గుల్మార్గ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు
జాతీయం
జాతీయ జెండా
జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ సమీపంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను ఆగస్టు 10న సైన్యం జాతికి అంకితం చేసింది. దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన కశ్మీరీలకు నివాళిగా ఈ జెండాను నిర్మించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లో ఈ పతాకాన్ని ఏర్పాటు చేశారు.
నిర్భయ్ క్షిపణి
సతీష్ ధావన్ సెంటర్ నుంచి ‘నిర్భయ్’ క్రూయిజ్ క్షిపణిని ఆగస్టు 10న విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి పరిధి 1000 కి.మీ. ఉపరితలం నుంచి ఉపరితలానికి దీనిని ప్రయోగిస్తారు.
నేర చరితులపై యాప్
ఎన్నికల్లో పోటీచేయడానికి వివిధ పార్టీల తరఫున ఎంపికయిన అభ్యర్థుల నేర చరిత్రను తెలిపేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)ను సుప్రీంకోర్టు ఆగస్టు 10న ఆదేశించింది. అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నట్లు పార్టీలు ప్రకటించిన 48 గంటల్లోనే వారి వివరాలను పొందుపర్చాలని స్పష్టం చేసింది. ప్రతి ఒక్క ఓటరు తమ మొబైల్లో ఈ యాప్ ద్వారా అభ్యర్థుల వివరాలు తెలుసుకునేలా ఉండాలని సూచించింది.
జనరల్ ఇన్సూరెన్స్ బిల్లు
ప్రభుత్వ నిర్వహణలోని బీమా కంపెనీలను ప్రైవేటీకరించేందుకు ఉద్దేశించిన జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ బిల్లు-2021ను పార్లమెంట్ ఆగస్టు 11న ఆమోదం తెలిపింది. అదేవిధంగా భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ (సవరణ) బిల్లు, జాతీయ హోమియోపతి కమిషన్ (సవరణ) బిల్లులను కూడా పార్లమెంట్ ఆమోదించింది.
ఎల్డర్లీ ఇన్ ఇండియా-2021
‘ఎల్డర్లీ ఇన్ ఇండియా-2021’ పేరుతో కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆగస్టు 11న ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 13.80 కోట్ల మంది వృద్ధులు ఉంటారని అంచనా వేసింది. వీరిలో 6.70 కోట్లు మంది పురుషులు, 7.10 కోట్ల మంది మహిళలు ఉంటారు. 60 ఏండ్లు పైబడినవారిని వృద్ధులుగా పరిగణిస్తున్నారు.
వాటర్ ప్లస్ సిటీ
దేశంలో తొలి ‘వాటర్ ప్లస్ సిటీ’గా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఆగస్టు 12న ఎంపికయ్యింది. ఈ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో మొదటిస్థానంలో నిలవడం ఇది వరుసగా నాలుగో సారి. మురుగు కాలువల్లోకి నేరుగా చెత్తను పారవేయడాన్ని అరికట్టడానికి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ మూడేండ్లుగా పటిష్టంగా చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.300 కోట్లతో రెండు నదులు, 27 మురుగునీటి పారుదల వ్యవస్థలను శుద్ధి చేసింది.
జీఎస్ఎల్వీ ఎఫ్-10
జీఎస్ఎల్వీ ఎఫ్-10 రాకెట్ ద్వారా ఆగస్టు 12న నిర్వహించిన జీఐశాట్-1 ఉపగ్రహ ప్రయోగం విఫలమయ్యింది. ఈ ఉపగ్రహం బరువు 2268 కేజీలు. దీని ముఖ్య ఉద్దేశం దూర ప్రాంతాల సమాచారాన్ని సేకరించడం.
అంతర్జాతీయం
జాయెద్ తల్వార్
భారత్, యూఏఈ ‘జాయెద్ తల్వార్-2021’ పేరుతో ఆగస్టు 7న నేవీ ఎక్సర్సైజ్ను అబుధాబి తీరంలో నిర్వహించాయి. దీనిలో భారత్ నుంచి ఐఎన్ఎస్ కొచ్చి, రెండు ఇంటిగ్రల్ సీ కింగ్ ఎంకే 428 హెలికాప్టర్లు, యూఏఈ నుంచి అల్ ధఫ్రా, ఏఎస్-565బీ పాంథర్ హెలికాప్టర్ పాల్గొన్నాయి.
బీబోట్
బీచ్‌లను శుభ్రం చేసేందుకు ‘బీబోట్’ అనే రోబోను అభివృద్ధి చేసినట్లు అమెరికా సైంటిస్టులు ఆగస్టు 8న వెల్లడించారు. ఇది తీర ప్రాంతంలో ఏ చిన్న ప్లాస్టిక్ ముక్కనూ వదలకుండా ఏరేస్తుంది. దీనిని బ్యాటరీతో ఇసుకలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పయనించేందుకు వీలుగా రూపొందించారు.
మోదీ అధ్యక్షతన భద్రతా మండలి భేటీ
‘సముద్ర ప్రాంత భద్రత పెంపు-అంతర్జాతీయ సహకారం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఐరాస భద్రతా మండలిలో జరిగే చర్చకు భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి. సముద్ర మార్గంలో వాణిజ్యానికి ఎదురవుతున్న అవరోధాల తొలగింపుపై చర్చించారు.
కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ
‘కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ’ అనే నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ ైక్లెమేట్ చేంజ్ (ఐపీసీసీ) ఆగస్టు 9న విడుదల చేసింది. ప్రపంచ పర్యావరణ పరిస్థితులపై ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం పర్యావరణ మార్పుల కారణంగా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయుల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి.
మార్స్ డ్యూన్ ఆల్ఫా
‘మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలిచే 1700 చదరపు అడుగుల కృత్రిమ నివాస స్థలాన్ని నిర్మించే ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆగస్టు 9న తెలిపింది. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని మనిషి తట్టుకుంటాడో లేదా అనే అధ్యయనాన్ని ఈ ప్రయోగం ద్వారా తెలుసుకుంటారు. 3డీ ప్రింటింగ్ ద్వారా హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
స్కైట్రాక్స్ అవార్డులు
ప్రపంచంలోని ఎయిర్‌పోర్టులకు స్కైట్రాక్స్ సంస్థ అవార్డులను ఆగస్టు 9న ప్రకటించింది. దీనిలో మొదటి స్థానంలో ఖతార్‌లోని హహద్ ఎయిర్పోర్ట్ నిలిచింది. టోక్యోలోని హనెడా విమానాశ్రయం 2, సింగపూర్‌లోని చాంగి ఎయిర్పోర్ట్ 3, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ ఎయిర్పోర్ట్ 4, టోక్యోలోని నారిటా ఎయిర్పోర్ట్ 5వ స్థానాల్లో నిలిచాయి.
దీనిలో భారత్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ 45, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 64, ముంబై ఎయిర్పోర్ట్ 65, బెంగళూరు ఎయిర్‌పోర్టు 71వ స్థానాల్లో ఉన్నాయి.
అల్ మొహిద్ అల్ హిందీ
భారత్, సౌదీ అరేబియా దేశాలు తొలిసారిగా ‘అల్ మొహిద్ అల్ హిందీ’ పేరుతో నౌకా విన్యాసాలు ఆగస్టు 11న నిర్వహించాయి. సౌదీ అరేబియా తీరంలో ఇరుదేశాల రక్షణపరమైన మైత్రి కోసం దీనిని చేపట్టారు.
సవరణ: గతవారం ఇదే పేజీ ఇదే అంతర్జాతీయంలో ‘హెరిటేజ్ జాబితాలో ఇటలీ’ అంశంలో టైపింగ్ మిస్టేక్ వల్ల భారత్ 40 అంశాలకు బదులుగా 49 ప్రింట్ అయ్యింది. హెరిటేజ్ జాబితాలో భారత్ 40 అంశాలుగా చదువుకోగలరని మనవి.
క్రీడలు
ఒలింపిక్స్
32వ ఒలింపిక్ గేమ్స్ టోక్యోలో జూలై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగిశాయి. 33 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో 205 దేశాల నుంచి 11,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పతకాల పట్టికలో అమెరికా (39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు) మొదటి స్థానంలో నిలువగా.. చైనా (38 స్వర్ణాలు, 18 రజతాలు, 32 కాంస్యాలు) 2వ స్థానంలో నిలిచింది.
జావెలిన్ డే
జాతీయ జావెలిన్ దినోత్సవంగా ఆగస్టు 7ను నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) ప్లానింగ్ కమిషన్ చైర్మన్ లలిత్ బానోత్ ఆగస్టు 10న వెల్లడించారు. ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా భారత్‌కు స్వర్ణం అందించాడు. దీనికి గుర్తుగా ఆ రోజున జాతీయ జావెలిన్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఆర్చరీ జట్టు రికార్డులు
ఆగస్టు 10న నిర్వహించిన ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. క్యాడెట్ కాంపౌండ్ బాలికల టీమ్ ర్యాంకింగ్ విభాగంలో ప్రియా గుజ్జర్, పర్నీత్ కౌర్, రిధు వర్షిణిలతో కూడిన జట్టు 2067/2160 స్కోరుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికా పేరిట ఉన్న 2045/2160 స్కోర్ రికార్డును తిరగరాసింది. కాంపౌండ్ మిక్స్ టీమ్ ర్యాంకింగ్ ఈవెంట్లో ప్రియా గుజ్జర్, కుశాల్ దలాల్ జోడీ 1401 స్కోర్‌తో రికార్డు నెలకొల్పింది. నెదర్లాండ్‌కు చెందిన నటాషా-పులర్టన్ 2019లో చేసిన 1387 స్కోర్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది.
లియోనల్ మెస్సీ
లియోనల్ మెస్సీ బార్సిలోనా క్లబ్ నుంచి ఆగస్టు 13న వీడ్కోలు పలికారు. గతంలో ఈ క్లబ్ తరఫున 672 గోల్స్ చేశాడు. ఆగస్టు 11న మెస్సీ ఫ్రెంచ్ క్లబ్ పారిస్-సెయింట్ జెర్మెయిన్తో రూ.610 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు.
పారాలింపిక్స్
టోక్యోలో పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆగస్టు 13న వెల్లడించారు. భారత్ నుంచి 54 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం 16 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. గతంలో దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు స్వర్ణ పతకాలు సాధించారు.
వార్తల్లో వ్యక్తులు
అనురాధా రాయ్
అనురాధా రాయ్ రచించిన ‘ది ఎర్త్ స్పిన్నర్’ పుస్తకం ఆగస్టు 10న పబ్లిష్ అయ్యింది. ఎలాంగో పాటర్ జీవితం, మనస్సు, అతని సంక్లిష్టమైన, అసాధ్యమైన ప్రేమ, పెంపుడు జంతువు అంకితభావం, సృజనాత్మకత పట్ల తన సొంత అభిరుచి తదితర అంశాల గురించి వివరించింది.
సుధామూర్తి
సుధామూర్తి రచించిన ‘హౌ ది ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ’ పుస్తకం ఆగస్టు 10న పబ్లిష్ అయ్యింది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది. ఈ పుస్తక కవర్‌పేజీని ప్రియాంక పచ్‌పాండే రూపొందించారు.
కమలేష్ కుమార్ పంత్
నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) చైర్మన్‌గా కమలేష్ కుమార్ పంత్ ఆగస్టు 12న ఎంపికయ్యారు. ఈయన 1993 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఎన్పీపీఏ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీనిని 1997, ఆగస్టు 29న స్థాపించారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు