Vemulawada Chalukyas | వేములవాడ చాళుక్యులు
వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్, తర్వాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతాలనే సపాదలక్ష దేశం అంటారు. అంటే ఒక లక్షా యాభై వేల బంగారు నాణేలు ఆదాయం కలిగిన దేశం (కొందరి అభిప్రాయం ప్రకారం లక్షాపాతిక వేల గ్రామాలు కలిగిన దేశం). గోదావరి నదికి దక్షిణానగల మంజీర నది నుంచి మహాకాళేశ్వర సర్వాంతం వ్యాపించి ఉన్న భూభాగమే పోదనాడు. దీన్నే సపాదలక్ష దేశం అంటారు. ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం.
వీరి చరిత్రకు ఆధారాలు: వీరికి సంబంధించి 6 శిలా శాసనాలు, 2 తామ్ర శాసనాలు లభించాయి.
-కురవగట్టు శిలాశాసనం (మహబూబ్‌నగర్), రెండో అరికేసరి వేయించిన కరీంనగర్ (క్రీ.శ.946), వేములవాడ, చెన్నూరు (క్రీ.శ.941) శిలాశాసనాలు, జినవల్లభుని కుర్క్యాల శాసనం (క్రీ.శ.940), కరీంనగర్ మ్యూజియంలోని శిలాశాసనాలు, మొదటి అరికేసరి కొల్లిపర తామ్ర శాసనం, మూడో అరికేసరి పర్బణి తామ్రశాసనం (క్రీ.శ.966) వీరి చరిత్రను తెలుపుతున్నాయి.
-అంతేగాక కరీంనగర్ జిల్లాలో వేములవాడ, రేపాక, కోరుట్ల, బొమ్మలగుట్ట (కుర్క్యాల) మొదలైన ప్రదేశాల్లో వీరు నిర్మించిన హిందూ, జైన ఆలయాలు వీరి గురించి తెలుసుకోవడానికి పురావస్తు ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి.
సాహిత్య ఆధారాలు
-పంపకవి రాసిన విక్రమార్జున విజయం, సోమదేవి సూరి రాసిన యశస్తిలక చంపూ కావ్యం, నీతి వాక్యామృతం మొదలైన గ్రంథాలు వీరికాలం నాటి మత, సాంఘిక, రాజకీయ విషయాలను తెలుసుకోవడానికి తోడ్పడుతున్నాయి.
-వీరి శాసనాల ప్రకారం వేములవాడ చాళుక్య వంశానికి మూల పురుషుడు సత్యాశ్రయ రణ విక్రముడు (క్రీ.శ.650-675), తర్వాత ఇతని కుమారుడు పృథ్వీపతి (క్రీ.శ.675-700), మహారాజు (క్రీ.శ.700-725), పృదు విక్రముడు (క్రీ.శ.725-750) పరిపాలన చేశారు. కానీ వీరి పాలనా వివరాలు, వారు ఎక్కడ పరిపాలించారు, వారి రాజ్య వివరాలు స్పష్టంగా తెలియడం లేదు.
వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750-775)
-ఇతను వేములవాడ చాళుక్య రాజ్యస్థాపకుడు. ఇతను ధారాశ్రయ జయసింహవర్మ కుమారుడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అయితే పులకేశి సోదరుడే ఈ వినయాదిత్య యుద్ధమల్లుడని కొందరివాదన.
-ఇతను రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడి వద్ద సేనాధిపతిగా ఉంటూ అనేక యుద్ధాల్లో పాల్గొని, చిత్రకోట దుర్గాన్ని జయించి దంతిదుర్గుడి మెప్పు పొందాడు.
-దంతిదుర్గుడు ఇతని సేవలకు గుర్తింపుగా బోధన్, కరీంనగర్ జిల్లాలతో కూడిన సపాదలక్ష అనే ప్రాంతానికి సామంతరాజుగా నియమించాడు.
-ఇతను బోధన్‌ను రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు వరకు విస్తరింపజేశాడు.
-పంపకవి విక్రమార్జున విజయం ప్రకారం ఇతనికి గజదళం ఎక్కువగా ఉందని, పోదన (బోధన్)లోని ఒక పెద్ద తైల తటాకంలో ఏనుగులన్నీ స్నానం చేసేవని తెలుస్తుంది.
-వినయాదిత్య యుద్ధమల్లుడు కాంభోజ, మగధ, కళింగ, గాంగ, పల్లవ, పాండ్య, కేరళ ప్రాంతాలను జయించాడని, ఈ రాజ్యాల ప్రభువులు యుద్ధమల్లునికి పాదపూజ చేశారని కొల్లిపర తామ్ర శాసనం పేర్కొంటుంది.
మొదటి అరికేసరి (క్రీ.శ.775-800)
-ఇతను వినయాదిత్య యుద్ధమల్లుని కుమారుడు. రాష్ట్రకూట ధృవుని సామంతుడు.
-ధృవునికి, అతని సోదరుడు రెండో గోవిందునికి జరిగిన వారసత్వ యుద్ధంలో అరికేసరి ధృవుడిని సమర్థించాడు.
-అంతేగాక రాష్ట్రకూట గోవిందునికి సాయంగా వచ్చిన తూర్పు చాళుక్యరాజు నాలుగో విష్ణువర్ధనుడిని అరికేసరి ఓడించి వేంగి, త్రికళింగలను జయించినట్లు కొల్లిపర శాసనం, విక్రమార్జున విజయం ద్వారా తెలుస్తున్నది.
-ఈ విజయాలకు గుర్తుగా ధృవుడు అరికేసరికి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలోని రామడుగు ప్రాంతాలను బహూకరించాడని కురవగట్టు శాసనం ద్వారా తెలుస్తున్నది.
-ఈ ప్రాంతాల చేరికతో వేములవాడ చాళుక్య రాజ్యం తూర్పు వైపునకు విస్తరించడంవల్ల మొదటి అరికేసరి తన రాజధానిని బోధన్ నుంచి వేములవాడకు మార్చాడు.
-మొదటి అరికేసరి కాలాముఖ శైవాచార్యుడైన ముగ్ధ శివాచార్యుడికి బెల్మోగ గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చాడు. బీఎన్ శాస్త్రి ప్రకారం బెల్మోగ అనే గ్రామం నల్లగొండ జిల్లాలోని పెద్దవూర గ్రామమని తెలుస్తున్నది.
-అరికేసరి గొప్ప విద్వాంసుడని, గజతంత్రం, ధనుర్విద్య, ఆయుర్వేదంలో ప్రజ్ఞ కలవాడని కొల్లిపర శాసనం తెలుపుతుంది. ఇతనికి సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజ త్రినేత్ర, సాహసరాయాది మొదలైన బిరుదులున్నాయి.
-మొదటి అరికేసరి తర్వాత కుమారులు వరుసగా మొదటి నరసింహుడు (800-825), ఇతని కుమారుడు రెండో యుద్ధమల్లుడు (825-850) పరిపాలించారు. అయితే వీరిద్దరి యాభై ఏండ్ల కాలంలో ఎటువంటి విజయాలు, విశేషాలు లేవు. తర్వాత రాజ్యానికి వచ్చిన బద్దెగ పేరు ప్రఖ్యాతులు పొందాడు.

బద్దెగ (850-895)
-ఇతడు రెండో యుద్ధమల్లుని కుమారుడు. ఇతనికి సోలదగండ అనే బిరుదు ఉంది. అంటే అపజయమెరుగని యోధుడని అర్థం.
-ఇతడు 42 యుద్ధాలు చేసి అన్నింట్లో విజయం సాధించాడు. అందుకే ఇతనికి ఈ బిరుదు వచ్చింది.
-బద్దెగుడు వేంగిరాజ్యంపై దండెత్తి మొదటి చాళుక్య భౌమున్ని ఓడించి, మడుగులోని భయంకర మొసలిని పట్టుకున్నట్లు చాళుక్య భీమున్ని బంధించినట్లు పర్బణి శాసనం తెలుపుతుంది.
-ఇతడు గుణగ విజయాదిత్యుడిని కూడా ఓడించినట్లు తూర్పు చాళుక్య శాసనాలు తెలుపుతున్నాయి.
-ఇతడు తన పేరుమీదుగా బద్దెగేశ్వర ఆలయాన్ని వేములవాడలో నిర్మించాడు. ఇదే ఇప్పుడు వేములవాడ (ప్రస్తుతం సిరిసిల్లా జిల్లా)లో ఉన్న భౌమేశ్వరాలయంగా ప్రసిద్ధి.
-బద్దెగుని తర్వాత అతని కుమారుడు మూడో యుద్ధమల్లుడు సింహాసనాన్ని అధిష్టించి (క్రీ.శ. 895-915) పాలించాడు. ఇతని పాలనా విశేషాల సమాచారం లేదు.
రెండో నరసింహుడు (క్రీ.శ. 915-930)
-ఇతను మూడో యుద్ధమల్లుని కుమారుడు. మహాశక్తిమంతుడైన యుద్ధవీరుడు. గంగానది వరకు దండయాత్ర చేసి తన వ్యక్తిత్వానికొక ప్రాధాన్యం కల్పించుకున్నాడు.
-ఇతడు రాష్ట్రకూట మూడో ఇంద్రుని సామంతుడు. మూడో ఇంద్రుని ఆజ్ఞ మేరకు రెండో నరసింహుడు ఉత్తర ప్రాంతంపై దండెత్తి లాట, సప్తమాళవను జయించి తదుపరి కనోజ్‌పై దండెత్తి ప్రతీహార రాజైన మహీపాలుని ఓడించి, అతని అశ్వాలకు గంగానదిలో స్నానం చేయించాడని తెలుస్తున్నది.
-ఆ తర్వాత విజయానికి చిహ్నంగా తిరిగి వస్తున్న క్రమంలో యమునా నది తీరంలో కాళప్రియం వద్ద విజయ స్తంభం నాటాడని తెలుస్తున్నది.
-ఈ ఉత్తర, మధ్య భారత ప్రాంతాల్లో రెండో నరసింహుడు చేసిన యుద్ధాలను కీర్తిస్తూ పంపకవి విక్రమార్జున విజయంలోనూ రెండో అరికేసరి వేములవాడ శాసనంలోనూ కళ్లకు కట్టినట్టు వర్ణించడం జరిగింది.
-ఇతని విజయాలను మెచ్చుకొని మూడో ఇంద్రుడు తన సోదరి జాకవ్వను రెండో నరసింహునికి ఇచ్చి వివాహం జరిపించాడు.
-రెండో నరసింహుని కాలంలో వేములవాడలో జైన చౌముఖాలు చెక్కించారు.
రెండో అరికేసరి (క్రీ.శ. 930-955)
-వేములవాడ చాళుక్యుల్లో అగ్రగణ్యుడైన రెండో అరికేసరి నరసింహ-II, జాకవ్వల కుమారుడు.
-రెండో అరికేసరిని పండితుడిగా, యుద్ధవీరుడిగా, మంచి పాలకుడిగా, గొప్ప నిర్మాతగా, కవి పోషకుడిగా కీర్తిస్తారు.
-ఇతని పోషణలోనే కన్నడ సాహిత్యంలో మొదటి గొప్ప గ్రంథం పంపకవి విక్రమార్జున విజయం రచించారు.
-ఇతను తన మేనమామ మూడో ఇంద్రుడి కుమార్తె రేవక నిర్మాడితో పాటు రాష్ట్రకూట రాకుమార్తె అయిన లోకాంబికను వివాహం చేసుకున్నాడు.
-రాష్ట్ర కూట రాజులైన బద్దెగుడు (మూడో అమోఘ వర్షుడు), నాలుగో గోవిందుడికి మధ్య జరిగిన వారసత్వ యుద్ధాల్లో రెండో అరికేసరి బద్దెగుడికి మద్దతు పలికి అతన్ని మూడో అమోఘ వర్షుడు అనే పేరుతో సింహాసనాన్ని అధిష్టింపజేశాడు.
-రెండో అరికేసరికి పాంబరాంకుశ, అమ్మనగంధవారణ, ఉదాత్త నారాయణ, గుణనిధి, గుణార్ణవ, శరణాగత, వజ్ర పంజర, ప్రియగళ, త్రిభువన మల్ల, సామంత చూడామణి అనే బిరుదులు ధరించాడు.
-ఇతను వేయించిన శాసనాల్లో వేములవాడ శాసనం అతి ముఖ్యమైంది. ఇది సంస్కృత శాసనం. ఈ శాసనంలో వినయాదిత్య యుద్ధమల్లుడి నుంచి రెండో అరికేసరి వరకు గల వేములవాడ చాళుక్య వంశవృక్షం ఉంది.
-రెండో అరికేసరి యుద్ధమంత్రి పెద్దనార్యుడు వేములవాడలో ఆదిత్యాలయాన్ని నిర్మించాడని తెలుపుతుంది.
-రెండో అరికేసరి ఈ దేవాలయానికి సంక్రాంతి రోజున 100 నివర్తనాల భూమిని దానం చేశాడు.
-ఇతని అస్థాన కవి పంప. ఇతడు తాను రచించిన విక్రమార్జున విజయంలో రెండో అరికేసరిని అర్జునితో పోల్చాడు.
-ఇంతటి అద్భుత కావ్యాన్ని రచించిన పంపకవిని చూసి ఆనందభరితుడైన రెండో అరికేసరి జగిత్యాల తాలుకాలోని ధర్మపురి గ్రామాన్ని పంపకవికి అగ్రహారంగా దానం ఇచ్చి, కవితా గుణార్ణవుడు అనే బిరుదు ఇచ్చాడు.
-రెండో అరికేసరి అనేకమంది జైన గురువులను, పండితులను ఆదరించాడు. ఇతను తన పేరుతో బోధన్‌లో అరికేసరి జినాలయాన్ని నిర్మించాడు.
-ఇతని రాజ్యం బోధన్ నుంచి చెన్నూరు వరకు విస్తరించినట్లు చెన్నూరులో దొరికిన బద్దెగ శాసనం (941) ద్వారా తెలుస్తున్నది.
-ఇతనికి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు వేగరాజు, రేవక నిర్మాడికి జన్మించాడు. రెండోవాడు బద్దెగ-II లోకాంబికకు జన్మించాడు.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






