కుతుబ్‌షాహీల పరిపాలన వ్యవస్థ

కేంద్రప్రభుత్వం
రాజు/సుల్తాన్: ఆ కాలపు రాజ్యాలన్నిటిలాగానే గోల్కొండ కూడా రాచరికపు పద్ధతినే అనుసరించింది. సుల్తాన్ రాజ్యపు సర్వాధికారి. అయితే ఉదారుడు, నీతిమంతుడుగా ఉండాలని మతగ్రంథాలు ఆదేశిస్తాయి. రాజు దైవాంశ సంభూతుడని హిందూ శాస్ర్తాలు
ఘోషిస్తున్నాయి.
అలాంటి భావనే పాశ్చాత్యులకూ ఉండేది. మహమ్మదీయులూ సుల్తానుకు ప్రజలకు పాలించే దైవికమైన హక్కు ఉందని భావిస్తారు. తమను ‘జిల్లుల్లా’గా భావించుకునేవారు. అంటే వారు దైవానికి ప్రతిరూపాలు. ఈ విశేషణాన్ని సుల్తాన్ మహమ్మద్ తన కవితానామముద్రగా ఉపయోగించుకున్నాడు.
హైదరాబాద్ సమీపాన ఓ గ్రామాన్ని జిల్లుల్లాగూడగా కూడా పిలుచుకున్నాడు. కుతుబ్‌షా సుల్తానుల జీవనశైలి గొప్పగా ఉండేది. అతడెప్పుడో అరుదుగా కానీ తన మందిరాలను వదిలి బయటకు రాడు. బయటకు వచ్చినప్పుడు ఏర్పాట్లు ఎంతో దర్పాన్ని ప్రదర్శించేటట్లుగా ఉంటాయి.
పాలించే సుల్తాన్ మరణించిన వెంటనే అధికజాప్యం జరగకుండా కొత్త సుల్తానును ప్రకటించడం జరిగేది. అందువల్ల దైనందిన పరిపాలన కుంటుపడకుండా ఉండటమే కాక, అవాంఛనీయ పరిస్థితులకు అవకాశం కల్పించకుండా ఉండటం జరుగుతుంది. అయితే ఇబ్రహీం కుతుబ్‌షా మరణం తర్వాత పదిహేనేండ్లు కూడా నిండని మహమ్మద్ కులీకుతుబ్ షాకు పట్టం కట్టడానికి కారణం దర్బారు కుట్రలే అంటారు చరిత్రకారులు.
అధికారం కోసం పడే తపన వల్ల హత్యలు జరిగి రక్తపుటేరులు ప్రవహిస్తాయి. ఆ కాలంలో ఇది సామాన్య విషయమే. సింహానం అధిష్టించే సమయంలో పొరుగురాజులు స్నేహపూర్వకంగా తమ దూతలను పంపుతారు. సుల్తాన్ కులీ హత్య తర్వాత జంషీద్ పాలకుడైనప్పుడు తనను అభినందించిన ఒకే ఒక్క దక్కనీ సుల్తాన్ నిజాంషాహీ బుర్హాన్ నిజాం షా. అతడు తన ప్రతినిధిగా ‘షా తాహీర్’ను గోల్కొండకు పంపాడు.
ఆ తర్వాత జంషీద్ ఇబ్రహీంలు బీజాపూర్‌పై కంటే అహ్మద్ నగర్ పట్ల మొగ్గు చూపడానికి అది నాంది అయ్యింది. పట్టాభిషేకం కోసం కొలువుదీరిన దర్బారుకు రాజ్యంలోని ప్రముఖులు, పౌర, సైనిక అధికారులు హాజరవుతారు. నగరంలో ఏనుగులపై, ఒంటెలపై తిరుగుతూ సందేశ వాహకులు ఎలుగెత్తి కొత్త సుల్తాన్ పేరును ప్రకటిస్తారు.
కుతుబ్‌షాహీల దర్బారులు ఎంతో విలాసంగా అలంకరించి ఉండేవి. సుల్తాన్ కులీ జీవితకాలంలో దర్బార్ నిరాడంబరంగా ఉండేది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో ఓ పెద్ద దర్బార్ ‘దౌలత్ ఖానా అలీ’ని నిర్మించారు. అది 200 అడుగుల పొడవు ఉండేది. దానిచుట్టూ ఎన్నో స్తంభాలు, కమానులు ఉండేవి. దాని ప్రవేశ ద్వారం హిందూశైలి నిర్మాణంతో ఉండేది. దాని ఎత్తు 20 గజాలుండేది. దాని ఉపనిర్మాణం పెద్ద స్తంభాలపై నిలబడి ఉండేది. ఈ హాలు పక్కన సచివాలయం ఉండేది. హైదరాబాద్ నగర నిర్మాణం జరిగి దాద్ మహల్, ఖుదాదాద్ మహల్ లాంటి అద్భుత కట్టడాలు వెలిశాక, అక్కడ కూడా దర్బార్ జరిగేది. సుల్తాన్, మంత్రులు, పండితులతో సలహాసంప్రదింపులు జరిపే సభా భవనాలు కూడా ఉండేవి.
పాలక మండలి/మజ్లిస్ దివాన్‌దారీ/మజ్లిసెఖాన్
మొదట్లో సుల్తాన్ క్లిష్ట సమయంలో తన ఇష్టులు, సమర్థులు అనుకున్న అమీరులతో సంప్రదింపులు జరిపేవాడు. ఆ తర్వాత అది ఓ పాలక మండలి ఏర్పాటుకు దోహదపడింది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలోని సలహామండలిని ‘మజ్లిసె-కింగాష్’ అనేవారు. అత్యవసర విషయాల్లో నిర్ణయం తీసుకోడానికే సుల్తాన్ ఆ మండలిని సమావేశపరిచేవాడు.
అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ‘మజ్లిస్-ఇ-దివాన్-దారీ’ పరిపూర్ణత సాధించి కొందరిని సుల్తాన్ రాయబారులుగా నియమించేవాడు. యూసఫ్‌షా అనే సభ్యుడు ‘ఐన్-ఉల్-ముల్క్’ సైనిక వ్యవహారాలు నిర్వహించే మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాతి కాలంలో ఇతడు మొఘల్ చక్రవర్తి జహంగీర్ దర్బార్‌లో కుతుబ్‌షాహీ దూతగా పనిచేశాడు. కేంద్రప్రభుత్వంలో పీష్వా ఐన్-ఉల్-ముల్క్, మీర్ జుమ్లా మొదలైనవారు విశేషాధికారాలుగలవారు.
పీష్వా/వకీల్/ప్రధానమంత్రి
గోల్కొండ రాజ్యంలో సుల్తాన్ తర్వాత శక్తిమంతమైన మంత్రి పీష్వా లేదా దివాన్. ఇతడు సుల్తాన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడై ఉండేవాడు. మేధావి, పరిపాలనా వ్యవహారాల్లో పూర్తి అనుభవం ఉన్న వ్యక్తులనే ఈ ఉన్నత పదవిలో సుల్తాన్ నియమించేవాడు. గోల్కొండ రాజ్య పీష్వాలుగా పనిచేసినవారిలో ‘ముస్తాఫాఖాన్ అర్బిస్తానీ (ఇబ్రహీం కుతుబ్‌షా కాలం), షేక్ మహమ్మద్ ఇబ్నేఖాతూన్ (అబ్దుల్లా కుతుబ్‌షా కాలం)లు విశేష గౌరవం పొందారు. పీష్వా జీతం 12 వేల హొన్నులు. చివరి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ తానీషా కాలం నాటి పీష్వా పదవి ‘దివాన్’గా మారింది. ‘మాదన్న’ చివరి గోల్కొండ సుల్తాన్ దివాన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
పీష్వా తన హోదాకు తగినట్లుగా సువిశాల భవనంలో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అతని కింద అనేకమంది ఉద్యోగులు, అధికారులు, దాసీజనం పనిచేసేవారు. పీష్వా సలహాలను సుల్తాన్ గౌరవించేవాడు. పీష్వా సుల్తాన్ పేరున రాచవ్యవహారాలు చక్కబెట్టడమే కాక, పండితులు, కవులు, అమీరులతో పరివేష్టించి ఉండేవాడు. రాజ్యంలో వారపు సెలవుదినం మంగళవారం. ఆ రోజుల్లో పీష్వా విదేశీ రాయబారులతో కలిసి ఉద్యానవనాల్లో కాలం గడిపేవాడు.
మీర్ జుమ్లా (ఆర్థిక శాఖా మంత్రి)
l ఇతడిని ‘అమీరె-జుమ్లా’ అని కూడా పిలుస్తారు. పీష్వా తర్వాత పెద్ద అధికారి ఇతడే. ఇతడికి ‘జుమ్లతుల్ ముల్క్’ అనే బిరుదు కూడా ఉంది. అందుకే అతడి శాఖను ‘జుమ్లతుల్-ముల్కీ’ అని అంటారు. అతడి బాధ్యత ఆదాయ, ద్రవ్యసేకరణ, వినియోగం. ఓ రకంగా అతడిని విత్తమంత్రిగా భావించవచ్చు. సైనిక వ్యవహారాల శాఖ లెక్కలు కూడా ఇతడు తనిఖీ చేసేవాడు. కాబట్టి అతడి అధికారాలు విస్తృతంగా, ఒక్కోసారి పీష్వాను మించి కూడా ఉండేవి. అందువల్లే ఈ పదవి గోల్కొండ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యాన్ని వహించింది. వీరిలో కొంతమంది తమ పరిధిని కూడా దాటి పీష్వా అధికార పరిధిలోకి ప్రవేశించినవారూ ఉన్నారు. మీర్జా మహమ్మద్ అమీన్, ముల్లా తాకీ, మీర్ మహమ్మద్ సయీద్, మహ్మద్ కులీ, అబ్దుల్లాల కాలంలో గొప్ప విత్తమంత్రులుగా పనిచేసి, పీష్వా పదవినే మరుగుపరిచేట్టు చేశారు.
వజీర్లు (మంత్రులు)
l పీష్వాకు సహాయంగా నిత్య విధుల్లో సాయం చేయడానికి 12 మంది వజీర్లు ఉండేవారు. బహమనీ వంశ స్థాపకుడి కాలం నుంచి ‘వజీరు’ అనే పదం వినపడుతూనే ఉంది. మధ్యలో ఈ వ్యవస్థ అంతరించినప్పటికీ, అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఈ పదవిని పునరుద్ధరించడం జరిగింది. వజీర్లకు ‘ధీ శౌకత్’ అనే బిరుదు ఉండేది. అంటే ఘనత వహించినవారని అర్థం. వీరికి కుట్టుపని చేసిన జెండా, ఇతర ఉన్నతాధికార చిహ్నాలు వహించే అధికారం ఉంటుంది. ప్రతి మంత్రికీ రాజధానికి దూరంగా జాగీరు ఉండేది. మంత్రుల నడత విషయంలో రాజు ఎంతో జాగ్రత్తపడేవాడు.
ఐన్-ఉల్-ముల్క్
కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో సైన్య వ్యవహారాలను చూసే మంత్రిని ఐన్-ఉల్-ముల్క్ అనేవారు. సేనల నియామకం, శిక్షణ, యుద్ధ వ్యూహాల రచన, తరఫ్ స్థాయి సేనాధిపతులు, దుర్గాధిపతుల నియామకం ఇతని విధులు. సమకాలీన చరిత్రకారుడైన నిజాముద్దీన్ సైదీ దృష్టిలో కుతుబ్‌షాహీల కేంద్రమంత్రివర్గంలో ఐన్-ఉల్-ముల్క్ ప్రముఖుడు. ఇతడు సుల్తాన్‌కు నమ్మినబంటు. సైఫ్‌ఖాన్, మన్సూర్ ఖాన్-హదాషీ పేరుగాంచిన ఐన్-ఉల్-ముల్క్లు.
నజీర్
ఇతడు సామ్రాజ్యంలోని ప్రజల్లో నీతి, నియమాలను, సుల్తాన్ పట్ల భక్తిని, గౌరవాన్ని, శాసనాల పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించేవాడు. శాంతిభద్రతలు, చట్టాల అమలు ఇతని విధులు. మహమ్మద్ కులీ కాలంలో అబూతాలీబ్, అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో ‘మీర్ కాసిం’ నజీర్ పదవి సమర్థవంతంగా నిర్వహించారు.
మజుందార్
l గోల్కొండ రాజ్య ఆదాయ, వ్యయాలన్నింటినీ తనిఖీ చేసే మంత్రి మజుందార్. ఇతడి కార్యాలయం ఉద్యోగులు ప్రతి శాఖ జమా, ఖర్చులను లెక్కించేవారు. హిందువులనే ఈ పదవిలో నియమించారు. అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో ‘నారాయణరావు’ ఈ పదవి
నిర్వహించాడు.
దబీర్
ఇతడి కార్యాలయాన్ని దివానె-ఇన్షా అని వ్యవహరించేవారు. సుల్తాన్ తరఫున తరఫ్దార్లకు, ఇతర శాఖలకు ఫర్మానాలను పంపడం, అనువాదం చేయించడం ఇతని ముఖ్య విధులు. సుల్తాన్, మంత్రివర్గం అంగీకరించిన ఫర్మానాలకు ముద్ర (అధికార ముద్ర) వేయించడం ఇతడి కార్యాలయ విధి. సుల్తాన్ మహమ్మద్ కాలంలో ‘కాజీ ముజఫర్ అలీ’, అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ‘మౌలానా ఒవైసీ’ దబీర్ బాధ్యతలు నిర్వహించారు. దబీర్ కార్యాలయంలో ముఖ్య ఉద్యోగి ‘షురుహ్నవీస్’. ఇతడు నేటి రికార్డ్ కీపర్ విధులు నిర్వహించేవాడు.
కొత్వాల్
ఇతడు పోలీస్ శాఖ పెద్ద. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ ఇతడి అతి ప్రధాన విధి. ఫ్రెంచి బాటసారులైన ట్రావెర్నియర్, థెవ్నాట్, బెర్నియర్లు గోల్కొండ పట్టణంలో పోలీస్ శాఖ క్రమశిక్షణతో పనిచేసేదని, విదేశీ, స్వదేశీ వ్యాపారులు నిశ్చింతగా వ్యాపారం చేసేవారని, నగరంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని నిశితంగా తనిఖీ చేసేవారని, ఆ తర్వాత కొత్తవారి కదలికలపై నిఘా ఉంచేవారని రాశారు. టంకశాలకు ఇతడే అధిపతి. కొన్ని సందర్భాల్లో న్యాయాధీశునిగా విధులు నిర్వహించేవాడు. దొంగల బెడద చాలా అరుదు.
సర్ఖేల్
కేంద్రస్థాయి మంత్రుల్లో సర్ఖేల్ ఒకడు. సర్ఖేల్ అంటే గ్రూపు నాయకుడు. ఇతడే రాజధానిలో ముఖ్య రెవెన్యూ అధికారి. ఇతడి ఆధీనంలోనే జిల్లాలు, రాష్ర్టాలు ఉండేవి. వీరికాలంలో సర్ఖేల్ పదవి చేపట్టి ఆ పదవికి గౌరవం చేకూర్చినవారిలో ‘మహమ్మద్-తకి-షఫీరుల్-ముల్క్, మీర్జా రోజ్బిహాన్, సయ్యద్ ముజఫర్’ ముఖ్యులు. సర్ఖేల్ తూర్పు తీరంలోని విదేశీ వర్తక సంఘాల కార్యకలాపాలపై నిఘా ఉంచి వారిని అదుపులో పెట్టేవాడు. వారి వ్యాపారాన్ని రక్షించేవాడు.
హవల్దార్లు
ప్రభుత్వ భాండాగారాలు, గుర్రాలు, ఏనుగు శాలలను నిర్వహించే వ్యక్తి హవల్దార్.
రాష్ట్ర పరిపాలన
కుతుబ్‌షాహీ సుల్తానులు బహమనీ సుల్తానుల మాదిరిగానే పరిపాలన సౌలభ్యం కోసం రాష్ర్టాన్ని ‘తరఫ్ లేదా సిమ్త్’లుగా విభజించారు. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఆరు తరఫ్‌లుండేవి డచ్ కంపెనీ రికార్డుల వల్ల రాష్ర్టాల పాలకులు 1630 తర్వాత తరఫ్‌దార్‌లు సుల్తాన్ ఆదేశాలను ధిక్కరించారని, ఫర్మానాలు సరిగ్గా అమలు చేయలేదని, కేంద్ర ఆదేశాలను లెక్కచేయలేదని, మచిలీపట్నం సిమ్త్ అధికారి సుల్తాన్ పంపిన కానుకలను, వస్ర్తాలను తిరిగి సుల్తాన్‌కే పంపి, ఫర్మానాలను అమలు చేయలేదని, హైదరాబాద్‌కు రావాల్సిందిగా సుల్తాన్ ఆదేశించగా, దాన్ని బేఖాతర్ చేశాడని పేర్కొన్నాడు. బెల్లంకొండ, వినుకొండ, కొండపల్లి, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి 22 సిమ్త్ లేదా సీమలు వీరి రాజ్యంలో ఉన్నాయని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు.
అబుల్ హసన్ తానీషా కాలంలో మొత్తం 37 సర్కారులు, 517 పరగణాలు ఉండేవని తెలుస్తుంది. రేవు పట్టణంలో ఉన్నతాధికారిని ‘షాబందర్’ అనేవారు. భూమిశిస్తు వసూలు అధికారాన్ని వేలం పాటలో అందరి కంటే ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధపడినవారికే ఇచ్చేవారు. ఈ రకమైన హక్కులను కొన్నవారిని ‘ముస్తజీర్లు’ అనేవారు. ముస్తజీర్లుగా హిందువులనే ఎక్కువ సంఖ్యలో నియమించారు.
స్థానిక పాలన
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాలను సర్కార్లుగా విభజించారు. వీరి అనేక ఫర్మానాల్లో దేశ్‌పాండే, తానేదార్, దేశ్‌ముఖ్ మొదలైన రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల పేర్లు ప్రస్తావించారు. వీరికాలంలో గ్రామమే పరిపాలనా వ్యవస్థకు తొలిమెట్టు. గ్రామస్థాయిలో పెద్ద మఖుద్దమ్. కులకర్ణి గ్రామ అకౌంటెంట్. దేశ్‌పాండే పరగణ స్థాయి అకౌంట్స్ అధికారి.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
- Tags
- Education News
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






