిద్ధిచెందిన వీరు సాహసంతో కూడిన ఆటలను ప్రదర్శిస్తారు. వీరిలో చిన్నపిల్లలు కూడా తమ కళను ప్రదర్శిస్తారు. వీరు ప్రదర్శించే కళలో గడసాము ఆదరణ పొందింది.
వీరు నాలుగు వీధుల కూడలిలో తమ విద్యను ప్రదర్శిస్తారు. గడసాములో గడపైకి ఎక్కే ముందు వేపాకును దేవత చిహ్నంగా తమతో తీసుకెళ్తారు. ఈ ఆట ముగింపులో
వేపాకును జనంపై చల్లుతారు.
కాటికాపరివాళ్లు
వీరు మనిషి అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు స్మశానానికి వచ్చి తమ ఇంద్రజాలాన్ని ప్రదర్శించి వ్యక్తులను కీర్తించి యాచిస్తుంటారు.
ఈ ఇంద్రజాల ప్రదర్శనల్లో వీరు ప్రసిద్ధిచెందారు. సాధనతో నేర్చుకున్న ఈ విద్యను వారు తమ జీవనాధారంగా వినియోగించుకుంటున్నారు.
వీరు ఎక్కువగా నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఉన్నారు. వీరి వేషధారణ గంభీరంగా ఉంటుంది.
వీరు తమ ఇంద్రజాల ప్రదర్శనలో నోటిలో నుంచి గుండ్లు, పాములు, తేళ్లు, మేకులు, డబ్బులు తీయడం ప్రదర్శిస్తారు.
విప్రవినోదులు
వీరు కూడా ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ, విప్రుల (బ్రాహ్మణులు)ను మాత్రమే యాచిస్తుంటారు. వీరు విప్రుల ఇండ్లలోనూ, బహిరంగ స్థలాల్లోనూ ప్రదర్శనలు ఇస్తుంటారు.
వీరి ప్రదర్శనలో 5, 6 శాలువాలు, ఒక కొయ్య అల్మరా, ఒక తాళపత్ర గ్రంథం, రెండు జతల తాళాలు ఉంటాయి.
ఈ విప్రవినోదులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు.
సాధనాశూరులు
వీరు కూడా కాటికాపరివాళ్లు, విప్రవినోదులు తరహాలోనే ఇంద్రజాల ప్రదర్శనలో ఆరితేరినవారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని నేత కుటుంబాల్లో ఇప్పటికీ ఈ కళ కనిపిస్తుంది.
సాధనతో కనికట్టును ఎలా ప్రదర్శించాలో నేర్చుకుంటారు. సాధనతో అనేక మేజిక్‌లు చేస్తుంటారు. కాబట్టి వీరిని సాధనాశూరులు అంటారు.
వీరు పద్మశాలీలను మాత్రమే యాచిస్తారు. పద్మశాలీలకు ఆశ్రిత కులంగా ఉంటూ వారికి తమ విద్యను ప్రదర్శించి జీవనం సాగిస్తుంటారు. ఇది ఎక్కువగా పగటివేళలో చేస్తుంటారు.
ఆరుగురు పురుషులు ఒక జట్టుగా ఉండి ఏడాది మొత్తం ఊరూరా తిరుగుతూ అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన వంటి విద్యలను ప్రదర్శిస్తారు.
దాసర్లు
జంగాలు శైవ మత ప్రతీకలయితే, దాసర్లు వైష్ణవ మత ప్రచారకులు. వేషధారణలో కూడా వైష్ణవ మత చిహ్నాలు కనిపిస్తాయి.
వీరు విష్ణు సంకీర్తనలు చేస్తూ యాచిస్తారు. సంక్రాంతి పండుగ అప్పుడు ఇంటింటికీ తిరుగుతూ హరిలో రంగ హరీ అని పాడుతూ భిక్షమడుగుతారు.
వీరిలో పాగ దాసరి, బుక్క దాసరి, భాగవత దాసరి, దండె దాసరి, చిన్న దాసరి, మాల దాసరి మొదలైన ఉప జాతులున్నాయి.
రామదాసు కీర్తనల ప్రాముఖ్యం వీరి వ్యాప్తివల్లే పెరిగింది. ‘ఈ దాసరి తిప్పలు దైవానికెరుక’ అనే సామెత వీరి పేదరికాన్ని పోలుస్తూ పుట్టిందని చెప్పవచ్చు.
కాకమ్మ, బొబ్బిలి బాలనాగమ్మ, చిన్నమ్మ మొదలైన వారి కథలను పాడుతారు. సంప్రదాయ చిహ్నాలతో సంస్కృతి సంరక్షకులుగా నిలిచిన వీరు కాలక్రమేణా కనుమరుగవుతున్నారు.
పెద్దమ్మలోళ్లు
వీరు సంచార జాతికి చెందిన మహిళాకారులు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఈ ప్రదర్శన చేస్తారు. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకున్న ఒక మహిళ డోలు శబ్దాలకు అనుగుణంగా అడుగులు వేస్తుంది.
మరో మహిళ డోలును వాయిస్తుంది. ఇంకో మహిళ వీరజాటిని పట్టుకొని విసురుతుంది.
నిజాం నవాబును ఎదిరించిన పండుగ సాయన్న వీరగాథను వీరు గానం చేస్తూ యాచిస్తుంటారు.
బుడబుక్కలు
సంచార జాతికి చెందిన వీరు సంక్రాంతి పండుగ సమయంలో తెల్లవారుజామున ఇల్లిల్లు తిరుగుతూ యాచిస్తారు.
వీరి ఢమరుక శబ్దాన్ని బట్టి వీరిని బుడబుక్కలవారు అని అన్నారు.
వీరు ధోతీ, నల్లని కోటు, తలపాగా, ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో ఢమరుకంతో ‘అంబపలుకు జగదాంబ పలుకు’ అని ఆలపిస్తారు.
క్షుద్రశక్తులను పారదోలుతామని, జ్యోతిష్యం చెబుతూ తాయెత్తులు కడుతూ యాచిస్తుంటారు.
ప్రాక్టీస్ బిట్స్
- తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ప్రసిద్ధి చెందిన జానపద కళారూపం?
1) చెక్కభజనలు 2) చిరుతల భజనలు
3) వీధి భాగవతం 4) గంటె భాగవతులు - దీపం వెలిగించిన గంటెలతో నృత్యం చేసే కళాకారులు?
1) గరగ నృత్యం 2) కోలాటం
3) గుస్సాడీ నృత్యం 4) గంటె భాగవతులు - ఏ కులానికి చెందినవారు గంగిరెద్దులాటను ప్రదర్శిస్తారు?
1) ఎర్రగొల్ల 2) కురుమ గొల్ల
3) ముష్టిగొల్ల 4) పూజగొల్ల - గంటె భాగవతులు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు?
1) రంగారెడ్డి 2) వరంగల్
3) కరీంనగర్ 4) హైదరాబాద్ - కొలనుపాక భాగవతులు అంటే?
1) చిందు భాగవతులు
2) గంటె భాగవతులు
3) చెంచు భాగవతులు
4) గొంధెళి భాగవతులు - అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు ఇంద్రజాల ప్రదర్శనను నిర్వహించేవారు?
1) విప్రవినోదులు 2) పిచ్ఛకుంట్లవారు
3) కాటికాపరివాళ్లు 4) సాధనాశూరులు - శ్రీరామనవమి సందర్భంగా ప్రదర్శించే కళారూపం?
1) చిరుతల భజన 2) చెక్క భజన
3) గంటెభాగవతులు 4) 1, 2 - సాధనాశూరులు ఏ కులస్థులకు తమ కళను ప్రదర్శించి జీవనం సాగిస్తారు?
1) పద్మశాలీలు 2) గాండ్లవారు
3) యాదవులు 4) ముదిరాజ్‌లు - కాటికాపరివాళ్లు ఎక్కువగా ఏ జిల్లాలో కనిపిస్తారు?
ఎ. మహబూబ్‌నగర్ బి. నల్లగొండ
సి. మెదక్ డి. వరంగల్
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, సి, డి - సాధనాశూరులు ప్రదర్శించే విద్యలు?
ఎ. అగ్నిస్తంభన బి. జల స్తంభన
సి. వాయు స్తంభన డి. జీవ స్తంభన
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) సి, డి - విప్రవినోదులను ఏమని పిలుస్తారు?
1) గౌడవారు 2) సాధనాశూరులు
3) మాయాజాల కళాకారులు
4) గంగిరెద్దులవారు - గడసాముతో ప్రేక్షకుల ఆదరణ పొందిన జానపదకళ?
1) విప్రవినోదులు 2) గంగిరెద్దుల ఆట
3) దొమ్మరి ఆట 4) ఏదీకాదు - దేవతలకు ప్రతిరూపంగా వేపాకులను ఉపయోగించే కళారూపం?
1) దొమ్మరి ఆట 2) ఇంద్రజాల ప్రదర్శన
3) సాధనాశూరులు 4) బుడబుక్కలు - సంచార జాతికి చెందిన జానపద కళారూపాలు?
ఎ. బుడబుక్కలు బి. జక్కులు
సి. ఆసాదులు డి. పెద్దమ్మలోళ్లు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి
3) బి, డి 4) ఎ, డి - పెద్దమ్మలోళ్లు ఎవరి గాథను గానం చేస్తారు?
1) సర్వాయి పాపన్న
2) పండుగ సాయన్న
3) కుమ్రం భీం
4) చాకలి ఐలమ్మ - సంచార జాతికి చెందిన మహిళాకారులు?
1) బుడబుక్కలు 2) జక్కులు
3) ఆసాదులు 4) పెద్దమ్మలోళ్లు
Answers
1-1, 2-4, 3-4, 4-3, 5-2, 6-3, 7-1, 8-1, 9-3, 10-2, 11-3, 12-3, 13-1, 14-4, 15-2, 16-4
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు