కూడు పెట్టని విద్య.. కూసు విద్యే!

విద్యలేనివాడు వింత పశువు అన్నది ఒకనాటి నానుడి. విత్త సంపాదనకు పనికిరాని విద్య మిథ్యే అనేది నేటి నానుడి. విద్య ద్వారా అజ్ఞానం నుంచి జ్ఞానమార్గంలో నడవడానికి క్రమశిక్షణ అలవర్చుకొంటారు అనేది మన ప్రాచీనుల అభిప్రాయం. ఇటీవలి కాలంలో విద్యావంతులు ఇది నమ్ముతున్నప్పటికీ విత్తమును సముపార్జించడానికి పనికిరాకపోతే, అది నిరర్థకం. గత రెండు దశాబ్దాల్లో సాంకేతిక రంగంలో జరిగే విప్లవాత్మక మార్పులకు దీటుగా విద్యా విధానంలో కూడా భిన్న మార్పులు చోటు చేసుకొంటున్నాయి.
ముఖ్యంగా సాంకేతిక విద్యలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యను ధనార్జన దిశగా మలచనంతకాలం ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ అభివృద్ధికి నోచుకోలేవు. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఔషధ, విడిభాగాల తయారీ, వైద్య రంగంలో స్థిరపడిన యువతరంలో కేవలం 18 నుంచి 20 శాతం మంది నిరుద్యోగులు చిరుద్యోగులవుతున్నారు. విద్యావంతులు అంటే యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకొని, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడటం కాదు. తాను చదివిన విద్య ద్వారా జీవిస్తూ పదిమందికి ఉపాధి కల్పిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు బాధ్యతను పోషిస్తూ తలసరి ఆదాయాన్ని పెంచకపోతే ఆ చదువు నిష్ప్రయోజనమే అవుతుంది. మనరాష్ట్రంలో పదో తరగతి తర్వాత 78 శాతం మంది ఇంటర్మీడియెట్ చేస్తే కేవలం 10 శాతం మంది మాత్రమే పాలిటెక్నిక్, ఐటీఐలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. 2 శాతం మంది ఇతర కోర్సుల్లో చేరుతున్నారు.
విద్యార్జన, ధనార్జన అనేవి రెండు కూడా పరస్పరం అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయనడానికి నేటి విద్యావ్యవస్థలో చోటు చేసుకుంటున్న పెనుమార్పులే నిదర్శనం. దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో సాంకేతిక ప్రగతికి కారణమేమిటంటే, విద్యార్థులకు ఉన్న అభిరుచికి తగ్గట్టుగా కోర్సులు ఉండటం, వాటికి తగిన విధంగా సమకాలీన విద్యావ్యవస్థ, ఇందులోనే సాంకేతిక విద్య, అధ్యయన ప్రక్రియ, పరిశ్రమల అనుసంధానం, పరిశ్రమల్లో నైపుణ్యాభివృద్ధిలో భాగంగా కార్పొరేట్ ఒప్పందాలు తదితర సాంకేతిక ప్రగతి మనకు కన్పిస్తుంది.ఒక దేశ ప్రగతికి మూడు ప్రధానాంశాలు కారణమవుతున్నాయి. ఇవి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అవి : 1) విద్యాలయాలు 2) పరిశ్రమలు 3) తలసరి ఆదాయం. ఒక విద్యార్థి తాను చదివిన విద్యతో తనకున్న నైపుణ్యంతో ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచడం ద్వారా ఆ పరిశ్రమకు, యాజమాన్యానికి ఉత్పత్తి పెంపులో తనవంతు పాత్ర పోషిస్తాడు. తద్వారా దేశస్థూల జాతీయోత్పత్తితో పాటు తలసరి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి విద్యాలయాలు విద్యార్థులను తయారుచేసే ఒక నైపుణ్య గనులుగా మారాలి కానీ, నిరుద్యోగులను ఉత్పత్తి చేసే యంత్రాలు కాకూడదు. డిమాండ్ ఉన్న విద్యలో నైపుణ్యం కొరవడటం కారణంగా నిరుద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. ఉద్యోగులకు తగ్గట్టుగా పరిశ్రమల్లో ఉద్యోగాలు లేకపోవడం కారణంగా చాలామంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారు.

మన రాష్ట్రంలోనే తీసుకొంటే బయో టెక్నాలజీ, జియాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, మైక్రో బయాలజీ, జియోగ్రఫీ, ఫిషరీస్, జియో ఫారెస్ట్రీ, ఇన్ఫర్మాటిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ ఇంజినీరింగ్ వంటివి చెప్పుకొంటూ పోతే చాంతాడంత పొడవుగా ఉంటుంది. ఈ కోర్సులన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో ఉపయోగకరమైనప్పటికీ, వాటికి అనుగుణంగా పరిశ్రమలు, ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడంతో ఈ కోర్సులు చేసిన వారి జీవితం ఆగమ్యగోచరమే అవుతుంది. ఈ మధ్యకాలంలో బయో టెక్నాలజీ కోర్సులను జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న కొన్ని కళాశాలల్లో మూసివేస్తున్నట్టు ప్రకటించడం చాలా బాధకరమైన విషయం. కోర్ సబ్జెక్ట్, ఏరియాకు సంబంధించిన జాతీయ, బహుళజాతి సంస్థల్లో 15 నుంచి 20 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం గగనమైంది. కెమికల్, టెక్స్టైల్స్, బయోకోర్సులు చేసినవారు ఐటీ రంగంలో ఉన్న మెరుగైన అవకాశాలకు, మంచి జీతభత్యాలకు ఆకర్షితులు కావడం. కోర్ రంగంలో అవకాశాలు సన్నగిల్లడం కారణంగా కోర్సులకు సంబంధం లేకుండా దాదాపు కోర్ రంగాల్లోని 90-95 శాతం విద్యార్థులు ఐటీ రంగంలో అరంగేట్రం చేస్తున్నారు. చదువుకున్నది ఒకటైతే ఉద్యోగం మరొకటి చేయడం ద్వారా నైపుణ్య రాహిత్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నైపుణ్యతా రాహిత్యంతో పాటు మంచి విద్యాబోధనా పద్ధతులు, బోధనా సిబ్బంది లేకపోవడం, తగినన్ని పరిశ్రమలు లేవనేది మనందరికీ తెలిసిందే.
– బీటెక్ చేసిన వారు బీఈడీ చేసి ప్రైవేటు స్కూల్ టీచర్, మెడికల్ రిప్రజెంటేటివ్, కానిస్టేబుల్, హోంగార్డ్ తదితర ఉద్యోగాల్లో స్థిరపడటం చూస్తుంటే వారికున్న నైపుణ్యాభివృద్ధి, అవకాశాలను, తెలివితేటలను ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకొని ఇటువంటి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్న వారిసంఖ్య ఏటేటా పెరుగుతోంది.
చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేక, ఇటు కుటుంబాన్ని పోషించలేక, తనకాళ్లమీద తాను నిలబడలేక సమాజానికి భారంగా మారడం వల్ల వచ్చే ఐదేళ్లలో సంఖ్య పెరగడంతో నిరుద్యోగ యువతను ఉత్పత్తి చేయడంలో అగ్రగామి కావచ్చు. ఇలాంటి భయంకర సామాజిక విపత్తుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చట్టాల రూపకల్పన, ప్రణాళికలు, ఆచరణలకు పదునుపెట్టాలి.
RELATED ARTICLES
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
Biology | First Genetic Material.. Reactive Catalyst
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !