తెలంగాణ సాహిత్య ఉద్యమకారులు
నిత్య చైతన్యగడ్డ తెలంగాణ. నిరంకుశ రాజులను ఎదిరించి నిలిచిన తెలంగాణ ఆధునిక కాలంలో కూడా అదే పోరాటాన్ని, తెగువను చూపి దోపిడీకి వ్యతిరేకంగా గెలిచి నిలిచింది. ఈ పోరాటాలకు నిత్యస్ఫూర్తిదాతలుగా నిలిచిన కళాకారులు, కవులు ఎంతోమంది ఉన్నారు. ఆధిపత్య వలస పాలనలో మరుగునపడ్డ మన కవులను, వారి సేవలను వెలుగులోకి తేవటం, స్మరించుకోవటం ప్రస్తుతం తెలంగాణ పౌరులందరి బాధ్యత. పోటీ పరీక్షల్లో కూడా ఆ మహానుభావుల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున కొందరు కవులు, వారి రచనల గురించి నిపుణ పాఠకుల కోసం..
దాశరథి కృష్ణమాచార్యులు :
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణపై తన మమకారాన్ని చాటిన కవి దాశరథి. ఆయన 1925, జూలై 22న వరంగల్ జిల్లాలోని మానుకోట తాలూకా చిన్నగూడురులో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచారి. 1953లో తెలంగాణ రచనల సంఘాన్ని స్థాపించారు. మా నిజాం రాజు జన్మజన్మల బూజు అని గర్జింజిన దాశరథి మహాంధ్రోదయం, మార్పు నా తీర్పు, ధ్వజమెత్తిన ప్రజ, అగ్నిధార, రుద్రవీణ, అమృతాభిషేకం, గాలిబ్ గీతాలు, తిమిరంతో సమరం, కవితా పుష్పకం వంటి అనేక రచనలు చేశారు. వాటిలో ప్రముఖమైనది అగ్నిధార. అగ్నిధారను వట్టికోట ఆళ్వార్స్వామికి, రుద్రవీణను తెలంగాణ ప్రజలకు అంకితం ఇచ్చారు. తిమిరంతో సమరం రచనకు గాను 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. కవితా పుష్పకం అనే రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977, ఆగస్టు 15 నుంచి 1983 వరకు దాశరథి పనిచేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్న దాశరథి 1987, నవంబర్ 5న మరణించారు.
కూరెళ్ల విఠలాచార్య :
1940, జూలై 9న నల్లగొండ జిల్లా వెల్లంకిలో జన్మించారు. నల్లగొండ పరిశోధక మండలి వ్యవస్థాపకులు. నీరునెముల గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యతగా మార్చిన ఘనుడు. రామన్నపేటలో చైతన్య కళాస్రవంతిని, సాహితీ సాంస్కృతిక మిత్ర మండలి అనే సంస్థలను స్థాపించారు. సుమాంజలి, నవోదయ, విద్యున్మాలల్లో వీరి రచనలు ఉన్నాయి. తెలుగు నవలలై స్వాతంత్య్రోద్యమ చిత్రణ , దేశం పేరిట ప్రతిజ్ఞ చేయండి (వచన కవిత), ఎలిజాలు, విఠలేశ్వర శతకం రాశారు. ప్రసుత్తం రామన్నపేట వద్ద వెల్లంకిలో పెద్ద గ్రంథాలయం నిర్వహిస్తున్నారు.
దాశరథి రంగాచార్యా :
1928లో వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. దాశరథి కృష్ణమాచార్యా తమ్ముడు. నిజాంకు వ్యతిరేకంగా తన బాల్యంలోనే సమ్మె చేశారు. పోలీసు నిర్బంధానికి గురయ్యారు. తెలంగాణ పల్లెల్లో గడిపిన అనుభవంతో 40వ ఏట చిల్లరదేవుళ్లు నవల రాశారు. ఇది తెలంగాణ సాంఘిక జీవనానికి దర్పణం పట్టింది. ఇది సినిమాగా కూడావచ్చింది. తెలంగాణలో జాగిర్దారీ విధానాన్ని నిరసిస్తూ పల్లె జివితాన్ని వివరిస్తూ 1940-60ల మధ్య జనపదం నవల, ఏది నిజం 4వ నవల, స్వీయ చరిత్ర జీవనయానం రాశారు. నాలుగు వేదాలను వచనంగా అనువదించారు. ఇంకా మహాభారతాన్ని, భాగవతాన్ని, ప్రేమ్‌చంద్, బుద్ధభగవానుడు, శంకర జీవిత చరిత్ర, సారథి, రామానుజ చరితం మొదలైన జీవిత చరిత్రలు రాశారు. పరిశీలన, అక్షరమందాకిని, కలంబొమ్మలు, వేదిక మొదలైన వివర్ణ గ్రంథాలు, పిల్లల కోసం మహాత్ముడు, వివేకానంద రాశారు. కేదారం, తెలుగు, అప్సానా, కోనాల్బంగ్లా నాటకాలు అనువాదం చేశారు. 1970లో సాహిత్య అకాడమి అవార్డు (చిల్లరదేవుళ్లు), 1997లో విశాఖపట్నంలో గురజాడ అవార్డు, 1998లో కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, 1999లో యువ కళావాహిని అవార్డు, 2001లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, 2004లో అన్నమాచార్య ఆధ్యాత్మిక అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస అవార్డు, 2004,2009లో రాజీవ్ ప్రతిభా అవార్డులు వచ్చాయి. వీరు ఇటీవలే మరణించారు.
ముడుంబ వరదాచార్యులు :
1935, ఏప్రిల్ 15న యాదగిరిగుట్టలో జన్మించారు. అర్ధభారతి, కళాకౌముది జాతీయ సాహిత్య పరిషత్ సంస్థలను స్థాపించి, సాహిత్యాన్ని వ్యాపింపజేస్తూ చైతన్యం కలిగిస్తున్నారు. నా తెలంగాణ తల్లిఅనే పద్యాలను రాసి వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి, సి.నా.రె, వానమామలై వరదాచార్యులు లాంటి వారి తో కలిసి ఎన్నో సమావేశాల్లో చదివి వినిపించారు. చేనేతలక్ష్మి పత్రికలో అనేక పద్యాలు రాశారు. వీరు భక్తకవిగా ప్రసిద్ధులు.
సుంకరి రమేష్ :
1971లో నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జన్మించారు. 9వ తరగతి నుంచే సాహితీప్రక్రియలు చేపట్టారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఆంగ్ల పాఠ్యపుస్తకంలో Flower Boat అనే కవితను రాసి నల్లగొండ జిల్లాకే పేరు తెచ్చారు. తెలంగాణ కవిత పేరుతో ఉద్యమ సాహిత్యాన్ని 5 సంకలనాలుగా(2006-2010ల మధ్య) వెలువరించారు. ఈ సంకలనాల ఆవిష్కరణ ఒకేరోజు తెలంగాణ అంతటా 100 పట్టణాల్లో ఆవిష్కరణ అనేది చరిత్రలోకి ఎక్కవలసిన అంశం. హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా ఈ సంకలనాలు ఉన్నాయి.
నెమలికొండ రంగాచార్యులు :
1929, సెప్టెంబర్ 20న నల్లగొండ జిల్లా ధర్మాపురంలో జన్మించారు. నల్లగొండ జిల్లాలో జరిగిన రజాకార్ల వ్యతిరేకోద్యమంలో రంగాచారి దళం ఏర్పాటు చేసి పోరాడారు. పోలీసు చర్యకు ముందు మునగాల కాంగ్రెస్ కార్యకర్తల శిబిరంపై బాంబు పేలిన ఘటనలో అరెస్టయ్యారు. బుర్రకథ కళాకారుడు కూడా. మిత్రద్రోహులు అనే కవిత రాసి పుస్తకంగా ప్రచురించి వచ్చిన డబ్బును చైనా దురాక్రమణ జరుగుతున్నప్పుడు భారత రక్షణ రంగ నిధికి పంపించారు. ప్రజాపుష్పాలుపద్యాకృతి రాశారు. భానుపురి (సూర్యాపేట) కవిత్రయంలో (నెమలికొండ రంగాచార్యులు, కందాళ లక్ష్మి నరసింహచార్యులు, శ్రీ పెరంబుదురు లక్ష్మినరసింహచార్యులు) ఒకరు.
వేదాటి రఘుపతి :
నమిలె గ్రామం. చిన్న వయస్సులోనే అవధానాలు చేసి అష్టవధానిగా ప్రఖ్యాతులైనారు. మెదక్ జిల్లా కవులు, రచయితలుపై పరిశోధన చేశారు. ఖమ్మంలోని రమ్య సాహితీ సంస్థ, సూర్యాపేటలోని భానుపురి సాహితీ సమితిల్లో ముఖ్యులు.
ఇడుకుడు రఘువీరాచారి :
చండూరు మండలంలోని పుల్లెంల గ్రామం. చండూరు సాహితీ మేఖలలో కార్యనిర్వాహక సభ్యులు. సాహితీ కుసుమాలు సంకలనంలో దోమకాటు దొంగ పద్యాలు ప్రముఖమైనవి.
కాంచనపల్లి చిన్నవెంకట రామారావు (21.4.1921 – 13.3.1992) :
నల్లగొండ జిల్లాలోని రావిపహాడ్ గ్రామం. మావూళ్లో కూడానా!, అరుణరేఖలు రచనలు రాశారు. దర్పణం పత్రికకు సంపాదకత్వం వహించారు. సైకిళ్లపై ప్రయాణించి 5,6వ ఆంధ్ర మహాసభల్లో వలంటిర్గా పాల్గొన్నారు. వీరు 1935లో పానగల్లులో ప్రతాపరుద్ర ఆంధ్ర గ్రంథాలయం స్థాపించారు. అక్కినేపల్లి జానకిరామారావు గారితో కలిసి గడ్డిఅన్నారంలో గ్రంథాలయం ఏర్పాటుచేశారు. 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖ ను నల్లగొండలో స్థాపించారు. మావుళ్లో కూడానా! కథలు చండూరు సాహితీమేఖల వారు అచ్చువేశారు. 1954లో బేరారు యువరాజు పర్యటన తెలంగాణలో ఏర్పాటు చేసినప్పుడు, ఆ పర్యటన వెనక ఆంతర్యాన్ని యువరాజు పర్యటనపేరుతో అరుణ పత్రికలో రాశారు.
అంబటిపూడి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి :
ఇతను అంబటిపూడి వెంకటరత్నం కుమారుడు. 15-9-1946లో జన్మించారు. వీరు రాసినది రత్నదీవిటి.
కోదాటి నారాయణరావు :
1914, డిసెంబర్ 16న నల్లగొండ జిల్లా రేపాలలో జన్మించారు. కోదా టి వారు అనగానే గ్రం థాలయోద్యమం గుర్తు కు రాకమానదు. ఇంకా సహకారోద్యమం, భూదానోద్యమంతోనూ సంబంధం ఉంది. ఇతను రాసిన గ్రంథం చిన్ననాటి జ్ఞాపకాలు. ఏడేండ్ల వయస్సులోనే సొంతూరులో గ్రంథాలయం స్థాపించారు. సర్వజ్ఞ పేరుతో ప్రతిధ్వని, తెలంగాణ, గోలకొండ, సుజాత, మీజాన్ అనే పత్రికల్లో వ్యాసాలు రాశారు. ధ్రువతారవై వెలుగు మాకేతనమా అనే గేయాలు ఇప్పటికీ నల్లగొండ జిల్లా ప్రజల నాల్కలపై నిలిచే ఉన్నాయి. కేఎల్ఎన్ రావు గారికి గెలుపునాదే నాటకం రాయించి ప్రదర్శింపజేశారు. నల్లగొండ జిల్లాలో ఒక ఉన్నత కుటుం బం నుంచి వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్న ప్రథమవ్యక్తి కోదాటి నారాయణరావు.
మద్దోజు సుగుణాచారి :
సాహితీ మేఖలలో ముఖ్యులు. మధుర కవి, నటుడు, చిత్రకారుడు, గాయకుడు కూడా. నల్లగొండ జిల్లాలో చదువు వెలుగు కార్యక్రమానికి గేయా లు రచించారు. వీరు సత్యనారాయణచారి కుమారుడు.
కపిలవాయి లింగమూర్తి :
1928, మార్చి 30న మహబూబ్‌నగర్ జిల్లా జినుకటలో జన్మించారు. ప్రసిద్ధ కవి పండితుడు అయిన ఆయన తల్లి దండ్రులు వెంకటాచలం, మాణిక్యవల్లి. ఉస్మానియా వర్సిటీలో ఎంఓఎల్ డిగ్రీ చేశారు. చారిత్రక పరిశోధకులుగా, స్థల పురాణాల పరిశోధకులుగా ప్రసిద్ధి చెందారు. ఈయన తొలి రచన జినుకుంట రామశతకం, నగరకందనూరు, పండరీనాథ విఠలశతకం, ఆర్యశతకం, దుర్గాభర్తశతకం, శ్రీ సాయి శతక ద్వయం, గద్వాల హనుమద్వచనాలు, పాలమూరు దేవాలయాల చరిత్ర, వైజయంతీ కల్యాణోదాహరము, పాలమూరు జిల్లా మాండలికం, యయాతి చరిత్రపై వ్యాఖ్యానం, పాలమూ రు జిల్లా కవి పండితాంశాలు, పాలమూరు జిల్లా గ్రామాల చరిత్ర, భగవతా కధతత్వం, వీర జనోమనోవిరాజితం, ఉదాహరణ ప్రక్రియలు వంటి మొత్తం 110కి పైగా రచనలు ఉన్నాయి.
ఈయన నోరి నరసింహశాస్త్రి, బీఎన్ శాస్త్రి పురస్కారాలను అందుకున్నారు. 2016, జూన్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఉత్తమ పండిత అవార్డు అందుకున్నారు.
కాళోజీ నారాయణరావు :
1914, సెప్టెంబర్ 9న వరంగల్ జిల్లా మడికొండ జన్మించారు. తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందారు. భగత్‌సింగ్‌ను ఉరితీసినప్పుడు ఆయనను స్మరిస్తూ పాటలు రాశారు. గ్రంథాలయోద్యమం, తెలంగాణోద్యమం, జాతీయోద్యమంతో పాటు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర వహించారు. నిజాం ప్రభుత్వం 1938లో ఏర్పడిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను నిషేధిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించగా రెండున్నరేండ్లపాటు జైలు జీవితం గడిపారు. 1946లో జెండాను ఎగరేసినందుకు అరెస్టయ్యారు. నా గొడవ 1953లో వెలువడింది. 1952,1978ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1958లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో పద్మవిభూషణ్పురస్కారం లభించింది. తెలంగాణ త్రయంగా (కోదాటి నారాయణరావు, కొమరగిరి నారాయణరావు, కాళోజీ నారాయణరావు) పిలువబడుతున్న వారిలో ఒకరు. నా గొడవ తొలి ఆవిష్కరణ 1923లో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించింది. తన ఆత్మకథను ఇది నాగొడవ పేరుతో ప్రచురించారు. సమాజానికి వర్తించే నగ్న సత్యాలే వీరికి కథావస్తువులు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎన్నో పాటలు రాశారు. ఎత్తుగడ, ఎత్తిపొడుపు, అధిక్షేపం, వ్యంగ్య చమత్కారాలు వీరి కవితల్లో ప్రత్యేకత. 2002, నవంబర్ 12న తొంభయవ ఏట మరణించారు.
బిన్నూరి నరసింహశాస్త్రి (బీఎన్ శాస్త్రి)
ఇతనికి శాసనాల శాస్త్రి అని కూడా పేరు. 1933, మార్చి 1న నల్లగొండ జిల్లా వలిగొండలో జన్మించారు. విష్ణుకుండినుల శాసనాలను వెలికితీసి, వారి నివాసం, రాజధాని నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం అని నిరూపించిన చరిత్రకారుడు. నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల సర్వస్వాలు తయారు చేశారు. మూసీ పత్రికను 1981లో ప్రారంభించారు. వాకాటక మహాదేవి, విష్ణుకుండినుల చరిత్ర, రజాకార్ల చర్యలను తెలిపే నవల విప్లవజ్వాల, ఆంధ్రుల సాంఘిక చరిత్ర( సురవరం రాయగా మిగిలింది), గోలకొండ చరిత్ర- సంస్కృతి, ఆంధ్రదేశ చరిత్ర -సంస్కృతి (3 భాగాలు), భారతదేశ చరిత్ర- సంస్కృతి (8 భాగాలు), శాసన సంపుటి, త్రిపురాంతక దేవాలయ శాసనాలు, రేచర్ల రెడ్డివంశ చరిత్ర-శాసనాలు, చెఱుకు రెడ్డివంశ చరిత్ర-శాసనాలు, గోలకొండ చరిత్ర -సంస్కృతి, శాసనాలు, ముఖలింగ దేవాలయ చరిత్ర- సంస్కృతి, శాసనాలు, కందూరి చోడుల శాసనాలు, బెజవాడ దుర్గామల్లీశ్వరి శాసనాలు, వేములవాడ చరిత్ర, శాసనాలు, రేచర్ల పద్మనాయకులు, కాయస్థ రాజులు, తుక్కాదేవి, రాధ, జీవనపథం, జీవిత గమనం, విప్లవ జ్వాలరి, వాకాటకదేవి, పాపాయి పతకం, తపోభంగం, నీరాజనం, నిరాయిదారు, గ్రామజీవితం, సహకారం. ఇతను శతాధిక గ్రంథకర్త. ఆధునిక చరిత్రకారులెందరో వీరి బాటలోనే నడుస్తున్నారు. 2002 ఏప్రిల్ 4న మరణించారు.
ఆదిరాజు వీరభద్రరావు(1890-1973)
ఖమ్మం జిల్లా మధిర తాలుకా దెందుకూరులో జన్మించారు. జీవిత చరితావళి, ప్రాచీనాంధ్రనగరములు, తెలంగాణము, గ్రీకు పురాణ దేవతలు, షితాబ్ఖాన్చరిత్ర, మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్ర మొదలైనవి రచించారు. సుజాత, శోభ, ప్రగతిన, మీజాన్, నీలగిరి, తెలుగు పత్రిక, కాకతీయ, భాగ్యనగరం, తెలుగుదేశం తదితర పత్రికలతో చక్కని సంబంధాలు కలిగి వ్యాసాలు రాశారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (1901), విజ్ఞాన చంద్రికాగ్రంథ మండలి (1905), ఆంధ్ర జన సంఘం (1921), పరిశోధన మండలి (1922), విజ్ఞానవర్ధిని పరిషత్ (1941), ఆంధ్రసారస్వత పరిషత్ (1943), ఆంధ్రచంద్రికా గ్రంథమాల (1948), ఆంధ్రబాలికోన్నత పాఠశాల మొదలైన సంస్థలలో పని చేశారు. ఇంకా సంగ్రహంది విజ్ఞాన కోశ సమితి, 1957లో సాహిత్య అకాడమితో కూడా మంచి సంబంధాలు ఉన్నా యి. విజ్ఞాన చంద్రిక గ్రంథమాల సంస్థ 1908లో హైదరాబాద్ నుంచి మద్రాస్‌కి మార్చినప్పుడు ఆదిరాజుగారు అక్కడికి వెళ్లి కొంతకాలం లేఖకుడిగా పనిచేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మేల్కొల్పిన మొదటితరం వారిలో ఆదిరాజు వీరభద్రరావుగారు ఒకరు. సురవరం, కొమర్రాజు, కందుకూరి, చిలుకూరి వీరభధ్రరావు, గురజాడ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేమూరి విశ్వనాథశర్మ వంటి విద్వాంసులతో చాలా సన్నిహిత సంబంధాలు వీరికి ఉన్నాయి.
మరుగున పడిన మన రచయితలు
ధవళ శ్రీనివాసరావు (1918-80) :
నల్లగొండ జిల్లా చం డూరు మండలం కోటయ్యగూడెంలో జన్మించారు. చం డూరు సాహితీ మేఖల మూలస్థంభాల్లో ఒకరు. వీరి రచనలు ధవళశ్రీ (ఖండకావ్యం). నీలగిరి సారస్వత సమితి స్థాపించబడి యువ రచయితల సంకలనం తొలిసంజ పేరున వెలువడింది.
మద్దోజు సత్యనారాయణ :
1930లో చండూరులో జననం. 1991లో మధురస్మృతులు (ఖండకావ్యం)ను సాహితీ మేఖల ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.
ముడుంబ సీతారామానుజాచార్యులు :
1916న హుజూర్నగర్ మండలం బూరుగుగడ్డలో జన్మించారు. సంగీత విద్వాంసులు, కవి సముద్రాల రాఘవాచార్యులు వద్ద భక్తకుచేల, ఋష్యశృంగ, సత్యనారాయణ మహత్మ్యం వంటి సినిమాలకు నేపథ్యగానం అందించారు. సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, సముద్రాల, పి. నాగేశ్వరరావు వంటి వారితో వీరికి పరిచయం ఉంది. సాహితీ మేఖల వార్షికోత్సంలో ఇతని శిక్షణలో ప్రదర్శితమైన నాటకాలు బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావుల ప్రశంసలందుకున్నాయి.
పులిజాల హనుమంతరావు :
1919లో కొండాపురంలో జన్మించారు. చండూరు సాహితీ మేఖల మూలస్థంభం. ఇతను సాహితీ మేఖల ప్రచురించిన పుస్తకాలకు అమూల్యమైన పీఠికలు రాశారు.
పాంపాటి చినహనుమంతు గుప్త :
1916లో చం డూరులో జన్మించారు. సాహితీ మేఖలకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అస్పృశ్యులు (పద్యకవిత), ఉష:కిరణాలు (కవితాఖండిక) రచించారు. ఇతను అంబటిపూడి వెంకటరత్నం శిష్యులు.
రామడుగు శ్రీమన్నారాయణ శర్మ :
17-7-1935లో కనగల్ మండలం చిన్న మాధవరంలో జన్మించారు. ముట్నూరి కృష్ణారావు జీవితం – సాహిత్యం రచించారు. సాహితి మేఖల సౌజన్యంతో రాగవీణ ప్రచురితమైంది.
పాశం నారాయణరెడ్డి (1909-82) :
మర్రిగూడ మండలం ఖుదాభక్ష్పల్లిలో జన్మించారు. వీరి రచనలు త్యాగమూర్తులు, సాధుమూర్తులు, బంగ్లాదేశ్ (బుర్రకథ), దయానంద్ సరస్వతి (బుర్రకథ), సత్రాజాతీయం(వీధినాట కం), సదాశివరెడ్డి పద్యకావ్యం (1990), భారతదేశ చరిత్ర (బతుకమ్మపాట)లాంటివి రాశారు. ఇతను పదోప్రాయం నుంచే కవిత్వం మొదలుపెట్టారు.
సిరిప్రగత భార్గవరావు (1923-55) :
నల్లగొండ జిల్లాలోని కస్తాలలో జన్మించారు. చండూరు సాహితీ మేఖల వ్యవస్థాపక శిష్యుల్లో ఒకరు . ఇతని రచన భార్గవానందలహరి. సాహితీ మేఖల వెంకటరత్నం, భార్గవరావుల మధ్య అవినాభావ సంబంధం గల వ్యక్తులు- సంస్థలు. ఇతను కవి, స్వాతంత్య్ర సమరయోధులు.
పులిజాల గోపాలరావు (1910-89) :
చండూరు మండలంలోని దొనిపాములలో జన్మించారు. ఇతను సాహితీ మేఖ ల నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒక స్థితిని కలిగించిన వారిలో ఒకరైన మంచికవి. ఖడ్గతిక్కన, వియోగతీతి, శతకమంజరి, రామచంద్రప్రభూ శతకం, ధర్మజీవన్ (నాటకం), కష్టజీవి, స్మృత్యాంజలి, శ్రీరామ శతకం, శ్రీవెంకటేశ్వర శతకం, విజయ భాస్కరం (నాటకం), పల్లె బ్రతుకు, తెలుగుపొలము లాంటి రచనలు చేశారు.
ఏలె ఎల్లయ్య (1904-90) :
నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకిలో జన్మించారు. ఇతను సాహితీ మేఖల సభల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు పొందిన కవి. వీరికి కవిరాజు సిద్ధాంత శిరోభూషణ బిరుదు కలదు. చిన్నవి పెద్దవి కలిపి 50 గ్రంథాలు రాశారు. బీదరైతు, సీతాకళ్యాణం, సాంఘిక నాటకం, ఆంధ్రశబ్దమంజరి, హిందూవివాహనిధి, ఏలెవాస్తు, భృగువంశం, మార్కండేయ సుప్రభాతం,కర్ణవధ, కులం తదితర రచనలు రాశారు. ఈయన జీవితంపై కూరెళ్ల విఠలాచార్య గ్రంథం రాశారు.
నాగార్జున కనకాచారి :
1929లో నల్లగొండ మండలం దో మలపల్లిలో జన్మించారు. ఇతని రచనలు నల్లగొండ పిచ్చోడు, కాలజ్ఞానం, మేలుకొలుపు, ఇంకా నైజాం విప్లవ పోరా ట చరిత్ర, కోదాడ రజాకార్ చిచ్చు, విప్లవ ఢంకా (బుర్రకథలు)కూడా రాశారు. ఇతను ఆయుర్వేద వైద్యులు కూడా.
ఆచార్య జయధీర్ తిరుమలరావు :
1950లో వరంగల్‌లో జన్మించారు. తెలుగు సాహిత్యంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం ఉన్న సాహిత్యాన్ని, కళారూపాల్ని వెలికి తేవాలన్న ఆలోచనతో పరిశోధన కృషి కొనసాగిస్తున్నారు. తెలంగాణ రైతాంగపోరాటం, ప్రజాసాహిత్యం, ప్రజాకళారూపాలు, డాక్యుమెంటరీ సినిమా, దళిత గేయాలు, స్త్రీవాద కథలు, జానపద చారిత్రక గేయ కథలు రచనలు రాశారు. ఇతను తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, తెలుగు అకాడమిలో పరిశోధక శాఖలో కూడా పనిచేశారు.
ఆచార్య పేర్వారం జగన్నాథం :
23-8-1934లో వరంగల్ జిల్లా ఖిలాషాపురం మండలం సర్వాయి పాపన్న ఉన్న గ్రామంలో జన్మించారు. వృషభపురాణం, సాగర సంగీ తం, గరుడపురాణం, ఆరె జానపదుల గాథలు, సర్వాయి పాపన్న గ్రంథాలను రచించారు. ఇతను తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేశారు.
సి.హెచ్ రాజేశ్వరరావు:
10-8-1923లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకా మాదిపాడులో జన్మించారు. ఇతను క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 6 నెలలు జైలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. 1957,62,72 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచి రచయిత కూడా.
పుచ్చా పరబ్రహ్మశాస్త్రి :
1921,జూన్‌లో జన్మించారు. ఇతని స్వస్థలం గుంటురు జిల్లా తెనాలి అయినప్పటికీ, తెలంగాణ పరిశోధనకే తన జీవితాన్ని అంకితం చేశారు. బ్రహ్మలిపి తెలిసిన చరిత్రకారుడు. సంస్కృతం, కన్నడ భాషల్లోని శాసనాలను చదవగలరు. ఇతను కనుగొన్న శాసనాల్లో కాకతీయ గణపతి చక్రవర్తి బయ్యారం చెరువు శాసనం ముఖ్యమైంది. కాకతీయుల చరిత్రపై పరిశోధన చేశారు. రుద్రమ్మ మరణ శాసనం – చందుపట్ల (1289)ను నల్లగొండ జిల్లా లో కనుగొన్నారు. కాకతీయ శాసన సాహిత్యంతో పాటు తదితర పద్య శాసనాల గ్రంథాలు రాశారు. ది కాకతీయాస్ అండ్ దేర్ టైమ్స్ అంశంపై పీహెచ్డీ కూడా చేశారు.
తెలంగాణ నుంచి వెలువడిన పత్రికలు
కాకతీయ – పాములపర్తి సదాశివ, వరంగల్
జనధర్మ, వరంగల్ వాణి (దినపత్రిక)
విశ్వజ్యోతి (1968)- వరంగల్ నుంచి వెలువడింది. ఇది తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఒక చారిత్రక పత్రం గా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది.
విద్యుల్లత- జమ్మికుంటలో ప్రారంభమైంది
జీవగడ్డ (దినపత్రిక)- కరీంనగర్
1968లో బైస రాందాసు మహబూబ్‌నగర్, నిజామాబాద్ నుంచి వెలుగు పత్రికను నడిపారు.
మషీర్-ఎ-దక్కన్ (దినపత్రిక)- ఎం. హనుమంతరావు
ఇమ్రోజ్ – షోయబుల్లాఖాన్. (రజాకార్లు ఈయనను హైదరాబాద్‌లో హత్యచేశారు)
హితబోధిని – బీ శ్రీనివాసశర్మ, బీ రామచంద్రరావు 1913, జూన్ 13న స్థాపించారు. ఇది మహబూబ్‌నగర్ నుంచి వెలువడింది. ఆత్మకూరు సంస్థానాధీశులు ఈ పత్రిక ముద్రణా యంత్రం కోసం ఆర్థిక సహాయం చేశారు.
తెనుగు – ఒద్దిరాజు సోదరులు రాఘవరంగారావు, సీతారామచంద్రరావులు 1922, ఆగస్టు 27న వరంగల్‌లోని ఇనుగుర్తిలో స్థాపించారు.
ఆంధ్రాభ్యుదయం (1925) – హన్మకొండ
దేశబంధు (1926)- బెల్లంకొండ నరసింహాచార్యులు
తరణి (1942)- సుబ్బరాయసిద్ధాంతి, సికింద్రాబాద్
శోభ (1947)- దేవులపల్లి రామానుజరావు
గ్రామజ్యోతి (గోడ పత్రిక)- బొబ్బల ఇంద్రసేనారెడ్డి, వరంగల్ జిల్లా జనగామ తాలూకా గూడూరులో నడిచింది. ప్రభుత్వానికి రూ. 50 జరిమానా కట్టిన మొదటి పత్రిక.
తెలంగాణ (1941-42)- బుక్కపట్నం రామానుజాచార్యులు. తెలంగాణలో వెలువడిన తొలి దినపత్రిక
దక్కన్ క్రానికల్ (1937- ఆంగ్లపత్రిక)- కే రాజగోపాల్, బుక్కపట్నం రామానుజాచార్యులు, హైదరాబాద్
కాంగ్రెస్ (వారపత్రిక)- 1956- దేవులపల్లి సుదర్శన్‌రావు, వరంగల్
ఆంధ్రశ్రీ (త్రైమాసిక పత్రిక)- 1944- సికింద్రాబాద్ నుంచి వెలువడింది. ఇది ఆంధ్రమహాసభకి చెందింది.
తెలుగుతల్లి- 1941- రాచమల్లు సత్యవతీదేవి (సంపాదకులు), సికింద్రాబాద్
భాగ్యనగర్- 1949- అయోధ్య రామకవి (సంపాదకులు), హైదరాబాద్
ఆంధ్రసారస్వత్ పరిషత్ పత్రిక- 1940- హైదరాబాద్
విద్యార్థివాణి- 1955- కేఎం నరసింహారావు
మీజాన్- కలకత్తాకు చెందిన గులాం మహ్మద్ స్థాపన.
సృజన (1966)- కాళోజీ సంపాదకత్వంలో నాలుగేండ్ల పాటు వెలువడింది. తరువాత నవీన్, అనంతరం విప్లవకవి వరవరరావు నడిపారు. 1973లో అరెస్టవడంతో ఆయన భార్య హేమలత నడిపారు.
జనధర్మ (1958)- ఎంఎస్ ఆచార్య
సుజాత- తెలుగువారి ఆడబిడ్డగా 1927లో వెలువడింది.
వరంగల్ వాణి (1980)- ఎంఎస్ ఆచార్య, ఇది 1994 వరకు నడిచింది.
మానుకోట (వారపత్రిక)- సీబీ లక్ష్మి, వరంగల్
కొన్ని పత్రికలు – ప్రారంభకులు
సత్యార్థ ప్రకాశిక – మంత్రి ప్రగడ వెంకటేశ్వర్రావు (1887-1993), లింగగిరి వాసి
గ్రామ వెలుగు (1942)- లక్ష్మీ నరసింహారావు (కేఎల్ఎన్ రావు), రేపాల
ప్రగతి, బాల సరస్వతి- కోదాటి నారాయణరావు, రేపాల నుంచి నడిపారు.
తొలి వెలుగు (వారపత్రిక)- పెరికె రాజారత్నం, పానుంగంటి నరసింహారావు
విశ్వాభ్యుదయ (మాస పత్రిక), వేదిక- జగిని ఆదినారాయణ గుప్త, కోదాడ
సాహితీ మేఖల- పున్న అంజయ్య (సంపాదకులు- 1993 నుంచి)
నీలగిరి (1922, ఆగస్టు 24)- షబ్నవీసు వెంకటరామ నరసింహారావు
విశ్వప్రకాశ- సూర్యాపేట నుంచి
ఉజ్వల- సంపాదకులు ఎన్ నరేందర్ రెడ్డి
సాహితీ మిత్ర (మాస పత్రిక)- సంపాదకులు సుతారి శివసుబ్రహ్మణ్యం, మిర్యాలగూడెం నుంచి వెలువడింది
మూసీ (మాసపత్రిక)- బీఎన్ శాస్త్రి, 1981 నుంచి ఆరేండ్ల పాటు నడిచింది
తెలుగు పరిశోధన- ఎన్ గోపీ, హైదరాబాద్ నుంచి నడిపారు
స్పందన (మాస పత్రిక)- మిర్యాలగూడెం నుంచి
ప్రపంచ శాంతి- వసంతరాయ్, మిర్యాలగూడెం నుంచి
దర్పణం- దీనిని జిల్లా రచయితల సంఘం స్థాపించింది
నాగార్జునవాణి- హుజూర్ నగర్ నుంచి వెలువడింది
ఆబ్కారీ సమాచార్- చెఱుకు ఉషాగౌడ్ సంపాదకత్వంలో గుడ్రాంపల్లి నుంచి వెలువడింది
భృగుభేరి- పున్న ఎల్లప్ప స్థాపించారు, సిరిపురం (రామన్నపేట)
తేజోప్రభ (1980)- దేవులపల్లి ప్రభాకర్‌రావు సంపాదకులు, సూర్యాపేట నుంచి వెలువడింది.
షాడో- బీ రాజు నల్లగొండ నుంచి నడిపారు
మూఢ విశ్వాసాలు- ఎస్ జగన్నాథం స్థాపించారు. నల్లగొండ
ప్రతిధ్వని (1972)- కొమర్రాజు మురళీధర్ రావు, ఇది నల్లగొండ నుంచి వెలువడిన పక్షపత్రిక
విపంచి- చెన్నూరి హనుమంతారావు హుజూర్నగర్ నుంచి నడిపారు
ప్రజాపోరు (1987)- యూసఫ్ బాబు సంపాదకులు
రయ్యత్ (1927)- మందుముల నరసింగరావు, ఇది ఉర్దూపత్రిక. దీనిని నిజాం ప్రభుత్వం 1929లో నిలిపివేసింది. మళ్లీ 1932లో పింగళి వెంకట రామిరెడ్డి సహాయంతో మొదలైంది.
తెలంగాణలో పత్రికోద్యమం
గ్రంథాలయోద్యమానికి తోడుగా తెలంగాణలో పత్రికోద్యమం కొనసాగింది. ప్రజలను జాగృతం చేసిన ఉద్యమాల్లో పత్రికల పాత్ర ప్రధానమైంది. తెలంగాణలో స్థాపితమైన తొలి తెలుగు పత్రిక శౌర్య చంద్రిక (1880లో). అనంతరం హితబోధిని, తెలుగు, నీలగిరి, గోలకొండ, సారస్వత, సుజాత, దేశబంధు, విభూతి, భాగ్యనగర్, తెలంగాణ, మీజాన్ మొదలైన దిన, అర్ధవార, వార, పక్ష, మాస పత్రికలు ప్రజల్లో చైతన్యానికి కృషిచేశాయి. వరంగల్ జిల్లా ఇనుగుర్తిలో ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు కలిసి 1922, ఆగస్టు 27న తెలుగు దినపత్రికను స్థాపించారు. ఇది ఐదేండ్ల పాటు నడిచింది. షబ్నవీసు వెంకటరామ నర్సింహారావు నల్లగొండలో నీలగిరి పత్రికను నడిపారు. అయితే తెలుగువారి మొదటి పత్రిక కర్నాటిక్ క్రానికల్ 1832లోనే వెలువడింది.
గోలకొండ- సురవరం ప్రతాపరెడ్డి. 1926, మే 10న ప్రారంభమైంది. 25 ఏండ్లపాటు వెలువడింది. 1966, ఆగస్టు 22న మూతపడింది. దీని తొలి పెట్టుబడి రూ. 75 వేలు.
సురవరం ప్రజావాణి పత్రికను ప్రారంభించడానికి ప్రయత్నించారు. కానీ అది నిలవలేదు.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






