దాల్ మే కుచ్ కాలా హై..
తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒక కొత్త దుక్నం పెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. రాజన్న రాజ్యం తెలంగాణకు కొత్త కాదు. ఆ రాజ్యం ఎట్లా ఉంటదో, ఆ రాజ్య స్వభావం ఏందో తెలంగాణ ప్రజలు చూసినవారే. జలయజ్ఞం పేరుమీద నీటి దోపిడీ రాజకీయాలు నడిపిన రాజన్న రాజ్యాన్ని తెలంగాణ ఇంకా మరచిపోలేదు. ఆంధ్రాలో ఆయన వారసుడి రాజ్యం మరపు రానివ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకుంటూ కృష్ణా గోదావరి జలాల్లో తన వాటాను సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో రాజన్న రాజ్యం నినాదంతో ఆంధ్రా వలసవాదం మళ్లీ తెలంగాణలో చొరబడాలనుకుంటున్నది. ఈ నేపథ్యంలో.. రాజన్నరాజ్యంలో నీటి దోపిడీ రాజకీయాలను మరొక్కసారి మననం చేసుకుందాం.
జలయజ్ఞం తాత్విక భూమిక: 2005లో వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలయజ్ఞంకు రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించడం, రెండోది గోదావరి నీటిని ఆంధ్రకు తరలించడం. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సుమారు 250- 300 టీఎంసీల కృష్ణా నీటిని తరలించడానికి రాజన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు- శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని (ఎండీడీఎల్) 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచడం, 11 వేల క్యూసెక్కుల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు అదనంగా 44 వేల కూసెక్కులను తరలించుకపోవడానికి 10 తూములను నిర్మించడం, ఈ నీటిని నిల్వ చేసుకోవడానికి రాయలసీమలో 250 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలను నిర్మించడం. ఇకపోతే, శ్రీశైలం నుంచి తరలించుకుపోయే 250 టీఎంసీల కృష్ణా నీటి లోటును ఆంధ్ర ప్రాంతానికి సమకూర్చడానికి ప్రభుత్వం గోదావరిపై రెండు ప్రాజెక్టులను చేపట్టింది. ఒకటి పోలవరం, రెండోది దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ లింక్ పథకం. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి 225 టీఎంసీల నీరు సమకూరుతుందని ఆంధ్ర ప్రాంత నాయకత్వాన్ని నోరెత్తకుండా చల్లబర్చినాడు.
ఈ క్రమంలో తెలంగాణకు కూడా న్యాయం చేస్తున్నానని నమ్మబలకడానికి ప్రాణహిత చేవెళ్ళ పథకాన్ని ప్రారంభించినాడు. అప్పటికే ప్రారంభమైన మరికొన్ని భారీ మధ్యతరహా ప్రాజెక్టులను జలయజ్ఞంలో చేర్చి తెలంగాణ నాయకత్వాన్ని నోరెత్తకుండా చేయగలిగినాడు. 2009 ఎన్నికల నాటికి రాయలసీమ ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు అదనపు తూముల నిర్మాణం, పోలవరం కుడి కాలువ, పులిచింతల, రాయలసీమలో 250 టీఎంసీల జలాశయాల నిర్మాణం పూర్తయినాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే వెలిగొండ టన్నెల్ నిర్మాణం ప్రారంభమైంది. కృష్ణా నదిపై నాగార్జునసాగర్ కింద పులిచింతల పూర్తయింది. తెలంగాణ ప్రజలు ఎంత డిమాండ్ చేసినా పట్టించుకోని నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ డ్యాం నిర్మాణం ప్రారంభమైంది. తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం భూసేకరణ జరుగక, అటవీ అనుమతులు లేక, అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాక, నిధులు లేక తెలంగాణ వచ్చేదాక దేకుతూనే ఉన్నాయి. రాజన్న ప్రభుత్వం కుట్రలను సమర్థంగా, పదునైన విశ్లేషణతో బహిర్గతం చేసినవాడు దివంగత విద్యాసాగర్‌రావు.
రాజన్న వారసుడి రాజ్యం: తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలను నెరవేర్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలవుతుంటే, రాజన్నరాజ్యం తెస్తనని ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన రాజన్న వారసుడి ప్రభుత్వం ముందరికాళ్ళ బంధం వేసే ప్రయత్నంలో ఉంది. రాజన్న కంటే రెండాకులు ఎక్కువ చదివిన వారసుడు ఏకంగా శ్రీశైలం జలాశయాన్నే రాయలసీమకు మలుపుకపోవడానికి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడానికి రెండు డజన్లకు పైగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి జీవోలు జారీ చేసిండు. ఈ వివరాలను సీఎం కేసీఆర్ 2020 అక్టోబర్ 2న కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
గోదావరి కృష్ణా నదులపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆమోదించిన/ ప్రారంభించిన ప్రాజెక్టులనే తెలంగాణ కొనసాగిస్తున్నది తప్ప కొత్తవి కాదు. కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, ఎలిమినేటి మాధవరెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భక్తరామదాసు, మిషన్ భగీరథ ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో దేవాదుల ఫేజ్-3, సీతారామ, తుపాకులగూడెం, చనాఖ కొరాటా, రామప్ప- పాకాల కాలువ, కాళేశ్వరం (మూడో టీఎంసీ), మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఉన్నాయి. సీఎం కేసీఆర్ వీటిని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా వివరంగా చెప్పి, ఇవి అపెక్స్ కౌన్సిల్ పరిధిలోకి రావని వాదించారు. ఇప్పుడు రాజన్న వారసుడి ప్రభుత్వం వీటిని కొత్త ప్రాజెక్టులని ఆరోపిస్తున్నది. ఆపివేయాలంటూ కేంద్ర మంత్రితో, నదీ బోర్డులతో లేఖలు రాపిస్తున్నది. ఇందులో కృష్ణా బేసిన్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టినవి తుమ్మిళ్ల, భక్తరామదాసు పథకాలు మాత్రమే. పాత రాజోలిబండ పథకానికి నీరు ఇచ్చేదే తుమ్మిళ్ళ పథకం, కొత్త నీటి కేటాయింపులు లేవు. భక్తరామదాసు పథకం కూడా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కేటాయింపుల నుంచి ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం, కూసుమంచి తదితర కరువు పీడిత మండలాలకు నీరిచ్చే పథకం. గోదావరి బేసిన్లో ఒక్కటి కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టినవి కావు. వివిధ సమస్యల కారణంగా వాటిని రీ-ఇంజినీరింగ్‌తో పూర్తిచేసుకుంటున్నాం.
ఉమ్మడి ప్రభుత్వం గోదావరి జలాల్లో 967.98 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ నీటిని సంపూర్ణంగా వాడుకునేందుకు కాళేశ్వరం, సీతారామ, చనాఖా కొరాటా, దేవాదుల, సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) తదితర ప్రాజెక్టులను చేపట్టింది. తెలంగాణలో 18.25 లక్షల ఎకరాలకు సాగు నీరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, చెరువుల కింద ఉన్న మరో 26.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, దారిపొడుగునా వందల గ్రామాలకు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించే బృహత్తర పథకం కాళేశ్వరం ప్రాజెక్టు.
ఇది 20 తెలంగాణ జిల్లాలకు జీవధార కాబోతున్నది. ఇదే విధంగా కరువుకు, వలసలకు మారు పేరు అయిన మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి సాగునీటి సౌకర్యం పొందని రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు, దారిపొడుగునా వెయ్యికి పైగా గ్రామాలకు తాగునీరు అందించేది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, దారిపొడుగూతా గ్రామాలకు తాగునీరు అందించే పథకం డిండి ఎత్తిపోతల పథకం.
రూపం మార్చిన వలసవాదం: తెలంగాణ పొలిమేరలు దాటిన వలసవాద పార్టీలు, తెలంగాణలో వారి దళారీ వర్గాలు అదను కోసం వేచి చూస్తున్నయి. ఏదో రకంగా చొరబడటానికి ప్రయత్నాలు మళ్ళీ షురు అయినయి. ఈసారి నినాదం మారింది. రూపం మారింది. రాజన్నరాజ్యం అంటూ ప్రజలను మత్పరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజానీకం ఈ నినాదాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే వలసవాదం మరో రూపంలో చొరబడుతుంది. వలసవాద దళారీవర్గాలు బలం పుంజుకుంటయి. ఇప్పుడిప్పుడే కళకళలాడుతున్న తెలంగాణ తిరిగి వలసవాదం బారిన పడకుండా కాపాడుకోవలసింది తెలంగాణ ప్రజానీకమే. దాల్ మే కుచ్ కాలా హై..
తెలంగాణ పొలిమేరలు దాటిన వలసవాద పార్టీలు, తెలంగాణలో వారి దళారీ వర్గాలు అదను కోసం వేచి చూస్తున్నయి. ఏదో రకంగా చొరబడటానికి ప్రయత్నాలు మళ్ళీ షురు అయినయి. ఈసారి నినాదం మారింది… ఇప్పుడిప్పుడే కళకళలాడుతున్న తెలంగాణ తిరిగి వలసవాదం బారిన పడకుండా కాపాడుకోవలసింది తెలంగాణ ప్రజానీకమే. దాల్ మే కుచ్ కాలా హై..
శ్రీధర్‌రావు దేశ్‌పాండే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు