పంటలో రాజ్య భాగాన్ని నిర్ణయించే అధికారి?
ఏప్రిల్ 28వ తేదీ తరువాయి..
రెండో విక్రమేంద్ర వర్మ (క్రీ.శ.555-569)
ఇతడు చిన్న వయస్సులోనే (16 సంవత్సరాలు) సింహాసనాన్ని అధిష్టించాడు.
ఇతడి బిరుదు ‘సకల భువన రక్షాభరణైక్తాశ్రయ’ ఇతడి రాజ్య విస్తృతి చాలా విశాలమైందని సూచిస్తుంది.
ఇతడు తన 11వ పాలనా సంవత్సరంలో పల్లవ రాజైన సింహవర్మన్ చేసిన దండయాత్రను ఎదుర్కొని, తన కింది స్థానిక రాజులు అందించిన సహాయంతో సింహవర్మన్ను తరిమికొట్టినట్లు తుమ్మలగూడెంలో లభ్యమైన శాసనాల్లో ఉంది.
దాదాపు అన్ని శాసనాల్లో విక్రమేంద్రవర్మన్ను నీతిమంతుడైన రాజుగా (ఉత్తమాశ్రయ) చిత్రీకరించారు.
ఇతడు పల్లవ రాజు సింహవర్మన్పై విజయానికి గుర్తుగా ఇంద్రపాలనగరంలో గోవింద వర్మ భార్య మహాదేవి నిర్మించిన విహారానికి ‘ఇరుందెర’ అనే గ్రామాన్ని దానం చేశాడు.
రెండో విక్రమేంద్ర వర్మ పల్లవులతో పోరాడుతున్న సమయంలోనే ఇతడి సామంత రాజు రణదుర్జయ వంశానికి చెందిన ‘పృథ్వీమహారాజు’ పిష్టపురంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.
అయితే పృథ్వీ మహారాజును ఓడించడానికి పిష్టపురంపై దండెత్తిన రెండో విక్రమేంద్ర వర్మ అక్కడ జరిగిన యుద్ధంలో మరణించాడు (30 ఏండ్ల వయస్సులో)
మాధవ వర్మన్-II (క్రీ.శ.576-623)
విక్రమేంద్ర వర్మన్-2 చనిపోయే సమయానికి అతడికి సంతానం లేదు.
అతడి తరువాత విష్ణుకుండినుల్లోని సమాంతర శాఖకు చెందిన మాధవ వర్మన్-4 రాజపదవిని స్వీకరించాడు.
రాజపదవిని అధిరోహించిన వెంటనే మాధవ వర్మన్ తన శత్రువులను ఓడించి, విష్ణుకుండినుల రాజ్యానికి పూర్వ వైభవాన్ని పునరుజ్జీవింపజేశాడు.
అంతేకాకుండా ఈ వంశం, రాజ్యం, కీర్తి ప్రతిష్టలను అధికం చేయడానికి ఇతడు అశ్వమేధ, ఇతర వైదిక యజ్ఞాలను నిర్వహించాడు.
ఇతడు మహా విజ్ఞాని, పండితుడు, న్యాయ పాలనలో తనకుతానే సాటి అనిపించుకున్నాడు.
హిరణ్యగర్భ దానం చేసి ‘సువర్ణగర్భ ప్రసూతుడు’ అని పేరుపొందాడు.
ఇతడికి ‘జనాశ్రయ’ అనే ప్రత్యేకమైన బిరుదు కూడా ఉంది. ‘జనాశ్రయ ఛందో విచ్ఛితి’ అనే ఛందశ్శాస్ర్తాన్ని రాశాడు. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం.
612వ సంవత్సరంలో మాధవ వర్మన్-IV కళింగను జయించి తర్వాత జైపూర్ వరకు వెళ్లాడు.
ఇతడు పొలమూరు, ఈపూరు శాసనాలు వేయించాడు. ఈ శాసనాల ప్రకారం ఇతడి బిరుదులు..
‘జనాశ్రయ, అవసరిత వివిధ దివ్య’- పొలమూరు శాసనం
‘న్యాయ శాస్త్ర విశారదుడు, సూక్ష్మగ్రాహి’- ఈపూరు శాసనం
మంచన భట్టారక వర్మ (క్రీ.శ.623-624)
ఇతడు మాధవ వర్మన్-IV కుమారుడు.
విష్ణుకుండినుల్లో చివరివాడు. బీఎన్ శాస్త్రి ప్రకారం మంచన భట్టారక వర్మ ఒక సంవత్సరం పాలించాడు.
ఇతడిని పృథ్వీమూల మహారాజు ఓడించినట్లు ‘తాండివాడ’ శాసనం ద్వారా తెలుస్తుంది.
పరిపాలనా విధానం
విష్ణుకుండినులు ‘శ్రీపర్వత స్వామి’ పాదాలను పూజించడంవల్ల ప్రజాపాలనాధికారం పొందామని చెప్పడంతో పాటు వారి నాణేలపై కూడా ‘శ్రీపర్వత’ అనే అక్షరాలు చెక్కించారు.
విష్ణుకుండిన రాజ్యంలో రాజే సర్వాధికారి, నిరంకుశుడు. అయితే మంత్రిమండలి అభిప్రాయాలకు కూడా రాజాస్థానంలో సముచితమైన స్థానం ఉండేది. వీరు తమ రాజ్యాన్ని రాష్ర్టాలుగా, రాష్ర్టాన్ని విషయాలుగా, విషయాన్ని గ్రామాలుగా విభజించారు.
రాష్ర్టానికి పాలకుడు రాష్ట్రికుడు. విష్ణుకుండినుల రాజ్యంలో ‘పఱకి రాష్ట్రం, ప్లక్కి రాష్ట్రం, కర్మ రాష్ట్రం, కళింగ రాష్ట్రం’ మొదలైన రాష్ర్టాలుండేవి. విషయానికి పాలకుడు ‘విషయాధిపతి’. వీరి రాజ్యంలో ‘శృతనవాడి విషయం, నేత్రపాటి విషయం’ మొదలైన విషయాలుండేవి.
ఈ పాలనా విభాగాలు గాక రాజ్యంలో కొంత భాగానికి రాజు కొడుకులను ‘యువరాజు’గా నియమించేవారు. ఇంకా కొన్ని సామంత రాజ్యాలు విష్ణుకుండిన రాజ్యానికి లోబడి పాలించేవి.
కొందరు సామంతులతో విష్ణుకుండినులు వైవాహిక సంబంధాలను ఏర్పర్చుకున్నారు. ఇటువంటి సంబంధాలు విష్ణుకుండినుల రాజ్య రక్షణకు, విస్తృతికి దోహదం చేశాయి. రాజుకు రాజ్యాన్ని పరిపాలించడంలో యువరాజు, మహామాత్య, అమాత్య, రహస్యాధికారి, ఆంతరంగికుడు మొదలైన అధికారులు తోడ్పడేవారు.
వీరికాలంలో కొందరు ఉద్యోగులు
హస్తి కోశ గజ దళాధిపతి
వీర కోశ పదాతి దళాధిపతి
రజ్జకులు భూములను కొలిచి ఆయకట్టు నిర్ణయించేవారు
ఫలదారుడు పండిన పంటలో రాజ్య భాగాన్ని నిర్ణయించే అధికారి
శెట్టి ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని కొలిచేవాడు
అక్ష పటలాధీకృత ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే అధికారి శాసన ఆజ్ఞపులు
లేఖకులు రాజు ఆజ్ఞను లిఖించే అధికారులు
గుల్మికుడు గ్రామాధికారి
ఆర్థిక పరిస్థితులు
విష్ణుకుండినుల నాటికి గ్రామాల్లో స్వయం సమృద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఉండేది. అంటే వ్యవసాయదారులు, వివిధ వృత్తుల ప్రజలు ఒకరిపై ఒకరు ఆధారపడి బతికేవారు.
రాజులు వ్యవసాయాభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నారు. విష్ణుకుండినులు అనేక వ్యవసాయ బావులు, చెరువులను తవ్వించారని శాసనాలు తెలుపుతున్నాయి.
వర్తక వ్యాపారాలు
విష్ణుకుండిన రాజ్యంలో స్వదేశీ, విదేశీ వర్తక వాణిజ్యాలు కొనసాగాయి. వీరి నాణేలు తెలంగాణలో ఏలేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్‌లలో, ఆంధ్రలోని బొజ్జన్నకొండ, యలమంచిలి, మహారాష్ట్రలోని నాసిక్, ఖానాపూర్‌లో, మధ్యప్రదేశ్‌లోని బ్రహ్మగిరి తదితర ప్రదేశాల్లో దొరికాయి. వీరి నాణేలపై శంఖం, సింహం గుర్తులను ముద్రించారు.
రెండో మాధవ వర్మకు ‘త్రిసముద్రాధిపతి’ అనే బిరుదు ఉండటం వారి విదేశీ వాణిజ్య ప్రాముఖ్యాన్ని సూచిస్తున్నాయి. మోటుపల్లి, కోడూరు మొదలైన తూర్పు తీర పట్టణాల నుంచి బర్మా, సయాం, కంబోడియా, చైనా, జపాన్, సిలోన్, సుమత్రా, జావా, బోర్నియా, మలయ, అరకాన్, ఈజిప్ట్, రోమ్, గ్రీస్ దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది.
విష్ణుకుండినుల రాజ్యంలో ‘గవ్వలు’ కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయని చైనా యాత్రికుడు ‘ఫాహియాన్’ రాశాడు. మరో చైనా యాత్రికుడు ‘హ్యుయాన్‌త్సాంగ్’ శ్రీపర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ విగ్రహాలు ఉన్నాయని రాశాడు.
n అవి దొరకలేదు కానీ ఒకటి నుంచి ఐదు అంగుళాలు ఎత్తున్న రాగి బుద్ధ విగ్రహాలు దొరికాయి. వీటిని బట్టి ఆనాడు కంసాలి వృత్తి పనివారు మంచి నైపుణ్యంగలవారని తెలుస్తుంది.
n కీసరగుట్టపై దొరికిన ఒక ‘నశం డబ్బి (పోత ఇనుముతో మామిడి పిందె ఆకారంలో చేసినది-7 సెం.మీ.)’ ఇందుకు మరో నిదర్శం. మొత్తం మీద విష్ణుకుండినుల కాలంలో బిక్షువులు, బ్రాహ్మణులు, అనాథలు, యాచకులు, దీనులు అందరూకూడా అనుభవించేంతగా, న్యాయంగా సంపాదించిన ధనసమృద్ధి ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆనాటి ఆర్థిక వ్యవస్థ పటిష్టమైందని చెప్పవచ్చు.
సామాజిక పరిస్థితులు
విష్ణుకుండినులు ‘దానమానాదులచే అనురక్తమగు వర్ణాశ్రమ స్వజన పరిజనులైనవారు’ అని వారి శాసనాల్లో ఉంది. ఇలా వారు చాతుర్వర్ణాలవారు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) తమతమ వృత్తిధర్మాలను పాటించేటట్లుగా చేసే ప్రయత్నం చేశారు. మొదటి రెండు కులాలకు ఎక్కువ గౌరవముండేది.
విష్ణుకుండిన రాజుల్లో కొందరు ‘పరమ బ్రహ్మణ్య, బ్రహ్మక్షత్ర తేజస్సు’ బిరుదులు ధరించడం, హిరణ్యగర్భ యాగం చేయడం వల్ల వీరు మొదట శూద్రులై ఉండి అనేక యాగాలు చేసి క్షత్రియులుగా మారారని తెలుస్తుంది.
బ్రాహ్మణులకు అగ్రహారాలతో పాటు ఆ గ్రామంలో సాగుచేస్తున్న రైతులను, వేల సంఖ్యలో దాసీదాస జనాలను దానం చేసేవారు. వీరి వల్ల వ్యవసాయాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి జరిగేదేమో కాని వీరు మానవ హక్కులను కాలరాసినట్లు అర్థమవుతుంది.
నరమేధ యజ్ఞాలు (నరబలి) చేసిన రోజుల్లో ఇది పెద్ద విషయమేమీకాదు. వైశ్యులు వ్యాపారాల్లో నిమగ్నమయ్యేవారు. శూద్రుల్లో కంసాలి వారు, శిల్పులు, చేనేత పనివారు మొదలైనవారికి సముచిత స్థానం ఉండేది.
రైతులు దేశానికి వెన్నెముక కాబట్టి కొందరు రైతులకు కూడా అగ్రహారాలను మాన్యాలతో పాటు దానం చేశారు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు