రామభక్తి కాదు బీజేపీ రాజకీయ భక్తి
పక్షపాతం అంటే రెక్కల చప్పుడు అని చప్పున గుర్తుకువచ్చే మాట. ఈటల చుట్టూ ప్రతిపక్ష శ్వేనాల రెక్కల చప్పుడు ఇప్పుడు వినబడుతున్నది. నిన్న మొన్నటిదాకా చూపులు కూడా కలవనివారు, తమ మధ్యన పడ్డ పచ్చిగడ్డిని పెట్రోలు పోసి వరిగడ్డిలా భగ్గున మండించిన వారు, దిగ్గున లేచి కావలించుకొని మిత్రులు కావడం వేరే రంగాల్లో అరుదేమో కానీ, రాజకీయరంగంలో అతి సామాన్యం కదా. ఎప్పుడో క్రీ.పూ.నాలుగో శతాబ్దంలోనే కౌటిల్యుడు అర్థశాస్త్రంలోని రాజమండల విభాగంలో, చెప్పిన వాస్తవం శత్రువుకు శత్రువును వెంటనే మిత్రునిగా చేసుకోవాలనే నీతి, నేటి తెలంగాణ బీజేపీ నాయకులకు బాగా పనికివస్తున్నట్లు కనిపిస్తున్నది.
నిన్న మొన్నటిదాకా ఈటల రాజేందర్‌ను కనురెప్ప
లేపి చూడని బీజేపీ వారికి ఈ రోజు ఆత్మబంధువు ఎలా అయ్యాడు? కేసీఆర్ ప్రభుత్వం ఆయన్ను భూఆక్రమణదారుగా, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాలయ భూములను కబ్జా చేసిన వ్యక్తిగా గుర్తించి పదవీభ్రష్టుని చేయగానే, బీజేపీ వారు ఆయనకు ఆత్మీయ నేస్తం అయినట్లు ఆయన మీద సానుభూతి వర్షం కురిపిస్తున్నారు. ఆయన్ను వెనుకేసుకొస్తూండటానికి కారణం ఈటల నేడు కేసీఆర్‌కు, కేసీఆర్ పార్టీకి, ప్రభుత్వానికి వైరిపక్షం కావడం ఒక్కటే కారణం కదా!
నిన్న మొన్నటిదాకా నాయకుల భూఆక్రమణల గురించి ఎన్నో ఆరోపణాస్ర్తాలు సంధించిన బీజేపీ నాయకులకు ఈటల ఆక్రమణలను కళ్లు విప్పి చూసే ధైర్యం లేదా? లేకపోతే కేసీఆర్‌కు వైరిపక్షంలో ఉన్నవాడు కాబట్టి కావలించుకొని కళ్లు మూసుకోవాలని నిర్ణయించుకున్నారా? అసలు నేటి విపక్షం వారికి ఉన్న రాజకీయ దృష్టి ఏమిటి? ఈ విపక్ష నాయకులు ఈటలతో చేసే చర్చలు ఏమిటి? వీరు ఈటల చేసిన భూకబ్జాలను సమర్థించాలనుకుంటున్నారా? ఇదే రేవంత్‌రెడ్డి మీద అదే విధమైన ఫిర్యాదుల్లేవా? మీరు ఎవరిని సమర్థించాలని అనుకుంటున్నారు? సామాజిక న్యాయం, బీసీ కార్డు ప్రయోగించే నేతల్లారా, బీసీలకు సామాజిక న్యాయం జరగాల్సిందే. రాజ్యపాలన వ్యవస్థలో బీసీలకు వారి న్యాయమైన వాటా వారికి దక్కవలసిందే. అయితే అవినీతికి గురైన నాయకులకు తక్షణం ఉద్వాసన పలకడం రాజనీతి, రాజధర్మం కాదా? ప్రభుత్వ బాధ్యత కాదా? ఈటల కొత్త దోస్తు అయితే ఆ కారణంగానే ఆయనకు దేవాలయ భూములను కబ్జా చేసేందుకు ఇమ్యూనిటీ వస్తుందా. మీరు ఈ మాత్రం ప్రశ్నించే విజ్ఞతని కోల్పోతున్నారా?
స్వాతంత్య్రానికి ముందునుంచి కూడా దేవాలయ భూములు అంగబలం ఉన్నవాడికి అప్పనంగా దొరికేవిగా, కాజేసేవాడికి కాజేసినంత సంపదగా మారుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఐదారు దశాబ్దాల్లో కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమవుతూ ఉంటే కొందరు నేతలు వాటిలో భాగం పంచుకుంటూ వారికి అందినంతవరకు వారు గుటకాయ స్వాహా చేయలేదా? ఈ కారణంగానే నేడు బీజేపీ నేతలకు కాంగ్రెస్ వారికి ఈటల ప్రాణ మిత్రుడు అయ్యాడా?
యాభై ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ వారు, ఉమ్మడి రాష్ట్రంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లోకి పోతుంటే, ఒక సమగ్ర చట్టం చేసిన పాపానపోయారా? నిజాం పాలనలో 1875లో సాలార్జంగ్ భూ సంస్కరణలు చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఆయినా సమగ్రమైన భూసంస్కరణల చట్టం తెచ్చే ప్రయత్నం చేశారా? సింహాద్రి అప్పన్న గుడికి చెందిన వందల ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల ముసుగులో కొందరు నాయకులు, అక్కడి బలమైన వర్గాల వారు ఆక్రమించుకొని, వ్యయసాయం చేసుకున్నా, ఇండ్లు కట్టుకున్నా దశాబ్దాల పాటు కోర్టు వ్యవహారాలు నడిపారు కానీ ఆ భూములను కాపాడుకున్నారా? శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గుడి భూములు వందల ఎకరాలు ఎవరి పాలయ్యాయో మీకు తెలియదా? ఉగ్రవాదుల పేరుతో కబ్జా చేసింది ఎవరు? దేవదాసీల మాన్యాలను సైతం కబ్జా చేసింది ఎవరు? నేడు శ్రీకాకుళాంధ్ర స్వామి గుడికి ఎన్ని భూములు మిగిలాయి? మిగతా వందల ఎకరాలు ఎవరి కబంధ హస్తాల్లో ఇరుక్కున్నాయి? వాటి అనుభవదార్లు ఎవరో చెప్పగలిగే ధైర్యం మీకు ఉందా? తిరుమలేశుడి భూములు వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాలున్నాయి. అవి ఎవరెవరి చేతుల్లో మగ్గుతున్నాయి? దేవాలయ భూములు కౌలురైతుల పేరుతో ఆక్రమించి అక్కడ స్థిరాస్తులు ఏర్పాటుచేసుకున్న చరిత్రలు ఎవరికున్నాయి?
ఉత్తరభారతంలో ఆశ్రమాల పేరిట కొన్ని వందల వేల ఎకరాల్లో దేవాలయాల భూములు ఎవరి అధీనంలో పెట్టుకొని, అక్కడ ప్రైవేటు సైన్యాలను సైతం పెట్టుకొని, అక్కడ నాటి అఖిలేశ్‌యాదవ్ ప్రభుత్వానికే సవాలు విసిరి, పోలీసు కాల్పుల దాకా వచ్చినట్టు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాలేదా. బిహార్‌తోపాటు ఇతర ఉత్తరభారత రాష్ర్టాల్లో ఆశ్రమాల పేర వందల వేల ఎకరాలలో భూకబ్జాల విషయమై, అక్కడి రైతుల గోస పోసుకొని, ప్రభుత్వ వర్గాలతో ఘర్షణ పడినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు అప్పుడే మర్చిపోయారా? ఈ ఆశ్రమాల భూ ఆక్రమణల వెనుక ఏ పార్టీలు, నాయకులు ఉన్నారనే విషయమై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉందా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుంచి కేసీఆర్ ప్రభుత్వం ఈ భూకబ్జాల గురించి, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కావడం గురించి దృష్టిసారించిందని, సమగ్రమైన భూచట్టం తీసుకురావాలని ప్రయత్నం చేసినదని కనీసం రోజు పత్రికలు చదివేవారికి ఎవరికైనా తెలుస్తుంది. చాంద్రాయణగుట్టలో కేశవగిరి భూములు, గడ్డి అన్నారంలోని వేంకటేశ్వరస్వామి, రంగనాథస్వామి ఆలయం, ఇతర దేవాలయాలకు చెందిన భూములు, అమ్మపల్లి సీతారామచంద్ర స్వామికి చెందిన భూములు అన్యాక్రాంతం కావడం గురించి అక్కడ దేవాలయ భూముల్లో కబ్జాదారులు భవనాలు కట్టడం గురించి 2019లోనే విస్తారంగా ఇదే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చిన విషయాలు మర్చిపోయారా? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అక్కడి కబ్జాదారులపైన చర్యలు తీసుకోలేదా? అప్పుడు కబ్జాదారులను కాపాడటానికి ప్రయత్నం చేసింది ఎవరు? అమ్మపల్లి ప్రాంతంలో భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపింది, వాటిని కాపాడింది ఏ ప్రభుత్వమో ఈ నాయకులకు గుర్తుకురావడం లేదా?
దేవుడి పెళ్లికి ఊళ్లో వాళ్లంతా పెద్దలే అనే సామెత నిజమే. అయితే దేవుడి మాన్యాలు దయ్యాల పాలు అని మీరు కొత్త సామెత చెప్పదలచుకున్నారా? నేడు దేవుడి భూములు ఎవరికి బలం ఉంటే వారికే అన్నచందంగా మారితే ప్రభుత్వం చూస్తూ ఉరుకోవాలా? అటువంటి రాజకీయ నాయకులపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం తమ బాధ్యతగా సమర్థించాలి.
స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత నేటికీ కేసీఆర్ ప్రభుత్వం
ఒక సమగ్ర భూచట్టాన్ని తయారుచేసి, రాష్ట్రంలోని భూమిని శాస్త్రీయంగా నేటి డిజిటల్ సాంకేతికతో సర్వే చేసి ప్రతి అంగుళానికి లెక్కకడుతూ ఉంది. సమగ్ర సమాచారాన్ని ప్రతి పౌరుని వేలికొసలపైన అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ వచ్చింది. దీనిద్వారా పౌరుని భూమికి ఉన్నది ఎకరమైనా, వంద ఎకరాలైనా, దేవుని మాన్యమైనా, వక్ఫ్ భూమి అయినా, చర్చి ఆస్తి అయినా సొంత
దారునికి సమగ్రమైన శాశ్వతమైన రక్షణ కల్పించే దిశగా పనిచేస్తున్నది. ఈ క్రమంలోనే స్వ పర భేదం లేకుండా, తన
పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే విచక్షణ లేకుండా భూఆక్రమణ దారులపైన చర్యలు తీసుకుంటున్నది.
చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డగించే పనిచేస్తున్నది. ఈ పనులకు పూర్తి మద్దతు ఇచ్చి, దేవాలయ భూములను కాపాడటానికి ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, చౌకబారు రాజకీయాలు చేయడం, ఈటలకు సంఘీభావం చెప్పడం, ప్రభుత్వంపైనే బురద చల్లే ప్రయత్నాలు చేయడం విపక్షాలకు తగని పని. ఇప్పటికైనా చౌకబారు విమర్శలకు దిగకుండా రాజకీయ హూందాతనాన్ని పాటించాలి. రావణుడు సీత నిలుచున్న గడ్డను లేపినట్లు, అసైన్డ్, దేవాలయ, ప్రభుత్వ భూమలును గోళ్లతో పట్టి లేపాలనుకునే రాబందుల రెక్కలు విరిచే ప్రభుత్వ ప్రయత్నాలకు పార్టీ రాజకీయాలకు అతీతంగా నాయకులు ప్రవర్తించాలి. రాజ్యం చేసే భూరక్షణ చర్యలను సమర్థించాలి. అలా సమర్థించకపోతే వారికి ప్రజలు సరైన రీతిలో పాఠం చెప్పే పరిస్థితి తప్పకుండా వస్తుంది. దేవరయాంజాల్‌లో కబ్జాకు గురైనవి సీతారాముడి భూములు. ఆలయ భూమిలో కొంత తన స్వాధీనంలో ఉన్నట్టు ఈటల స్వయంగా అంగీకరించారు. మరి ఈ మాట బీజేపీ నేతలకు ఎందుకు వినిపించడం లేదు! రాముడి భూమి కబ్జా అయిన వాస్తవం కళ్లెదుట ఉన్నా ఎందుకు కనిపించడం లేదు! జైశ్రీరాం అంటూ ప్రజలను రెచ్చగొట్టే వారి రామభక్తి ఏమైంది? చూస్తుంటే అది రామభక్తిలా అనిపించడం లేదు, రాజకీయ భక్తిలా కనిపిస్తున్నది.
రావణుడు సీత నిలుచున్న గడ్డను లేపినట్లు, అసైన్డ్, దేవాలయ, ప్రభుత్వ భూమలును గోళ్లతో పట్టి లేపాలనుకునే రాబందుల రెక్కలు విరిచే ప్రభుత్వ ప్రయత్నాలకు పార్టీ రాజకీయాలకు అతీతంగా నాయకులు ప్రవర్తించాలి. రాజ్యం చేసే భూరక్షణ చర్యలను సమర్థించాలి. అలా సమర్థించకపోతే వారికి ప్రజలు సరైన రీతిలో పాఠం చెప్పే పరిస్థితి తప్పకుండా వస్తుంది.
దేవుడి పెళ్లికి ఊళ్లో వాళ్లంతా పెద్దలే అనే సామెత నిజమే. అయితే దేవుడి మాన్యాలు దయ్యాల పాలు అని మీరు కొత్త సామెత చెప్పదలచుకున్నారా? నేడు దేవుడి భూములు ఎవరికి బలం ఉంటే వారికే అన్నచందంగా మారితే ప్రభుత్వం చూస్తూ ఉరుకోవాలా? అటువంటి రాజకీయ
నాయకులపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం తమ బాధ్యతగా సమర్థించాలి. కానీ, శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే కౌటిల్య నీతి పాటించి కబ్జాదారులను కౌగిలించుకోవడం తగిన పనేనా?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు