లాభాల ఎల్ఐసీ ప్రైవేటీకరణా?

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ఐపీవో చేపట్టే ప్రక్రియ ప్రైవేటీకరణ కాదని, కేవలం వాటాలు అమ్మడమేనని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో పేర్కొన్నారు. అయితే, బడ్జెట్ సందర్భంలోనే ప్రభుత్వం.. ఎల్ఐసీ చట్టానికి 27 సవరణలు ప్రతిపాదించింది. ఇందులో ఐదేండ్లలోపుగా 25 శాతం వాటాలను అమ్మాలని, ఆ తర్వాత ప్రభుత్వ వాటాను 49 శాతానికి పరిమితం చేసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. కనుక, ఎల్ఐసీలో వాటాల అమ్మకం పేరుతో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించడం సంస్థ ప్రైవేటీకరణ దిశగా వేసే మొదటి అడుగు. మరోవైపు, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 74 శాతానికి పెంచడానికి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లులను ప్రవేశపెట్టింది.
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని, ప్రైవేటు బీమా సంస్థల్లో విదేశీ యాజమాన్యాన్ని కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మనలాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో దేశీయ పొదుపుపై విదేశీ పెట్టుబడులను విచక్షణారహితంగా అనుమతించడం దేశానికి ఎంతో హాని చేస్తుంది.

ఎల్ఐసీలో.. ఐపీవో ప్రక్రియ సంస్థ లక్ష్యాలను బలహీనపరుస్తుంది. ప్రజల సొమ్ము ప్రజా సంక్షేమానికి అనే లక్ష్యంతో 1956లో ఏర్పడిన ఎల్ఐసీ.. ప్రజల పొదుపును దేశ సర్వోతోముఖాభివృద్ధికి వినియోగిస్తున్నది. ఎల్ఐసీ ప్రతి సంవత్సరం రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టగలిగే నిధులను సమీకరిస్తుంది. అందువల్ల నిధుల కోసం సంస్థకు మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి లేదు. 2020 మార్చి 31 నాటికి ఎల్ఐసీ రూ.30.67 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది. ఇందులో రూ.24.10 లక్షల కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలలో, హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం కేటాయించింది. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా దాని నిజవిలువ ఆవిష్కారమవుతుందని, అలా సృష్టించిన సంపదలో రిటైల్ పెట్టుబడిదారులు పాల్గొనే అవకాశం వస్తుందనే ప్రభుత్వ వాదనలు అసంబద్ధం, అర్థరహితం. స్టాక్మార్కెట్లో పాల్గొనే రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య- మొత్తం పెట్టుబడిదారుల సంఖ్యలో 3 శాతం మాత్రమే. మన దేశంలో మొత్తం డీమ్యాట్ అకౌంట్లు దాదాపు 4 కోట్లు ఉంటే, అం దులో కేవలం 0.95 కోట్ల అకౌంట్లే చురుకుగా ఉన్నాయి. లిస్టింగ్ వల్ల దేశంలోని కొద్ది మంది ధనికులు, విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే లాభాలు మెరుగుపడతాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ 2.15 కోట్ల క్లెయిములు చెల్లించి ప్రపంచంలోనే క్లెయిముల పరిష్కారంలో అత్యుత్తమ బీమా సంస్థగా పేరు తెచ్చుకున్నది. ఎల్ఐసీ జాతీయకరణకు ముందు ప్రైవేట్ బీమా కంపెనీల అక్రమాలను చూసి ప్రభుత్వం- ఎల్ఐసీ పాలసీలకు ఎల్ఐసీ చట్టం, 1956లోని సెక్షన్ 37 ప్రకారం సావరిన్ (ప్రభుత్వ) గ్యారంటీ మంజూరు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోనస్‌లకు కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇస్తుంది. ‘కర్ణుడి కవచకుండలాలు’గా సెక్షన్ 37 ఎల్ఐసీ అమ్ముల పొదిలో ఉన్నది తప్ప సంస్థకు దానిని ఉపయోగించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు, భవిష్యత్‌లో కూడా రాదు. ఇది సంస్థ సుదీర్ఘ పనితీరుతో స్పష్టమయిన వాస్తవం. మరోవైపు- ప్రైవేటు బీమా పాలసీలకు ఎటువంటి ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఎల్ఐసీలో ఐపీవో నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ కారణంగా, ఎల్‌ఐసీకున్న ప్రభుత్వ గ్యారంటీ కొనసాగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించాల్సి వచ్చింది.
అమెరికాలోని సర్వే సంస్థ వీ ఏజెన్సీ నివేదిక ప్రకారం- అమెరికన్, యూరోపియన్ దేశాల్లోని బీమా కంపెనీలు అధిక లాభాపేక్షతో తమ 34 శాతం పెట్టుబడులను కార్పొరేట్ డెబిట్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాయి. ఆ ఫండ్ల రేటింగ్ ‘జంక్’గా తేలింది. దీంతో ఆయా దేశాల్లో బీమా కంపెనీలు మునిగిపోయి, పాలసీదారులు పెద్దఎత్తున నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా అనుభవాలను చూస్తే- దేశీయ పొదుపు పద్ధతికి విదేశీ పెట్టుబడులు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని నిరూపితమైంది.
ఎల్ఐసీ గత 20 ఏండ్లుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ 71 శాతానికిపైగా మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో బీమా సేవలందిస్తున్నది. తన వ్యాపారంలో 45 శాతం ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నుంచి సమీకరిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల ప్రజల పాలసీ సేకరణలో నష్టాలను.. పట్టణ ప్రాంతాల వ్యాపారంలో వచ్చిన లాభాల నుంచి భరిస్తున్నది.
ఎల్ఐసీ ఈ ఏడాది కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. 2020 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఈక్విటీ పెట్టుబడులపై రూ.18,000 కోట్ల లాభాలు ఆర్జించింది. ఈ విధంగా ఎల్ఐసీలో పాలసీదారులు దాచుకున్న పొదుపు దేశ సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడుతున్నది. దేశాభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం ఉన్న నేపథ్యంలో ప్రధాని ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ విజయవంతం కావాలం టే, దేశానికి ఏటేటా భారీగా పెట్టుబడులు అందించే ఎల్ఐసీని 100 శాతం ప్రభుత్వ అజమాయిషీలోనే కొనసాగించి, బలోపేతం చేయాలి. కేంద్రం ఎల్ఐసీలో ఐపీవో ప్రయత్నాలను విరమించి, బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు బిల్లులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 18న నిర్వహిస్తున్న సమ్మెకు 40 కోట్ల పాలసీదారులు, ప్రజానీకం మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం.
ఆత్మ నిర్భర భారతానికి ఎల్ఐసీ కీలకమని ప్రభుత్వం గుర్తెరగాలి. సంస్థలో కేంద్ర ప్రభుత్వం 1956లో రూ.5 కోట్లు మూలధన పెట్టుబడి పెట్టింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎల్ఐసీ స్వీయశక్తితో ఎదిగింది తప్ప ఏనాడూ ప్రభుత్వ సాయాన్ని కోరలేదు. చైనా లైఫ్‌తో సహా, ప్రపంచంలో ఏ ప్రభుత్వ రంగ బీమా సంస్థ కూడా ప్రైవేటు, బహుళ జాతి బీమా కంపెనీలతో పోటీపడి 50 శాతం మార్కెట్ వాటాను సైతం నిలబెట్టులేకపోయాయి.
పి. సతీష్
- Tags
RELATED ARTICLES
-
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
-
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
-
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
-
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
-
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
-
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Latest Updates
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా జరుగుతుంది?
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
Physics – IIT/NEET Foundation | Vector Subtraction is Useful to?
Economy | డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం.. పాత కొత్తల మేలు కలయిక
RBI Recruitment | ఆర్బీఐలో 450 అసిస్టెంట్ పోస్టులు
Current Affairs | కరెంట్ అఫైర్స్
Physics IIT/NEET Foundation | The value of a vector will?