పెట్రోల్‌బంక్ వర్కర్ టు కలెక్టర్ !
# కష్టాల కడలిలో నుంచి ఉన్నత శిఖరాలకు..
# చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా ధైర్యంగా అడుగులు
# పొలం పనులు చేసుకుంటూ పాఠశాలకు..
#బంక్‌లో పనిచేస్తూనే ఉన్నత చదువులు పూర్తి
#2009లో గ్రూప్ -1 స్టేట్ నాలుగో ర్యాంకు
# ప్రస్తుతం నిజామాబాద్ కలెక్టర్‌గా ప్రజలకు సేవ
#గ్రూప్స్ రాసేవారికి ఆదర్శం..
# ఐఏఎస్ సీ నారాయణరెడ్డి జీవితం
కలెక్టర్ కావాలనేది ఆ పిల్లాడి కల. కానీ.. ఆ కలలను కల్లలు చేసే అవరోధాలు అడుగడుగునా ఎదురయ్యాయి. కుటుంబానికి పెద్దదిక్కైన నాన్న భౌతికంగా దూరమయ్యాడు. కలెక్టర్ సంగతేమో కానీ, కుటుంబం గడవని పరిస్థితి ఏర్పడింది. అయినా ఆ పిల్లాడు లక్ష్యాన్ని వదల్లేదు. ఆ కలను మదిలోనుంచి చెరిపేయలేదు. బిగించిన పిడికిలిలా దృఢ సంకల్పంతో దాన్ని నెరవేర్చుకునేందుకే సిద్ధమయ్యాడు. కష్టాలను ఎదుర్కొని లక్ష్యసాధనలో అడుగులు వేశాడు. పొలం పనులు చేసుకుంటూనే బడికెళ్లాడు. పెట్రోల్ బంకులో పనిచేస్తూనే కాలేజీలో చదువుకున్నాడు. కష్టాలనే మెట్లుగా మలుచుకున్నాడు. చివరకు 2009లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-1లో రాష్ట్రస్థాయి నాలుగో ర్యాంకును సాధించాడు. ఆయనే.. ఐఏఎస్ అధికారి చింతకుంట నారాయణరెడ్డి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తున్నారు. ‘ఒక కలను నిజం చేసుకునే ప్రయాణంలో సమస్యలెన్నో అడ్డుపడొచ్చు. ఆ దారిలో ముళ్లెన్నో గుచ్చుకోవచ్చు. ఆ ప్రయత్నంలో అవమానాలెన్నో ఎదురుకావచ్చు… కానీ చివరికి సాధించే విజయం వాటన్నింటినీ చెరిపేస్తుంది’ అంటున్న నారాయణరెడ్డి జీవితం గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వారందరికీ ఆదర్శం. అనుసరణీయ పాఠం. కష్టాల కడలిలో నుంచి ఉన్నతశిఖరాల వరకు సాగిన తన ప్రయాణం గురించి ఆయన మాటల్లోనే..
చదువుకుంటూ పొలంబాట
మాది మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలోని శ్రీపురం అనే చిన్న పల్లె. అమ్మానాన్న చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ. వాళ్లకు నేను ఆరో సంతానం. నలుగురు అన్నలు, ఓ అక్క. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబమే అయినా.. ఉన్నది కొద్దిపాటి పొలమే. నాన్నతోపాటు అన్నయ్యలు కూడా వ్యవసాయమే చేసేవారు. దానిపై కుటుంబం వెళ్లదీయమే కష్టం. అట్లాంటిది.. ఇక చదువు చెప్పించడం ఎలా సాధ్యం? చిన్నవాడిని కాబట్టి నేనంటే అందరికీ ఇష్టం. అయితే.. ఏడోతరగతి చదువుతున్నప్పుడే నాన్న చనిపోయాడు. ఒక్కసారిగా జీవితం ఆగిపోయినంత పనైపోయింది. చుట్టూ చీకటి. చదువు అపేద్దామని నిర్ణయించుకున్నాను. పొలంబాట పట్టాను. ఆ తర్వాత అంతా కష్టాల పయనమే!
ఎగతాళి చేశారు.. ఎక్కిరించారు…
కష్టాలెన్ని ఎదురైనా ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఫలితంగా డీఎస్సీలో మహబూబ్‌నగర్ జిల్లా టాపర్‌గా నిలిచాను. అయితే.. 2006 డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం ఆలస్యమైంది. ఫలితంగా.. మళ్లీ ఉద్యోగ వేట మొదలైంది. మక్తల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. నెలకు రూ.2,500 ఇచ్చేవారు. పెద్ద చదువు చదివి ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నావని అందరూ అడిగేవారు. కొందరైతే.. ‘నువ్వెంత చదివితే ఏంటి? చివరికి ఇదే నీ జీవితం’ అంటూ ఎగతాళి చేసేవారు. కానీ నేనెప్పుడూ వారి మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. ఆ క్షణం నవ్వుకుని వదిలేసేవాడిని. 2008లో డీఎస్సీ పోస్టింగ్ ఇచ్చారు. నేను చదివిన కల్వాల్ పాఠశాలలోనే ఉద్యోగం వచ్చింది.
పెట్రోల్ బంకులో పనిచేస్తూ…
చదువు మానేస్తానంటే అన్నయ్యలు ససేమిరా అన్నారు. మేం చూసుకుంటాం.. నువ్వు చదువుకో..అని చెప్పారు. అయితే ఆర్థిక ఇబ్బందుల ముందు అన్నల ప్రోత్సాహం నిలబడలేకపోయింది. ఖాళీ ఉన్నప్పుడల్లా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసేవాడిని. పదో తరగతి పూర్తయ్యాక ఇక చదవకూడదని, ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఫిక్స్ అయ్యా. హైదరాబాద్ వెళ్లి ఓ పెట్రోల్ బంకులో పనికి కుదిరాను. అయితే.. పదోతరగతిలో మంచి మార్కులు వచ్చాయి. కాలేజీ వాళ్లు ఉచితంగా చదువు చెప్పేందుకు ముందుకొచ్చారు. దాంతో ఇంటర్లో చేరాను. మళ్లీ అవే కష్టాలు. కొంతకాలం పెయింటర్‌గానూ పనిచేశాను. ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయిన ప్రతీసారి చదువే నాకో మార్గం చూపిస్తూ వచ్చింది. మళ్లీ ఇంటర్లో మంచి మార్కులు రావడంతో డిగ్రీలో చేరాను. ఆ తర్వాత ఉస్మానియాలో బీఈడీ పూర్తిచేశాను. ఆ తర్వాత ఎంఎస్సీ( మ్యాథ్స్) కూడా చేశా.
తొలి ప్రయత్నం.. సబ్ కలెక్టర్ ఉద్యోగం…
టీచర్ ఉద్యోగం వచ్చినా జీవితంలో ఇంకా ఏదో అసంతృప్తి అలాగే ఉంది. తెలియని వెలితి రాత్రివేళల్లో నిద్రపోనిచ్చేది కాదు. సొంత ఊరే అయినా.. ఓ చిన్న రూమ్ అద్దెకు తీసుకుని ప్రిపరేషన్ ప్రారంభించాను. బడిలో పాఠాలు చెప్పడం, ఇంట్లో తినడం, రూంకు వెళ్లి చదువుకోవడం.. ఇదే జీవితం. కుటుంబం లేదు. స్నేహితుల్లేరు. ఫంక్షన్లు లేవు. సరదాలు లేవు. ఒకటే లక్ష్యం-చదువు. శ్రమ ఫలించింది. 2009లో తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో స్టేట్ నాలుగో ర్యాంకు సాధించాను. 2011లో గద్వాల, 2011లో పెద్దపల్లి, సూర్యాపేటల్లో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేశాను. జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ములుగు జిల్లా కలెక్టర్‌గా పనిచేశాను. ప్రస్తుతం.. నిజామాబాద్ కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేస్తున్నాను. నాన్న చనిపోయినప్పుడే నేను చదువును వదిలేసి ఉంటే.. కష్టాలు ఎదురైనప్పుడు నిరాశపడి ఉంటే.. కలెక్టర్‌ని అయ్యేవాడినే కాదు. అందుకే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికోసం అహర్నిశలు శ్రమించాలి. స్వేచ్ఛగా కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవాలి.
గురిపెడితే.. గ్రూప్స్ ఈజీనే!
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికతో ముందుకెళ్తే.. గ్రూప్-1 కొట్టడం ఈజీనే. మనసు పెట్టి చదివితే మూడునెలలు చాలు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ముందు ఓ క్లారిటీకి రావాలి. టాప్-5 ర్యాంకుల్లో తమపేరు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఏ ఉద్యోగం వస్తుందో.. ఆ హోదాను పేరు పక్కన ఊహించుకుంటూ ఉండాలి. తెలుగు అకాడమీతోపాటు క్రెడిబులిటీ ఉన్న పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. గ్రూప్స్ సాధించాలంటే కోచింగ్ సెంటర్‌కు వెళ్లాలనే అపోహను వీడండి. మాడల్ పేపర్లు చూసి.. రోజూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అందరికంటే భిన్నంగా, స్పష్టంగా పరీక్ష రాయగలిగితేనే ర్యాంకర్‌గా నిలవడం సాధ్యం. మూస పద్ధతిలో ఎంతరాసినా ఉపయోగం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్స్‌కి ఇంటర్వ్యూలు ఎత్తివేయడం మంచి నిర్ణయం. మెయిన్స్‌లో నేను టాప్-1 ర్యాంకర్‌ని. కానీ ఇంటర్వ్యూల తర్వాత నాలుగో ర్యాంకు వచ్చింది. అందుకే.. ఇంటర్వ్యూలు ఎత్తివేయడం గ్రామీణ అభ్యర్థులకు ఓ వరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 503 గ్రూప్-1 పోస్టుల్లో మీకూ ఓ పోస్టు ఉందనే లక్ష్యంతో పరీక్ష రాయండి. విజయీభవ!
– సీ నారాయణరెడ్డి, నిజామాబాద్ కలెక్టర్
- Tags
- civil cervices
- Groups
- upsc
RELATED ARTICLES
-
Career Guidence | Career in Python Programming Language
-
NEET Success Stories | నీట్లో మెరిసిన తెలుగు తేజాలు
-
JEE Advanced 2023 – Success Stories | లక్ష్యం పెట్టుకున్నారు.. లక్షణంగా సాధించారు
-
Success Stories | ఆత్మవిశ్వాసం @ ఆరు ఉద్యోగాలు
-
Civil Services Success Stories | వీక్లీ టెస్టులతో లోపాలు సవరించుకున్నా..
-
Civil Services Success Stories | సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






