వరంగల్‌కు పురస్కారం
తెలంగాణ
పింక్ బుక్
తెలంగాణ పరిశ్రమల శాఖ రూపొందించిన ‘పింక్ బుక్’ను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ జూలై 27న ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ఈ బుక్ మార్గదర్శకంగా ఉంటుంది. నిరంతర విద్యుత్, మానవ వనరులు తదితర వివరాలు ఈ బుక్‌లో ఉన్నాయి.
వరంగల్‌కు పురస్కారం
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జూలై 28న నిర్వహించిన సైకిల్స్ ఫర్ చేంజ్ పోటీ (చాలెంజ్)లో వరంగల్‌కు పురస్కారం దక్కింది. కాజీపేట నుంచి హన్మకొండ వరకు 4 కి.మీ రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్‌ను వరంగల్ నగర పాలక సంస్థ ఏర్పాటు చేసింది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 107 నగరాలు పాల్గొన్నాయి. దీనిలో మొత్తం 25 నగరాలు రెండో దశకు ఎంపిక కాగా.. 11 నగరాలకు పురస్కారాలు దక్కాయి. దక్షిణాది రాష్ర్టాల్లో వరంగల్, బెంగళూరు మాత్రమే మొదటి 11 స్థానాల్లో నిలిచాయి. పురస్కారం కింద వరంగల్‌కు రూ.కోటి నగదు అందజేశారు.
వనపర్తి తిరుపతి
ఆసిఫాబాద్ కవులు సంఘం కవిగా, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ సాహిత్య కార్యదర్శిగా పనిచేసిన వనపర్తి తిరుపతి జూలై 20న మరణించారు. ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి 2020లో సాహితీభూషణ్ అవార్డును అందుకున్నారు. గోడు, నా గోడు, సాహిత్య భారతం వంటి ప్రసిద్ధిచెందిన పుస్తకాలు రాశారు. ఆయనకు 13 జాతీయ, నంది పురస్కారాలు లభించాయి.
ప్రీమియర్ సోలార్ ప్లాంట్
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఎలక్ట్రాన్ సిటీ (ఈ-సిటీ)లో ప్రీమియర్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేసిన సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ ప్లాంట్‌ను జూలై 29న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనిని రూ.450 కోట్లతో నిర్మించారు.
జాతీయం
బ్లింకెన్ భారత పర్యటన
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జూలై 27, 28 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో ఆయన సమావేశయ్యారు. జో బైడెన్ అధ్యక్షుడయ్యాక భారత పర్యటనకు వచ్చిన మూడో అత్యున్నత నాయకుడు ఈయనే. మార్చిలో రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, ఏప్రిల్‌లో పర్యావరణ మార్పులపై ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీలు వచ్చారు.
ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ బిల్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 29న ప్రవేశపెట్టిన ‘ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ బిల్లు-2021’ను పార్లమెంట్ ఆమోదించింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రవేశపెట్టిన ‘భారత విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ ప్రాధికార సంస్థ (సవరణ) బిల్లు-2021’, నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రవేశపెట్టిన ‘అంతర్గత జల రవాణా బిల్లు-2021’లను లోక్‌సభ ఆమోదించింది.
డీఐసీజీసీ యాక్ట్-1961
డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీసీజీసీ) యాక్ట్-1961 సవరణకు కేంద్ర కేబినెట్ జూలై 28న ఆమోదం తెలిపింది. ఒక బ్యాంకు మూతపడే సందర్భంలో మొత్తం డిపాజిట్లో కేవలం రూ.లక్ష మాత్రమే డిపాజిట్‌దారుడు డీఐసీజీసీ యాక్ట్ కింద పొందుతున్నాడు. ఈ కవరేజీని ఐదు రెట్లు (రూ.5 లక్షలు) పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
పుస్తకం విడుదల
వాణిజ్య ప్రకటనల రంగంలో ప్రముఖుడు రమేశ్ నారాయణ్ రచించిన డిఫరెంట్ రూట్ టు సక్సెస్ (విజయానికో విభిన్న మార్గం) పుస్తకం జూలై 30న విడుదలైంది. కాండో అడ్వర్టయిజింగ్ సంస్థను స్థాపించిన ఆయన ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) ఇండియన్ చాప్టర్ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఎన్ఐఎస్ఏఆర్ ఉపగ్రహ ప్రయోగం
నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎన్ఐఎస్ఏఆర్) ఉపగ్రహ ప్రయోగం 2023లో చేపట్టనున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ జూలై 30న లోక్‌సభలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భూ ఉపరితలంలో జరిగే మార్పులను అడ్వాన్స్డ్ రాడార్ వ్యవస్థను ఉపయోగించి పసిగట్టడమే ఈ ప్రయోగ లక్ష్యమన్నారు. భారత్-అమెరికాల మధ్య దీనికి సంబంధించిన ఒప్పందం 2015లో జరిగిందని తెలిపారు.
అంతర్జాతీయం
షాంఘై సమావేశం
తజకిస్థాన్‌లోని దుషాంబేలో జూలై 27 నుంచి 29 వరకు షాంఘై సహకార ఫెడరేషన్ రక్షణ మంత్రుల సమావేశం నిర్వహించారు. రక్షణ సహకార సమస్యలపై చర్చించారు. భారత్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. 2017లో భారత్ షాంఘై సహకార సంస్థలో సభ్యత్వం పొందింది. దీనిలో మొత్తం 8 సభ్యదేశాలు ఉన్నాయి.
అంతర్జాతీయ పులుల దినోత్సవం
అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జూలై 29న నిర్వహించారు. ఈ ఏడాది దీని ఇతివృత్తం ‘వాటి మనుగడ మన చేతుల్లో ఉంది’. 2010లో రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు.
బ్రిక్స్ కౌంటర్
బ్రిక్స్ కౌంటర్-టెర్రరిజం వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం జూలై 28, 29 తేదీల్లో వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం వంటి వాటిని అడ్డుకోవడానికి కలిసికట్టుగా పనిచేసే విషయంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాలని చర్చించారు.
రష్యా-భారత్ నేవీ విన్యాసాలు
రష్యాలోని బాల్టిక్ సముద్రంలో జూలై 28, 29 తేదీల్లో భారత్, రష్యా నేవీ విన్యాసాలు నిర్వహించారు. రష్యా 325వ నౌకాదళ దినోత్సవం సందర్భంగా ‘ఆపరేషన్ ఇంద్ర’ పేరుతో ఈ విన్యాసాలు చేపట్టారు. 2003 నుంచి ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి ఐఎన్ఎస్ తబర్, రష్యా ఫెడరేషన్ నేవీ నుంచి కార్వెట్ ఆర్ఎఫ్ఎస్జీ నౌకలు ఈ విన్యాసాల్లో
పాల్గొన్నాయి.
వార్తల్లో వ్యక్తులు
వీణారెడ్డి
అంతర్జాతీయ అమెరికా మిషన్ అభివృద్ధి సంస్థకు డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన వీణారెడ్డి జూలై 27న బాధ్యతలు స్వీకరించారు. గతంలో కాంబోడియా, మయన్మార్ దేశాలకు మిషన్ అభివృద్ధి డైరెక్టర్‌గా పనిచేశారు.
బసవరాజు బొమ్మై
కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై జూలై 28న ప్రమాణం చేశారు. ఆయన 2008లో బీజేపీలో చేరారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు.
రాకేష్ ఆస్తానా
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్తానా జూలై 28న నియమితులయ్యారు. ఈయన 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేశారు.
గణపత్రావ్ దేశ్‌ముఖ్
మహారాష్ట్రలో పీజంట్ అండ్ వర్కర్స్ పార్టీ సీనియర్ నాయకుడు గణపత్రావ్ దేశ్‌ముఖ్ జూలై 30న మరణించారు. ఆయన షోలాపూర్ జిల్లా సంగోలా నియోజకవర్గం నుంచి 1962-2019 మధ్యకాలంలో 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 52 ఏండ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సాధించారు.
నారాయణమూర్తి
డీఆర్డీవోలో మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ (ఎంఎస్ఎస్-క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థ) విభాగానికి డైరెక్టర్ జనరల్ (డీజీ)గా బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి జూలై 30న నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ ఎంఎస్ఆర్ ప్రసాద్ పదవీ విరమణ చేశారు. భారత్ తొలిసారిగా చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగాని (మిషన్ శక్తి)కి అవసరమైన అడ్వాన్స్డ్ ఏవినాయిన్స్, డిజైన్, అభివృద్ధి ప్రాజెక్టుకు నాయకత్వం వహించారు.
క్రీడలు
చెస్ చాంప్ సంహిత
ఆసియా పాఠశాలల అండర్-7 ఆన్లైన్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన పీ సంహిత విజేతగా నిలిచింది. జూలై 25న నిర్వహించిన ఈ పోటీలో ఇరాన్‌కు చెందిన హెమతియన్పై గెలుపొందింది.
నందు నటేకర్
భారత బ్యాడ్మింటన్ తొలి తరం ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన నందు నటేకర్ జూలై 28న మరణించాడు. 1961లో అర్జున అవార్డు అందుకున్న తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా నిలిచాడు. 1933లో మహారాష్ట్రలో జన్మించిన ఆయన 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించాడు.
రగ్బీలో ఫిజీకి స్వర్ణం
ఒలింపిక్స్‌లో జూలై 28న నిర్వహించిన రగ్బీ సెవెన్స్‌లో ఫిజీ స్వర్ణ పతకం సాధించింది. 27-12తో న్యూజిలాండ్‌పై గెలిచింది. రగ్బీలో ఫిజీ స్వర్ణం గెలవడం ఇది రెండోసారి. గతంలో రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచింది. రగ్బీ ఫిజీ జాతీయ క్రీడ.
వందేండ్ల తరువాత బ్రిటన్‌కు స్వర్ణం
బ్రిటన్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో వందేండ్ల తరువాత స్వర్ణాన్ని సాధించింది. జూలై 28న నిర్వహించిన పురుషుల 4X200 మీ. ఫ్రీైస్టెల్ రిలేలో డీన్ స్వర్ణ పతకం సాధించాడు. 1912లో మహిళల స్విమ్మింగ్‌లో బ్రిటన్ స్వర్ణం గెలిచింది.
టేబుల్ టెన్నిస్‌లో చైనాకు స్వర్ణం
ఒలింపిక్స్‌లో జూలై 29న నిర్వహించిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో చైనా స్వర్ణాన్ని సాధించింది. ఈ పోటీలో స్వర్ణం గెలవడం చైనాకు వరుసగా ఇది తొమ్మిదోసారి. ఫైనల్ పోటీలో చైనాకే చెందిన చెన్ మెంగ్, సన్ యింగ్షా తలపడ్డారు. చెన్ మెంగ్ స్వర్ణం సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌ను ప్రారంభించినప్పటి నుంచి మహిళల సింగిల్స్‌లో చైనానే స్వర్ణం సాధిస్తుంది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- KTR
- National Blinken
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు